ఇండియాను మళ్లీ బెదిరిస్తున్న అమెరికా


ఎడమ నుండి వరుసగా: విదేశీ మంత్రి మార్కో రుబియో, ట్రంప్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్

అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి పరస్పరం ఒకరి పట్ల మరొకరు గౌరవం, స్నేహ భావన వ్యక్తం చేసుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అమెరికా, ఇండియాను బెదిరించటం మొదలు పెట్టింది. అమెరికా వస్తు సేవల పైన ఇండియా విధిస్తున్న టారిఫ్ లను మళ్లీ ప్రస్తావిస్తూ, అమెరికా నుండి మొక్క జొన్న ను దిగుమతి చేసుకోవాల్సిందే అని అమెరికా వాణిజ్య మంత్రి (కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుత్నిక్ హెచ్చరికలు జారీ చేశాడు.

అమెరికా వ్యవసాయ కంపెనీలు పండించిన మొక్కజొన్న లను దిగుమతి చేసుకునేందుకు ఇండియా నిరాకరిస్తే గనక ఇండియా తన సరుకులకు అమెరికా మార్కెట్ లో ప్రవేశం కోల్పోవాల్సి ఉంటుందని వాణిజ్య కార్యదర్శి లుత్నిక్ ఈ రోజు (బుధవారం, సెప్టెంబర్ 17) ఇండియాను హెచ్చరించాడు.

మోడి, ట్రంప్ నాలుగు రోజుల క్రితం పరస్పరం ఒకరినొకరు పొగడుకున్నాక ఇరు దేశాల మధ్య నిలిచి పోయిన వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతాయని ఇరు దేశాల్లోని వాణిజ్య వర్గాలు ఆశించాయి. ఆ మేరకు త్వరలో వాణిజ్య చర్చలు జరపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి కూడా. చర్చలు మొదలు కాక మునుపే అమెరికా హెచ్చరిక చేయటం బట్టి చర్చల్లో ఇండియా పైన అమెరికా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయనున్నదని స్పష్టం అయింది. భారత రైతాంగం ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా అమెరికా మొక్క జొన్నలను దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి ఎదురయ్యే పరిస్ధితిని ఇండియా ఎదుర్కొంటున్నది.

చర్చల్లో అమెరికా ఒత్తిడి అంటే ఇచ్చి పుచ్చుకోవడం పద్ధతిలో చర్చలు జరగవు. అమెరికాకు మాత్రమే ప్రయోజనాలు ఒనగూరే విధంగా చర్చలు ఏక పక్షంగా జరుగుతాయి. బహుళ పక్ష వాణిజ్య సంస్థ WTO లో సైతం అమెరికా తన పంతాన్నే ప్రధానంగా నెగ్గించుకుంటూ వచ్చింది. దోహా రౌండ్ చర్చల్లో ఇండియా, చైనా, టర్కీ, ఇండోనేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు ఒక జట్టుగా ఏర్పడి అమెరికా మాట చెల్లుబాటు కాని పరిస్ధితి ఏర్పడటంతో అమెరికా దోహా రౌండ్ చర్చలకు ప్రాధాన్యత తగ్గించేసింది. ఇప్పుడు ఏకంగా ప్రతి దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతూ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు చేసుకుంటోంది.

అమెరికా హుంకరింపు

ఆక్సియోస్ (Axios) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ హోవర్డ్ లుత్నిక్ “ఇండియా పట్ల మెతక వైఖరి అవలంబించ బోతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చినప్పటికీ, వాణిజ్య చర్చల్లో ఇండియా ‘టఫ్ టైమ్’ ఎదుర్కోవటం ఖాయం” అని లుత్నిక్ చర్చల్లో అమెరికా వైఖరి ఎలా ఉండబోతున్నదో స్పష్టం చేసేశాడు.

విచిత్రం ఏమిటంటే ఇండియా-అమెరికా వాణిజ్య సంబంధాలు ఏకపక్షంగా ఉంటున్నాయని లుత్నిక్ చెప్పటం! ఏకపక్షంగా అమెరికా-ఇండియా వాణిజ్య సంబంధం ఉండటం నిజమే గానీ ఆ ఏకపక్షం అన్నది ‘అమెరికాకు కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరే’ ఏకపక్షత. కానీ లుత్నిక్ చెబుతున్నది అది కాదు.

“వాళ్ళు మాకు అమ్మకాలు చేస్తూ అమెరికాను తమకు అనుకూల అవకాశంగా మార్చుకున్నారు. వారి ఆర్ధిక వ్యవస్థలో ప్రవేశం నుండి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము మా మార్కెట్ ను బార్లా తెరుచుకుని ఆహ్వానిస్తుంటే వారు మాత్రం మాకు సరుకులు అమ్ముతూ కూడా మా కంపెనీల సరుకులకు ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారు” అని లుత్నిక్ ఆరోపించాడు.

లుత్నిక్ ఇంకా ఏమన్నాడో చూడండి, “తమకు 1.4 బిలియన్ల జనం ఉన్నారని ఇండియా బాకాలు ఊదుతుంది. 1.4 బిలియన్ల (140 కోట్ల) మందిలో ఒక్కరు కూడా కనీసం ఒక బుషెల్ (35.2 లీటర్లు) మొక్క జొన్నలైనా ఎందుకు కొనుగోలు చేయరు? అటువంటి పరిస్ధితి అమెరికాకు ఆగ్రహం కలిగిస్తుందా లేదా? వాళ్లెమో మనకు సమస్తం అమ్ముతారు, వాళ్లెమో కనీసం మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయరా? పైగా వాళ్ళు అమెరికాకు చెందిన ప్రతి సరుకు పైనా సుంకం (టారిఫ్) మోపుతారు” అని లుత్నిక్ ఫిర్యాదు చేశాడు.

“అందుకే ఇండియా సుంకాలు తగ్గించాలని, మేము మిమ్మల్ని ఎలా చూస్తున్నామో మమ్మల్ని మీరు అలాగే చూడాలని మా అధ్యక్షుడు కోరాడు. ఏళ్ల తరబడి జరుగుతున్న తప్పుల్ని సవరించటానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. అందుకే ఈ పరిస్ధితి చక్కబడే వరకు సుంకాలను ఇండియా సరుకుల పైన మోప దలిచాము. ఇది మా అధ్యక్షుడి మోడల్. దీనికి అంగీకరిస్తే సరి, లేకపోతే ప్రపంచంలో అతి గొప్ప వినియోగ మార్కెట్ కలిగిన మాతో వాణిజ్యం కఠినంగా మారుతుంది” అని లుత్నిక్ అమెరికా అహంకార ధోరణిని ఎటువంటి తడబాటు లేకుండా వ్యక్తం చేశాడు.

జి ఎం మొక్క జొన్నలు

అమెరికా వ్యవసాయ కంపెనీలు ఉత్పత్తి చేసే మొక్క జొన్నలు ప్రధానంగా జన్యుపరంగా సవరించిన (జెనెటికల్లీ మోడిఫైడ్) మొక్కజొన్నలు. ఈ మొక్క జొన్నలు తినటానికే తప్ప మళ్లీ వాటిని నాటి పంట పండించటానికి పనికి రావు. అంటే అమెరికా నుండి మొక్కజొన్నలు దిగుమతి చేసుకున్నాక వాటిని విత్తనాలుగా తిరిగి నాటి పంట తీసే అవకాశం లేకుండా జన్యుపరమైన మార్పులు చేస్తారు. తద్వారా చౌక మొక్కజొన్నల కోసం ఎప్పటికీ అమెరికా పైనే ఆధారపడవలసిన అగత్యం ఇండియాకు ఏర్పడుతుంది.

అమెరికా బహుళజాతి కంపెనీలు భారీ వ్యవసాయ క్షేత్రాలలో యంత్రాల ద్వారా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో మొక్కజొన్నలు పండించటం వలన, అధిక ఉత్పాదక శక్తితో, వాటిని చవక ధరలకు అమ్మకం చేయగలుగుతారు. అవి ఇండియాకు దిగుమతి చేసుకోవటం మొదలు పెడితే, చవగ్గా వస్తాయి గనుక భారత వినియోగదారులు వాటికే అలవాటు పడతారు.

ఇండియా పరిస్ధితి అందుకు భిన్నం. భారీ వ్యవసాయ క్షేత్రాలు ఇక్కడ లేవు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అన్నది వ్యవసాయ రంగంలో ప్రవేశించలేదు. వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులు అత్యధికం చిన్న చిన్న కమతాల్లో పంటల్ని సాగు చేస్తారు. కనుక ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల మన రైతులు అమెరికా మొక్కజొన్న పంటతో పోటీ పడే పరిస్ధితి ఉండదు. ఫలితంగా అమెరికా మొక్కజొన్నలు దిగుమతి అయితే, కోట్లాది మంది రైతులు ఆదాయం కోల్పోయి, ఖర్చులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోయి మరో విడత ఆత్మహత్యల వైపు ప్రయాణం కట్టే ప్రమాదం మెండుగా ఉంటుంది.

ఈ నేపధ్యంలో జిఎం మొక్క జొన్న సాగుని ప్రభుత్వం నిషేధించింది. జిఎం మొక్కజొన్నల దిగుమతిని గానీ, దేశంలో జిఎం మొక్కజొన్న లను పండించటం గానీ చేయకూడదు. జిఎం మొక్కజొన్న భారత దేశంలోని ఆహార గొలుసు (ఉత్పత్తిదారి పంటలతో ఈ ఫుడ్ చెయిన్ ప్రారంభమై వినియోగదారుల (మానవులు, జంతువుల వినియోగం ద్వారా పోషక ప్రోటీన్లుగా మారి అవి మళ్లీ పర్యావరణంలో కలిసి మరోసారి ఉత్పత్తిదారు అయిన పంట మొక్కల్లో చేరాటమే ఒక రకం ఆహార గొలుసు. ఇలాంటి ఆహార గొలుసులు ప్రకృతిలో అనేకం ఉంటాయి) లో ప్రవేశించకుండా నివారిస్తుంది.

మానవుని మరియు జంతువుల ఆహార వినియోగంతో కూడిన ఫుడ్ చెయిన్ లో జిఎం పంట ఉత్పత్తులు ప్రవేశిస్తే అటు మానవులు, జంతువులతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతుంది. ఎందుకంటే జన్యు మార్పిడి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహార గొలుసులో ఒక ఉపద్రవాన్ని ప్రవేశ పెట్టడమే. జీవ సృష్టిలో మనిషి జోక్యం చేసుకుని ప్రకృతి క్రమాన్ని మార్చితే ప్రకృతి తనదైన రీతిలో తిరగబడుతుంది.

జన్యు పంటలు తిన్న మనుషులు, జంతువులలో జీవ క్రమం అనూహ్య రీతిలో మార్పులకు గురై అంతిమంగా వినియోగం చేసే జీవుల ఆరోగ్యాన్ని, ప్రకృతి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఈ సంగతి అనేక మంది జీవ శాస్త్రజ్ఞులు వెల్లడి చేసి జన్యు పంటల సాగు ప్రమాదాల గురించి హెచ్చరించారు. అయినప్పటికీ లాభమే పరమావధిగా ఉండే పెట్టుబడిదారీ కంపెనీలు లాభాల సాగు కోసం జన్యు విత్తనాల సృష్టిని కొనసాగించారు.

ఇప్పటికే జన్యు మార్పులకు గురి చేసిన పత్తి పంటతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ కారణం వలన భారత ప్రభుత్వం మోడి ప్రభుత్వానికి ముందే జన్యు పంటల ఉత్పత్తి, దిగుమతులపై నిషేధం విధించారు. రైతాంగం అతి పెద్ద ఓటు బ్యాంకు కావటం వల్లనే ఈ నిషేధం విధించబడింది కానీ మరో పరిస్ధితి ఉంటే ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేసి ఉండేవి కావని ప్రభుత్వాల ఆచరణే తెలియజేస్తుంది.

చైనా కోణం

అమెరికా జిఎం మొక్కజొన్న పంట ఇప్పటి వరకు చైనాకు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుండేది. కానీ ట్రంప్ మొదటి విడత అధ్యక్ష పాలనా కాలం నాటి నుండి చైనా పైన ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. చైనా దిగుమతులపైన వివిధ రకాల ఆంక్షలు విధించింది. దానితో చైనా ప్రతీకార చర్యలు చేపట్టి అమెరికా మొక్కజొన్నల దిగుమతి బాగా తగ్గించుకుంది. ఈ వాణిజ్య యుద్ధం ట్రంప్ రెండో విడత పాలనలో మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఏప్రిల్ 2025 నుండి చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత ఏర్పడి వృద్ధి అవుతోంది.

దరిమిలా అమెరికా తన వ్యవసాయ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవటం ప్రారంభించింది. తన ఆజ్ఞలను శిరసా వహించే భారత ప్రభుత్వం అమెరికాకు తేలికగా కనపడింది. ఇండియాను దారికి తెచ్చుకోవచ్చని భావించి రష్యా చమురు దిగుమతిని సాకుగా చూపిస్తూ సుంకాలు భారీగా పెంచి తద్వారా ఇండియాను బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టింది.

బ్లూమ్ బర్గ్ పత్రిక గత జులై నెల నుండి విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలో ఆర్ధిక వృద్ధి క్షీణత, మరియు చైనాతో వాణిజ్య యుద్ధం వలన అమెరికాలో చిన్న వాణిజ్యవేత్తలు దివాళా తీయటం మొదలైంది. ఈ దివాళాలు గత 5 ఏళ్లలో అత్యధికంగా ఉన్నట్లు పత్రిక విశ్లేషణలో వెల్లడి అయింది.

చైనా పైన కారాలు మరియాలు నూరిన ట్రంప్ చివరికి ఆదేశం లొంగకపోవటంతో చైనాతో సుంకాలు, టెక్నాలజీ, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతి అంశాల్లో ఓ పక్క చర్చలు చేస్తూనే మరో పక్క అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను వెతకటం ప్రారంభించింది. తద్వారా ట్రంప్, పెద్ద మొత్తంలో ఓటు బ్యాంకు కలిగిన రైతాంగం ప్రయోజనాల కోసం ఇండియా లాంటి దేశాలను అధిక టారిఫ్ లతో బెదిరిస్తున్నాడు.

ఇండియాతో వాణిజ్య చర్చలు ముగింపుకి వచ్చాయని 2025 ఆరంభ నెలల్లో ప్రకటించిన ట్రంప్, చివరికి టారిఫ్ లు రెట్టింపు చేశాడు. అందుకు రష్యా చమురు దిగుమతిని సాకుగా చూపాడు.

లుత్నిక్ హెచ్చరికతో అమెరికా ధోరణి మారలేదని స్పష్టం అయింది. వాణిజ్య చర్చలు ఏకపక్షంగా జరగ బోతున్నాయని కూడా స్పష్టం అయింది. ఎటొచ్చీ అమెరికా ఒత్తిడిని భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కో బోతున్నది అన్న సంగతే తెలియాల్సి ఉన్నది. ఈ వారంలోనే అమెరికా వాణిజ్య చర్చల బృందం ఇండియాకు రానున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది.

భారత ప్రధాని తనకు మంచి మిత్రుడని ట్రంప్ ప్రకటించటం, తాము కూడా ట్రంప్ భావాలతో ఏకీభవిస్తున్నట్లు (అనగా ట్రంప్ తనకు మంచి మిత్రుడని చెప్పటం) ప్రధాని మోడీ ప్రకటించటం… ఇవన్నీ ఇండియా-అమెరికా సంబంధాలు భేషుగ్గా ఉన్నాయని భారత ప్రజానీకానికి నచ్చజెప్పేందుకు ఉద్దేశించినవే తప్ప మరొకటి కాదు. సానుకూల ప్రకటన ద్వారా చర్చల్లో ఇండియా అమెరికా సమాన పోటీదారులుగా ఉండబోతున్నారన్న సందేశాన్ని భారతీయులకు అందించారు. ఆ విధంగా ఇప్పటి వరకు అమెరికా, ఇండియాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయని, అమెరికా ఆధిపత్య పెత్తనం చేస్తున్నదని నమ్మిన భారత ప్రజలు ఇక ఇరు దేశాల మధ్య సమాన స్థాయి స్నేహం నెలకొదన్న భ్రమను కలిగించారు. ఇక ఇండియా నిరభ్యంతరంగా అమెరికాతో చర్చలు చేయవచ్చన్న ఒక సంతృప్తికర భ్రమను సృష్టించారు.

లుత్నిక్ చేసిన హెచ్చరిక సదరు భ్రమకు గండి కొట్టి ఉండవచ్చు. అయినప్పటికీ ఈసారి వెనక్కి తగ్గేది లేదని లుత్నిక్ చెప్పదలిచి హెచ్చరిక చేశాడు. చర్చలు మొదలై ఫలితాలు వెలువడితే గాని భారత పాలకుల వాస్తవ వైఖరి ప్రజలకు అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమెరికా, పశ్చిమ దేశాలు తమ పంతం నెగ్గించుకున్న పరిస్ధితే తప్ప మరొక విధంగా జరగలేదు. ఈ సారి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉండబోదు. కాకుంటే కాస్తో కూస్తో ఇండియా సమాన స్థాయిలో ఫలితాలు రాబట్టిందన్న భ్రమలను మరోసారి కల్పించవచ్చు. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండే అవకాశమే కనిపిస్తున్నది.

వ్యాఖ్యానించండి