
అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు.
అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా అయోమయంగా ఎటు పడితే అటు వెళ్ళడం లాంటివి జరగడంతో రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడగలడా అన్న అనుమానాలు బలంగా రేకెత్తాయి.
ఐనప్పటికీ తన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతూ బైడెన్ రెండో సారి అధ్యక్ష పదవిలో పోటీ పడేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన మతిమరుపు మరింత తీవ్రం అవుతూ వచ్చింది. జూన్ నెలలో ట్రంప్, బైడెన్ ల మధ్య జరిగిన డిబేట్ పోటీలో బైడెన్ బలహీనత స్పష్టంగా వ్యక్తం అయింది. తన డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పేరు మర్చిపోయి ‘బ్లాక్ మేన్’ గా చెప్పి అప్రతిష్ట పాలయ్యాడు. ట్రంప్ దాడి ముందు తేలిపోయాడు.
ఈ నేపధ్యంలో పలువురు డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆయనను పోటీ నుండి తప్పు కోమని కోరారు. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, మాజీ హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ లు కూడా బైడెన్ తప్పుకుంటే మంచిదని సూచించారు. దానితో పోటీ నుండి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించక తప్పలేదు.
అయితే బైడెన్ ఎండార్స్ చేసిన కమలా హ్యారిస్ అభ్యర్ధిత్వానికి డెమోక్రటిక్ పార్టీ లోని ప్రముఖులు బారక్ ఒబామా గానీ, హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ గానీ ఇంకా మద్దతు ప్రకటించలేదు. పైగా డెమోక్రటిక్ పార్టీ నుండి పోటీలో దిగేందుకు పలువురు అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది.
ప్రధానంగా మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ గ్రెచెన్ విట్మర్ (52), కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం (56), ఇల్లినాయిస్ గవర్నర్ జే బి ప్రిట్జ్ కర్ (59), పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో (51), మిన్నెసోటా నుండి హౌస్ సభ్యుడుగా ఉన్న డీన్ ఫిలిప్స్ (55) లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్దిత్వానికి పోటీ పడుతున్నారు.
అనేక మంది డెమోక్రటిక్ నేతలు కమలా హ్యారిస్ కే ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా అమెరికా ప్రజల నుండి అత్యంత తక్కువ మద్దతుగల వ్యక్తిగా అప్రతిష్ట పొందారు. లో ప్రొఫైల్ మెయింటెయిన్ చెయ్యడం, రాజకీయ ప్రకటనల్లో పరిణతి కనబరచ లేకపోవటం, ఉపాధ్యక్షురాలిగా మెరుగైన పనితనం కనబరచక పోవటం, కార్యాలయ ఉద్యోగులపై కేకలు వేయటం వల్ల వారితో సత్సంబంధాలు లేకపోవటం, సిబ్బంది అభిప్రాయాలను తేలికగా కొట్టివేయటం… ఇవన్నీ ఆమె ప్రతిష్టను మసకబార్చాయి.
ఐనప్పటికీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ని ఓడించే సత్తా బైడెన్ కంటే కమలా హ్యారిస్ కే ఎక్కువ అవకాశం ఉందని డెమోక్రటిక్ పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు పలు సర్వేలలో అమెరికన్లు ట్రంప్ కంటే హ్యారిస్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
ట్రంప్ డోలాయమానం
డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు రేటింగ్ లో బైడెన్ కంటే ముందంజలో ఉంటూ వచ్చాడు. జూన్ నెలలో జరిగిన డిబేట్ తర్వాత ట్రంప్ గెలుపు తధ్యం అని అందరూ భావించారు. కానీ బైడెన్ తప్పుకోవడంతో డోనాల్డ్ ట్రంప్ తన ప్రచారాన్ని కొత్త ఎత్తుగడలతో తిరిగి ప్రారంభించ వలసిన అగత్యం ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ట్రంప్ తో పోటీలో విజయం సాధించే అంశంలో బైడేన్ కంటే కమలా హ్యారిస్ కు అధిక అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా విశ్లేషణలను నమ్మ వచ్చా అన్న అంశంపై అనుమానాలు ఉన్నాయి. వివిధ సర్వేలు తాము మద్దతు ఇచ్చే అభ్యర్ధుల ప్రభావాన్ని పెంచేందుకు వాస్తవ విరుద్ధ విశ్లేషణలు చేయడం కద్దు.

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఉక్రెయిన్ కు అమెరికా ఇస్తున్న మద్దతును ఉపసంహరిస్తానని, యుద్ధాన్ని వెంటనే విరమిస్తానని హామీ ఇచ్చాడు. ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా వెంటనే నిలిపివేసి తద్వారా ఉక్రెయిన్ – రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. ఈ హామీ పట్ల గ్లోబల్ సౌత్ దేశాలు ఆశాభావంతో ఉన్నాయి.
కాని డొనాల్డ్ ట్రంప్ హామీలు నీటి మూటలతో సమానం. 2015 ఎన్నికలకు ముందు రష్యాతో సంబంధాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేప్పట్టిన తర్వాత అందుకు తగిన చర్యలు తీసుకోవటంలో విఫలం అయ్యాడు. చైనాతో ఘర్షణ విధానాన్ని మరింత తీవ్రం చేశాడు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడం కొనసాగించాడు. పైగా ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయని విధంగా జెరూసలెం మొత్తం ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. టెల్ అవీవ్ నుండి జెరూసలేంకు అమెరికా రాయబార కార్యాలయాన్ని తరలించాడు. ఇది పాలస్తీనా ఒప్పందాలకు, ఐరాస తీర్మానాలకు విరుద్ధం. తూర్పు జరూసలేం ను పాలస్తీనా రాజధానిగా ఐరాస తీర్మానాలు గుర్తించగా వాటిని ట్రంప్ అతిక్రమించాడు.
కనుక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నిక అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం నిలిపివేస్తానన్న హామీని ఆయన నిలుపుకోగలడన్న నమ్మకం లేదు. పైగా అమెరికా విదేశీ విధానాలను అధ్యక్షుడి కంటే అమెరికా డీప్ స్టేట్ శక్తులే నియంత్రిస్తాయి. డీప్ స్టేట్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ అధ్యక్షుడూ నిర్ణయాలు తీసుకోలేడు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్వారా అమెరికన్ సామ్రాజ్యవాద మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ భారీగా లబ్ది పొందుతోంది. సదరు లాభాలను వాళ్ళు వదులుకోరు.
ఎన్నికలు ఒక ప్రహసనం
డీప్ స్టేట్ అంటే అమెరికా సూపర్ ధనిక వర్గాలతో కూడిన గుంపు. వీళ్ళు వివిధ రహస్య సంఘాలను ఏర్పాటు చేసుకుని అమెరికా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ ఉంటారు. వాల్ స్ట్రీట్ కంపెనీల యజమానులు, భారీ ద్రవ్య సంస్థల నిర్వాహకులు, ఆయుధ కంపెనీల అధిపతులు ఈ డీప్ స్టేట్ లో భాగంగా ఉంటారు. వీళ్ళలో కూడా గ్రూపులు ఉన్నప్పటికీ తమ ప్రయోజనాలకు ప్రమాదం వచ్చినప్పుడు అంతా ఒక్కటవుతారు. అధ్యక్షుడు, హౌస్ స్పీకర్, సెనేట్ మరియు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ల మెజారిటీ మరియు మైనారిటీల నాయకులు వారి కను సన్నలలో కొనసాగుతూ తగిన ఆర్ధిక లబ్ది పొందుతారు.
అమెరికా ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ అభ్యర్ధి అధ్యక్షుడు గా గెలిచినా ప్రజల ప్రయోజనాల విషయంలో తేడా ఎమీ ఉండదు. ఇరు పార్టీల మధ్య ఉన్నాయని చెప్పే తేడాలు, వైరుధ్యాలు కేవలం అమెరికా ప్రజలను మోసగించేందుకు మాత్రమే ఉద్దేశించినవి. ప్రభుత్వం అంటూ ఒకటి ఏర్పడినాక పాలక వర్గాలు పార్టీలకు అతీతంగా కలిసిపోతారు. అప్పులు తేవడంలో, అప్పు పరిమితి పెంచడంలో వాల్ స్ట్రీట్ కంపెనీలకు బిలియన్ల కొద్దీ బెయిలౌట్ లు ప్రకటించడంలో రెండు పార్టీలు కలిసిపోయి బై-పార్టిసన్ ఒప్పందాలతో ఏకగ్రీవ నిర్ణయాలు చేసేస్తారు. బెర్నీ సాండర్స్, రాన్ పాల్ లాంటి ప్రగతిశీల కబుర్లు చెప్పే నేతలు కూడా చివరికి పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్ధికి మద్దతు ప్రకటించేస్తారు. ప్రైమరీ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన కబుర్లు అన్నీ ఇట్టే మాయం అయిపోతాయి.
అమెరికా, ఇండియా, బ్రిటన్… ఇలా ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే దేశాలు అమలు చేసేది వాస్తవంలో బూర్జువా నియంతృత్వమే తప్ప ప్రజాస్వామ్యం కానే కాదు. కాకపొతే పాలకవర్గాల మధ్య ఉండే గ్రూపుల్లో ఎ గ్రూపుకు అధికారం కట్టబెట్టాలి అన్న విషయాన్ని నిర్ణయించేందుకు మాత్రమే ప్రజల వద్దకు ఎన్నికల రూపంలో వస్తారు. ఎన్నికలంటూ ముగిసాక అందరూ ఒకటే.
పాఠకులు ఎవరైనా నాకొక సంగతి చెప్పండి. అక్షరాల సైజు ఇప్పుడు బాగా తగ్గిపోయింది. వాటి సైజు పెంచే అవకాశం ఇప్పుడు నాకు అందుబాటులో లేదు. వర్డ్ ప్రెస్ వాళ్ళు తెచ్చిన భారీ మార్పుల్లో ఆ సౌకర్యం ఎగిరిపోయింది.
నేను అడిగేది ఏమిటంటే బ్లాగ్ లో అక్షరాలు చదవలిగినంత పెద్ద సైజులో మీకు కనిపిస్తున్నాయా?
అక్షరాలు బాగానే కనిపిస్తున్నాయి!
OK. Thank you moola2019!