అమెరికాకు పోస్టల్ సేవలు రద్దు చేసిన 25 దేశాలు -యుఎన్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్లోబల్ స్థాయిలో తలపెట్టిన Trade Disruption తాలూకు మంటలు కొనసాగుతూ పోతున్నాయి.

ఇండియాతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ దేశాల నుండి జరిగే పోస్టల్ సేవలను సస్పెండ్ చేసుకున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి లోని పోస్టల్ సేవల సంస్థ తెలియజేసింది.

రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టడం తోనే, ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా కస్టమ్స్ నియమాల లో ఒకటైన గ్లోబల్ డి మినిమిస్ (de minimis) రాయితీ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.

డి మినిమిస్ సూత్రం ప్రకారం 800 డాలర్ల లోపు విలువ చేసే చిన్న పార్సెళ్లను కస్టమ్స్ సుంకాల నుండి అమెరికా మినహాయిస్తుంది. ఈ మినహాయింపు క్రింద ప్రపంచ దేశాల నుండి అమెరికాకు తాత్కాలిక వీసా, స్టడీ వీసా, కంపెనీ ఉద్యోగాల నిమిత్తం జారీ చేసే వీసాలతో అమెరికాకు వెళ్ళిన తమ వారికి చిన్న పార్సిళ్ళ ద్వారా ఆయా కుటుంబాలు సౌకర్యవంత మైన పోస్టల్ సర్వీసులను పొందేవి.

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం వలన ఈ సౌకర్యాన్ని లక్షలాది కుటుంబాలు కోల్పోయాయి. చిన్న పార్సెళ్ళ పైన కూడా సుంకాలు విధించటం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న ట్రంప్ తాపత్రయం అమెరికాలో పని చేసే విదేశీ విద్యార్ధులు, ఉద్యోగులకు ఆశనిపాతం అయింది.

చిన్న చిన్న పార్సెళ్ళ ద్వారా అమెరికాకు ఫెంటనిల్ లాంటి మత్తు పదార్ధాల తయారీకి వాడే ముడి సరుకును అమెరికాకు ఎగుమతి చేస్తున్నారని, దీని వలన అమెరికా యువత మత్తు పదార్ధాల బారిన పడి చనిపోతున్నారని అమెరికా/ట్రంప్ వాదన.

వాస్తవం ఏమిటంటే, కొలంబియా, మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాల లోనూ, ఇటీవల వరకు ఆఫ్ఘనిస్తాన్ లోనూ గంజాయి సాగును అమెరికా గూఢచార సంస్థ సిఐఏ స్వయంగా ప్రోత్సహిస్తుంది. గంజాయి సాగు కోసం, వివిధ డ్రగ్స్ ఉత్పత్తి మరియు తయారీ కోసం వివిధ దేశాల్లో సిఐఏ, క్రిమినల్ గ్యాంగ్ లను, డ్రగ్స్ మాఫియా లను పెంచి పోషిస్తుంది.

మత్తు పదార్ధాలకు అమెరికా యువత భారీ స్థాయిలో అలవాటు పడటంలో అమెరికా పోలీసు విభాగం, నార్కోటిక్స్ విభాగం పాత్ర ప్రధాన మైనది. పోలీసు, ఎఫ్.బి.ఐ లాంటి సెక్యూరిటీ విభాగాల తో పాటు సిఐఏ సంస్థలు డ్రగ్స్ వ్యాపారం ద్వారా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుతాయి. వాల్ స్ట్రీట్ లోని భారీ ఫైనాన్స్ కంపెనీలు మత్తు పదార్ధాల వ్యాపారంలో పెట్టుబడులు పెడతాయి. తద్వారా తక్కువ ఖర్చుతో అపరిమితమైన లాభాలను పోగేసుకుంటాయి.

డ్రగ్స్ వ్యాపారం ద్వారా అమెరికా రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చు కుంటుంది. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ తనకు సహకరించని లాటిన్ అమెరికా దేశాల నేతలను, ప్రభుత్వాలను కూల్చుతుంది అమెరికా. పనామా అధ్యక్షుడు డేనియల్ నోరీగాను 1980 లలో డ్రగ్స్ ఆరోపణల తోనే అమెరికా తమ జైళ్ళలో బందించింది. పనామా కాలువ ఆదాయం పనామా దేశానికే చెందాలని వాదించి ఆ వైపుగా ప్రభుత్వ చర్యలు చెప్పట్టడంతో అమెరికా ఈ ఘాతుకానికి పాల్పడింది.

2011 సంవత్సరంలో ఇదే తరహా ఆరోపణలతో హోండూరాస్ అధ్యక్షడి ప్రభుత్వాన్ని కూడా అమెరికా కుట్ర జరిపి కూల్చివేసింది.

ఇలాంటి పాపపు చరిత్ర ఉన్న అమెరికా ఇప్పుడు డి మినిమిస్ వల్లనే అమెరికాకు మత్తు పదార్ధాలు రవాణా అవుతున్నాయని ఆరోపించటం గ్లోబల్ స్థాయి బొంకుడు తప్ప మరొకటి కాదు.

అమెరికాకు పోస్టల్ సేవలు సస్పెండ్ చేసిన 25 దేశాల పేర్లను ఐరాస సంస్థ ప్రకటించలేదు. అయితే ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్, ఇండియా దేశాలు మాత్రం సస్పెన్షన్ చర్యను బహిరంగంగా ప్రకటించాయి.

గ్లోబల్ పోస్టల్ సేవలలో అంతరాయం ఏర్పడటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ స్విట్జర్లాండ్ నుండి పని చేసే యూనివర్సల్ పోస్టల్ యూనియన్, అమెరికా విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) కి 25 ఆగస్టు 2025 తేదీన లేఖ రాసినట్లు తెలిపింది.

గ్లోబల్ సంస్థ అయిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో 192 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంస్థ 192 దేశాల పోస్టల్ సేవల సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది.

కాగా ఇండియాపై విధించిన అధిక టారిఫ్ ల నుండి వెనక్కి తగ్గేది లేదని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు (ఆగస్టు 26) జారీ చేసిన నోటీస్ ద్వారా స్పష్టం చేశాడు. రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత దిగుమతులపై అదనంగా 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటిస్తూ అమెరికా నోటీసు జారీ చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోడి, అమెరికాను గానీ, ట్రంప్ ను కానీ పేరు పెట్టి సంభోదించకుండా, భారత రైతులు, డెయిరీలు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలు పరిరక్షించటంలో వెనకడుగు వేసేది లేదని, గాంధీ పుట్టిన నేల నుండి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నానని ఈ రోజు ఆర్భాటంగా ప్రకటించాడు.

ఒక వారం రోజుల క్రితం అయితే “భారత ప్రయోజనాలు కాపాడేందుకు వ్యక్తిగంతంగా ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం” అని ప్రకటించాడు ప్రధాన మంత్రి.

అమెరికాతో వాణిజ్యంలో గానీ, భారత స్వావలంబన ప్రయోజనాలు పరిరక్షించడంలో గానీ, భారత ప్రధాని వ్యక్తిగతంగా ఏమి త్యాగం చేయవలసి ఉంటుందో అంతుబట్టని విషయం.

వోటి మాటలకు బదులు, అర్ధం లేని ప్రకటనలకు బదులు నేరుగా అమెరికాను, డొనాల్డ్ ట్రంప్ ను సంభోదిస్తూ “మీ వాణిజ్య విధానాలు ఇండియాకు సమ్మతం కాదు. మేము స్వతంత్రులం. భారత స్వావలంబన భారత ప్రజల హక్కు. మీతో వాణిజ్యం మా ప్రజల ప్రయోజనాల కోసమే జరుగుతుంది” అని నేరుగా ఎందుకు చెప్పలేరు?

వ్యాఖ్యానించండి