దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం


Dayanidhi Maran

కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్ సెల్ కంపెనీని అమ్మే వరకూ సాధించిన దయానిధి, తాను కోరుకున్నట్లు ఎయిర్ సెల్ కంపెనీని మాక్సిస్ కి అమ్మాక ఆగమేఘాల మీద స్పెక్ట్రం లైసెన్సులు జారి చేసినట్లు తెలుస్తోంది.

ఎయిర్ సెల్ కంపెనీని మలేషియా కంపెనీకి కట్టబెట్టడం ద్వారా దయానిధి మారన్ తన మీడియా కంపెనీల్లో మాక్సిస్ చేత 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకున్నాడని తెహెల్కా వెల్లడించింది. స్పెక్ట్రం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఎ.రాజా, ఎం.పి కనిమొళి లు స్పెక్ట్రం కుంభకోణం ఆరోపణలపైనే ప్రస్తుతం నైలులో ఉన్నారు. కనిమొళిది కేవలం 200 కోట్ల రూ.ల కుంభకోణం. దయానిధి సంపాదించిన మొత్తం 700 కోట్ల రూపాయలు. సి.బి.ఐ త్వరలోనే దయానిధి మారన్ పై కూడా దృష్టి సారించవచ్చని తెహెల్కా భావిస్తోంది.

ఐతే ప్రస్తుతం టెక్స్‌టైల్స్ శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న దయానిధి మారన్ తెహెల్కా పత్రికపై పరువు నష్టం కేసు వేయడానికి నిర్ణయించాడు. ఈ నిర్ణయంతో సన్ టీ.వి షేర్లు 30 శాతం పడిపోయాయి. వారి చౌక విమాన సర్వీసుల స్పైస్ జెట్ కంపెనీ షేర్లు కూడా12 శాతం పడిపోయాయి. ఈ రెండు కంపెనీలు మారన్ కుటుంబానివే. దయానిధి సోదరుడు కళానిధి మారన్ ఈ వ్యాపారలను చూస్తున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దయానిధి మారన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డి.ఎం.కె పార్టీ కోర్టు కేసు ఉన్నంత మాత్రాన మంత్రి పదవికి రాజీనామా చేయనవసరం లేదని ప్రకటించింది.

సన్ టివి నెట్ వర్క్ లో తనకు వాటాలేవీ లేవని దయానిధి ప్రకటించాడు. తెహెల్కా పత్రిక టీవిని అతని సోదరుడు కళానిధి నడుపుతున్న సంగతిని గుర్తు చేసింది. బాబా రాందేవ్ దీక్షతో డీలా పడిన మన్మోహన్ ఆ విషయం చర్చించడానికి కేబినెట్ సమావేశం నిర్వహించాడు. అందులో దయానిధి కూడా పాల్గొన్నాడు. కొద్ది రోజుల క్రితం చేసినట్లుగా రాందేవ్ దగ్గరికి సీనియర్ మంత్రుల నెవరినీ పంపరాదని సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వ్యాఖ్యానించండి