బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు


“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది.

బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కేసు విషయమై గత కొన్ని రోజులుగా సుప్రీం కోర్టులో తీవ్ర స్థాయి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి.

మంగళ వారం జరిగిన వాద ప్రతివాదనల సందర్భంగా “స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్ చట్ట విరుద్ధం అని మీరు రుజువు చేయగలిగితే, సెప్టెంబర్ ఆఖరి నాటికి దానిని పక్కన పెట్టేస్తాం” సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది.

గత వాయిదా (ఆగస్టు 6) తేదీన జరిగిన వాదనల సందర్భంగా కూడా ఇదే తరహా హామీని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చింది. గుంపుగా ఓట్లు తొలగించడం జరిగినట్లు రుజువయితే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ను ఎలాంటి శషబిషలు లేకుండా రద్దు చేస్తామని ధర్మాసనం హామీ ఇచ్చింది.

గత వాదనల సందర్భంగా, ఆధార్ మరియు వోటర్ ఐ.డి లను ఓటు హక్కు జారీకి పనికి రావని ఇసిఐ చెప్పడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఓటు హక్కు జారీకి అర్హతలుగా ఇసిఐ పేర్కొన్న 11 పత్రాలకు తోడు ఆధార్, వోటర్ ఐడి లను కూడా రుజువులుగా పరిగణించాలని ఇసిఐ ని కోరింది.

కానీ ఈ రోజు జరిగిన వాదనల్లో, ఆధార్ విషయంలో తన అవగాహనను సుప్రీం ధర్మాసనం మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఇసిఐ చెప్పినట్లుగా ఆధార్ కార్డు పౌరసత్వానికి రుజువు కాజాలదని పేర్కొంది.

అయితే గత వాయిదాలో “ఓటు హక్కు” జారీకి అర్హత పత్రాలుగా ఆధార్ కార్డ్, వోటర్ ఐడి లను పరిగణించాలని కోరగా, ఈ రోజు “పౌరసత్వం” కు ఆధార్ కార్డ్ రుజువు కాజాలదని పేర్కొనడం గమనార్హం. పౌరసత్వ హక్కు మరియు ఓటు హక్కు రెండూ సమానమే అని సుప్రీం ధర్మాసనం భావిస్తున్నదా లేదా అన్నది తెలియరాలేదు.

పౌరసత్వం మరియు ఓటు హక్కు రెండూ ఒకటే అని కోర్టు భావిస్తే గత వాయిదాకీ, నేటి వాయిదాకీ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తన అవగాహనను మార్చుకున్నట్లు భావించవచ్చు.

బీహార్ ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియను ఇసిఐ గతంలో ఎన్నడూ చేపట్టలేదని, 2003 లో ఇలాంటి ప్రక్రియనే ఇసిఐ అమలు చేసినప్పటికీ ఆ నాడు ‘ఇంటెన్సివ్’ అన్న పదం లేదని యోగేంద్ర యాదవ్ తన తరపున తానే వాదిస్తూ ధర్మాసనానికి విన్నవించాడు.

పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్ కు రాజ్యాంగం ఇవ్వలేదని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా పౌరసత్వ హక్కును ఇసిఐ నిర్ధారిస్తున్న కారణం చేత, బీహార్ ఎస్ఐఆర్ మొత్తంగా రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక ప్రక్రియ అని యోగేంద్ర యాదవ్ వాదించాడు.

“పెద్ద మొత్తంలో ఓటర్ల తొలగింపు అప్పుడే మొదలై పోయింది. ఇసిఐ లెక్కలు చెబుతున్నట్లుగా తొలగిస్తున్న ఓటర్ల సంఖ్య 65 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. ఎక్కడ ఎస్ఐఆర్ జరిపినా ఫలితం ఎలాగే ఉంటుంది” అని సెఫాలజిస్టు (ఎలక్షన్ మరియు పోలింగ్ సర్వే స్పెషలిస్టు) యోగేంద్ర యాదవ్ వాదించాడు.

“నిజానికి 2003 లో ఇలాంటి ప్రక్రియను ఇసిఐ జరిపింది. ఈ సంగతి ఇసిఐ కోర్టుకు చెప్పి ఉండాల్సింది. ఒక్క ఓటర్ ని కూడా జాబితాకు కలపకుండా ఓటర్ల జాబితాను ఇసిఐ రివైజ్ చేస్తున్న సందర్భం ఇది ఒక్కటే. గతంలో రివిజన్ జరిపిన ప్రతి సారీ తొలగింపులతో పాటు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిని చేర్చడం కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం చేర్పులు ‘సున్నా’. అస్సలు ఒక్క ఓటర్ని కూడా ఈసారి జాబితాలో చేర్చలేదు” అని యోగేంద్ర ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న తీవ్ర తప్పిదాన్ని ఎత్తి చూపాడు.

2003 లో ఒకసారి రివిజన్ జరిగింది. ఆ తర్వాత 2025 లో రివిజన్ జరుగుతున్నది. ఈ మధ్య 22 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ లెక్కన 2003 నుండి 2007 మధ్యలో పుట్టిన వారందరికీ ఓటు హక్కు రావాల్సి ఉంటుంది. ఒక్క ఓటర్ ని కూడా జాబితాలో చేర్చలేదు కనుక 2003 నుండి 2007 వరకు 5 సంవత్సరాల కాలంలో బీహార్ లో ఒక్కరూ కూడా పుట్టలేదని ఇసిఐ లెక్క గట్టినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది భారీ తప్పిదం అని వేరే చెప్పనవసరం లేదు.

“ఇది ఓటు హక్కు తొలగించటానికి జరుపుతున్న అతి పెద్ద ప్రక్రియ!” అని యోగేంద్ర యాదవ్ తన వాదనలో స్పష్టం చేశాడు. పురుషుల కంటే మహిళల ఓట్లను ఎక్కువ సంఖ్యలో తొలగించారని ఆయన చెప్పాడు. తొలగింపు సంఖ్య 65 లక్షలు కాదు, కోటి సంఖ్యను దాటి పోతుందని తెలిపాడు.

“వాళ్ళు కేవలం ఐడెంటిటీ ని మాత్రమే నిర్ధారించ వలసి ఉందని కోర్టు ఇంతకు ముందు చెప్పింది… 5 కోట్ల మంది ఓటర్ల పౌరసత్వాన్ని అనుమానించే వ్యవస్థ (ఇసిఐ) ను మనం కొనసాగించలేము” అని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి ధర్మాసనానికి తెలిపాడు.

“జాబితాలో ఉన్నవారంతా ఓటు హక్కును న్యాయబద్ధంగా పొందిన వారే అన్న పూర్వ భావన (presumption) చట్టపరంగా ఉంటుంది. ఫలానా వారు న్యాయబద్ధంగా పౌరులు కాదని అధికార వ్యవస్థ (భారత ప్రభుత్వం) భావించినట్లయితే దాన్ని ప్రభుత్వమే నిర్దిష్ట ప్రక్రియ ద్వారా రుజువు చేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా కొందరు పౌరుల ఓటు హక్కు రద్దు చేసేసి మీ పౌరసత్వ హక్కు ని మీరే రుజువు చేసుకోండి అంటున్నది” అని సింఘ్వి కోర్టుకు తెలిపాడు.

జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బీహార్ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్ పైన వాద, ప్రతివాదనలు వింటున్నది.

వ్యాఖ్యానించండి