స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో వారికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నీ, అత్యాధునిక నిఘా పరికరాలని సరఫరా చేస్తున్నది అమెరికా కంపెనీలేనని ఎఫ్.పి కధనం తేటతెల్లం చేసింది. నిఘా పరికరాలు తయారు చేస్తున్న కంపెనీలకు అతి పెద్ద కష్టమర్ అమెరికా ప్రభుత్వమేనని కుండ బద్దలు కొట్టింది.
ప్రపంచ వ్యాపితంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలమని చెబుతున్న దేశాలలో కూడా ప్రజలపై నిఘా పెట్టడానికి తగిన దుర్మార్గ చట్టాలను చేసుకున్నాయని ఎఫ్.పి తెలిపింది. వినియోగదారుల సెల్ ఫోన్ సంభాషణలను రికార్డు చేయడానికి తగిన అవకాశాలను ప్రభుత్వానికి అప్పగించాలని సెల్ ఫోన్ కంపెనీలనూ, ఐ.టి కంపెనీలనూ అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉండని చెప్పే భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ, ఒత్తిడి చేస్తోందనీ పత్రిక తెలిపింది. కోర్టు అనుమతి లేకుండా తమ ప్రజల ఫోన్ సంభాషణలను వినేందుకు దుర్మార్గ చట్టాన్ని తేవడానికి బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతిని ప్రస్తావించింది. చైనా, ఇరాన్, సిరియా లను అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, అధ్యక్షుడు ఒబామా లు ‘ఇంటర్నెట్ స్వేచ్చా’పై ఓ వైపు తిట్టిపోస్తుండగా, కోర్టుల అనుమతి కోరకుండా, అమెరికా ప్రజలపైనే నిఘా పెడుతున్న అమెరికా పోలీసులు, ఎఫ్.బి.ఐ ల గురించి వారు పట్టించుకోవడం లేదని ఎత్తి చూపింది. ఇంటర్నెట్ స్వేచ్ఛ ముందు సొంత ఇంటి నుండే ప్రారంభం కావాలన్న కనీస ప్రజాస్వామిక సూత్రాన్ని అమెరికా పట్టించుకోవడం లేదని తప్పు పట్టింది.
కొద్ది రోజుల క్రితం మాస పత్రిక ‘వైర్డ్’ ప్రచురించిన మరొక సంచలనాత్మక కధనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అమెరికాకి చెందిన ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ప్రపంచంలోనే అతి పెద్ద ‘గూఢచార కేంద్రం’ నిర్మిస్తున్న సంగతిని ఆ పత్రిక బైటపెట్టింది. ప్రపంచ వ్యాపితంగా ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య ప్రవహించే సంభాషణలనూ, సమాచారాన్ని మధ్యలోనే విని, రికార్డు చేసే అతి పెద్ద ‘గూఢచార కేంద్రం’ ని ‘ఉటా’ రాష్ట్రంలో ‘బ్లఫ్ డేల్ లో అమెరికా నిర్మిస్తున్నదని వెల్లడించింది. ఈ కేంద్ర యోట్టా బైట్ల (ఒక మిలియన్ బిలియన్ల గిగాబైట్లు) సమాచారాన్ని ప్రాసెస్ చేయగల శక్తి ఈ కేంద్రానికి సమకూరుస్తున్నారని వెల్లడించింది. అమెరికాలోనే కాక మొత్తం ప్రపంచం అంతటా జరిగే సమాచార ప్రవాహంపై ఇది నిఘా పెడుతుందని తెలిపింది.
ఈ మెయిళ్ళు, మొబైల్ ఫోన్ల సంభాషణలు, టెక్స్ట్ మెసేజ్ లు, వెబ్ వినియోగదారుల ఇంటర్నెట్ సెర్చ్ లు టెలిఫోన్ కాల్సు… ఇలా సమస్త ప్రవాహాలనీ మధ్యలోనే అడ్డగించి, విడదీసి, విశ్లేషించి, నిలవ చేయడానికి బ్లఫ్ డేల్ గూఢచార కేంద్రాన్ని ఉపయోగించనున్నారని వైర్డ్ పత్రిక తెలియజేసింది. “అత్యంత కపట, రహస్య, చొరబాటు ఏజన్సీ’ గా ‘బ్లఫ్ డేల్ స్పై సెంటర్’ పని చేస్తుందని ఆ పత్రిక తెలిపింది. సంవత్సరానికి 65 మెగావాట్ల విద్యుత్ ని వాడే ఈ కేంద్రం 40 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లు కు ప్రాణం పోస్తుందని తెలిపింది. శాటిలైట్ల నుండి భూగ్రహంపైకి ప్రవహించే అన్నీ సిగ్నళ్లను పట్టి జిప్ చేసి భూమి పొరల్లో, సముద్రాల అంతర్భాగాల్లో గుండా ప్రవహించే అంతర్జాతీయ, దేశీయ, విదేశీయ నెట్ వర్క్ ల గుండా సంగ్రహిస్తుందని వెల్లడించింది. రెండు బిలియన్ల డాలర్లతో నిర్మిస్తున్న ఈ కేంద్రం పైకి సైబర్ సెక్యూరిటీ కి అని చెప్పినా అసలు పని ప్రపంచ ప్రజలపై నిఘా పెట్టడమేనని వెల్లడించింది.
ప్రపంచ ప్రజల సమస్త కార్యకలాపాలపైనా నిఘా పెట్టడానికి తెగించిన అమెరికా తగుదునమ్మా అని ఇంటర్నెట్ స్వేచ్చా పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటనలు జారీ చేయడం, సుద్దులు చెప్పడం పరమ మోసం. నియంతృత్వ విధానాలపైన తిరగబడుతున్న వివిధ దేశాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేస్తున్న నియంతలకూ, సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలకూ ఆధునిక సాంకేతిక నిఘా పరికరాలు, సేవలు అందజేస్తున్నది అమెరికా కంపెనీలే అయినప్పటికీ వాటి నియంత్రణకు అమెరికా నిజాయితీగా ప్రయత్నించడం లేదు. అమెరికా విధానాల్లో, చట్టాల్లో నిజాయితీ వెతకడం నేతి బీరలో నెయ్యిని వెతకడమే. ప్రపంచ వనరులను స్వాయత్తం చేసుకోవడానికి వీలుగా దేశాలను ఆక్రమించుకోవడానికయితే నియంతృత్వ వ్యతిరేక కబుర్లు కావాలి గానీ కంపెనీల లాభాలను హరించే పనయితే మాత్రం ‘ఇంటర్నెట్ స్వేచ్చా’ సూత్రాలేవీ అమెరికాకి సోదిలోకి కూడా రావు.
“ఇంటర్నెట్ స్వేచ్చ తన లక్ష్యమని ఒబామా ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ, తాను వినియోగిస్తున్న నిఘా పరికరాల విషయంలో తమ ప్రజలతో పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించడం లేదు. ఎటువంటి గూఢచార పరికరాలను ప్రజలపై వినియోగిస్తున్నదీ, పరికరాలను ఏ కంపెనీల నుండి తాను కొనుగోలు చేస్తున్నదీ, ఈ పరికరాలకి ఏ విధమైన సామర్ధ్యం ఉన్నదీ ఏయే దేశాలు ఈ పరికరాలను కొనుగోలు చేస్తున్నదీ మున్నగు వివరాలు ప్రజలకు తెలియజేయడానికి అమెరికా కార్యనిర్వాహక విభాగం ఏ ప్రయత్నమూ చేయడం లేదు” అని ఎఫ్.పి పత్రిక వ్యాఖ్యానించింది.
అమెరికాలోని ప్రతి పోలీసు డిపార్ట్ మెంటూ కోర్టుల అనుమతి లేకుండానే అత్యవసరం కాని పరిస్ధితుల్లో కూడా సెల్ ఫోన్ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్’ పరిశోధన చేసి వెల్లడించిందని ఎఫ్.పి తెలిపింది. తమ నెట్ వర్క్ ల ద్వారా ప్రవహించే పౌరుల ప్రవేటు సంభాషణలను రహస్యంగా విని, రికార్డు చేసి, పోలీసులకు, గూఢచార సంస్ధలకు అంధించే అవకాశాన్ని ప్రవేటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు ఇచ్చే విధంగా అమెరికా కాంగ్రెస్ స్వయంగా ఒక బిల్లు తయారు చేస్తున్నదని ఎఫ్.పి తెలిపింది. ఇందుకోసం కోర్టులు, చట్టాలతో పని లేకుండా చేయడానికి ఈ బిలును ఉద్దేశించారని తెలిపింది. ప్రజల స్వేచ్ఛకు, ప్రైవసీకి భంగం కలిగించే విధంగా అమెరికా ప్రభుత్వం, ప్రవేటు టెక్నాలజీ కంపెనీలకు పెరుగుతున్న అనైతిక బంధాన్ని అమెరికా ప్రజలు ప్రతిఘటించవలసిన అవసరం అత్యవసరంగా ముందుకు వచ్చింది.