పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి


UNRWA official Chris Gunnes

UNRWA official Chris Gunnes

గాజాలో ఐరాస తరపున శరణార్ధి శిబిరాలను నిర్వహిస్తున్న UNRWA ప్రతినిధి తమ పాఠశాలపై దాడిని వివరిస్తూ కెమెరా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అమానుషాన్ని కళ్ళారా చూసిన ఆయన జరిగిన ఘోరాన్ని తిరిగి గుర్తు చేసుకుంటుండగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నోట మాట రాకపోయినా బలవంతంగా మాటలు కూడబలుక్కుని వివరిస్తూ తలవంచుకుని ఏడ్చేశారు.

పాఠశాలలో తలదాచుకుంటున్న వారు నిద్రలోనే చనిపోయారని UNRWA ప్రతినిధి క్రిస్ గన్నెస్ ఆల్ జజీరా టి.వి ఛానెల్ కు చెబుతూ దుఃఖించారు. జబాలియా లోని ఐరాస పాఠశాలలో 3,300 మంది శరణు పొందుతున్నారని, ఇళ్లకు దూరమై కూడా రక్షణ పొందలేకపోతున్నారని వారు అనుభవించడానికి హక్కులు ఏమీ లేకుండా పోయాయని తెలిపారు.

“పాలస్తీనా పౌరుల హక్కులు, వారి పిల్లల హక్కులు కూడా సంపూర్తిగా నిరాకరించబడుతున్నాయి. ఒక్కోసారి పదాల కంటే కన్నీళ్లే మరింత సమర్ధవంతంగా మాట్లాడగలుగుతాయి. కానీ, గాజా పౌరుల కన్నీళ్లతో పోలిస్తే నా కన్నీళ్లు ఇట్టే తేలిపోతాయి” అని రాయిటర్స్ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది.

పాఠశాల దాడిని ఐరాస ఖండించిన సంగతి తెలిసిందే. “పిల్లలను నిద్రలోనే చంపేశారు. ఇది మనందరకూ అవమానకరం. విశ్వవ్యాపితంగా సిగ్గు పడడానికి ఇది తగిన వనరు” అని ఐరాస ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్ మాత్రం ఘటనపై విచారణ చేస్తున్నామని బొంకింది. అనగా దాడికి తాము బాధ్యులం కాదని పరోక్షంగా చెప్పదలిచింది. దాడికి ఇజ్రాయెలే కారణం అని భావించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఐరాస తెలిపింది.

ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలపై దాడి జరగడం ఇది 6వ సారి అని UNRWA తెలిపింది. అప్పటికే 5 సార్లు తాము నిర్వహిస్తున్న పాఠశాల శిబిరాలపై దాడులు జరగడంతో జబాలియా శిబిరం గురించి ఇజ్రాయెల్ కు తాము ముందే సమాచారం ఇచ్చామని UNRWA అధికారులు చెప్పారు. బహుశా అందుకే ఇజ్రాయెల్ గురి చూసి దాడి చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. గాజాను నేలమట్టం చేసి పూర్తిగా మనిషి అనేవాడు లేకుండా చేయడమే తమ లక్ష్యం అని అనేకమంది ఇజ్రాయెల్ నేతలు, మిలట్రీ అధికారులు గతంలో అనేకసార్లు ప్రకటించారు.

“జబాలియా బాలికల ప్రాధమి పాఠశాల సరిగ్గా ఎక్కడ ఉన్నదీ మేము ముందే ఇజ్రాయెల్ కు సమాచారం ఇచ్చాము. శరణు జొచ్చిన వేలమంది ప్రజలు అందులో ఉన్నారని చెప్పాము. 17 సార్లు ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ మిలట్రీకి చేరవేశాము. తద్వారా శరణార్ధులను రక్షించుకోవచ్చని భావించాము. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు కూడా మరొక్కసారి సమాచారం ఇచ్చాము” అని UNRWA అధికారి ఒకరు చెప్పారు.

3 thoughts on “పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి

  1. ప్రజాస్వామ్య భారత్‌ మాత్రం ఈ ఘటనని ఖండించడానికి కూడా ముందుకు రాలేకపోతోంది. మోడీ వస్తే దౌత్య విధానాల్లో భారీ మార్పులు వస్తాయని ఆశించాం కానీ ఇంత దుర్బలమైన మార్పులు వస్తాయని అనుకోలేదు. కనీసం కాంగ్రెస్‌ హాయంలోనే నయం అన్యాయాన్ని మెల్లిగానైనా అన్యాయం అన్నారు.

  2. @urs_sreenivas : మీరు మరీ అంత అత్యాశతో ఎలా ఉన్నారో బొత్తిగా అర్ధం కావడంలేదు. పాలస్తీనా విషయంలో మన policy reversal జరిగిందే వాజపేయి సారధ్యం వహించిన భాజపా హయాంలో. అప్పుడే తొలిసారిగా మనం ఇజ్రాయెల్ దేశాధినేతను ఆహ్వానించామనుకుంటాను. ఇప్పుడిక చెప్పేదేముంటుంది? అయ్యా వీధిరౌడీ జులుంని ఎదిరించి నిలిచే సత్యకాలపు, అలీనవిధాన కాలపు రోజులుకావివి. వాడితో లాలూచీపడి, వాడితో ఇచ్చిపుచ్చుకోవడాలు నడుపుతూ, వాడికి అధికారానికిదాసోహమయ్యి, వీలైతే వాడు విదిల్చే రక్తపు మెతుకులకోసం పాకులాడే రోజులివి (ఇరాకు యుధ్ధము గుర్తున్నదా?).

    @విశేఖరు గారు: ప్రభుత్వవిధానాలు ఎంత అంకఛండాలముగాఉన్నా వెనకేసుకురావడమే దేశభక్తి అనిపించుకుంటుంది. మీకు బొత్తిగా దేశభక్తి లోపించినట్లుంది.

వ్యాఖ్యానించండి