–
“మరేం ఫర్వాలేదు – మాకు సంతోషమే. ఎందుకంటే ఆ ఉచితాలన్నింటి ఖర్చు ఇక మేము భరించనక్కర్లేదు కదా!”
–
రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పధకాలు అవినీతి కాదని చెబుతూనే అవి ప్రజాస్వామ్యం మూలాలను కుదిపి వేస్తాయని అంగీకరించింది. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ పంపిణీ పధకాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అవి అవినీతి కాదని ప్రకటించింది. కానీ ఉచిత పధకాల ప్రకటనపై తగిన నియంత్రణ ఉండాలనీ, నియంత్రించేందుకు తగిన మార్గదర్శకాలను త్వరలో రూపొందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.
నిజానికి ఉచిత పధకాలను ప్రజలు ఎన్నడూ దేబిరించలేదు. ప్రజలు ఎప్పుడూ తమ కష్టాన్ని నమ్ముకున్నారు తప్ప అన్నీ ఉచితంగా తమకు సమకూరాలని ఎన్నడూ కోరుకోలేదు. ఓట్ల వేటలో పడిన రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక నీతి పాటిస్తూ ఆరోగ్యకరమైన విధానాల ద్వారా, హుందాగా ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు సంపాదించడానికి బదులు అనేక అడ్డదారులు తొక్కుతున్న ఫలితమే ఉచిత పధకాలు!
వాస్తవానికి ఉచితం అన్నవేవీ ప్రజలకు ఉచితంగా లభించడం లేదు. ఉచితం అనీ, సబ్సిడీలనీ ఉద్దేశించిన పధకాలన్నీ పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుండగా సబ్సిడీల భారాన్ని ప్రజలే పెరిగిన పన్నులు, మద్యం లాంటి ఇతర రూపాల్లో అదనంగా ప్రభుత్వానికీ, దాన్ని నడుపుతున్న ధనికులకు సమర్పించుకుంటున్నారు. సబ్సిడీ ఎరువులను తమ మిశ్రమ ఎరువుల ఫ్యాక్టరీలకు తరలించుకుంటూ పట్టుబడిన కడప మాజీ మేయర్ రవీంద్ర నాధ్ దగ్గరనుండి, ఉపాధి హామీ పధకం నిధుల్ని యంత్రాలతో పని చేయించి బొక్కుతున్న అక్రమార్కుల వరకూ ఈ వాస్తవాన్ని రుజువు చేశారు. అంతిమ పరిశీలనలో తేలేదేమిటంటే ఉచితం అన్నవన్నీ ఆ పేరుతో ప్రజలపై అదనపు భారం మోపడం.
ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో వాగ్దానం చేస్తున్న ఉచిత పధకాలు స్వేచ్ఛాయుత, నీతిమంతమైన ఎన్నికల వ్యవస్ధ యొక్క పునాదులను కుదిపేస్తున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కానీ వాటిని అవినీతి అని చెప్పడానికి మాత్రం నిరాకరించింది. బహుశా ఉచిత పధకాలు కొద్దో గొప్పో పేదలను ఆదుకుంటున్నాయని కోర్టు భావిస్తుండవచ్చు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు.
కానీ ప్రభుత్వాలు ఉచిత పధకాలు అందించే బదులు ఈ దేశానికి అత్యవసరమైన భూ సంస్కరణలను అమలు చేసినట్లయితే జనం కష్టం చేసి కడుపు నింపుకోగల సత్తా ఉన్నవారే. చేపలు పట్టడం నేర్పాలి గానీ, చేపలు పట్టి ఇవ్వడం చేయకూడదు అన్న చైనా సామెతను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం. ఆదాయాలు పెంచుకోగల సౌకర్యాలను ప్రజలకు ప్రభుత్వాలు కల్పించాలి గాని ఉచితం అంటూ వారిని మోసం చేయడం, ఆనక ఉచిత భారాన్ని ప్రజల పైనే మోపడం గర్హనీయం!

ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ lu enti kontamandi uchitamgaa bhoomi kooda istaamantunnaru kudarak pote jendaalu pata mantunnaru