అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు.
వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్ తోనే నెట్టుకొద్దామని అమెరికా డీప్ స్టేట్ భావించింది.
కానీ జో బైడెన్ పరిస్ధితి నానాటికీ డిజజారుతూ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన మొదటి డిబేట్ లో జో బైడెన్ తడబడటం, అయోమయానికి గురి కావటంతో తెర వెనుక పెద్దలు జో బైడెన్ అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా తెర ముందుకు వచ్చేశారు. హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా లాంటి వారు జో బైడెన్ ను రేసు నుండి తప్పుకోమని కోరారు.
ఆ వెంటనే జో బైడెన్ పేరుతో “పోటీ నుండి విరమించుకుంటున్నాను” అన్న ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల పాటు బైడెన్ బహిరంగంగా కనపడకపోవడంతో బైడెన్ ను నిర్బంధించి, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతర డెమోక్రటిక్ పార్టీ పెద్దలే ప్రకటన చేశారన్న అనుమానాలు తలెత్తాయి. కానీ బైడెన్ మరో రెండు రోజుల్లో పత్రికల ముందు ప్రత్యక్షం కావడంతో ఊహాగానాలకు తెరపడిపోయింది.
అయితే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ నాయకులు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారీస్ పైన విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ను ఎండార్స్ చేసిన X (మాజీ ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం కమలా హ్యారీస్ విధానాలను విమర్శిస్తూ “ఆమె పక్కా మార్క్సిస్టు” అని ప్రకటించేశాడు.
రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్యన ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసి) చానెల్ రెండో డిబేట్ నిర్వహించింది. ఈ సారి డిబేట్ లో కమలా హ్యారీస్ నుంచి పెద్దగా విషయ పరిజ్ఞానం లేనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ని రెచ్చ గొట్టి, ఆందోళన రేపి, చిత్తం వచ్చిన రీతిలో మాట్లాడేలా చేయడంలో సఫలం అయ్యారామె.
తాను డిబేట్ లో వెనకబడి పోయానని గ్రహింపుకు వస్తున్న కొద్దీ డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతూ కమలా హ్యారీస్ పన్నుల విధానం బట్టి “ఆమె పక్కా వామపక్ష వాది” అని ఆరోపించాడు.
డెమోక్రటిక్ పార్టీ గానీ, కమలా హ్యారీస్ గానీ ఎప్పుడూ వామపక్ష భావాలు ప్రకటించింది లేదు. అసలు వాళ్ళ విధానాలు ఏవీ వామ పక్ష విధానాలు కావు సరికదా, కనీసం ఇండియాలోని కాంగ్రెస్ పార్టీ వలె “లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్” కూడా కాదు. కానీ అమెరికాలో లెఫ్ట్ (వామ పక్షం), రైట్ (మితవాదం) ల మధ్య తేడా ఎ స్థాయిలో కనుమరుగయింది అంటే పేద ప్రజలు లేదా కార్మిక వర్గం లేదా కనీసం మధ్యతరగతి వర్గం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాటమాత్రం ప్రస్తావన వచ్చినా వాళ్ళ పైన లెఫ్టిస్ట్ అనీ, మార్క్సిస్టు అనీ, కమ్యూనిస్టు అనీ ముద్ర వేసేస్తున్నారు.
అంటే అమెరికాలో సామాన్య ప్రజల పక్షాన మాట్లాడడం, కంపెనీలలో ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడడం, అమెరికన్ ప్రజలు ఎదుర్కొంటున్న దరిద్రం, నిరుద్యోగం సమస్యల గురించి చర్చించడం అంతంగా నేరం అయిపోయింది. అసలు నిజం ఏంటయ్యా అంటే అమెరికాలో వామపక్షం అన్నదే లేదు. నిన్న మొన్నటి వరకూ అంటే గత ఎన్నికల వరకు డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో పోటీ చేస్తూ ఓడిపోతూ వచ్చిన బెర్నీ శాండర్స్ ను లెఫ్టిస్టు గా చెప్పే వాళ్ళు. ఆయన కనీసం హిల్లరీ క్లింటన్, బారక్ ఒబామా విధానాల్ని అయినా విమర్శించాడు. అయినా ఆయన లెఫ్ట్ వాది కాదన్నది వేరే సంగతి.
కనీసం బెర్నీ శాండర్స్ కి కూత వేటు దూరంలో కూడా కమలా హ్యారీస్ విధానాలు నిలబడవు. ఆమె ప్రకటించిన విధానాలు, ఉపాధ్యక్షురాలిగా మద్దతు ఇచ్చిన విధానాలు అచ్చంగా మితవాద విధానాలు. అంటే డెమోక్రటిక్ పార్టీ, మితవాద పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ యొక్క పోలిటికల్ పొజిషన్ ని ఆక్రమించడంతో రిపబ్లికన్ పార్టీ మితవాదం లోనే మరింత ‘అతి’ విధానాల వైపుకి వెళ్లాల్సిన పరిస్ధితి దాపురించింది. మితవాదం లోనే extreme పొజిషన్ లో నిలబడ్డ రిపబ్లికన్ పార్టీకి లేదా డొనాల్డ్ ట్రంప్ కూ, ఆయన మద్దతుదారులకూ డెమోక్రటిక్ పార్టీ కూడా మార్క్సిస్టు పార్టీగా, లెఫ్టిస్టు పార్టీగా కనిపిస్తున్నది.
కింద కార్టూన్ చెబుతున్నది ఆ సంగతే. అమెరికాలో లెఫ్ట్ అన్నదే లేదు. అది అదృశ్యం అయిపోయింది, లేదా చిన్నాభిన్నమై కూలిపోయింది. ఇన్నాళ్లూ లెఫ్ట్ పొజిషన్ లో ఉన్నట్లు ఫోజులు పెట్టిన డెమోక్రటిక్ పార్టీ రైట్ లోకి దూకడంతో, డెమోక్రటిక్ పార్టీతో తమ పార్టీకి తేడా ఉందని చెప్పుకోవటానికి రైట్ లోకి దూకిన డెమోక్రటిక్ పార్టీని ‘మార్క్సిస్టు’ పార్టీగా, లెఫ్ట్ పార్టీగా చెప్పాల్సిన పరిస్ధితిని రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొంటున్నది.
ఈ లెక్కన చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడి పేద ప్రజల గురించి మాట్లాడని రోజు లేదు. విద్య, వైద్య రంగాల్లో వివిధ ఇన్సూరెన్స్ స్కీమ్ లు ఆయన ప్రకటించారు. పేదలకు ఉచిత బియ్యం ఇచ్చే అన్న యోజన పధకాన్ని పొడిగించారు. గ్యాస్ సిలిండర్ ల రేటు తగ్గించారు. పెట్రోల్, డీజెల్ రేట్లు కూడా కొద్ది మొత్తమే అయినా తగ్గించారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తే ప్రధాన మంత్రి గారు పక్కా మార్క్సిస్ట్-లెనినిస్టు విధానాలు అమలు చేస్తున్నారు అనాలేమో?!
ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్టూన్ ని ది హిందూ పత్రికలో నేను చూడలేదు.
