
–
ఒక పక్క ఇరాన్ తో చర్చలు జరుపుతూనే అమెరికా, ఇజ్రాయెల్ లు హఠాత్తుగా ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ దేశం పైన నరహంతక దాడి ప్రారంభించాయి. దానితో అమెరికా, ఇజ్రాయెల్ లు నిజాయితీగా, ఘర్షణని నివారించే ఉద్దేశంతో చర్చలు జరపడం లేదని లోకానికి అర్ధం అయింది. చర్చల పేరుతో ఇరాన్ ను ఏమరుపాటు స్థితిలో ఉంచి మెరుపుదాడి చేయటమే అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యం అని స్పష్టం అయింది.
ఇజ్రాయెల్, అమెరికా లు కుట్ర చేసినట్టే ఫిబ్రవరి 28 తేదీన చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ (హెడ్ ఆఫ్ స్టేట్ మరియు ఇరాన్ ప్రజల షియా మత నాయకుడు) అయితుల్లా ఖమెనీ హత్యకు గురయ్యాడు. అమెరికాతో జరుగుతున్న చర్చల గురించి, అమెరికా చేసిన ప్రతిపాదనల గురించి చర్చించటానికి ప్రభుత్వ పెద్దలు, ఐ.ఆర్.జి.సి (ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) ప్రధాన నాయకత్వం అందరినీ ఖమెనీ సమావేశ పరిచి ఉండగా ఆయన ఇంటి పైన అమెరికా మిసైళ్లతో దాడి చేసింది.
ఫలితంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయితుల్లా ఖమెనీ, ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురు, ప్రభుత్వ నేతలు పలువురు, మిలటరీ నాయకులు పలువురు ఈ దాడిలో హత్యకు గురయ్యారు. నాయకత్వం చనిపోతే ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని, ప్రభుత్వాన్ని కూలదోస్తారని, అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఆశించాయి.
అదే అవకాశంగా తమ అనుచరులను ప్రవేశ పెట్టి, ఇరాన్ రాజ వంశీకుడు, మరియు 1979 నాటి ఇస్లామిక్ విప్లవం లో ఇరాన్ ప్రజలు కూలదోసిన పహ్లవి రాజ వంశీకుల వారసుడిని తమ తోలు బొమ్మ ప్రభుత్వంగా నిలబెడదామని ప్రపంచ పెత్తందారు అమెరికా, పశ్చిమాసియా ప్రాంతీయ పెత్తందారు మరియు యూదు జాత్యహంకార ఇజ్రాయెల్ ఆశ పడ్డాయి.
కానీ అనుకున్న దొకటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టాయి అమెరికా, ఇజ్రాయెల్ లు.
ఇరాన్ ప్రజలు ఆగ్రహోదగ్రులు అయ్యారు. కానీ తమ ప్రభుత్వం పైన కాకుండా దాడి చేసి తమ నేతను చర్చల పేరుతో కుట్ర చేసి చంపినందుకు వారు ఆగ్రహం చెందారు. దేశం మొత్తం ఇరాన్ ప్రభుత్వం వెనక నిలబడింది. చనిపోయిన వారి స్థానంలో కొన్ని గంటల్లోనే కొత్త నాయకులను నియమించుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన కొన్ని గంటలలోనే ఇరాన్ ప్రతి దాడి చేసింది.
ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు, ఇజ్రాయెల్ కు తొత్తులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల పైన ఏక కాలంలో మెరుపు దాడి చేసింది.
గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుందని తాము అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. ఇరాన్ దాడితో తాము షాక్ కు గురయ్యామని ట్రంప్ ఒప్పుకున్నాడు.
ఫిబ్రవరి 28 తేదీ న మొదలైన అమెరికా-ఇజ్రాయెల్ నరహంతక యుద్ధం నేటికీ కొనసాగుతోంది. కొన్ని రోజుల్లో, మహా అయితే ఒకటి రెండు వారాల్లో ముగిసిపోతుందని, ఇరాన్ చేతులెత్తేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ లు భావించిన యుద్ధం కాస్తా 5 వారాలు దాటినా ముగిసే జాడలు కనిపించటం లేదు.
ఇక అంతా అయిపోయిందని, ఇరాన్ ఆయుధాలు అన్నిటినీ నాశనం చేసేశామని, ఆ దేశ రక్షణ వ్యవస్థలు (మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్) సమస్తం మట్టి కరిచాయని, ఇరాన్ గగనతలం పూర్తిగా తమ అదుపులోకి వచ్చేసిందని, ఇక రేపో మాపో ఇరాన్ లొంగిపోతుందని ఇప్పటికే డజన్ల సార్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.
కానీ యుద్ధం ముగియక పోగా, రోజు రోజుకీ మరిన్ని ఆయుధాలతో, సరికొత్త ఆయుధాలతో, ఆత్మాహుతి డ్రోన్ల తో, మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ లు క్రమం తప్పకుండా చేస్తున్న దాడుల్లో తీవ్రంగా నష్ట పడుతూనే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రోజుకి కనీసం 3 సార్లు మిసైళ్లు, డ్రోన్ లతో ఇరాన్ విరుచుకు పడుతోంది.
యుద్ధం గురించిన వార్తలను ఈ బ్లాగ్ ఇంతవరకు కవర్ చేయలేదు. అయితే మార్చి 6 తేదీ నుండి యుద్ధ పరిణామాలకు సంబంధించిన వార్తలను నోట్స్ గా రాసుకుంటూ ఉన్నాను. వాటిని ఇప్పటి నుండి బ్లాగ్ లో ప్రచురించాలని నిర్ణయించుకున్నాను.
06/03/2026
- ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేకపోవటంతో ఇండియా మళ్ళీ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించింది. చైనా కూడా రష్యా చమురు దిగుమతి మరింత పెంచుకునే పనిలో పడింది. ఇరాన్ నానాటికీ బలహీనం అవుతున్నట్లు, అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ను కుళ్లబొడుస్తున్నట్టు పశ్చిమ వార్తా సంస్థలు వార్తలు గుప్పిస్తున్నప్పటికీ అది పూర్తి వాస్తవం కాదు.
- ఇరాన్ నష్ట పోతున్న మాట నిజమే గానీ, అమెరికా ఇజ్రాయెల్, కతార్, సౌదీ, యు ఏ ఇ దేశాల రక్షణ వ్యవస్థలు ఇరాన్ దాడిలో తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు విడతల వారీగా నాశనం అవుతున్నాయి. అమెరికా విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ ఇరాన్ డ్రోన్ ల తాకిడికి గల్ఫ్ నుండి 1000 కి మీ వెనక్కి పారిపోయింది. ఇజ్రాయెల్, హిజ్బొల్లా (లెబనాన్ ప్రభుత్వంలో భాగస్వామి) చేతుల్లో చావు దెబ్బలు తింటోంది. కతార్ లో అమెరికా కి ఉన్న అతిపెద్ద రాడార్ (రష్యా, చైనా, ఇరాన్ లపై నిఘాకి ఉద్దేశించింది) నాశనం అయింది. ఇది అమెరికా కి వ్యూహాత్మకంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
- కతార్ లోని రాడార్ 5000 కి మీ వరకు ఏరియాలో నిఘా పెట్టేందుకు నెలకొల్పిన అతి పెద్ద అత్యాధునిక రాడార్. దీన్ని మళ్ళీ నెలకొల్పేందుకు అమెరికాకి కొన్ని సం లు పడుతుంది.
- ఇరాన్ పైన పై చేయి సాధించటంలో అమెరికా పూర్తిగా విఫలం అయింది. ఏళ్ళతరబడి ఇరాన్ నిర్మించిన, అభివ్రుద్ది చేసిన షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్ సోనిక్ మరియు సూపర్ సోనిక్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ కి పై చేయితో పాటు దీర్ఘ కాలం యుద్ధం లో నిలబడే సామర్థ్యం ఇస్తున్నాయి.
- సౌదీ, కతార్, యు ఏ ఇ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలు పైకి రాయబారం తో సమస్య పరిష్కరించుకుని యుద్ధం విరమించాలని కోరుతున్నాయి. కానీ ప్రైవేటుగా ఇరాన్ పని ముగిసేదాకా యుద్ధం కొనసాగించమని ట్రంప్ కి గట్టి సలహా ఇస్తున్నాయి.
- ఇరాన్, పై చేయి సాధిస్తే యుద్ధం ముగిశాక, ఇరాన్ ప్రతిష్ట, పలుకుబడి పెరిగిపోతుందని అమెరికా కీలు బొమ్మలు గల్ఫ్ దేశాలు భయ పడుతున్నాయి. అందుకే ఇరాన్ కూలిపోయే వరకూ అమెరికా దాడి కొనసాగాలని అవి కోరుతున్నాయి.
- నిజానికి యుద్ధం మొదలు కావటానికి ముందు కూడా ఇరాన్ పైన దాడి చేయాల్సిందేనని సౌదీ అరేబియా ప్రిన్స్ అమెరికాని తెర వెనుక కోరాడు.
- అయితే ఇప్పటికే అమెరికా వద్ద ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ల నిల్వలు తగ్గిపోయాయి. రాడార్ లు నాశనం కావటాన అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ లు గుడ్డి వి గా మారాయి. అంటే దాడి కోసం ఇరాన్ నుండి వచ్చే మిస్సైళ్లను కనిపెట్టి గాలిలోనే కూల్చే డిఫెన్స్ సిస్టమ్ లు తమ పని చేయలేకున్నాయి.
- ఇరాన్ ఇప్పటి దాకా ప్రధానంగా పాత మిసైల్ సిస్టమ్ లను మాత్రమే ఎక్కువగా వాడింది. అంటే ఇరాన్ అధునాతన క్షిపణులు పెద్ద సంఖ్యలో మిగిలి ఉన్నాయి. బహుశా అమెరికా మును ముందు మరింత నష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు.
- ఇంకో పక్క ఇరాక్ లోని షియా మిలీషియాలు కూడా చురుకుగా ఉన్నాయి. ముఖ్యంగా షియా మిలీషియా ‘పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్’ (పి ఎం ఎఫ్) ఇరాక్ లో అమెరికాకు ఉన్న అతి పెద్ద స్థావరం పైన దాడులు చేస్తున్నది. అడపా దడపా ఇజ్రాయెల్ పైన కూడా దాడులు చేస్తున్నది.
- మరో పక్క కుర్ద్ మెర్సినరీలు (కిరాయికి యుద్ధం చేసే కుర్ద్ జాతి సైనికులు) ఇరాన్ పశ్చిమ సరిహద్దును ఇరాక్ నుండి దాటి భూతలం యుద్ధం చేస్తున్నట్లు వార్తలు చెబుతున్నాయి. సిరియా ఈశాన్య ప్రాంతంలో ఉండే ఈ కుర్ద్ లు అమెరికా మాట వింటారు.
- కానీ ఇరాన్ లో భూతల యుద్ధం కష్టం తో కూడినది. ఇరాన్ లో కొండలు గుట్టలు చాలా ఎక్కువ. పశ్చిమ సరిహద్దులో ఇంకా ఎక్కువ. కాబట్టి బయటి నుండి దాడి చేయటం అంత తేలిక కాదు. కుర్ద్ మెర్సినరీలను ఇరాన్ సైన్యం తరిమి కొట్టిందని స్వతంత్ర వార్తా సంస్థల ద్వారా తెలుస్తున్నది.
- ఇరాన్ అధ్యక్షుడు భూతల యుద్ధానికి ఏమీ భయపడుతున్న ఛాయలు లేవు. పైగా మాతో తలపడే వాళ్ళు ఎవరో రావచ్చని సవాలు విసిరాడు.
గల్ఫ్ యుద్ధం కు సంబంధించిన నోట్స్ ప్రచురణ కొనసాగుతుంది.