అణు సాంకేతిక పరిజ్ఞానం కోసం పాక్ మిలట్రీ అధికారులకు లంచం చెల్లించిన ఉత్తర కొరియా


Abdul Qadeer Khan

పాక్ అణు పితామహుడు "అబ్దుల్ ఖదీర్ ఖాన్'

పాకిస్ధాన్‌కు అణుశాస్త్ర, అణ్వస్త్ర పితామహుడుగా పేరుపొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ మిలట్రీ పరువు తీస్తూ అణుబాంబు పేల్చినంత పని చేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉత్తర కొరియాకు అణు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉత్తర కొరియాకు బదలాయించాడని పాక్ ప్రభుత్వం ఖదీర్ ఖాన్‌పై ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఆ అరోపణలకు భిన్నంగా అణు సాంకేతికత బదలాయింపులో పాక్ మిలట్రీకే నేరుగా సంబంధం ఉందనీ, అందుకు మిలట్రీ అధికారి ఒకరు 3 మిలియన్ డాలర్లు, మరొక అధికారి 0.5 మిలియన్ డాలర్లు ఉత్తర కొరియానుండి లంచంగా పొందారని అబ్దుల్ ఖాదిర్ వెల్లడించాడు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక గురువారం ఈ వివరాలని వెల్లడించింది.

ఉత్తర కొరియా అధికారి ఒకరు 1998 లో రాశాడని చెబుతున్న ఉత్తరం కాపీని అబ్దుల్ ఖాదిర్ విడుదల చేశాడు. ఆ లెటర్ లో అణు సాంకేతికత బదలాయింపు, లంచాల చెల్లింపుల వివరాలు ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఐతే సదరు ఉత్తరం సరైనదా కాదా అన్న విషయాన్ని ధృవీకరించలేక పోతున్నట్లు ఆ పత్రిక తెలిపింది. రెండో అధికారికి 0.5 మిలియన్ డాలర్లతో పాటు కొన్ని నగలను కూడా లంచం కింద సమర్పించుకున్నట్లు ఉత్తరం తెలుపుతోంది. ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ సెక్రటరీ జోన్ బ్యాంగ్ ఉత్తరంపై సంతకం చేసినట్లు ఉందని పోస్ట్ తెలిపింది.

లంచం సమర్పించుకున్నాక అబ్దుల్ ఖాదిర్, ఉత్తర కొరియాకు అణు కార్యక్రమంపై డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉందని ఉత్తరం ద్వారా తెలుస్తోంది. అబ్దుల్ ఖరీద్ ఖాన్ ఉత్తర కొరియాకు సెంట్రిఫ్యూజ్‌లను, యురేనియం ఆధారిత అణు బాంబును తయారు చేయడానికి సహాయం అందించే వివిధ బొమ్మలను అందించినట్లుగా గతంలో అంగీకరించాడు. అప్పటికే ఉత్తర కొరియా వద్ద ప్లుటోనియం ఆధారిత అణు బాంబులు ఉన్నాయి. ప్లుటోనియం అణు బాంబులు ఉన్నప్పటికీ యురేనియం ప్రకృతిలో అధికంగా దొరికే ఖనిజం ఐనందున యురేనియం బాంబుకోసం వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

పాకిస్ధాన్ ప్రభుత్వం మాత్రం అణు రహస్యాలను ఉత్తర కొరియాకు చేరవేయడంలో అబ్దుల్ ఖదీర్ స్వంతగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించాడని ఆరోపిస్తోంది. పశ్చిమ దేశాల గూఢచార సంస్ధలు కొన్ని అబ్దుల్ ఖదీర్ వెల్లడించిన ఉత్తరం అసలుదేనని నమ్ముతున్నట్లు చెబుతుండగా పాకిస్ధాన్ అధికారులు అది నకిలీ ఉత్తరమని ఆరోపిస్తున్నారు. పాక్ రాజకీయాల్లో, పాలనా రంగంలో శక్తివంతమైన మిలట్రీ అధికారులపై ఆరోపణలు రావడం పాక్ పౌర ప్రభుత్వానికి సైతం ఇష్టం లేదు. తద్వారా తాను పశ్చిమ దేశాలతో కుమ్మక్కైన సంగతి కూడా వెల్లడి అవుతుందని పాక్ ప్రభుత్వ వర్గాలు భావిస్తాయన్నది బహిరంగ రహస్యం.

వ్యాఖ్యానించండి