
ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటల లోగా (అమెరికా కాలమానం ప్రకారం) హోర్ముజ్ జలసంధి ని బేషరతుగా తెరవక పోయినట్లయితే ఇరాన్ నరకం చవి చూస్తుందని డొనాల్డ్ ట్రంప్ నిన్న హెచ్చరించాడు. ఇరాన్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పైన, మౌలిక నిర్మాణాలైన వంతెనలు, ప్రభుత్వ భవనాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు సమస్తం అమెరికా బాంబు దాడుల్లో సర్వ నాశనం అవుతాయని హుంకరించాడు. వేల సంవత్సరాల ఇరాన్ నాగరికత ఒక్క క్షణంలో ఆవిరి చేసేస్తా అన్నాడు. అలా చేయటం నాకు ఇష్టం లేదు కానీ చేసేస్తా! అని వదరాడు.
అయితే తాను విధించిన గడువు ముగియటానికి రెండు గంటల ముందే ట్రంప్ తన సామాజిక వెబ్ సైట్ ‘ట్రూత్ సోషల్’ లో హఠాత్తుగా ఒక ప్రకటన పోస్ట్ చేశాడు. దాని సారాంశం ఏంటయ్యా అంటే:
“పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ లు నాకు ఫోన్ చేశారు. హోర్ముజ్ జలసంధి ని తెరవటానికి నేను విధించిన గడువును మరో రెండు వారాలు పొడిగించమని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఇరాన్ కు పంపిస్తున్న వినాశక బలగాలను ఇరాన్ కు పంపకుండా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, తక్షణమే, అత్యంత భద్రతతో తెరవటానికి ఇరాన్ అంగీకరించటం ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు షరతుగా ఉంటుందని చెప్పటంతో నేను ఇరాన్ పైన బాంబు దాడులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయటానికి అంగీకరిస్తున్నాను.
“ఇది రెండు వైపులా పని చేసే కాల్పుల విరమణ! నా అంగీకారానికి కారణం ఏమిటంటే నేను విధించిన మిలటరీ లక్ష్యాలు అన్నీ పూర్తి కావటమే కాకుండా అంతకు మించి కూడా మనం సాధించాము. ఇరాన్ తోనూ, మధ్య ప్రాచ్యం లోనూ శాంతి నెలకొనే విషయంలో నిర్దిష్టమైన ఒప్పందం కుదిరే దిశలో మనం ఇప్పటికే చాలా దూరం వచ్చేశాము.
“ఇరాన్ నుండి పది పాయింట్ల ప్రతిపాదన మనకు అందింది. చర్చలు జరపటానికి అది అనువైన ప్రాతిపదికగా నేను నమ్ముతున్నాను. అమెరికా, ఇరాన్ ల మధ్య గతంలో వైరుధ్యం నెలకొన్న దాదాపు అన్ని అంశాల్లో అంగీకారం కుదిరింది. అయితే ఒప్పందం అంతిమ రూపం ధరించటానికి, అమలు అంశాలు ఖరారు కావటానికి రెండు వారాల కాలం పడుతుంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల తరపున, అధ్యక్షుడిగా, అలాగే మధ్య ప్రాచ్యం లోని దేశాల ప్రతినిధిగా ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం వైపుగా ముగుస్తున్నందుకు నాకు గౌరవ కారణం. ఈ విషయం పట్ల మీ శ్రద్ధ పెట్టినందుకు కృతజ్ఞతలు!
అధ్యక్షుడు, డొనాల్డ్ జె. ట్రంప్
నిన్న ట్రంప్ చేసిన హెచ్చరికలకీ, పైన ఉదహరించినట్లు ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తూ ఆయన చేసిన ప్రకటనకూ ఏ మాత్రం పొంతన లేదని ఇట్టే అర్ధం అవుతుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాలను పరిశీలిస్తే ట్రంప్ నేతృత్వం లోని అమెరికా ఇరాన్ ముందు ఎంతగా సాగిల పడిందీ మరింత స్పష్టంగా అర్ధం అవుతుంది.
ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాలు ఇలా ఉన్నాయి:
- అణ్వాయుధాలు నిర్మించబోమన్న వాగ్దానానికి ఇరాన్ కట్టుబడి ఉండటం
- ఇరాన్ మరియు దాని మిత్ర గ్రూపుల పైన ఎలాంటి దాడులనైనా పూర్తి ముగింపు పలీకేలా ఏర్పాట్లు చేయటం
- మధ్య ప్రాచ్యం ప్రాంతం నుండి అమెరికా యుద్ధ బలగాలను ఉపసంహరించి ప్రాంతీయ అమెరికా స్థావరాల నుండి ఇరాన్ పై దాడులు జరగకుండా నిషేధం విధించటం
- సేఫ్ పాసేజ్ ప్రోటోకాల్ కింద ఇరాన్ విధించే నియమ నిబంధనలను అనుసరించి హోర్ముజ్ జలసంధి గుండా పరిమిత నౌకల రవాణాను అనుమతించటం
- ఇరాన్ పైన విధించిన ప్రథమ, ద్వితీయ మరియు ఐరాస ఆంక్షలను ఎత్తివేయటం
- యుద్ధంలో ఇరాన్ ఎదుర్కొన్న నష్టాలను భర్తీ చేసేందుకు వీలుగా ఒక ఇన్వెస్ట్ మెంట్ మరియు ఫైనాన్షియల్ ఫండ్ ఏర్పాటు చేయటం
- అణు పదార్ధాలను శుద్ధి చేసేందుకు ఇరాన్ కి ఉన్న హక్కును, మరియు శుద్ధి స్థాయిల పై చర్చలు జరిపేందుకు అమెరికా గుర్తించటం
- ప్రాంతీయ దేశాలతో ద్వైపాక్షిక మరియు బహుళ పక్ష శాంతి ఒప్పందాలను ఇరాన్ కుదుర్చుకునేందుకు అమెరికా (ఇతర దేశాలను) అనుమతించటం
- మధ్య ప్రాచ్యంలోని అన్ని ప్రతిఘటనా గ్రూపులకూ నాన్-అగ్రెషన్ విధానాన్ని విస్తరించటం
- ఐరాస అధికారిక తీర్మానాల ద్వారా ఈ అంశాలు అన్నింటికీ చట్టబద్ధ ఆమోదం సాధించటం
ఇరాన్ చేసిన ఈ పది అంశాల ప్రతిపాదన తాము (అమెరికా) చేసిన 15 అంశాల ప్రతిపాదనతో దాదాపు సంపూర్ణంగా అంగీకరిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. కానీ వాస్తవం ఏమిటంటే ఇరాన్ ప్రతిపాదనకు, అమెరికా ప్రతిపాదనకు అసలు పొంతనే లేదు. అమెరికా ప్రతిపాదన పూర్తిగా అమెరికా, ఇజ్రాయెల్ ల శాశ్వత పెత్తనానికి ఇరాన్ ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం చెప్పాలన్నట్లుగా ఉన్నది. పైన సూచించిన 10 అంశాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.
అంటే “నేను కింద పడ్డా నాదే పై చేయి” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రకటిస్తున్నాడు.
ఐతే ఇన్నాళ్ళు వదరుబోతు మాటల్ని పదే పదే వల్లించిన ట్రంప్, తాత్కాలిక సీజ్ ఫైర్ నేపధ్యంలో ఆ బాధ్యత ని యుద్ధ కార్యదర్శి (యుద్ధానికి ముందు రక్షణ కార్యదర్శి -డిఫెన్స్ సెక్రటరీ- అనేవాళ్లు) పీట్ హెగ్ సెత్ కి అప్పగించినట్లు కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే పీట్ హెగ్ సెత్ “ఈ కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరాన్ కాళ్లా వేళ్లా పడుతూ అడుక్కుంది” అని ఏ మాత్రం సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నాడు.
పైన ఉదహరించిన పది అంశాల ఇరాన్ ప్రతిపాదన సి.ఎన్.బి.సి టీవి 18 వెబ్ సైట్ నుండి స్వీకరించటం జరిగింది. అయితే ఈ అంశాలను వివిధ వార్తా సంస్థలు వివిధ రకాలుగా ఇస్తున్నాయి. మొత్తం మీద చూస్తే సంఖ్యలు అటూ ఇటూ అయినప్పటికీ పై పది అంశాలే వార్తా సంస్థలు ప్రచురించాయి. ఇరాన్ ఇచ్చిన అధికారిక జాబితా మాత్రం ఎక్కడా అందుబాటులో లేదు. ఎవరికి వారు ఇరాన్, పార్శీ భాషలో ఇచ్చిన జాబితాకు అనువాదం అని చెబుతున్నారు.
ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్, అమెరికాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయి అన్నది అనుమానమే. పై పది అంశాలలో రెండు వారాలు జరుగుతాయని చెబుతున్న చర్చల ఫలితంగా మార్పులు చేర్పులు జరగవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ పది పాయింట్లను యధాతధంగా ఆమోదిస్తాయని భావిస్తే అది అమాయకత్వమే అవుతుంది.
ఇప్పటికే సీజ్ ఫైర్ ఒప్పందం తమకు అంగీకారమే అని చెప్పాక కూడా అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ కు చెందిన ఫార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడులు చేశాయని, తద్వారా సీజ్ ఫైర్ ను ఆదిలోనే ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. మరో పక్క ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని ప్రకటించింది. లెబనాన్ పైన 100 చోట్ల దాడులు చేశామని కూడా చెప్పింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు నిజాయితీ అంటే ఏమిటో తెలియదు. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం అసలే తెలియదు. నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపు మరో మాట చెప్పటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఉన్న అలవాటు. అందులో తప్పు ఉన్నట్లు భావిస్తున్నట్లు కూడా మనకు ఆనవాళ్ళు దొరకవు.
ఇక ఇరాన్ ని చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను సహించే స్థితిలో ఉన్నట్లు కనిపించటం లేదు. ఇంతటితో ఏమీ కాలేదని, యుద్ధం తిరిగి ప్రారంభించటానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలకు ఇప్పటికే పిలుపు ఇచ్చింది.
కనుక అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం రెండు వారాల పాటు నిలుస్తుందన్న గ్యారంటీ లేదు.