గాజా యుద్ధం: పాలస్తీనియన్లు వెళ్లేందుకు ఇక చోటు లేదు -ఐరాస


గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైన్యం పాలస్తీనా పౌరుల మారణ హోమం కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 తేదీన హమాస్ తమ పైన దాడి చేసి 2 వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సాకుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. కాగా వారిలో 75 శాతం మంది స్త్రీలు, పిల్లలే కావటం గమనార్హం.

కాగా గాజాలో పరిస్ధితిని తాజాగా మరోసారి మదింపు చేసిన యు.ఎన్.ఆర్.డబల్యు.ఎ (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యుజీస్ ఇన్ ద నియర్ ఈస్ట్) సంస్థ, “పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న బాంబు దాడుల నుండి రక్షణ కోసం వెళ్లేందుకు భద్రమైన చోటు ఏదీ మిగల్లేదు” అని జులై 7 తేదీన ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లో ప్రకటించింది.

దక్షిణాన ఈజిప్టు సైన్యం మిగిలిన మూడు దిక్కులా ఇజ్రాయెల్ సైన్యం మోహరించగా, ఇజ్రాయెల్ సైన్యం ఖాన్ యూనిస్ నగరం పైన మరోసారి భీకరంగా మిసైళ్ళతో దాడులు చేస్తోంది. ఐడిఎఫ్ నేరుగా స్కూళ్ళు, ప్రజా భవనాలు, రిలీఫ్ క్యాంపులు (శరణార్ధి శిబిరాలు) పైనే దాడులు చేస్తుండడంతో పాలస్తీనా ప్రజలతో పాటు యు.ఎన్.ఆర్.డబల్యు.ఎ సంస్థ కార్యకర్తలు సైతం చనిపోతున్నారు.

గాజాలో యు.ఎం.ఆర్.డబల్యు.ఎ ప్రతినిధి లూయిస్ వాటరిడ్జ్ న్యూయార్క్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఇది ఒక అంతులేని చావు, స్థాన భ్రంశంల చక్ర భ్రమణం” అని వ్యాఖ్యానించింది. దీని అర్ధం ఏమిటంటే హమాస్ సైన్యం దాక్కుని ఉన్నందున మేము ఫలానా చోట మిసైల్ దాడి చేయబోతున్నాం. ‘అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఖాళీ చేయాలి’ ప్రకటిస్తుంది. కానీ అక్కడ జనం ఖాళీ చేసేందుకు కేవలం కొన్ని నిమిషాలే వ్యవధి ఇస్తుంది.

వాళ్ళు ఖాళీ చేసే లోగా ఇజ్రాయెల్ బాంబు దాడి చేస్తుంది. భవనాలు, శిబిరాలు కూలిపోతాయి. కూలిన భవనాల శిధిలాల క్రింద చిక్కుకుపోయిన వారి కోసం బ్రతికి ఉన్న పౌరులు, కుటుంబ సభ్యులు వల వల కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ వెతుకులాట ప్రారంభిస్తారు. లోపల ఇరుక్కున్న పౌరుల ‘కాపాడండి’ అంటూ చేసే ఆర్తనాదాలు కొన్ని గంటల పాటు కొనసాగి ఆ తర్వాత శాశ్వతంగా మూగబోతాయి.

బాంబు దాడి జరిగిన చోటు నుండి చావగా మిగిలిన వాళ్ళు మరో చోటికి తరలి వెళ్తారు. యు.ఎన్.ఆర్.డబల్యు.ఎ ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటారు. కొన్ని రోజుల తర్వాత పాలస్తీనా పౌరులు ఎక్కడికైతే తరలివచ్చి తలదాచుకున్నారో అక్కడ హమాస్ సైన్యం నక్కి ఉంది అని చెబుతూ అక్కడ దాడి చేయబోతున్నట్లు ప్రకటిస్తుంది. మళ్ళీ మిసైల్, బాంబు దాడులు, చావులు, శిధిలాలు, చిక్కుకున్న ప్రాణాల కోసం వెతుకులాట, అంతులేని దుఃఖం… అన్నీ షరా మామూలు.

ఈ విధంగా గాజా స్ట్రిప్ ఉత్తరాన దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ సైన్యం క్రమ క్రమంగా ఉత్తర అర్ధ భాగం అంతా నేలమట్టం కావించింది. చనిపోయిన వాళ్ళు చనిపోగా బ్రతికిన వారు దొరికిన/మిగిలిన సామాను చేత బట్టుకుని గాజా మధ్య ప్రాంతానికి, అక్కడి నుండి ఖాన్ యూనిస్ కీ, ఖాన్ యూనిస్ నుండి దక్షిణ గాజా చివర ఉన్న రఫా పట్నం, మళ్ళీ అక్కడి నుండి తూర్పు గాజాకు, అక్కడి నుండి తిరిగి ఉత్తర గాజాకు, అక్కడి నుండి ఖాన్ యూనిస్ కీ ఇలా గాజాలోనే ఒక చోటి నుండి మరొక చోటికి నడుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

“ప్రజలు ఇక్కడ విశ్వాసం కోల్పోయారు. ఏళ్ళ తరబడి భద్రంగా నిలబెట్టుకుంటూ వస్తున్న సంకల్ప శక్తిని కోల్పోతున్నారు. ఇంకోసారి, మరోసారి స్థాన భ్రంశం (displacement) ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు నిర్దిష్ట భద్రత అన్నది లేనే లేకుండా పోయింది” అని వాటరిడ్జ్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పింది. “ఒక చోటి నుండి మరో చోటికి తరలి వెళ్ళగల సామర్ధ్యం విషయానికి వస్తే యుద్ధం మొదలై 8 నెలలు కావటంతో వారు తీవ్రంగా అలసిపోయి ఉన్నారు. వాళ్ళు డస్సిపోయి, సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు” అని ఆమె తెలిపింది.

ఆహారం, ఔషధాలు, దుస్తులు, సానిటరీ సరుకులు ఇలాంటివి అన్నీ యు.ఎన్.ఆర్.డబల్యు.ఎ ద్వారానే అందాలి. కానీ ఐడిఎఫ్ బలగాలు ఆ సంస్థకి చెందిన వాహనం కనబడితే కాల్పులు జరుపుతున్నారు. ఈజిప్టు నుండి రఫా సరిహద్దు గుండా యు.ఎం వాహనాలు రావలసి ఉండగా ఈజిప్టు వైపు ఈజిప్టు సైన్యం, గాజా వైపు ఐడిఎఫ్ బలగాలతో పాటు తీవ్రవాద ఇజ్రాయెలీ పౌరులు కాపలా కాస్తూ అవి గాజా లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. వాటిని లోపలికి రప్పించేందుకు ఐరాస అధికారులు ఇజ్రాయెల్ తో చర్చల మీద చర్చలు జరుపుతున్నా, యు.ఎం వాహనాలు గాజా లోపలికి క్షేమంగా వచ్చే పరిస్ధితి ఏర్పడటం లేదు.

అంతర్జాతీయ ఒత్తిడితో ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించినా కరడుగట్టిన ఇజ్రాయెలీ మితవాద తీవ్రవాద సంస్థలు ఎవరి మాటా వినడం లేదు. దీనితో గాజా పౌరులకు రష్యా, చైనా, ఐరాసలు పంపిస్తున్న ఆహారం, ఔషధాలు తదితరాలు అందడం లేదు. ఫలితంగా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా గాజా పౌరులు ఆకలికి మాడుతూ, దప్పికతో అల్లాడుతూ పోషకాహార లేమితో సగం చస్తూ బతుకుతున్నారు. ఇంతటి మహా ఉపద్రవం కళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇజ్రాయెల్ బాంబు దాడులు ఎందుకు జీనోసైడ్ కాదో వివరించి సమర్ధించేందుకు వెర్రి మొర్రి లాజిక్ లతో వాదిస్తూ గడుపుతున్నాయి తప్ప గాజా పౌరుల చావు-బ్రతుకుల గురించి అస్సలు మాట్లాడడం లేదు.

“గాజా ప్రజలు చాలా బలహీనంగా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. గాయపడ్డ వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఔషధాలు అందడం లేదు. ఉన్న ఔషధాలు నానాటికి తగ్గిపోతున్నాయి. తాజా పండ్లు, కూరగాయలు చూసి యుగాలు గడిచినట్లుగా ఉంది. తాగు నీరు దుర్లభం అయింది” అని యు.ఎన్.ఆర్.డబ్ల్యు.ఎ ప్రతినిధి లూయిస్ వాటరిడ్జ్ తెలిపింది.

రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రజలు ఖాన్ యూనిస్ నగరం తూర్పు ప్రాంతం ఖాళీ చేయాలని ప్రకటించడంతో వాళ్ళు ఈసురోమంటూ రఫా ప్రాంతం లోని ఆల్-మవాసి ప్రాంతానికి తరలివెళ్ళారు. అక్కడి నుండి ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక, దిక్కూ దరీ తోచక గాజా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వ్యాఖ్యానించండి