మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!


India NSA Ajit Doval with Russian President Vladimir Putin

ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి అత్యంత నమ్మకమైన మిత్రుడుగా ఉంటూ వచ్చింది.

అమెరికా, ఐరోపా దేశాలు రష్యా చమురు, గ్యాస్ ఎగుమతుల పైన అనేక ఆంక్షలు విధించినప్పటికీ పట్టించుకోకుండా రష్యా నుండి ఇండియా చమురు, చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ఇండియా నుండి అమెరికాకు వచ్చే దిగుమతుల పైన 25% శాతం సుంకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన భారీ సుంకాల వలన “భారత సరుకులు అమెరికా మార్కెట్ కి ఎగుమతి కావటం ఆగిపోతే/తగ్గిపోతే గనక ఆ సరుకుల్ని రష్యాకు సరఫరా చేయాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం” అని ఇండియాలో రష్యా దౌత్యవేత్త రోమన్ బబూష్కిన్ ఈ రోజు (బుధవారం ఆగస్టు 20) ప్రకటించాడు (రాయిటర్స్). రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై అధిక సుంకాలతో అమెరికా ఒత్తిడి తేవటం “అసమర్ధనీయం”, “ఏకపక్షం” అని ఆయన అభివర్ణించాడు. ఇండియాపై అదనపు సుంకాలు విధించడం అమెరికా అనుసరిస్తున్న “ద్వంద్వ విధానం” అని ఆయన దుయ్యబట్టాడు.

“రష్యన్ క్రూడ్ ఆయిల్ పైన ఇండియాకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ద్వారా ఇండియా బాగా లబ్ది పొందుతున్నది. రష్యా చమురు కాంపిటీటివ్ ధరలకు లభిస్తున్నందున, రష్యా చమురుకు ప్రత్యామ్నాయం లేదని ఇండియాకు బాగా తెలుసు. అదీ కాక ఇండియా మాకు చాలా కావలసిన దేశం” అని రష్యా దౌత్యవేత్త ఇండియాకు మద్దతు వచ్చాడు.

రష్యన్ దౌత్యవేత్త మాత్రమే కాకుండా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇండియాకు గట్టి మద్దతు ప్రకటించాడు. ఆగస్టు 6 తేదీన ఇండియా సరుకులపై 50% సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన దరిమిలా భారత ప్రధాని నరేంద్ర మోడి, తన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ నుహుటాహుటిన రష్యా అధ్యక్షుడు పుటిన్ తో చర్చలు జరిపేందుకు పంపాడు.

టారిఫ్ కింగ్ ‘ఇండియా’

ట్రంప్ అప్పటికే భారతదేశ సరుకుల పైన 25% సుంకం విధించి ఉన్నాడు. ఇండియా, అమెరికా సరుకుల పైన అత్యధిక సుంకాలు అమలు చేస్తున్నదనీ, టారిఫ్ కింగ్ గా ఇండియా అవతరించిందనీ ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాన్ని విధించాడు. దీనికి తోడు రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకారంగా మరో 25% సుంకాన్ని విధించాడు. అంటే భారత సరుకుల పైన ట్రంప్ మొత్తం 50 శాతం సుంకం (tarrif) విధించాడు. అక్కడితో ఆగలేదు. రష్యా చమురు దిగుమతి చేసుకోవటం అంటే ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న యుద్ధానికి ఇండియా నిధులు అందిస్తున్నట్లే అని ఆరోపిస్తూ అందుకు గాను 50% తో పాటు అదనంగా మరికొంత పరిహార (పనిష్మెంట్) సుంకాన్ని విధిస్తానని చెప్పాడు. ఆ పనిష్మెంట్ సుంకం ఎంతో ఇంకా వెల్లడి చేయలేదు.

దానితో భారత దేశ ఎగుమతి సరుకులు ప్రపంచ వాణిజ్యంలో ఇతర దేశాల సరుకులతో పోల్చితే అధిక ధర పలికే పరిస్ధితి ఏర్పడింది. అమెరికా ప్రజలు భారత దేశ సరుకులు (టెక్స్ టైల్స్, రెడీ మేడ్ దుస్తులు, ముత్యాలు వజ్రాలు లాంటి విలువైన రాళ్లు, ఐ ఫోన్ లాంటి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు మొ.న ఎలెక్ట్రానిక్ సరుకులు, ఔషధాలు, ఇంజనీరింగ్ సరుకులు, బంగారు ఆభరణాలు, డీజెల్ మరియు జెట్ ఫ్యూయల్ లాంటి పెట్రోలియం ఉత్పత్తులు మొదలైనవి) ఖరీదుగా మారటం వలన ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే అవే సరుకులను కొనడం ప్రారంభిస్తారు. ఫలితంగా భారత జిడిపి భారీగా పడిపోయే పరిస్ధితి ఏర్పడింది.

2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా దాదాపు 86.5 బిలియన్ డాలర్ల సరుకులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది దాదాపు 7.27 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఈ యేడు రెవిన్యూ లోటుకు ఇది దాదాపు సమానం కూడా. అనగా అమెరికాకు ఎగుమతులు ఆగిపోతే ఈ యేడు రెవిన్యూ లోటు రెట్టింపు అవుతుంది అన్నట్లు! ఇలాంటి పరిస్ధితుల్లో రష్యా రాయితీ ధరలకు చమురు ఇవ్వటమే కాకుండా ఇతర భారత్ ఎగుమతులకు కూడా రష్యాలో మార్కెట్ కల్పించటానికి ముందుకు వచ్చింది.

ఐరోపా రాజ్యాలు సైతం, ముఖ్యంగా ఇంగ్లండ్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు పదే పదే ఇండియాను తప్పు పడుతున్నారు. ఉక్రెయిన్ పైన దాడి, యుద్ధం దరిమిలా పశ్చిమ దేశాలు, రష్యా వాణిజ్యం పైన విధించిన ఆంక్షలను ఇండియా పట్టించుకోకుండా స్వార్ధ ప్రయోజనాలకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న దాడులను నిరోధించటానికి ప్రయత్నాలు చేయటానికి బదులు యుద్ధం వల్ల రష్యా ఇస్తున్న చౌక చమురు దిగుమతి చేసుకుంటూ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నదని తప్పు పడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడి విమర్శలకు, ఆరోపణలకు గట్టి సమాధానం ఇవ్వకుండా, “అన్యాయం”, “సమర్ధనీయం కాదు” అంటూ గొణిగిన భారత నేతలు, ఐరోపా దేశాల విమర్శలకు మాత్రం గట్టి స్వరంతో బదులిచ్చారు. ముఖ్యంగా విదేశీ మంత్రి జైశంకర్ ఐరోపా దేశాల విమర్శలకు తడుముకోకుండా ప్రతి విమర్శలతో విరుచుకు పడ్డాడు. ఐరోపా దేశాలు రష్యా నుండి చేస్తున్న దిగుమతుల చిట్టాను ప్రదర్శించి ఇండియా కంటే భారీ మొత్తంలో ఐరోపా దేశాలే ఎక్కువ వాణిజ్యం రష్యాతో నిర్వహిస్తున్నాయని ఎత్తి చూపాడు. ఇండియాను తప్పు పట్టే ముందు యూరోపియన్ యూనియన్ మొదట తమ వాణిజ్యం గురించి పట్టించుకోవాలని కోరాడు.

జైశంకర్ చెప్పింది అక్షరాలా నిజం. అమెరికా ఆంక్షలకు తోడు సొంత ఆంక్షలను కూడా రష్యాపై విధించిన యూరోపియన్ యూనియన్, ప్రత్యక్షంగా పరోక్షంగా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. 2022 ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతుండగా, రష్యా ఎగుమతి చేస్తున్న ఎల్.ఎన్.జి లో 51% ఈయూ దేశాలే దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా 21% రష్యన్ ఎల్.ఎన్.జి ని దిగుమతి చేసుకుంటుంటే మరో అమెరికా మిత్రదేశం జపాన్ 18% దిగుమతి చేసుకుంటోంది.

పైప్ లైన్ ద్వారా రష్యా నుండి ఎగుమతి అయ్యే గ్యాస్ లో 37% యూరోపియన్ యూనియన్ కూ, 30% చైనా కూ, 27% టర్కీ దేశానికి వెళుతోంది. రష్యన్ క్రూడ్ ఆయిల్ మాత్రం చైనాకు 47%, ఇండియాకు 38%, యూరోపియన్ యూనియన్ కు 6% ఎగుమతి అవుతున్నది. ఆంక్షలు విధించిన తర్వాత ఈ 6 శాతం చమురు కూడా ఎందుకు దిగుమతి చేసుకోవాలన్నది ఇండియా ప్రశ్న. ఈ గణాంకాలు జూన్ 2025 వరకు నమోదైన రష్యా చమురు, ఎల్.ఎన్.జి, పైప్ లైన్ గ్యాస్ ఎగుమతులకు చెందినవిగా గుర్తించాలి.

కాగా నిన్న మొన్నటి వరకు రష్యా చమురును ఇండియా ద్వారా మారు బేరానికి ఈయూ కొనుగోలు చేయటం విశేషం. అనగా ఇండియా మొదట రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుని, తన రిఫైనరీ ఫ్యాక్టరీలలో (చమురు శుద్ధి కర్మారాగారమ్) శుద్ధి చేసి, దానిని తిరిగి ఈయు దేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చింది. ఈ వాణిజ్యం ద్వారా నరేంద్ర మోడి ప్రభుత్వం భారత్ ఎదుర్కొంటున్న కోశాగార లోటు భర్తీ చేసేందుకు వినియోగించింది తప్ప, రష్యా రాయితీ ధరల్ని ప్రజలకు అందజేయటానికి పూనుకోలేదు.

మోడి ప్రభుత్వం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు, చమురు కంపెనీలు నష్టాలు భరించలేక పోతున్నాయని చెబుతూ లీటర్ కి రు 70 లోపు ఉన్న పెట్రోల్ ధరను రు 110 వరకు పెంచాడు. అదే అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గు ముఖం పట్టినపుడు మాత్రం తగ్గిన ధరల్ని ప్రజలకి బదిలీ చేయాల్సి ఉండగా, అలా చేయకుండా ఆ డబ్బుతో కోశాగార లోటు భర్తీ చేయటానికీ, కార్పొరేట్ కంపెనీ మిత్రులకు భారీ రుణాలు మంజూరు చేసేందుకు వినియోగించింది. ప్రతిపక్షాలు, ప్రతి పక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోసం గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా మోడి ప్రభుత్వం పట్టించుకోనే లేదు.

గతంలో గల్ఫ్ దేశాల నుండి ఇండియా ప్రధానంగా చమురు దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్ యుద్ధం పుణ్యాన ఇండియాకు చమురు ఎగుమతి దేశాల్లో రష్యా ప్రధమ స్థానం ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి.

జులై నెల నుండి రష్యా చమురు దిగుమతులు ఇండియా తగ్గించుకున్నట్లు వాణిజ్య పత్రికల ద్వారా తెలుస్తున్నది. రాయిటర్స్ పత్రిక ప్రకారం జులై నెలలో ఇండియా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ళ చొప్పున దిగుమతి చేసుకున్నది. ఇది జూన్ నెలతో పోల్చితే దాదాపు 25% తక్కువ. సెపెంబర్ 2023 తర్వాత కాలంలో అత్యంత తక్కువ రష్యా చమురు ఇండియా దిగుమతి చేసుకోవటం ఇదే మొదటి సారి. అమెరికా బెదిరింపుల వల్లనే ఇండియా, రష్యా చమురు తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. అయితే భారత రిఫైనరీ కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇస్తున్న వివరణ వేరుగా ఉన్నది.

భారత ప్రభుత్వ చమురు కంపెనీల ప్రకారం జులై నుండి రష్యా ఇస్తున్న రాయితీ తగ్గిపోయింది. అది కాక ఋతుపవనాల సీజన్ అయినందున ఇంధనం డిమాండ్ యేటా తగ్గుతుంది. ఈ కారణాల వలన రష్యా నుండి దిగుమతి తగ్గింది తప్ప ట్రంప్ బెదిరింపుల వలన కాదని కంపెనీల అధికారులు చెప్పారు. ప్రభుత్వ కంపెనీల బదులు ప్రైవేట్ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, హెచ్‌పి‌సి‌ఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ లాంటి కంపెనీలు రష్యా చమురు దిగుమతి చేసుకున్నాయని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. అంటే ప్రభుత్వ కంపెనీల లాభాలను తగ్గించి ప్రైవేటు కంపెనీలకు ఆ లాభాలను ప్రభుత్వం తరలించినట్లు అర్ధమవుతున్నది.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది మరింత తగ్గుతుందని అమెరికా అధ్యక్షుడు రష్యా చమురు దిగుమతి తగ్గించాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఇండియన్ రిఫైనరీలు యూరల్స్ చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని (pause) రాయిటర్స్ పత్రిక చెప్పడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గాను రష్యా చమురు బదులుగా పశ్చిమాసియా, అమెరికా ల నుండి ఇండియా చమురు దిగుమతి చేసుకోనున్నది. జనవరి నుండి జులై నెల వరకు తీసుకున్నా కూడా రష్యా చమురు దిగుమతి 3.6 శాతం తగ్గిపోగా అమెరికా చమురు దిగుమతి ఏకంగా 58 శాతం పెరిగింది. లాటిన్ అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకోవటం ఇండియా పూర్తిగా నిలిపివేసింది.

ఈ లెక్కన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా చమురు దిగుమతి విషయమై చేసిన బెదిరింపులను ఇండియా ఖాతరు చేయడం లేదన్న మోడీ బాకా పత్రికల కధనాలు వాస్తవం కాదని తెలుస్తున్నది. అమెరికా బెదిరింపుల నేపధ్యంలో ఇండియా స్వాలంబన దేశంగా తనను తాను రుజువు చేసుకుంటున్నది అన్న వాదన కూడా సత్యదూరం అని అర్ధం అవుతున్నది.

ఎంపికలోనే ‘స్వతంత్రత’, పరాధీనత యధాతధం

అయితే ఇండియా-రష్యా, ఇండియా-చైనా దేశాల మధ్య అధికారుల స్థాయి లో పరస్పర సందర్శనలు, సమావేశాలు జరగడం, ప్రధాన మంత్రి స్థాయిలో తరచుగా టెలీ ఫోన్ సంభాషణలు జరుగుతూన్న నేపధ్యంలో అమెరికా పైన ఇండియా పాలకులు పెంచుకున్న భ్రమలు బలహీన పడుతున్నట్లు భావించాల్సి వస్తున్నది. ఓ పక్కన రష్యా నుండి వరస పెట్టి భారత్ కు మద్దతుగా, అమెరికా ఆంక్షలను ఖండిస్తూ ప్రకటనలు వెలువడుతుండగా మరో పక్క ఇండియా-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఇండియాపై అమెరికా విధించిన సుంకాలను పరుషంగా తెగనాడాడు కూడా. ఇరు దేశాల విదేశీ శాఖలు పరస్పరం సంభాషణలు జరుపుతూ సరిహద్దు సమస్య పరిష్కారం వైపుగా మొదటి అడుగు వేసేందుకు నిర్ణయించాయి.

ఇండియాపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను ఇండియా లైన చైనా ఎంబసీ తీవ్రంగా ఖండించింది కూడాను. అమెరికా సుంకాలు “ఏకపక్షం, రక్షణాత్మక విధానం” అని చైనా విమర్శించింది. అమెరికా ఏకపక్ష విధానాలను ప్రతిఘటించటానికి ప్రపంచ దేశాలు ఐక్యం కావాలని చైనా పిలుపు ఇచ్చింది.

రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చిన చైనా విదేశీ మంత్రి వాంగ్ యీ, సరిహద్దు సమస్యపై చర్చలు పురోగమింప జెసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆగస్టు 20 తేదీన ప్రకటించాడు. 2020 నాటి సరిహద్దు ఘర్షణ తర్వాత ఇరు దేశాలు మంత్రుల స్థాయిలో చర్చలకు ఉపక్రమించటం, అది కూడా ఎన్నడూ లేనంత సానుకూల వాతావరణం ఇరు దేశాల మధ్య ఏర్పడటం ఇదే ప్రధమం. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య ప్రవాహం పెంచటంతో పాటు ఒక దేశం నుండి మరో దేశానికి నేరుగా విమానాలను పునరుద్ధరించటానికి నిర్ణయించారు.

ఇరు దేశాలు అంగీకరించిన ఇతర చర్యలు: హిమాలయాల సరిహద్దు వద్ద ఇరు దేశాలు వేల సంఖ్యలో మోహరించిన ట్రూప్స్ ఉపసంహరణ గురించి చర్చలు జరపాలి. పెట్టుబడులు, వాణిజ్యం పెంచాలి. మరిన్ని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాలి. రవాణా సౌకర్యాలు పెంచాలి. అనేక వాణిజ్య రూట్లను (లిపులేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాధు లా పాస్) తిరిగి తెరవాలి. సాధ్యమైనంత త్వరగా సన్నిహిత సంబంధాల ఫలితాలు పొందటానికి గాను, మరింత క్లిష్టమైన ఒప్పందం కుదిరే లోపు, నిపుణుల గ్రూపు నియమించాలి.

సరిహద్దు నిర్వహణ మెరుగుపరచాలి (దీనిని ఇండియా గతంలో వ్యతిరేకించింది.) ఇండియా ఎరువులు, రేర్ ఎర్త్ మెటీరియల్స్, సొరంగాలు తవ్వే మెషినరీ తదితరాల ఎగుమతులపై విధించిన ఆంక్షలను పునఃపరిశీలించిందుకు చైనా అంగీకరించింది. నదీ నీటి పంపిణీ డేటా పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాలి. టూరిస్టులు, వ్యాపారాలు, జర్నలిస్టుల వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను రద్దు చేయాలి.

ఇండియా వచ్చిన వాంగ్ యీ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపాడు. అనంతరం మాట్లాడుతూ “ఇండియా, చైనాలు శాంతి, నిశ్చలతలతో కూడిన సరికొత్త వాతావరణం సాధించాయి. గత కొన్నేళ్లుగా మేము ఎదుర్కొన్న వెనకడుగులు మా ఇరు దేశాల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడవు. డీలిమిటేషన్, సరిహద్దు సమస్యలపై కూడా చర్చించాము” అని తెలియజేశాడు. కొద్ది నెలల క్రితం ఆ మాటకొస్తే ఆగస్టు 6 తేదీ ముందు వరకు ఇండియా-చైనాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుండి ఇలాంటి ప్రకటన వెలువడటం ఊహలకు అందని విషయం. డొనాల్డ్ ట్రంప్ తానే స్వయంగా ఇండియా-చైనాలను ఒకరి మీదకు ఒకరిని నెట్టినట్లయింది.

ట్రంప్ సుంకాల ప్రభావం లేదు, లేదు అని చెబుతూన్నప్పటికీ ఈ పరిణామాలన్నీ భారత పాలకులు అమెరికా నీడ నుండి రష్యా-చైనా దేశాల నీడకు జరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

పరాధీన విదేశీ విధానం

1991 లో సోవియట్ రష్యా పతనమై, ఆనక వివిధ స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నం అయినాక కూడా సోవియట్ రష్యా స్థానాన్ని తీసుకున్న రష్యన్ ఫెడరేషన్, ఇండియాకు మునుపటి సహాయ, సహకారాలను అందజేయటంలో వెనకడుగు వేయలేదు. యెల్టిసిన్ రష్యా అధ్యక్షుడుగా ఉన్నంత కాలం రష్యా, ఇండియాల సహకారం కొంత మేరకు వెనకపట్టు పట్టింది.

యెల్టిసిన్, అమెరికాతో సన్నిహిత మిత్రత్వాన్ని కోరుకోవటం చేతా, అమెరికా ఆజ్ఞల మేరకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లు రుద్దిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను మన్మోహన్ సింగ్ నెత్తిన వేసుకుని అమలు చేసినందు వలనా, ఇండియా-అమెరికాల మైత్రి బలపడింది. మరో పక్క రష్యన్ ఫెడరేషన్ ఆర్ధికంగా బలహీన పడినందున ఇండియాకు అందే సహకారం కూడా బలహీన పడింది.

2000 సంవత్సరంలో వ్లాదిమిర్ పుటిన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మెల్లగానే అయినా స్థిరంగా అటు ఆర్ధికంగా, ఇటు సైనిక పరంగా -ముఖ్యంగా సైనికంగా- రష్యా పుంజుకుంటూ వచ్చింది. 2008-09 నాటి ద గ్రేట్ రిసెషన్ దరిమిలా అమెరికా, ఐరోపాలు ఆర్ధికంగా బలహీనమై చైనా ప్రబల ఆర్ధిక శక్తిగా అవతరించింది. దరిమిలా రష్యా-ఇండియా మైత్రి మళ్ళీ పుంజుకుంది. బ్రిక్స్ (BRICS) కూటమి ఏర్పడిన తర్వాత ఈ మైత్రి గతం కంటే ధృడ పడింది.

అయితే నరేంద్ర మోడి నేతృత్వంలోని ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వం మునుపటి విదేశాంగ విధానంలో కీలక (కోర్) భాగమైన “పేద, బలహీన దేశాలకు మద్దతు అండదండలు అందజేసి, గ్లోబల్ సౌత్ దేశాలతో (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) గట్టి స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం” అన్న విధానాన్ని త్యజించింది. ప్రపంచంలో అత్యంత అరాచక దేశాలుగా, రోగ్ దేశాలుగా, గ్లోబల్ సౌత్ దేశాలను అణచివేసి దోపిడీ చేస్తూ రక్తపు కూడు తినడానికి అలవాటు పడ్డ దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలతో చెలిమి చేసేందుకు తహతహలాడింది.

[విచిత్రం ఏమిటంటే జాత్యహంకారంతో యూదులను ఊచకోత కోసిన జర్మన్ నియంత హిట్లర్ అనుసరించిన విధానాలను ఆర్ఎస్ఎస్, బిజెపి లు ప్రశంసిస్తాయి. అలాగే పాలస్తీనా అరబ్ జాతీయులను, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాల అండదండలతో ఊచకోత కోసి, వారి సొంత దేశం నుండి, సొంత భూముల నుండి, సొంత ఊళ్లు పొలాల నుండి తరిమి కొట్టి పాలస్తీనాను ఆక్రమించి, ‘ఇది జెహోవా (జెఃవే) దేవుడు మాకు వాగ్దానం చేసిన భూమి’ అంటూ ఇప్పటికీ పాలస్తీనాను వలస ఆక్రమణలో అణచివేస్తున్న యూదు రాజ్యం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న నరహంతక-జాత్యహంకార విధానాలను కూడా ఆర్ఎస్ఎస్, బిజెపి లు ప్రశంసిస్తాయి. అణచివేత దారులు, దోపిడీదారులు, జాత్యహంకారులు, మత దురహంకారులు… వీళ్లే ఆర్ఎస్ఎస్, బిజెపి లకు అత్యంత ఇష్టులు!]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పచ్చి మితవాది మరియు జాత్యహంకారి. పని వెతుక్కుంటూ వివిధ పేద దేశాల నుండి అమెరికాకు వస్తున్న నానా జాతుల ప్రజలను ఆక్రమణ దారులుగా, తిండిపోతులుగా, పరాన్నభుక్తులుగా, బద్ధకస్తులుగా ముద్ర వేస్తూ, అమెరికా ప్రజల ఉపాధిని ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ వారిని అమెరికా నుండి తరిమివేసే విధానాలను అనుసరిస్తున్నాడు.

లొంగుబాటు

వలస పౌరులపై ట్రంప్ అహంకార పూరిత అణచివేత విధానాలు అమలు చేయటం ప్రారంభించినపుడే భారత పాలకులు తగిన విధంగా స్పందించాల్సి ఉండగా అలా జరగలేదు. పైగా విదేశీ మంత్రి లాంటి వారే భారతీయులను సంకేళ్లలో బంధించి విమానాల్లో కుదేసి ఇండియాకు రవాణా చేయటాన్ని కనీసం నిరసించకుండా ‘అమెరికా విధానాలు అలా ఉన్నాయి. వారి విధానం ప్రకారం వారు చేశారు” అని వెనకేసుకొచ్చారు. అమెరికాకు వలస వెళ్ళినపుడు వాళ్ల చట్టాలను అనుసరించక తప్పదని కూడా ఆయన స్పష్టం చేశాడు. చట్టాల ప్రకారం అమెరికాలో జీవనం సాగించటం ఒక సంగతి.

ప్రపంచ దేశాల మధ్య కార్మికులు, ఉద్యోగుల రాకపోకల గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన సూత్రాలు ఉన్నాయని, వలస ప్రజల గురించిన సూత్రాలను విస్మరించ రాదని భారత ప్రభుత్వం అమెరికాకు చెప్పలేకపోయింది. ఎఫ్.డి.ఐ లతో పాటు, లాభాల కోసం చెప్పా పెట్టకుండా ఎగిరిపోయే ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల ప్రవాహానికి సరిహద్దులను చెరిపేసిన అమెరికా, పశ్చిమ దేశాలు కార్మికుల ప్రవాహం విషయంలో మాత్రం రక్షణ విధానాలు, జాత్యహంకార విధానాలు, నేరపూరిత విధానాలు ఎందుకు అవలంబిస్తున్నారని ప్రశ్నించాల్సి ఉండగా భారత పాలకులు అది చేయలేకపోయారు. దానికి బదులు అమెరికా అధికారులు చెప్పిన సూత్రాలకు, బోధనలకు తలలూపారు.

కనీసం ఎలాంటి ప్రతిఘటన లేకుండా భారత పాలకులు అమెరికా చెప్పిందానికల్లా తలలు ఊపినప్పటికీ రష్యా చమురు దిగుమతి విషయంలో అమెరికా నుండి ఏ మాత్రం సానుకూలత పొందలేకపోయారు. “మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు? మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు?” అన్నట్లుగా ఏక పక్షంగా సూత్రాలు నిర్వచిస్తూ ద్వంద్వ విధానం అనుసరిస్తున్న అమెరికా విధానాలను అదేమని నిలదీయటంలో విఫలం అయి కూడా వాణిజ్యం విషయంలో కనీస ప్రతిఫలం పొందలేకపోయారు.

నిజానికి ఇండియా, అమెరికాకు చేస్తున్న ఎగుమతుల విలువ, అమెరికా ఆర్ధిక వ్యవస్థతో పోల్చితే ఏ మాత్రం లెక్కలోనిది కాదు. కానీ అవే ఎగుమతులు ఇండియాకు చాలా అవసరం. సదరు ఎగుమతుల ద్వారా ఇండియాకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. అమెరికాతో, ఇండియాకు విదేశీ వాణిజ్య మిగులు ఉంటేనే ఇండియాకు విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది.

ఇది లేనట్లయితే భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయి చెల్లింపుల సమతూకంలో సంక్షోభం (Balance of Payments Crisis) ఏర్పడుతుంది. సరిగ్గా ఇదే తరహా సంక్షోభం 1991లో పి.వి నరసింహారావు-మన్మోహన్ సింగ్ ల ప్రభుత్వం ఐఏంఎఫ్, ప్రపంచ బ్యాంకు అప్పు కోసం కోసం బొచ్చె పట్టుకుని నిలబడాల్సి వచ్చింది.

ఫలితంగా ఐఏంఎఫ్ విధించిన షరతుల వలన భారత ప్రభుత్వ రంగం నామరూపాలు కోల్పోయింది. బంగారం లాంటి కోట్లాది ఉద్యోగాలు మాయమయ్యాయి. చదువు ముగించిన విద్యార్ధులు కోట్ల సంఖ్యలో నిరుద్యోగ సైన్యంలో చేరుతుంటే వారిని అత్యంత చౌక వేతనాలకు విదేశీ బహుళజాతి కంపెనీలు దోచుకు తింటున్నాయి.

కనీస కార్మిక హక్కులు, ఉద్యోగుల హక్కులు లేకుండా, అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్ధితుల మధ్య కంపెనీలలోనే కునారిల్లుతూ వాళ్ళు మానసిక, శారీరక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇండియాను ప్రపంచ ఐ.టి పటం పైన నిలబెట్టినట్లు ప్రశంసలు కురిపిస్తున్న టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీల అధిపతులు 10 గంటలు, 12 గంటల పాటు ఉద్యోగులు పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగేతర గృహ జీవనం, సాంస్కృతిక జీవనం ఉంటాయన్న సహజ వాస్తవాన్ని మర్చిపోయి పశువులు మాదిరి ఆలోచిస్తూ ఉద్యోగులను కూడా పశువులు మాదిరి పని చేయాలని ఆశిస్తున్నారు.

పోరాటాలకు విరామం కాదిది!

ఇది కేవలం పశ్చిమ దేశాల విధానాల ఫలితం. అయితే ఈ విధానాల నుండి చైనా, రష్యాల విధానాలు వేరుగా ఉంటాయని భ్రమిస్తే అది అమాయకత్వం కాగలదు. అమెరికా ఆధిపత్యం క్షీణించి చైనా, రష్యాల పలుకుబడి పెరుగుతున్నది అంటే దానర్ధం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానంలో గొప్ప మార్పులు వస్తాయని కాదు. ఏక పక్ష సామ్రాజ్యవాద ఆధిపత్యం బదులు బహుళ పక్ష సామ్రాజ్యవాద ఆధిపత్యం ఉనికి లోకి వస్తున్నదని అర్ధం.

ప్రపంచ పెట్టుబడి దారీ వ్యవస్థలో చర్చల ద్వారా సర్దుబాటు చేసుకునే క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికి లోకి వచ్చినప్పటికీ తన పెత్తనం సాగినంత మేరకే అమెరికా WTO సూత్రాలను అనుసరించింది. చైనా, ఇండియా, టర్కీ, బ్రెజిల్ లాంటి దేశాలు దోహా రౌండ్ లో సొంత డిమాండ్లు పెట్టడం, పశ్చిమ దేశాల గొంతెమ్మ డిమాండ్లకు ప్రతిఘటన ఎదురవటంతో అమెరికా, డొనాల్డ్ ట్రంప్ సారధ్యంలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు అవలంబిస్తున్నది.

పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిధిగా అమెరికా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఆ స్థానం నుండి అమెరికా మెల్లగా తప్పుకోగా చైనా తాను స్వయంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధాన నాయకత్వ స్థాయిలో ముందుకు వస్తున్నది. అనగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్షణాలను చైనా పెట్టుబడి పుణికి పుచ్చుకుని ప్రపంచం మీదికి విస్తరిస్తున్నదని గ్రహించాల్సి ఉన్నది.

కనుక భారత పాలకులు అమెరికా మిత్రత్వాన్ని వీడి, రష్యా-చైనాల మిత్రత్వాన్ని స్వీకరిస్తే అది స్వావలంబన కాదు. స్వతంత్ర నిర్ణయం కూడా కాదు. ఇది కేవలం యజమానులను మార్చుకునే ప్రక్రియ. ఒక యజమాని తన వాటా తనకు ఇవ్వటానికి నిరాకించినపుడు పరాధీనుడు మరో మెరుగైన యజమానిని వెతుక్కుంటే అది స్వావలంబన, స్వతంత్రత కాదు. బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థలో సామ్రాజ్యవాదుల మధ్య పోటీలో దళారీ పాలకులు సహజంగానే సొంత ప్రయోజనాల కోసం ఒకటికి రెండు డిమాండ్లు ఎక్కువ చేసే అవకాశం పొందుతారు. వాటా పెంచుకునే వెసులుబాటు లభిస్తుంది. అది పరాధీనత కొనసాగింపు మాత్రమే. పెనం మీది నుండి పొయ్యి లోకి జారడమే.

భారత సామాన్య కార్మిక, కర్షక ప్రజానీకానికి పెనం, పోయ్యీ రెండూ ఒకటే. పెనం, పోయ్యీ ఒకే సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థలో భాగం అయినప్పుడు కార్మిక వర్గ పోరాటాలకు విరామం లేదు గాక లేదు.

వ్యాఖ్యానించండి