ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -3


10/03/2026

  • హిందూస్థాన్ టైమ్స్ ప్రకారం చైనా నుండి ఎఫ్ డి ఐ లను అనుమతించే విషయంలో గాల్వన్ వ్యాలీ ఘర్షణ దరిమిలా విధించిన కఠిన ఆంక్షలను సడలించటానికి ఇండియా నిర్ణయించింది. చైనా ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు ఈ వార్త సూచిస్తోంది.
  • స్పెషల్ ఎకనమిక్ జోన్స్, మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చైనా ఎఫ్ డి ఐ లను ఇండియా అనుమతించనుంది. 2020 లో ఘర్షణ తర్వాత నేరుగా చైనా పేరు చెప్పకుండా ఇండియాతో భూ సరిహద్దులు కలిగిన పొరుగు దేశాల నుండి ఎఫ్ డి ఐ పై ఇండియా గట్టి ఆంక్షలు పెట్టింది.
  • అమెరికా టారిఫ్ లకు జడిసి తక్కువ రేటు కు వచ్చే రష్యా చమురు దిగుమతి ఆపేసిన ఇండియాకు, యుద్ధం దరిమిలా హార్ముజ్ జల సంధి ని ఇరాన్ మూసేసిన నేపథ్యంలో చమురు లభ్యతకు కట కట ఏర్పడింది. ఇప్పుడు రష్యా చమురు కోసం ఇండియా ఫీలర్స్ పంపింది. అయితే రష్యా, బ్రెంట్ క్రూడ్ (అమెరికా, బ్రిటన్ బ్రాండ్ చమురు) కంటే బ్యారెల్ కి 5 లేదా 6 డాలర్లు ఎక్కువ చెల్లించాలని నిర్దేశించింది. అంటే బహిరంగంగా అమెరికా చమురు షరతులకు తల ఒగ్గి నందుకు ఇండియా పైన రష్యా పనిష్మెంట్ విధించిందని భావించాలి.
  • హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపధ్యంలో G7 గ్రూపు దేశాలు చమురు ధరల్ని తగ్గించటానికి వివిధ దేశాలను తమ రిజర్వ్ నిల్వలను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా ఈ అంశం లో ఆమోదం చెప్పాయి. ఇందులో కలిసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అంటే చమురు ధరలు తగ్గించేందుకు G7 కూటమి చేసే ప్రయత్నాలకు మద్దతుగా తమ (స్ట్రాటజిక్) నిల్వలను మార్కెట్ లో విడుదల చేసేందుకు ఇండియా నిరాకరించింది.
  • ఇండియా విదేశీ విధానం పైన ప్రతిపక్షాల విమర్శలు, అమెరికా-ఇజ్రాయెల్ పక్షం వహిస్తున్నందుకు వివిధ అంతర్జాతీయ విశ్లేషకుల నుండి ఇండియాపై వ్యక్తం అవుతున్న తీవ్ర విమర్శలు… ఇవన్నీ పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది. తమ ప్రతిష్ట దెబ్బ తింటోంది అని మోదీ ప్రభుత్వం భావిస్తోందా?
  • యుద్ధ లక్ష్యాలు నెరవేరినందున యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ప్రకటించాడు. కాని ట్రంప్ మాటల్ని నమ్మడానికి లేదు. బహుశా చమురు ధరల్ని తగ్గించే వ్యూహం తో ఈ ప్రకటన చేసి ఉండొచ్చు.
  • మార్చి 9 తేదీన ట్రంప్, పుతిన్ కి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడినట్టు తాజా వార్త. యుద్ధం నుండి బయట పడే లక్ష్యంతో ట్రంప్ ఈ ఫోన్ చేసినట్లు సీఐఏ మాజీ ఎనలిస్టు ల్యారీ జాన్సన్ వెల్లడి చేశాడు.
  • యుద్ధం కొనసాగించేందుకు ఇజ్రాయెల్ కూడా సుముఖంగా లేదని తెలుస్తున్నది. పుతిన్ తన సంబంధాలని ఉపయోగించి ఒక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఐతే ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్, రష్యా లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోసారి దాడి చెయ్యటానికి వీల్లేదని గట్టి హామీ డిమాండ్ చేయొచ్చు.
  • అధికారికంగా నిర్ధారణ ఐతే తప్ప ఈ వార్తలను నమ్మటానికి వీలు లేదు. చర్చల పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే రెండు సార్లు ఇరాన్ ను దారుణంగా మోసం చేశాయి. దొంగ దెబ్బ కొట్టి అనేక మంది ఇరాన్ నాయకుల్ని చంపేశాయి.
  • ఇరాన్ వార్తా సంస్థ తస్నిం న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చనిపోవటం గాని తీవ్రంగా గాయపడటం గానీ జరిగింది.
  • ఈ అంచనాకు కారణాలు: 4 రోజులుగా పబ్లిక్ గా కనపడలేదు; చనిపోయాడన్న వార్తలను ఇజ్రాయెల్ నిరాకరించడం లేదు; మార్చి 10 తేదీన అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ క్రిష్ణర్ లు ఇజ్రాయెల్ రావలసి ఉండగా వారి విజిట్ హఠాత్తుగా రద్దు చేసుకున్నారు; నెతన్యాహు ఇంటి చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు; ప్రధాని పేరుతో వెలువడుతున్న ప్రకటనలన్నీ రాత పూర్వకంగా మాత్రమే వెలువడుతున్నాయి; మామూలుగా అయితే ఆయనే కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడతాడు.
  • కానీ నెతన్యాహు మరణవార్త ఎంతవరకు నిజమో అనుమానమే.
  • ఇండియాలో గ్యాస్ సిలిండర్ల కొరత పెరుగుతోంది. తమిళనాడు లో పలు హోటళ్లు తమ మెనూ లో కోత విధిస్తున్నాయి. సిలిండర్లు మరో ఒకటి రెండు రోజులు మాత్రమే వస్తాయని హోటళ్ల వాళ్ళు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

12/03/2026

  • యుద్ధంలో ఇరాన్ కి సహకరించ వద్దని నిన్న (11వ తేదీన) ట్రంప్ రష్యాకు విజ్ఞప్తి చేశాడు. అమెరికా, ఇజ్రాయెల్ ల యుద్ధ పరికరాలు ఎక్కడ ఉన్నది, ఆ దేశాల మిసైళ్ల ఆనుపానులు తదితర వివరాలను రష్యా తన ఇంటలిజెన్స్ వ్యవస్థల ద్వారా కనిపెట్టి లైవ్ లో ఇరాన్ కు అందిస్తున్నాయని అమెరికా అనుమానిస్తోంది. అది నిజమే కూడా. ఇరాన్ బలహీన పడితే భౌగోళిక రాజకీయాల్లో రష్యా ప్రయోజనాలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతుంది.
  • అమెరికా, ఇజ్రాయెల్ ల దాడులకు సహకారం ఇస్తున్న టెక్ కంపెనీలను తమ టార్గెట్లుగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ లోని అమెజాన్, మైక్రో సాఫ్ట్, పాలెంటిర్, గూగుల్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్, మొ. కంపెనీలు తమకు న్యాయబద్ధ టార్గెట్లు గా ఇస్లామిక్ రివల్యూషనరి గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది.
  • తమ దేశం ఇరాన్ పై జరుగుతున్న దాడుల విషయమై తమ స్టాండ్ ఏమిటో చెప్పాలని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆలీ, గల్ఫ్ లోని అరబ్ దేశాలను ఖమేనీ డిమాండ్ చేశాడు.
  • ఇరాన్ ప్రజల ప్రాణ నష్టానికి గాను పూర్తి ప్రతీకారం పొందే దాకా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశాడు. సైనిక బేస్ లతో మీకు భద్రత కల్పిస్తామన్న అమెరికా హామీ తాజా యుద్ధంతో గల్లంతు అయిందని కాబట్టి అమెరికాను తమ దేశాల నుండి వెళ్లగొట్టాలని లేకుంటే దాడి తప్పదని ప్రకటించాడు.
  • హార్ముజ్ జల సంధి మూసివేత కొనసాగుతుందని జూనియర్ ఖమెనీ చెప్పాడు. కాగా ఇరాన్ అనుమతితో ఒక ఆయిల్ ట్యాంకర్ ఇండియా చేరింది.

15/03/2026

  • ఇరాన్ అధ్యక్షుడు పెజష్కియాన్, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటి వార్త ఇంతవరకు ఏమీ లేదు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గాయపడినట్లు, ప్రాణానికి ప్రమాదం లేనట్లు ఇరాన్ చెప్పింది.
  • ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చనిపోవటమో లేదా కుటుంబంతో కలిసి దేశం వదిలి పారిపోవటమో జరిగిందని ఇరాన్ అంతర్గత నివేదికల ద్వారా తెలుస్తోంది. నిజం ఏమిటో స్పష్టంగా తెలియటం లేదు.
  • ఫిబ్రవరి లో ఇండియా, ముంబై తీరానికి 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న 3 ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు ను అదుపులోకి తీసుకుంది. అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలను అమలు చేస్తూ ఇండియా ఈ చర్య తీసుకుంది.
  • ఇప్పుడు ఇరాన్, తన మూడు ట్యాంకర్లు విడుదల చేస్తే ఇండియాకి ఆయిల్ తెస్తున్న రెండు ట్యాంకర్లు హార్ముజ్ జల సంధి గుండా బయటికి రావటానికి అనుమతి ఇస్తానని చెప్పింది. మోదీ ప్రభుత్వం తప్పనిసరై మూడు ఇరాన్ ట్యాంకర్లు విడుదల చేసింది. అందుకు బదులుగానే ఇరాన్ రెండు ఇండియా ట్యాంకర్ లను విడుదల చేసినట్లు తెలుస్తున్నది.
  • పైకి మాత్రం రెండు దేశాలు ఒకరికొకరు మిత్ర దేశం అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాయి.

18/03/2026

  • ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఫోర్డ్, ఇరాన్ మిసైల్ దాడిలో తీవ్రంగా దెబ్బ తిన్నది. ఇది భూమిపై ఉన్న నౌకల్లో అత్యంత పెద్దది, ఖరీదైనది. దీని తయారీ ఖర్చు దాదాపు 13 బిలియన్ డాలర్లు ఇందులో సుమారు 4,500 అమెరికా సైనికులు ఉన్నారు.
  • కానీ అమెరికా మాత్రం నౌకలో ఉన్న లాండ్రీ లో అగ్ని ప్రమాదం జరిగిందని, మంటలను వెంటనే కంట్రోల్ చేశామని చెబుతోంది. స్వతంత్ర యుద్ధ విశ్లేషకులు మాత్రం మంటలు 30 గంటల వరకు రగులుతూనే ఉన్నాయని అమెరికా అబద్ధం చెబుతోందని చెబుతున్నారు.
  • ఈ నౌక ఖరీదు 13 బిలియన్ డాలర్లు. ఇలాంటిది మరొకటి నిర్మించటం అమెరికాకి ఇక సాధ్యం కాదని విశ్లేషకుల అంచనా. విమాన వాహక నౌక పేరు “యు ఎస్ ఎస్ గెరాల్డ్ ఎఫ్ ఫోర్డ్”. దీనిని తాత్కాలికంగా పోర్ట్ కు తరలించామని ఇప్పుడు అమెరికా అంటోంది.
  • అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ ఇరాన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశాడు. ఇరాన్ అణు బాంబులను నిర్మిస్తోందని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యం లేదని, ఆ మేరకు సిఐఏ నివేదికలు కూడా ధృవీకరించాయని ఆయన స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవటం తనకు ఇష్టం లేదని అన్నాడు.

వ్యాఖ్యానించండి