హమ్మయ్య! సోనియా తిరిగొచ్చింది!


కాంగ్రెస్ నాయకులు సోనియా ఉన్నప్పటి కంటే, ఆమె లేనప్పుడే ఎక్కువగా ఆమె నామ జపం చేస్తారని భారత ప్రజలకు తెలిసొచ్చింది. ఇంకా వెల్లడికాని జబ్బు నయం కావడానికి, శస్త్ర చికిత్స కోసం సోనియా గాంధీ నెల రోజూల క్రితం అమెరికా వెళ్ళింది. సోనియా గానీ, ఆమె కుటుంబం గానీ చెప్పకుండానే తనకు గర్భాశయ కాన్సర్ సోకిందని పత్రికలు నిర్ధారించాయి. ప్రతి పత్రికా ‘సోనియాకు కాన్సర్’ అని మీడియా చెబుతున్నదని రాయడమే గానీ నిర్ధారించినవారెవరూ లేరు. ఎవరికీ చెప్పాపెట్టకుండా సోనియా అమెరికా వెళ్ళాక గాని, ఆమె దేశంలో లేని సంగతి వెల్లడి కాలేదు. రావడం కూడా అంతే రహస్యంగా వచ్చారు. ఆమె మరో నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవలసి ఉన్నదనీ, ఆ తర్వాతే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుందని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లుగా రాయిటర్స్ చెబుతోంది.

సోనియా కాన్సర్ కి గురికావడం బాధాకరమయిన విషయమే అయినా, కాంగ్రెస్ వాళ్ళూ చేసిన హడావుడి ఆమె పరోక్షంలో పనులన్నీ జరగకూడదు ఆపేయాలన్నట్లుగా సాగింది. అధికారిక కార్యక్రమాలనుండీ ఆంద్ర ప్రదేశ్ లో తెలంగాణ పోరాటం వరకూ అన్నీ వాయిదా పడాలన్నట్లుగా వారి ధోరణి కొనసాగింది. ఈ సెంటిమెంటు జాతీయ స్ధాయిలో కొన్ని పరిమితుల్లో ఉన్నా, ఎ.పిలో పరిధులు దాటింది. సోనియా గాంధీ జబ్బున పడి ఆపరేషన్ జరిగింది కనుక తాము తెలంగాణ ఆందోళన వదిలి, విధుల్లో చేరామని తెలంగాణ మంత్రులు ప్రకటించారు. అంతకుముందు వారు ఆఫీసులో చేసే పనికి ఇళ్ల వద్ద చేశారు తప్ప తెలంగాణ కోసం వారు చేసిన రాజీనామాలకు కట్టుబది ఉన్న పరిస్ధితి ఏమీ లేదు. ఆ కాస్త దాన్ని కూడా సోనియా ఆసుపత్రిలో చేరినందుకు, ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆందోళనకు బందు పెట్టారట!

మరోవైపు తెలంగాణ ఎం.పిలదీ అదే వరస. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నందున ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం లేదనీ ఆమె కోలుకునే వరకూ బైటికి రామనీ ప్రకటించిమరీ అదృశ్యమయ్యారు, తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలు. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎలు కూడా దాదాపు అలాంటి ప్రకటనే చేశారు. తెలంగాణ ఆందోళన అన్నది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలవంతం కావాలన్న కోరికను నెరవేర్చడానికి చేస్తున్న ఆందోళన. ఒక ఆందోళనకూ, ఒక పార్టీ అధ్యక్షురాలి ఆరోగ్యానికీ ముడి పెట్టడం అన్నది బహుశా ప్రపంచంలో ఎక్కడా చూసి ఎరగము. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వారు, చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా తమ అధ్యక్షురాలికి జబ్బు గనక, తమకూ తమ కార్యకలాపాలకూ జబ్బు వచ్చినట్లే అన్న స్ధాయిలో అన్నింటినీ బందు చేసుకుంటామనడం ఎక్కడి భావ దారిద్రం? వ్యక్తి పూజ, సైకో ఫాన్సీ, పరిమితులు దాటటం కాదా ఇది?

రాష్ట్రంలో పరిస్ధితి ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వంలో పరిస్ధితికూడా ఇలాగే ఉన్నట్లుగా పత్రికల వార్తలు చెబుతున్నాయి. అన్నా హజారే ‘జన్ లోక్ పాల్’ బిల్లు కోసం జరిపిన ఉద్యమాన్ని మన్మోహన్ ఎదుర్కోలేక పోయాడనీ, సోనియా లేకపోవడమే దానికి కారణమనీ జాతీయ పత్రికలు కొన్ని ఊహాగానాలు చేయగా, అంతర్జాతీయ పత్రికలు ఆ వార్తలను అంది పుచ్చుకుని తాము ఆ మేరకు వార్తలు రాశాయి. నిజానికి సోనియా గాంధీ దేశంలో లేకపోవడమ్ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు ఆగిపోయాయా అని పరిశీలిస్తే అదేమీ లేదనే అర్ధం అవుతుంది. అన్నీ యధావిధిగానే సాగాయి. తేడా వచ్చింది ఎక్కడయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులలోనే. అది కూడా ఒకటే రొదతోటి. తాము చెప్పేదానిలో కనీస హేతువు ఉండాలన్న జ్ఞానం మరిచి సోనియా అనారోగ్యం గురించి సానుభూతి పొందడం కోసం ప్రయత్నాలు చెయ్యడం, వెగటు పుట్టించిందనే చెప్పాలి.

జన్ లోక్ పాల్ బిల్లు పై ఆందోళన, పార్లమెంటు కార్యక్రమాలను బి.జె.పి స్తంభింపజేయడం ఈ రెండూ సొనియా ఇండియాలో లేకపోవడం వల్లనే అని కొన్ని పత్రికలు కాంగ్రెస్ నాయకులను ఉటంకిస్తూ రాశాయి. విచిత్రం ఏమిటంటే సొనియా అమెరికాకి బయలుదేరినప్పటినుండీ తిరిగి మళ్ళీ ఇండియా వచ్చాక కూడా ఆమెకు సంబంధించిన ఏ ఫోటో కూడా పత్రికలకు చిక్కకపోవడం. కాంగ్రెస్ నాయకుల హడావుడి గురించి తెలుసు కనకనే సోనియా ఈ జాగ్రత్త తీసుకున్నదా? అంత జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉన్నదా?

రాయిటర్స్ వార్తా సంస్ధ కూడా సోనియా గాంధి అనారోగ్యం ప్రభుత్వంపై ప్రభావం పడేసిందని రాస్తున్నది. అది కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను దృష్టిలో ఉంచుకునే ఆ విధంగా రాసింది. అయితే సోనియా లేకపోవడం వలన ఏ కార్యక్రమమూ ఆగిపోలేదని విశ్లేషకులు చెప్పినట్లు కూడా ఆ పత్రికే రాయడం గమనార్హం. ఆమెకు అనేకమంది సలహాదారులు ఉన్నారని సోనియా కార్యక్రమాలనన్నింటినీ ప్రధానంగా వీరే నిర్వహిస్తారనీ విశ్లేషకులను ఉటంకిస్తూ రాయిటర్స్ రాసింది. నిజానికి సోనియా ఇండియాలో ఉన్నప్పుడు కూడా పెద్దగా రోజువారీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోరనీ, ఆమె సలహదారుల ద్వారానే ప్రధానంగా పనులు నడిచిపోతుంటాయని వారు చెబుతున్నారు.

సోనియా అమెరికా వెళ్లక ముందు తన కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి పోయింది. ఆమె అప్పజెప్పిన బాధ్యతలను సరిగా నిర్వర్తించిన దాఖలాలు మాత్రం రాహుల్ కనబరచలేదు. భావి ప్రధానిగా కాంగ్రెస్ తో పాటు పత్రికలు కూడా భజన చేసే రాహుల్ గాంధీ అన్నా ఉద్యమ సమయంలో పార్టీ పెద్దలతో సమావేశాలు జరిపి పరిస్ధితిని ఎదుర్కోవడానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలొ విపలం కావడం కనిపిస్తూనె ఉంది. బహుశా అదంతా ప్రభుత్వం వ్యవహారం కనుక రాహుల్ ప్రభుత్వానికి వదిలేశాడేమో. కాని సోనియా గాంధీ నుండి ఆదేశాలు వచ్చాకే కాంగ్రెస్ పెద్ద ప్రణబ్ ముఖర్జీ అన్నా ఉద్యమ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు ముందుకు కదిలాడని పత్రికలు రాస్తున్నాయి. ఆమె చెప్పాకే పార్లమెంటులో చర్చలు, అన్నాతో రాయబారాలు జరిగాయని పత్రికలు రాశాయి.

అయితే, ప్రధాన మంత్రి ఏమీ చెయ్యలేకపోవడమన్నదీ సోనియాగాంధి లేకపోవడంతో కంటే ఆయన సామర్ధ్యానికి సంబంధించిన సమస్యగానే చూడవలసి ఉంటుంది. మన్మోహన్ గాంధీ రాజకీయవేత్త కాదు. దేశం భావిస్తున్నట్లుగా ఆయన కూడా తనకు తాను అన్నింటికీ అతీతుడుగా భావిస్తున్నట్లు కనిపిస్తుంది. దేశంలో ప్రవేటీకరణ, సరళీకరణ విధానాలు పవేశపెట్టడానికీ, దేశ ఆస్తులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి చూపే చొరవ, చురుకుదనం మన్మోహన్ ప్రజల సమస్యల విషయంలో చూపడు, చూపలేడు. ఆయన తనకు తాను ప్రజా సమస్యలనుండి మొదటినుండీ దూరంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రజలకు సంబంధించిన వ్యవహారలు సోనియా తదితర బృందానికి వదిలినట్లుగానూ, పెట్టుబడిదారులు, ధనికులు, పారిశ్రామికవేత్తలూ తదితర సెక్షన్ల వ్యవహారాలు మన్మోహన్ చేపట్టినట్లుగానూ కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఈ రెండు సెక్షన్లూ చేసే ప్రకటనలు కూడా అలాగే ఉంటాయి.

జవహర్ లాల్ నుండి సంక్రమించిన ఈ వారసత్వ చెయిన్ ఎప్పుడు తెగుతుందన్నదీ కాంగ్రెస్ వాళ్ళే నిర్ణయించుకోవాలి. వారి నిర్ణయ శక్తి ఒక విధంగా దేశానికి పట్టిన దరిద్రంగా కూడ కొనసాగుతున్నది.

వ్యాఖ్యానించండి