ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…


ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి!

అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా అమెరికాను నానా తిప్పలు పెడుతున్నది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా మధ్య ప్రాచ్యంలో శాంతి కోసం పరితపిస్తుంటే ఇరాన్ ఇజ్రాయెల్ ప్రయత్నాలని అడ్డుకుంటున్నది.

మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ఇజ్రాయెల్ అణు బాంబులు కూడా నిర్మించుకుంది. తన అణు బాంబులతో ఎప్పటికైనా పశ్చిమాసియా/మధ్యప్రాచ్యంలో శాంతిని సాధించాలన్నదే ఇజ్రాయెల్ ఏకైక లక్ష్యం. ఇజ్రాయెల్ లక్ష్యం సాధించడం కోసం అమెరికా పూర్తి మద్దతు ఇస్తున్నది. కానీ ఇరాన్ దేశమే వారి ప్రయత్నాలను వమ్ము చేస్తున్నది.

అందుకు సాక్ష్యం ఏమిటి అంటే… అమెరికా ప్రపంచ శాంతి కోసం నిర్మించుకున్న సైనిక స్థావరాలకు సరిగ్గా మధ్యనే తన దేశాన్ని తీసుకెళ్లి పెట్టింది. ఈ విధంగా అమెరికా సైనిక స్థావరాల మధ్యన ఇరాన్ ప్రజలు, ఇరాన్ పాలకులు తమ దేశాన్ని పెడితే అమెరికా ప్రపంచ శాంతి ఎలా సాధించాలి?

ఈ విధంగా ప్రపంచ శాంతిని సాధించకుండా ఇరాన్ అమెరికాను ఇబ్బంది పెట్టవచ్చా? ఎంత ఘోరం? ఎంత అన్యాయం? ఇరాన్ కి మరీ ఇంత యుద్ధ పిచ్చి పనికిరాదు సుమా!

వ్యాఖ్యానించండి