50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!


Mercury Public Affairs

ఇండియాలో వివిధ వ్యాపారాల్లో అనేక రకాల బ్రోకర్లు ఉంటారు. పల్లెల్లో గేదెలు, దున్నలు లాంటివి అమ్మి పెట్టటానికి కొనుగోలుదారుల్ని వెతికి పెట్టడానికి ఉండే బ్రోకర్లను ‘కాయిదా’ మనుషులు అంటారు. స్థలాలు, ఇళ్లు అమ్మి పెట్టడం – కొనుగోలుదార్లను వెతికి పెట్టేవాళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. సినిమా యాక్టర్లకు సినిమాలు సంపాదించి పెట్టే ట్యాలెంట్ బ్రోకర్లు మరి కొందరు.

షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మటం కొనటం చేసే వాళ్ళను స్టాక్ బ్రోకర్లు అంటారు. వీళ్లు వాళ్ల నాలెడ్జ్, క్వాలిఫికేషన్, ఆసక్తిని బట్టి షేర్లతో పాటు కమోడిటీలు, కరెన్సీలు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి అస్సెట్ లలో కూడా బ్రోకింగ్ చేస్తుంటారు. వీళ్లు సంపాదించేది ఎక్కువ మొత్తం లోనే ఉంటుంది. నిజానికి భారీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కూడా ‘కన్సల్టింగ్’ పేరుతో పెద్ద కంపెనీల షేర్ల వాల్యుయేషన్, పెట్టుబడి మదుపు సలహాలు ఇస్తూ బిలియన్ల డాలర్లు కూడబెడుతుంటాయి. వీళ్లూ ఒక రకంగా బ్రోకర్లే. కాకపోతే హై క్లాస్ బ్రోకర్లు.

ఇండియాలో వ్యవసాయ రంగంలో మధ్యవర్తుల వలన రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతున్న పరిస్ధితిని మనం దశాబ్దాలుగా వింటూ ఉన్నాం. వీళ్లు రైతుల నుండి పంటను అతి తక్కువకు కొనుగోలు చేసి, సరుకు నిలవ చేసి, ధరలు పెరిగినప్పుడు అమ్ముకుని భారీ లాభాలు సంపాదిస్తుంటారు. ఈ మధ్యవర్తుల ఆదాయం అంతా నిజానికి రైతులకు వెళ్లవలసిన సొమ్ము. ఈ మధ్యవర్తులే తాము సంపాదించిన అలవిమాలిన సొమ్ముతో రాజకీయ రంగం లోకి ప్రవేశించి, ప్రభుత్వ విధానాలను శాసిస్తూ రైతులకి మరింత నష్టం చేస్తున్నారు.

వీళ్లతో పాటు రాజకీయ బ్రోకర్లు ఒక ప్రత్యేక రకం. వీళ్లు రాజకీయాల్లో తిరుగుతూ మంత్రులు, ఏంఎల్ఏ ల వద్ద పలుకుబడి ఉన్నట్లు కలర్ ఇస్తారు. కొందరికి నిజంగానే పలుకుబడి ఉంటుంది. ఆ పలుకుబడితో పనులు చేయిస్తామని, కాంట్రాక్టులు ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంకా ఏవేవో పనులు చేస్తామని డబ్బు గుంజుతారు.

ఇది భారతదేశం లోని అంతర్గత వ్యవహారం. ఇలా కాకుండా ధనిక దేశాలలోని పార్లమెంటు లేదా వివిధ పేర్లతో ఉండే చట్ట సభల్లోని సభ్యులను ప్రభావితం చేసేందుకు మూడో ప్రపంచ దేశాలు సొంతగా రాజకీయ బ్రోకర్లను నియమించు కుంటారు. పెట్టుబడిదారీ అమెరికాలో ఇలాంటి బ్రోకరేజిని లేదా కన్సల్టెన్సీని ఒక భారీ వ్యాపారంగా నిర్వహించే కంపెనీలు చాలా ఉంటాయి. వాటిని కన్సల్టెన్సీ కంపెనీలు అనీ, లాబీయింగ్ కంపెనీలు అనీ పిలుస్తుంటారు.

ముఖ్యంగా అమెరికాలో ఈ రాజకీయ లాబీయింగ్ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుటూ ఉంటుంది. ప్రతి మూడో ప్రపంచ దేశమూ తమ తమ వ్యాపార, వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం లాబీయింగ్ కంపెనీలను సంప్రతిస్తాయి. సదరు లాబీయింగ్ కంపెనీలు ఆయా దేశాల నుండి రుసుము వసూలు చేసి, అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ సభ్యులను ఆయా దేశాల తరపున హౌస్ మరియు సెనేట్ సభ్యుల ద్వారా సభలో ప్రసంగాలు చేయటం, ప్రశ్నలు అడిగించటం చేస్తుంటాయి.

కొన్ని లాబీయింగ్ కంపెనీలైతే నేరుగా అధ్యక్షుడిని, హౌస్ స్పీకర్ ని ప్రభావితం చేస్తాయి. అమెరికా చట్ట సభలను ప్రభావితం చేసే లాబీయింగ్ సంస్థలలో కెల్లా ఇజ్రాయెలీ లాబీ సంస్థ అయిన AIPAC (అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ ఎఫైర్స్ kఅమిటీ) అత్యంత శక్తివంతమైన సంస్థ. దీనికి ఉన్న ఆర్ధిక బలిమి మరే లాబీయింగ్ సంస్థకు లేదు. దీనికి ఉన్న రాజకీయ పలుకుబడి, శక్తి మరే సంస్థకు లేదు. ఇజ్రాయెల్ తరపున అమెరికా చేత ఇరాక్, సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల చేత దురాక్రమణ దాడులు చేయించ గలిగినంత శక్తివంతమైన లాబీ యిది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రతీకార టారిఫ్ పేరుతో 25%, రష్యా చమురు దిగుమతి చేస్తున్నందుకు శిక్షగా మరో 25% సుంకాలు విధించటం అవి ఆగస్టు 27 నుండి అమలులోకి రానుండటం తెలిసిందే. ఈ తేదీ దగ్గర పడుతుండడంతో ఇండియా తరపున లాబీ చేయటానికి భారత ప్రభుత్వం రెండు లాబీ కంపెనీలను లేదా రెండు కన్సల్టింగ్ కంపెనీలను మాట్లాడుకుంది. ఇండియా తరపున బేరసారాలు చేసి అమెరికా ప్రభుత్వం మెత్తబడేలా వివిధ రకాల ప్రయత్నాలు చేసి సుంకాలు తగ్గించేలా చేయటం ఈ కంపెనీల పని.

ఈ పనిని వాషింగ్టన్ డిసి లోని భారత ఎంబసీ తన నెత్తికి ఎత్తుకుంది. సాధారణంగా భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంబసీలే లాబీయింగ్ కంపెనీలను నియమిస్తాయి. అమెరికా ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ (FARA) కింద జరిగిన ఫైలింగ్ ప్రకారం ‘మెర్క్యురీ పబ్లిక్ ఎఫైర్స్’ అనే కంపెనీని ఇండియా నియమించింది. ఈ పనికి గాను ఆగస్టు 15 నుండి మూడు నెలల కాంట్రాక్టు కుదుర్చుకుంది.

ఇండియా తరపున లాబీ చేసినందుకు నెలకు 75,000 డాలర్లను ఇండియా చెల్లిస్తుంది. ఇది నెలకు 65.5 లక్షల రూపాయలకు సమానం. ఒప్పందం మొత్తం విలువ 225,000 డాలర్లు లేదా 1.96 కోట్ల రూపాయలు. మెర్క్యురీ కంపెనీ ఫెడరల్ లాబీయింగ్, మీడియాతో సంప్రతింపులు, సోషల్ మీడియా వ్యూహం, ప్రకటనలు, డిజిటల్ ఆడిట్ సేవలు మొ.న వాటిని ఇండియా తరపున సుంకాలు తగ్గించేలా చేపడుతుంది.

మెర్క్యురీ కంపెనీని ఇండియా ఎంచుకోవటానికి కారణం ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సమీప సహాయకులు, మరియూ ట్రంప్ కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా అయిన సుశీ వైల్స్, గతంలో మెర్క్యురీ కంపెనీకి బాస్ గా పని చేసింది. వాషింగ్టన్ డిసి, ఫ్లోరిడా లలో ట్రంప్ ఆఫీసులకి ఈమె బాస్ గా చేసింది. తర్వాత ట్రంప్ 2024 పోటీ లో క్యాంపయిన్ చీఫ్ గా పని చేసింది. ఈమె ఒక్క ఇండియాకే కాకుండా డెన్మార్క్, ఈక్వడార్, ఆర్మీనియా, సౌత్ కొరియా లకు కూడా లాబీ చేస్తుండటం విశేషం.

నిజానికి మెర్క్యురీ పబ్లిక్ ఎఫైర్స్ కంపెనీ ఇండియా మాట్లాడుకున్న రెండవ లాబీ కంపెనీ. దీనికంటే ముందు SHW పార్టనర్స్ ఎల్.ఎల్.సి కంపెనీని గతం లోనే నియమించుకుంది. ఈ కంపెనీకి ఇండియా సంవత్సరానికి 1.8 మిలియన్ డాలర్లు (15.7 కోట్ల రూపాయలు) చెల్లిస్తున్నది. ఈ కంపెనీ, ఇండియాకు వ్యూహాత్మక సలహాలు, ప్రభుత్వ సంబంధాలు, ఇండియా ఇమేజ్ మేనేజ్మెంట్ లను చూసుకుంటుంది.

SHW పార్టనర్స్ కంపెనీకి ట్రంప్ మాజీ సలహాదారు జాసన్ మిల్లర్ అధిపతి. డొనాల్డ్ ట్రంప్ కి మాజీ సలహాదారు కనుక డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను జాసన్ మిల్లర్ ప్రభావితం చేయగలదని భారత పాలకులు నమ్ముకున్నారు.

దీన్ని బట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే భారత నియమించుకున్న దౌత్యవేత్తలు, హై కమిషనర్లు, ఇతర దౌత్య ఉప సిబ్బంది భారత ప్రయోజనాల కోసం అమెరికాలో పని చేయటం మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్న కంపెనీల సేవలను కూడా భారత ప్రభుత్వం వినియోగించాల్సి ఉంటుంది. రెండు ప్రభుత్వాల మధ్య జరిగే వాణిజ్య, వ్యాపార, రాజకీయ, దౌత్య సంబంధాలను కొన్ని ప్రవేటు కంపెనీలు తమ కమర్షియల్ ప్రయోజనాల రీత్యా ప్రభావితం చేస్తున్న సంగతి ఇక్కడ గ్రహించాల్సిన విషయం.

ఈ కంపెనీలు చేసే పని ఏంటయ్యా అంటే ఒక్కసారి రియల్ స్టేట్ బ్రోకర్లు ఏం చేస్తారో జ్ఞప్తికి చేసుకుంటే సరిపోతుంది. కొనుగోలుదారుడికి వాళ్ళు కొనబోయే స్థలం ఎంత గొప్పదో, భవిష్యత్తులో ఎంత భారీ సిరులు కురిపించనుందో ఉన్నవీ, లేనివీ కల్పించి చెబుతారు. అమ్మకందారుడికేమో, ఆ స్థలం అప్పటికప్పుడు అమ్ముకోవటం ఎంత మంచిదో, అమ్మకపోతే ఎంత నష్టం రానున్నదో, అమ్మితే ఎంత లాభం రానున్నదో ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతారు. ఎవరికి కావలసిన మాటలు వారికి చెప్పి, వ్యాపారం ముగించి, రావలసిన కమిషన్ పుచ్చుకుని ఇక కనపడకుండా పోతారు.

లాబీయింగ్ లేదా కన్సల్టింగ్ కంపెనీలు చేసే పని కూడా అదే. ఇండియాతో వాణిజ్యం వల్ల అమెరికాకు భౌగోళిక రాజకీయాల్లో ఎంత ప్రయోజనకరమో బ్రహ్మాండమైన రిపోర్టులు అవి తయారు చేస్తాయి. ఒకరో, ఇద్దరో హౌస్/సెనేట్ సభ్యులకు డబ్బులు చెల్లించి ఇండియా తరపున చట్ట సభల్లో మాట్లాడేలా చూస్తాయి. ఒక్కోసారి ఇండియా తరపున జనాన్ని ఆర్గనైజ్ చేసి ప్రదర్శనలు, రోడ్ షో లు చేస్తాయి కూడాను.

అమెరికా, ఇండియాలు ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ వ్యవస్థలు అని ఇరు దేశాల పాలకులు చెప్పుకుంటారు. అంటే ఆయా దేశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు, పాలకులు, పార్లమెంటు సభ్యులు కంటికి కునుకు లేకుండా పని చేస్తూ ఉండాలి. నిజానికి పార్లమెంటు సభ్యులే తమ నియోజకవర్గాల ప్రయోజనాలు, అవసరాలు ఏమిటో తెలిసి ఉండాలి. ఏయే దేశాలతో ఏయే వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే అమెరికాకు ప్రయోజనమో అధ్యయనం చేసి ఉండాలి. ఆ జ్ఞానంతో పార్లమెంటులో చర్చలు జరిపి ప్రజల ప్రయోజనాలు నెరవేరాలు శ్రమించాలి -అని ప్రజలు భావించాల్సి ఉన్నది.

అందుకు విరుద్ధంగా కేవలం డబ్బు కోసం పని చేసే కొన్ని కమర్షియల్ కన్సల్టెన్సీ కంపెనీలను ఇండియా లాంటి ప్రభుత్వాలు నియమించుకుంటుంటే అలాంటి కంపెనీల మాటలని అమెరికా పార్లమెంటు సభ్యులు, అధ్యక్షులు ప్రభావితం అవుతూ విధానాలు చేస్తున్నారంటే అంతకంటే మించిన ప్రజా ద్రోహం మరొకటి ఉంటుందా? వివిధ వాణిజ్య చర్చలు, దౌత్య సంబంధాల ద్వారా భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలకు నచ్చజెప్పే పరిస్ధితిలో ఉండాల్సి ఉండగా, డబ్బుకు పని చేసే కంపెనీల సహాయం తీసుకోవటానికి సిద్ధపడటం, ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సరైదేనా? అన్న ప్రశ్న ప్రతి పౌరుడు మదిలో ఉదయించాలి.

మంచి పనితనంతో, నైపుణ్యంతో, మేలైన సరుకులను అత్యంత చౌక ధరలకు ఆఫర్ చేయగలిగేలా శాస్త్ర సాంకేతిక పరిశోధనను స్థాపించ గలగడం ద్వారా భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్యంలో పోటీ పడే స్థాయిలో సరుకులను ఉత్పత్తి చేయగలిగితే లాబీయింగ్ లతో అవసరం ఏముంటుంది? అలాంటి ఉత్పత్తులు తీయాలంటే ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను నెలకొల్పి దేశీయ కార్మికులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహక పని వసతులు కల్పించాలి.

అమెరికా లాంటి దేశాల ఒత్తిళ్లకు లొంగటం మానేసి సొంతగా శాస్త్ర పరిశోధనలను వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నెలకొల్ప గలిగితే చైనాను దాటి పోవటం కష్టమైన పని కాదు.

నిజానికి చైనా చేసింది అదే. సొంత ప్రజలను నమ్ముకుంది. సోషలిస్టు నిర్మాణంలో ప్రజలందరికీ విద్య, పని, వసతి, పరిశోధనా సౌకర్యాలు కల్పించడం ద్వారా అటు భౌతిక సంపదలను, ఇటు మానవ మేధో సంపదలను అభివృద్ధి చేసుకుంది. ప్రభుత్వరంగంలో భారీ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసుకుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన వాటిని కూడా చైనా ప్రభుత్వం అధీనంలో, ప్రభుత్వ షరతులకు లోబడి పని చేసేలా అదుపు చేసింది.

ఫలితం మన కళ్ల ముందు ఉంది. అమెరికా చైనాను చూసి వణికే స్థాయికి చేరింది. తప్పనిసరై చైనా కేంద్రంగా అమెరికా విదేశాంగ విధానం రూపొందించుకునే పరిస్ధితికి చేరింది. ఇలాంటి శక్తి సంపాదించిన తర్వాత, కాస్త ఊపు కోసం లాబీయింగ్ కంపెనీలను నియమించినా ఫలితం ఉంటుంది. ఇవేవీ లేకుండా కేవలం లాబీయింగ్ కంపెనీలను ఆశ్రయిస్తే వచ్చే ఫలితానికి పెద్దగా విలువ ఉండదు.

కొస మెరుపు

ఈ కధనానికి చెర్నాకోల లాంటి ముగింపు ఉన్నది. పాకిస్తాన్ అమెరికాలో లాబీయింగ్ కోసం ఇండియా కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నది. తనకు ఎన్ని ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ, లాబీయింగ్ కోసం కేవలం ఒక్క నెలకే 600,000 డాలర్లను (5.2 కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నది. అంటే ఏడాదికి 7.2 మిలియన్ డాలర్లు లేదా 60.50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇండియా చేస్తున్న ఖర్చు ఏడాదికి 15.7 కోట్ల రూపాయలు. (మెర్క్యురీ కంపెనీ కాంట్రాక్టు 3 నెలలే మరి!)

One thought on “50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!

వ్యాఖ్యానించండి