
బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలనలో, నరేంద్ర మోడి, అమిత్ షా ద్వయం హయాం లో ఇండియా పైన అమెరికా దాష్టీకం, పెత్తనం, కంట్రోల్ పెరిగిపోయిందన్న సూచనలు అమెరికా అధ్యక్షుడు, మంత్రులు, అధికారులు వరుసగా ఇస్తూనే ఉన్నారు.
ఇండియా పైన తమ పెత్తనం సంపూర్ణం అన్న నమ్మకాన్ని వాళ్ళు తమ మాటల ద్వారా, ప్రకటనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఇవ్వటం కొనసాగుతూనే ఉన్నది. వారి సూచనల్లో ఎలాంటి తడబాటు లేకపోవటమే అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం!
రైసీనా డైలాగ్ పేరుతో భారత ప్రభుత్వం న్యూ ఢిల్లీలో ఒక వేదికను నిర్వహిస్తున్నది. ఈ వేదిక పైన పలువురు విదేశీ వాణిజ్య, పాలనా ప్రముఖులను పిలిచి వారితో చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అమెరికా ఉప విదేశాంగ మంత్రి (డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్) క్రిస్టఫర్ లాండూ వేదిక పైన మాట్లాడుతూ ఇండియా పట్ల తమకు ఎంత చిన్న చూపు ఉన్నదో చాటాడు.
“20 సంవత్సరాల క్రితం చైనా విషయంలో చేసినట్లుగా మేము ఇండియా విషయంలో అదే తప్పు చేయబోవటం లేదు. ‘ఈ మార్కెట్లు అన్నింటినీ మీరు అభివృద్ధి చేయండి’ అని చైనాను అనుమతించినట్లు ఇండియాను అనుమతించ బోవటం లేదు. అలా అనుమతిస్తే, ఆ తర్వాత మీరు వివిధ వాణిజ్య అంశాల విషయంలో మమ్మల్ని ఓడించే విధంగా ఎదిగిపోతారు” లాండూ వ్యాఖ్యానించాడు.
ఈ లాండూ గాడి ఉద్దేశ్యం ఏమిటంటే వాళ్ళు అనుమతించటం వల్లనే చైనా ఆర్ధికంగా, సైనికంగా విపరీతమైన అభివృద్ధి సాధించి అమెరికాను దాటి పోయింది అని. లేకపోతే చైనా అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశంగానే ఉండిపోయెదని ఈ బఫూన్ చెబుతున్నాడు.
ఇంకా ఏమంటున్నాడో చూడండి. “మేము ఏమి చేసినా మా ప్రజలకు న్యాయబద్ధంగా ఉండే చర్యలే అమలు చేస్తాము. ఇండియా గవర్నమెంట్ తన ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉన్నట్లే, మా సొంత ప్రజల పట్ల మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా!” లాండూ బఫూన్ సెలవిచ్చాడు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ఇండియా పైన తమ ఆధిపత్యం ఏ పాటిదో ఎరుక పరిచాడు. అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన అత్యంత దారుణంగా మిసైళ్లతో, బి 2, బి 21 బాంబర్లతో దాడులు చేస్తూ ఇప్పటికే 3000 కి పైగా ఇరాన్ ప్రజలను చంపేసింది. ఈ దాడుల వలన పర్షియన్ గల్ఫ్ నుండి చమురు దిగుమతులు బంద్ అయ్యాయి. దానితో ప్రపంచ మార్కెట్ లో చమురు లభ్యత పడిపోయింది. ఇది కొనసాగితే చమురు ధరలు పెరిగిపోతుంది.
ఈ పరిస్ధితుల్లో ప్రపంచ చమురు మార్కెట్ ని స్థిరీకరించ టానికి వీలుగా రష్యా చమురు ను ఒక నెల రోజుల పాటు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చాము అని బెస్సెంట్ బఫూన్ సెలవిచ్చాడు. ఆయన ఇండియా ను గోంగూర లో పురుగు లాగా తీసి పడేస్తూ ఏమన్నాడో చూడండి.
“ఇండియన్స్ చాలా మంచి వాళ్ళు. చెప్పినట్లు చేస్తారు. “ఈ ఫాల్ సీజన్ (శరదృతువు – ఆకులు రాలే కాలం) లో మేము ఆంక్షలు విధించిన రష్యా చమురును కొనుగోలు చెయ్యవద్దని ఇండియాకు చెప్పాము. వాళ్ళు మేము చెప్పినట్లే చేశారు. రష్యా చమురు దిగుమతి నిలిపివేసి ఆ స్థానంలో అమెరికా చమురు దిగుమతి చేసుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ (ఈ లోగా యుద్ధం జరుగుతుండడంతో) ప్రపంచ వ్యాపితంగా చమురు సరఫరాలో తాత్కాలిక తగ్గుబడి రాకుండా ఉండటం కోసం రష్యా చమురు దిగుమతి చేసుకునేందుకు మేము ఇండియాకు అనుమతి మంజూరు చేశాము” అని చెప్పాడు బెస్సెంట్!
“మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపెట్టినట్లు ఇందన సరఫరాలో అమెరికా ఆధిపత్యం నెలకొల్పాలన్న విధానంలో భాగంగానే ఇండియాకు ఈ అనుమతి ఇచ్చాము” అని బెస్సెంట్ స్పష్టం చేశాడు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నా మాట విని ఇండియా, పాకిస్తాన్ లు తమ యుద్ధాన్ని నిలిపి, శాంతి చర్చలు ప్రారంభించాయని డొనాల్డ్ ట్రంప్ అనేక మార్లు ప్రకటించాడు. దీనిని భారత ప్రధాన మంత్రి నేరుగా ఎన్నడూ ఖండించలేదు.
“ట్రంప్ చెబుతున్నట్లు, అమెరికా చెప్పటం వల్లనే ఆపరేషన్ సింధూర్ ని నిలిపివేసి చర్చలు జరిపాము అనటంలో నిజం లేదు” అని భారత ప్రధాని లేదా రక్షణ మంత్రి ప్రకటించలేదు.

US Treasury Secretary Scott Bessent
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యా నుండి చమురు దిగుమతిని ఇండియా పెంచుకోవడం ద్వారా రష్యా చేస్తున్న యుద్ధానికి ఇండియా పరోక్షంగా నిధులు అందిస్తున్నది. అందువలన రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు గాను ఇండియా పై అదనంగా మరో 25% సుంకాలు (టారిఫ్) అమెరికా మోపింది.
దానితో వెంటనే రష్యా చమురు దిగుమతులను, అవి అత్యంత చౌక ధరకు లభిస్తున్నా సరే, తగ్గించుకోవటం మొదలు పెట్టింది. కొన్ని నెలల లోనే పూర్తిగా తగ్గించుకుంది. అక్కడితో ఆగకుండా అమెరికాని చల్లబరచటానికి ఎఫ్-35 విమానాలు కొనుగోలు చేస్తానని, వచ్చే ఐదేళ్ళలో 500 బిలియన్ డాలర్ల అమెరికా సరుకులు కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చేసింది.
అలాగే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భారత రైతులకు నష్టం వాటిల్లే విధంగా అమెరికా నుండి వ్యవసాయ సరుకులు, డెయిరీ సరుకులు దిగుమతులు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే ఇది నేరుగా కనపించకుండా పరోక్ష అంశాలను ఒప్పందంలో చేర్చారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అతి కిరాతకంగా ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పర్షియా సముద్రంలో ఉన్న హోర్ముజ్ జల సంధి ని ఇరాన్ మూసి వేసింది. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా అవుతుంది. ఇరాన్ తో పాటు, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల నుండి కూడా చమురు ఈ జలసంధి గుండా రవాణా అవుతుంది.
కాబట్టి హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల 20 శాతం చమురు సరఫరా తగ్గిపోయింది. దరిమిలా చమురు ధరలు విపరీతంగా పెరిగే పరిస్ధితి వచ్చింది. ఈ పెరుగుదలను అదుపు చేయటానికి తాత్కాలికంగా రష్యా చమురు ఇండియా కొనుగోలు ద్వారా చమురు మార్కెట్ లో ప్రవేశించటం అనివార్యం అయింది. లేకుంటే అధిక చమురు ధరలకు అమెరికాతో పాటు అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంతో అతలా కుతలం అవుతాయి.

ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా కూడా ఇలాంటి పరిస్ధితి ఏర్పడింది. రష్యా చమురు, గ్యాస్ ల పైన అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన దరిమిలా ఇండియా రష్యా చమురు దిగుమతి చేసుకుని, ఇక్కడ రిఫైనరీలలో శుభ్రం చేసి దాన్ని తిరిగి మారు బేరానికి ఐరోపా దేశాలకు అమ్ముకుంది. ఇది కూడా అమెరికా అనుమతి తోనే జరిగింది. ఇండియా జోక్యం లేకపోతే పశ్చిమ ఐరోపా దేశాల పరిస్ధితి దారుణంగా ఉండేది.
వాస్తవం ఇది కాగా, తమ అవసరం తీరగానే అమెరికా (డొనాల్డ్ ట్రంప్) ప్లేటు మార్చి ఇండియా పైన ఉరమటం మొదలు పెట్టాడు. ఇండియా, రష్యా చమురు దిగుమతి చేసుకోవటం వల్ల రష్యా యుద్ధానికి నిధులు అందుతున్నాయని ట్రంప్ ఆరోపించాడు. వెంటనే కట్టి పెట్టాలని డిమాండ్ చేశాడు. ఆ కారణం చూపిస్తూ అప్పటికే విధించిన 25 శాతం సుంకాలతో పాటు మరో 25 శాతం కలిపి 50 శాతం సుంకాలు ప్రకటించాడు.
అమెరికా కోరినట్లే ఇండియా, రష్యా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. తన చమురు ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ఖరీదైన అమెరికా చమురు దిగుమతికి అంగీకరించింది. పైన చెప్పినట్లు ఇంకా అనేక వాణిజ్య షరతులకు అంగీకరించింది.
గతంలో భారత కమ్యూనిస్టులను ఎగతాళి చేస్తూ బిజేపి లాంటి పార్టీలు “రష్యాలో వర్షం పడితే భారత కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారు” అనేవాళ్లు. “రష్యాకు జలుబు చేస్తే భారత కమ్యూనిస్టులు తుమ్ముతారు అని గేలి చేసేవాళ్ళు.”
ఇప్పుడు బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలకుల పరిస్ధితి హీనంగా దిగజారిపోయింది. ఎలాగంటే “అమెరికా శాసిస్తుంది. భారత పాలకులు తు.చ తప్పకుండా పాటిస్తారు.”