చైనా ఇప్పుడు మనకు ఆత్మ బంధువా?


నిన్న మొన్నటి వరకు చైనా, ఇండియా సంబంధాలు ఎలా ఉండేవి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి భజరంగ్ దళ్ చివరాఖరి కార్యకర్త వరకు చైనా అంటే మండి పడేవాళ్లు. చైనా మనకు ఆజన్మ శత్రువు అని ఒకటే ఊదర గొట్టేవాళ్లు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలని చైనా దేశ భక్తులు అని పడ దిట్టేవాళ్లు.

మరి ఇప్పుడో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని చైనా మన శతృదేశం అన్న సంగతి మర్చిపోయాం. చైనా మనకిప్పుడు ఆపన్న మిత్రుడు. ఆ సంగతి ఎవరో కాదు, మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారే సెలవిస్తున్నారు.

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి చైనా, ఇండియా తలచుకుంటే చేయలేనిది ఏమీ లేదంటూ సవాలు విసిరే వరకూ వెల్లారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

మూడు, నాలుగేళ్ల క్రితం అమెరికా చెప్పిన వెంటనే చైనా నుండి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సరుకులను చాలా వరకు దిగుమతి కాకుండా నిలిపివేసింది భారత ప్రభుత్వం. హ్వువావీ కంపెనీ తయారు చేసే రౌటర్ లని కూడా ‘జాతీయ భద్రతకు తీవ్ర ప్రమాదం అని చెప్పి వాటి దిగుమతుల పైన గట్టి ఆంక్షలు విధించుకున్నాం. చైనా పెట్టుబడులు వద్దే వద్దు పొమ్మన్నాం.

భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామని అమెరికా ప్రకటించిన తర్వాత చైనాతో వాణిజ్యానికి భారత ప్రభుత్వం సై అంటోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను బలీయం చేసుకునేందుకు ఇప్పుడు ఇండియా సిద్ధంగా ఉన్నది. చైనా దిగుమతులు పెంచేందుకు ఇప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఈ మేరకు ఇండియా నుండి వర్తమానం వెళ్లింది కూడా.

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి చైనా, ఇండియా సంబంధాల వలన మొత్తం ప్రపంచం పైనే సానుకూల ప్రభావం పడుతుందని ఢంకా బజాయించి చెబుతున్నారు. “ఇండియా, చైనా లాంటి రెండు అతి పెద్ద ఇరుగు పొరుగు దేశాల మధ్య స్ధిరమైన, ఊహించ దాగిన, సావకాశమైన ద్వైపాక్షిక సంబంధాలు మొత్తం ప్రపంచ శాంతి మరియు శ్రేయస్సుల పైన సానుకూల ప్రభావం పడవేస్తాయి” అని ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు.

జపాన్ లో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడి, “అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఆహ్వానం మేరకు ఇక్కడ నుండి షాంఘై కొఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) శిఖరాగ్ర సమావేశాల్లో హాజరయెందుకు తీయాంజిన్ వెళ్తున్నాను. గత యేడు కజాన్ (రష్యా) లో అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ తో నా సమావేశం జరిగాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా మరుగు పడ్డాయి” అని మోడి పేర్కొన్నాడు.

ప్రధాన మంత్రి మోడి మరో ముఖ్యమైన అంశాన్ని పేర్కొన్నాడు. “ఇది బహుళ ధృవ ఆసియా మరియు బహుళ ధృవ ప్రపంచానికి అత్యంత కీలకమైన విషయం.”

బహుళ ధృవ ప్రపంచం గురించి ఒక అంతర్జాతీయ వేదిక పైన వ్యాఖ్యానించటం బహుశా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇదే మొదటిసారి కావచ్చు. బహుళ ధృవ ప్రపంచం ఏర్పడకుండా ఉండేందుకు అమెరికా, ఐరోపా రాజ్యాలు తీవ్రంగా శ్రమిస్తుండగా, బహుళ ధృవ ప్రపంచం స్థిరపడేందుకు రష్యా, చైనా నేతృత్వంలో బ్రిక్స్ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. తాజాగా భారత ప్రధాని అదే అభిప్రాయం వ్యక్తం చేయటం అమెరికాకు మరింత ఆగ్రహం తెప్పించవచ్చు.

“ఇండియా చైనా ద్వైపాక్షిక సంబంధాలను పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, పరస్పర సున్నితత్వంల ప్రాతిపదికన వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక దృక్పధంతో అభివృద్ధి చేయటానికి ఇండియా సిద్ధంగా ఉన్నది” అని నరేంద్ర మోడి ఈ సందర్భంగా నొక్కి చెప్పటం విశేషం.

జపాన్ నుండి ప్రధాని మోడి చైనా నగరం తీయాంజిన్ లో జరిగే ఎస్.సి.ఓ శిఖరాగ్ర సభకు హాజరు కానున్నాడు. ఎస్.సి.ఓ అన్నది చైనా చొరవతో ఏర్పడిన భద్రతా (సెక్యూరిటీ) కూటమి. అనగా దాదాపు మిలటరీ కూటమితో సమానం. ప్రస్తుతం రాజకీయ, ఆర్ధిక కూటమిగా చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇది మిలటరీ కూటమిగా అవతరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చైనా, ఇండియా, రష్యా, ఇరాన్, కిర్హిస్తాన్, కజక్ స్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ దేశాలు ఇందులో సభ్య దేశాలు.

వ్యాఖ్యానించండి