
తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది.
అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు లడ్డు తయారీలో వినియోగించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణ తాలూకు వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రాష్ట్ర ప్రభుత్వం మెడకి చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నది.
లడ్డు కల్తీ విషయం పైన జనతా పార్టీ నాయకుడు, ఉపనాయకుడు, కార్యకర్త సమస్తం తానే అయిన, ఇప్పుడు సీనియర్ బిజెపి నేతగా మారిన డాక్టర్ సుబ్రమణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా రెండు సార్లు పని చేసిన, రాజ్యసభ సభ్యుడు అయిన వైవి సుబ్బారెడ్డి, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ఆత్యాధ్మిక ప్రసంగీకుడు దుష్యంత్ శ్రీధర్ లు దాఖలు చేసిన ఐదు పిటిషన్లు నేడు సుప్రీం కోర్టు ముందుకు వచ్చాయి. జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాధన్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్లను విచారిస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ అయిందంటూ బహిరంగ ఆరోపణలు చేయటాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. కల్తీ జరిగిన అంశం ఒక పక్క విచారణలో ఉండగానే ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటనలు ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అదీకాక దేవస్థానం, లడ్డు తయారీలో వినియోగించటానికి తిరస్కరించిన నెయ్యి నుండి సేకరించిన శాంపిల్స్ లో కల్తీ జరిగినట్లు ల్యాబ్ నిర్ధారించినట్లు ప్రాధమిక ఆధారాల ద్వారా స్పష్టం అవుతున్నది తప్ప లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లు ల్యాబ్ నివేదిక చెప్పటం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరుతూ వివిధ పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు. కాగా, లడ్డు కల్తీ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వ విచారణ జరగాలా లేదా అన్న విషయాన్ని తమకు అఫిడవిట్ ద్వారా చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. గంట సేపు విచారణ జరిపిన ధర్మాసనం తన ఆదేశాల్లో ఇలా వ్యాఖ్యానించింది:
“ఈ పిటిషన్ ప్రపంచ వ్యాపితంగా నివశిస్తున్న కోట్లాదిమంది ప్రజల సెంటిమెంట్లకు సంబంధించినది. గత ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ప్రకటించారు. అయితే తిరుపతి తిరుమల దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ప్రకటన విడుదల చేస్తూ అటువంటి కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు తయారీలో ఎన్నడూ వినియోగించలేదని చెప్పినట్లుగా కొన్ని పత్రికలు నివేదించాయి. వివిధ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ఈ అంశం పైన స్వతంత్ర దర్యాప్తు జరపాలని, మతపర ట్రస్టుల వ్యవహారాలను నియంత్రించేందుకు, మరీ ముఖ్యంగా ప్రసాదం తయారీ విషయంలో మార్గదర్శక సూత్రాలు రూపొందించాలని ఈ పిటిషన్లు కోరాయి.”
“టిటిడి తరపున హాజరయిన అడ్వకేట్ సిద్ధార్ధ లూధ్రా ప్రకారం జూన్ నెల నుండి జులై 4 తేదీ వరకు అదే తయారీదారు సరఫరా చేసిన నెయ్యిని అనాలసిస్ కోసం పంపలేదు. అయితే జులై 6 మరియు 12 తేదీలలో రెండు ట్యాంకర్ల చొప్పున (మొత్తం 4 ట్యాంకర్లు) వచ్చిన నెయ్యి శాంపిల్స్ ని మాత్రమే అనాలసిస్ నిమిత్తం ఎన్.డి.డి.బి (నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఈ నాలుగు శాంపిల్స్ లో కల్తీ జరిగినట్లు కనుగొనబడినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. జూన్ నుండి జులై 4 వరకు సరఫరా చేయబడిన నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.”
“రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం కూడా దర్యాప్తు అవసరమని నిర్ధారిస్తూ సెప్టెంబర్ 25 తేదీన దాఖలయిన ఎఫ్ఐఆర్ పై దర్యాప్తు కోసం ఎస్ఐటి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ని ఏర్పాటు చేశారు. కనుక ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఎఫ్ఐఆర్ దాఖలు కావటానికి, ఎస్ఐటి ని ఏర్పాటు చేయటానికి ముందే సెప్టెంబర్ 18వ తేదీన చేశారని అర్ధం అవుతున్నది. పరిశోధన జరుగుతున్న క్రమంలో, ఒక అత్యున్నత రాజ్యాంగ అధికార వ్యవస్థ (ముఖ్యమంత్రి), కోట్లాది మంది ప్రజల మనోభావాలు (సెంటిమెంట్లు) ప్రభావితం అయ్యే రీతిలో బహిరంగ ప్రకటన చేయటం తగని పని అని ఈ కోర్టు ప్రాధమికంగా భావిస్తున్నది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని కొనసాగించాలా లేక ఏదేని స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలా అన్న అంశం పైన లెర్నడ్ సొలిసిటర్ జనరల్ మాకు తోడ్పాటు (assist) అందించటం సరైన చర్య కాగలదని మేము భావిస్తున్నాము” అని సుప్రీం కోర్టు తన ఆదేశాలలో పేర్కొన్నది.
హియరింగ్ సందర్భంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వం మరియు టిటిడి లపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పించింది. “ల్యాబ్ నివేదికలో కొన్ని డిస్^క్లెయిమర్లు ఉన్నాయి. నిరాకరించిన నెయ్యిని పరీక్షించినట్లు ప్రాధమికంగా సూచిస్తున్నది. మీరే దర్యాప్తుకి ఆదేశించిన తర్వాత పత్రికలకు ఎక్కవలసిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?” అని జస్టిస్ విశ్వనాధన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరయిన ముకుల్ రోహత్గీ ని ప్రశ్నించింది. “ఈ పదార్ధం (కల్తీ జరిగిన నెయ్యి) ను లడ్డూల తయారీలో వినియోగించలేదని ఈ నివేదికే ప్రాధమికంగా నిర్ధారిస్తున్నది కదా?” అని ఆయన ప్రశ్నించారు.
“ఎస్.ఐ.టి ద్వారా విచారణకు ఆదేశించాక, పత్రికలకు ఎక్కవలసిన అవసరం ఏమిటి?” అని జస్టిస్ గవాయ్ కూడా ప్రశ్నించాడు. “మీరు ఒక రాజ్యాంగ బద్ధ కార్యాలయంలో ఉండగా (బాధ్యతాయుత పదవిలో ఉండగా)… రాజకీయాల నుండి దేవుళ్ళను దూరంగా ఉంచుతారని మేము ఆశిస్తున్నాము” అని జస్టిస్ గవాయ్, సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడే గురి చూసి కొట్టారు. పదేళ్ళ బిజెపి పాలన నుండి ఏ పాఠాలనైతే నేర్చుకోకూడదో అవే పాఠాలను వంట పట్టించుకున్న చంద్రబాబు నాయుడు, అత్యంత సాధారణ అంశం అయిన లడ్డు తయారీలో కల్తీ విషయాన్ని, అది కూడా మత సెంటిమెంట్లను నేరుగా రెచ్చగొట్టే విధంగా, రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు సిద్ధపడ్డాడు. బిజెపితో కూటమి కట్టిన తర్వాత ఏ పార్టీ అయినా ఇలాంటి వెర్రిమొర్రి అంశాలను నెత్తిన పెట్టుకుని ప్రజల్లో అలజడి, అశాంతి ప్రేరేపించేందుకు బరితెగిస్తుందని అనుకోవలసి వస్తున్నది.
“మీకు జులైలో ల్యాబ్ నివేదిక అందింది. కానీ సెప్టెంబర్ 18 తేదీన దానిని బహిరంగం చేసేందుకు నిర్ణయించారు. మీకే నిశ్చయంగా తెలియనప్పుడు బహిరంగ ప్రకటన ఎలా చేస్తారు?” అని జస్టిస్ విశ్వనాధన్ ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలను వేసే అవకాశం ఉన్న కేసులు బోలెడన్ని గత పదేళ్ళ బిజెపి పాలనలో సుప్రీం కోర్టుకు వచ్చినప్పటికీ అప్పటి న్యాయమూర్తులు వేయలేదు. మోడి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగా స్వీకరించి ప్రభుత్వ వాదనలనే తీర్పుగా ప్రకటించటం ద్వారా భారతదేశంలోని అణగారిన ప్రజలు, మైనారిటీలు, మహిళలు, దళితులు సుప్రీం కోర్టుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఘోరంగా దెబ్బ తీశారు.
సిఏఏ చట్టంపై నిరసనలు పెల్లుబుకినపుడు బిజెపి నేతలు రెచ్చగొట్టిన ఫలితంగా ఢిల్లీ అల్లర్లు జరిగినప్పుడు, గిరిజనుల సేవకు అంకితమైన ప్రజా మేధావులపై టెర్రరిస్టు చట్టాలు మోపినపుడు, ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా సదరు మేధావుల కంప్యూటర్లలో వారికి తెలియకుండా వారిని నేరస్థులుగా రుజువు చేసేందుకు వీలుగా డాక్యుమెంట్లు చొప్పించినపుడు, ముంబై కోర్టులో అమిత్ షా కేసును విచారించబోతున్న జడ్జి అర్ధాంతరంగా హత్యకు గురైనపుడు… ఇలా సాధారణ శ్రామిక ప్రజలు, వారికి మద్దతుగా నిలబడిన మేధావులపై బూటకపు కేసులు పెట్టినపుడు కూడా హై కోర్టులు, సుప్రీం కోర్టులు అన్నీ పాలకపక్షం చెప్పినట్లు ఆడాయన్న అభిప్రాయం ప్రజలకు కలిగింది. ఇప్పుడు బిజెపి బలం తగ్గిపోయి, టిడిపి, జెడి(యు) పార్టీల సీట్లపై ఆధారపడే పరిస్ధితి వచ్చాకనే కోర్టులకు న్యాయం పక్షాన నిలబడే ధైర్యం వచ్చినట్లు కనిపిస్తున్నది.
“ఆ (కల్తీ జరిగిన) నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారా?” అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. “విచారణకు మేము ఆదేశించాము” అని సీనియర్ అడ్వకేట్ టిటిడి తరపున సమాధానం ఇచ్చారు. “ఎవరైనా మీ లాంటి వారికి ఒక నివేదిక ఇచ్చినపుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని మీ వివేకం మీకు చెప్పదా?” అని జస్టిస్ విశ్వనాధన్ తదుపరి ప్రశ్న సంధించారు. “విచారణకు ఆదేశించాక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమిటి? లక్షలాది మంది భక్తుల సెంటిమెంట్లకు సంబంధించిన వ్యవహారం కదా ఇది?” అని జస్టిస్ గవాయ్ మరోవైపు నుండి ప్రశ్నల బాణాన్ని సంధించారు. లడ్డూల క్వాలిటీ గురించి ఫిర్యాదులు వచ్చాయని, ఎన్.డి.డి.బి ల్యాబ్ నివేదిక కూడా కల్తీ జరిగినట్లు చూపిందని, ఎలాంటి కల్తీ జరిగిందన్న అంశం విచారణలో ఉన్నదనీ లూధ్రా కోర్టుకు చెప్పాడు.
జస్టిస్ విశ్వనాధన్, ఈ ల్యాబ్ పరీక్షలు రొటీన్ గా జరిగేవే, నెయ్యిని నిరాకరిస్తూ ఆ నిరాకరణను జస్టిఫై చేసుకునేందుకు అనేకసార్లు పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్.ఐ.టి చేతనే విచారణ చేయించాలా లేదా అన్నదే, అని ఆయన వ్యాఖ్యానించాడు. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో ఎన్నడూ ఉపయోగించలేదని టిటిడి అధికారి ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన జస్టిస్ గవాయ్, ఈ విషయంలో టిటిడి నుంచి తగిన సూచనలు తీసుకోవాలని కోరాడు. ఓ పక్కన కల్తీ నెయ్యి లడ్డూల తయారీకి ఉపయోగించలేదని టీటీడీ చెబుతుంటే మరోపక్క ముఖ్యమంత్రి అందుకు విరుద్ధమైన ప్రకటన ఎలా చెటారన్నది జస్టిస్ గవాయ్ ఆక్షేపణ!
సుబ్రమణ్య స్వామి తరపున హాజరయిన సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు వాదిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన లడ్డూలలో కల్తీ జరుగుతున్న వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబిస్తున్నదని చెప్పాడు. కానీ టిటిడి ఇ.ఓ చేసిన ప్రకటన దీనికి విరుద్ధంగా ఉందని చెబుతూ ఇలాంటి విరుద్ధ ప్రకటనలు వాతావరణ సమగ్రతను దెబ్బతీస్తాయని వాపోయాడు. “బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేసేముందు నిజాలు పరిశీలించాలి. దేవుడి ప్రసాదమే ప్రశ్నగా మారితే ఈ అంశాన్ని పరిశీలించ వలసిందే. ఇప్పుడు సి.ఎం ఒక ప్రకటన చేశారు కనుక వారు చేసే దర్యాప్తు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతుందా?” అని రాజశేఖర్ రావు ప్రశ్నించారు. “ఎలాంటి ఆధారం లేకుండా ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పడం తీవ్రమైన విషయం. రాజకీయ జోక్యాన్ని ఇలాంటి విషయాల్లో అనుమతించరాదు” అని ఆయన అన్నాడు. ఒకటి వాదించటానికి వచ్చి, సుప్రీం కోర్టు ప్రశ్నలతో తన వాదనల్లో పస ఉండదని గ్రహించిన సుబ్రమణ్య స్వామి లాయర్ మరొకటి వాదించినట్లు కనిపిస్తున్నది. సుబ్రమణ్య స్వామి గారు వివాదం రేగినప్పుడు చంద్రబాబు అనుకూల వాదనతో ప్రకటనలు చేశారు. కోర్టుకు వచ్చాక ఆయన లాయర్ జగన్ అనుకూల వాదన ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ, స్వామి పిటిషన్ బోనఫైడ్ కాదని, గత వై.ఎస్.ఆర్.సి.పి వాదనకు మద్దతుగా ఆయన పిటిషన్ వేశారని ఆరోపించాడు. స్వామి దాఖలు చేసిన పిటిషన్, టిటిటి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లు రెండూ ఒకే రకంగా ఉన్నాయని కోర్టుకు చెప్పారు.
స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని మరొక పిటిషన్ దారుడు సురేశ్ చావహంకే తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ సోనియా మాధుర్ వాదించాడు.
లడ్డూ వివాదానికి సంబంధించి దాఖలైన 5 పిటిషన్లలో 3 పిటిషన్లు ఈ రోజు ద్విసభ ధర్మాసనం ముందు హియరింగ్ కు వచ్చాయి. 1. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2. రాజ్యసభ ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి 3. చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ మరియు ఆధ్యాత్మికవేత్త దూష్యత్ శ్రీధర్. అయితే సంపత్ మరియు శ్రీధర్ ల తరపున లాయర్ చేసిన వాదనలను పత్రికలు కవర్ చేయలేదు.
సుప్రీం కోర్టులో ఈ రోజు జరిగిన వాదోపవాదాలు చూసిన తర్వాత ఒక సంగతి స్పష్టం అయింది. రాజకీయ ప్రయోజనాల కోసమే లడ్డు కల్తీ వివాదాన్ని ప్రస్తుత ప్రభుత్వం లేవనెత్తింది. అయితే వివాదంలో తమ వాదనలో లొసుగులు ఉన్నట్లు ముందే గ్రహించారో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ పైకి వివాదం మళ్లించారు. దేవుళ్ళను, దేవాలయాలను రాజకీయాల్లోకి లాగటం సరైన విధానం కాదని గతంలో అనేకసార్లు నీతులు చెప్పిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం సందర్భంగా దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి తానూ ఆ తానులో ముక్కనే అని స్పష్టం చేశాడు. విజయవాడ వరదల సందర్భంగా అదృశ్యమై పోయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చివర్లో పిఠాపురంలో ‘నేనున్నాను. ఎక్కడికి పోలేదు’ అన్నట్లు దర్శనం ఇచ్చారు.
గత కాలపు ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారి వలే ఒక్కో సీజన్ కి ఒక్కో వేషంలో దర్శనం ఇస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ముందుకు రండి’ అని ప్రజలకు పిలుపు ఇవ్వటానికి బదులు, తనకు ప్రజలు అధికారం అప్పగించారన్న సంగతి గ్రహించి తాను అట్టహాసంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నం అయితే ప్రజలకు ఉపయోగకరం కాగలదు. లేనట్లయితే ఆయనకు ప్రజలే త్వరలో వీడ్కోలు చెప్పే అవకాశం ఉన్నది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల సమావేశంలో ప్రకటించిన విధంగా, ప్రచార సంరంభంలో చేసిన వాగ్దానలను నెరవేర్చే దిశలో చర్యలు చేపట్టాల్సి ఉన్నది. 100 రోజులు దాటిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశలో ఒక్క అడుగు కూడా పడకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.