పాలస్తీనా దేశ ప్రకటనను వీటో చేస్తాం -అమెరికా దుర్మార్గం


అమెరికా తన దుర్నీతిని బహిరంగంగా ప్రకటించుకుంది. తాను నిత్యం వల్లించే మానవ హక్కుల సిద్ధాంతాలూ, ప్రజాస్వామికి సూత్రాలు తాను పాటించేది లేదని మరొకసారి బైటపెట్టుకుంది. అక్రమంగా ఇజ్రాయెల్ దేశాన్ని తెచ్చి అమెరికా, యూరప్ లు పాలస్తీనా ప్రజల నెత్తిన పెట్టిన దగ్గర్నుండీ, తాము కోల్పోయిన తమ స్వంత దేశం కోసం, స్వంత నేల కోసం తపన పడుతున్న పాలస్తీనా ప్రజలను దారుణంగా మోసం చేసింది. చర్చలతో పాలస్తీనా రాజ్యాన్ని స్ధాపించగలమని ఇచ్చిన హామీని దశాబ్దాల తరబడి సాగతీస్తూ అంతిమంగా ఇజ్రాయెల్ దుర్మార్గాలకు మద్దతు పలికే దురన్యాయాన్ని తాము మార్చుకోలేదని చాటి చెప్పింది.

ఓ వైపు పాలస్తీనీయుల ఇళ్ళను కూల్చి ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మిస్తుండగా ఇజ్రాయెల్‌తో చర్చలు జరపడం అసాధ్యమని పాలస్తినా అధారిటీ ప్రకటించి గత సంవత్సరం నామ మాత్రపు చర్చలనుండి లేదా చర్చల నాటకం నుండీ తప్పుకుంది. ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్ నిర్మాణాన్ని ఆపితేనే చర్చలకు వస్తామని మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలోని పాలస్తీనా అధారిటీ ప్రకటించింది. తూర్పు జెరూసలేంను భావి పాలస్తీనా దేశానికి రాజధానిగా పాలస్తీనియులు భావిస్తుండగా, తూర్పు పడపర జెరూసలేం అనేదేమీ లేదు జెరూసలేం మొత్తం ఇజ్రాయెల్‌దే అని ఇజ్రాయెల్ ప్రభుత్వం హుంకరిస్తూ తూర్పు జెరూసలెం లోని పాలస్తీనీయుల ఇళ్లను కూలగొట్టి సెటిల్ మెంట్లు నిర్మించడం కొనసాగిస్తున్నది. తూర్పు జెరూసలేం తమదే కనుక సెటిల్మెంట్ల నిర్మాణం ఆపేదే లేదని ఇజ్రాయెల్ దురహంకా పూరితంగా వ్యవహరిస్తున్నది.

ఇజ్రాయెల్, సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ఆపాలని అమెరికా మొక్కుబడి ప్రకటనలు చెయడమే తప్ప, ఇజ్రాయెల్ ను కట్టడి చేయడానికి ఒక్క చర్యా తీసుకున్నది లేదు. ఫలితంగా చర్చలు కొండెక్కాయి. పాలస్తీనీయుల నిరంతర వేదనకు అంతే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో పాలస్తీనా అధారిటీ, తామే స్వయంగా పాలస్తీనా దేశం ఏకపక్షంగా ఐక్యరాజ్య సమిత్లో ప్రకటించుకుంటామని తెలిపింది. అందుకు ప్రయత్నాలను గత కొన్ని నెలలుగా చేసుకుంటున్నది. సెప్టెంబరు 19 న జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో స్వతంత్ర దేశం ప్రకటించడానికి అన్ని దేశాల మద్దతుని కూడగట్టుకుంటున్నది. పాలస్తీనా ప్రభుత్వం ఆ పని చేసినట్లయితే అది తేలికగా జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందే అవకాశం ఉంది.

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు సఫలం కావడానికి ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నిర్మాణం ఆపాలని గత సంవత్సరం పాలస్తీనా సంస్ధ ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానం పెద్ద మెజారిటీతో గెలిచింది. అయితే ఆ తీర్మానాన్ని అమెరికా వీటో చేయడంతో అంతిమంగా తీర్మానంగా బైటికి రాలేకపోయింది. ఆ ధైర్యంతోనే పాలస్తీనా సంస్ధ స్వతంత్ర దేశం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుని ఆమేరకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలను విఫలం చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ లు శతధా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధికారులు పాలస్తీనా అధారిటితో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ ప్రయత్నాలను విరమించాలని నచ్చజెపుతున్నారు. అనేక ఎరలు చూపుతున్నారు. అయితే ఈ దశలో అమెరికా ఒత్తిడికి లొంగితే పాలస్తీనా అధారిటీని పాలస్తీనా ప్రజలు క్షమించరు. దానితో అమెరికా, ఇజ్రాయెల్‌ల ఒత్తిడి పనిచేయడం లేదు.

గురువారం మొదటిసారిగా అమెరికా ప్రభుత్వం బహిరంగంగా ఒక ప్రకటన చేసింది. పాలస్తీనా సమస్యకు పరిష్కారం చర్చలతోనే సాధ్యమని స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి విక్టోరియా నూలంద్ ప్రకటించింది. కనుక చర్చలకు భిన్నంగా జరిగే ప్రతి చర్యనూ తాము వ్యతిరేకిస్తామని ఐక్యరాజ్యసమితిలో అటువంటి తీర్మానం వస్తే తాము తప్పకుందా వీటో చేస్తామనీ ప్రకటించింది. అయినప్పటికీ పాలస్తీనా అధారిటీ తమ ప్రయత్నాల్ను కొనసాగించక తప్పదు. సమితిలో ఓటింగ్ జరిగితే మెజారిటీతో వారి తీర్మానం నెగ్గుతుంది. కాకపొతే అమెరికా వీటో చేస్తుంది. మెజారిటీతో తీర్మానం నెగ్గడమే పాలస్తీనా ప్రజలకు కావలదింది. తద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దుర్నీతికి ప్రపంచ దేశాలలో మద్దతు లేదన్న సంగతి ప్రపంచానికి మరొకసారి వెల్లడవుతుంది. అది అమెరికా ఇజ్రాయెల్ లను నైతికంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుత పాలస్తీనీయుల ప్రయత్నాల లక్ష్యం కూడా ప్రధానంగా అదే.

అరబ్ ప్రజా ఆందోళనల నేపధ్యంలో ఇజ్రాయెల్ దేశానికి మిత్రులు తగ్గుతున్నారు. ముబారక్ గద్దె దిగడంతో ఈజిప్టు నుండి అందుతున్న కీలక మద్దతు బాగా బలహీనపడింది. మరోవైపు టర్కీ తమ దేశస్ధులను తొమ్మిదిమందిని ఇజ్రాయెల్ చంపేసిన సంఘటనకు క్షమాపణ చెప్పనందుకు ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. ఇజ్రాయెల్ కు అన్నివైపులా ఒత్తిడి ఎదురవుతున్నది. ఈ దశలో కూడా అమెరికా పాలస్తీనీయులకు ఇచ్చిన హామీని అమలు చేయడం కంటే ఇజ్రాయెల్ ద్వారా మధ్య ప్రాచ్యంలో నెరవేరుతున్న తమ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం అమెరికా ప్రకటనల ద్వారా స్పష్టమవుతున్నది.

వ్యాఖ్యానించండి