
బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా!
బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను కూడా ప్రచురించింది.
కానీ జూన్ నెలలో ఎలక్షన్ కమిషన్, బీహార్ లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ జరపనున్నట్లు ప్రకటించింది. ఈ ఎక్సర్^సైజ్ లో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగదోడి, తొలగించ వలసిన పేర్లను తొలగించి, అచ్చమైన స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయనున్నట్లు ప్రకటించింది.
స్పెషల్ రివిజన్ కోసం రాష్ట్ర వ్యాపితంగా బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించింది. వారికి తోడ్పడేందుకు వివిధ పార్టీల నుండి బూత్ లెవల్ ఏజంట్ (బిఎల్ఏ) లను నియమించాలని రాజకీయ పార్టీలను కోరింది.
ఈ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓ లు ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారం లను ఇంటింటికీ తిరిగి వోటర్ల కు అందజేస్తారని చెప్పింది. వోటర్లకు తగిన సూచనలు ఇస్తూ సదరు పత్రాలను సరైన డేటాతో నింపటానికి బిఎల్ఓ లు దగ్గరుండి గైడెన్స్ ఇస్తారని చెప్పింది.
వోటింగ్ హక్కు నిర్ధారించుకోవటానికి రుజువుగా/మద్దతుగా ఆయా ఓటర్లు సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ 11 రకాల పత్రాలను మద్దతుగా ఇవ్వటానికి అర్హత కలిగి ఉన్నాయని ప్రకటించింది. విచిత్రంగా ఆ 11 పత్రాల్లో, ప్రతి దానికీ ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఎల్ఐసి, బ్యాంకులు, జి.ఐ.సి లూ డిమాండ్ చేసే ఆధార్ కార్డ్ లేదు. అలాగే ఎలక్షన్ కమిషనే స్వయంగా జారీ చేసిన వోటర్ కార్డ్ కూడా పనికిరాదని తేల్చేసింది.
ఆరంభంలో ఇంటింటికీ తిరిగిన బిఎల్ఓ లు ఇలా ఇంటింటికి తిరిగి పత్రాలు ఇవ్వటం, వాటిని నింపాక తిరిగి సేకరించటం అత్యంత వ్యయప్రాసలతో కూడిన వ్యవహారం అని గ్రహించారని వారి తర్వాత చేసిన పని బట్టి అర్ధం అయింది. ఎలాగంటే మొదటి 10 రోజుల్లో కేవలం 4 నుండి 5 శాతం వరకు మాత్రమే పత్రాలను పంపిణీ చేసి తిరిగి సేకరించ గలిగారు.
దానితో ఇసిఐ నుండి ఆదేశాలు అందుకున్న బిఎల్ఓ లు ఇంటింటికి తిరగడం ఆపేశారు. గ్రామ/పట్టణ కూడళ్ళ వద్ద గానీ, సెంటర్ల వద్ద గానీ బైఠాయించి ప్రజలనే తమ వద్దకు వచ్చి ఎన్యూమరేషన్ ఫారంలు నింపి ఇవ్వాలని కోరారు.
అక్కడి నుండి మద్దతు పత్రాలు ఏయేవి ఇస్తున్నారో, అసలు ఇస్తున్నారో లేదో, ఇస్తే అవి సరైనవో కాదో అన్న సంగతి పట్టించుకోకుండా అత్యంత వేగంగా ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించటం మొదలైంది. మద్దతు పత్రాలు గురించి పట్టించుకోకుండా ముందు ఎన్యూమరేషన్ పత్రాలు పూర్తి చేసి ఇవ్వాలని జులై 7 తేదీన ఎలక్షన్ కమిషన్ స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా కోరింది. దానితో మిగిలిన కొద్ది రోజుల్లో 91% పత్రాలు సేకరించామని ఇసిఐ ప్రకటించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిందని ఆగస్టు 1 తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అప్పటికి ఉనికిలో ఉన్న జాబితా ప్రకారం బీహార్ లో 7.89 కోట్ల వోటర్లు ఉన్నారని, ఆగస్టు 1 తేదీ నాటికి 7.24 కోట్ల మంది నుండి ఎన్యూపరేషన్ పత్రాలు అందాయని ప్రకటించింది. తద్వారా 65 లక్షల మంది వోటర్లను జాబితా నుండి తొలగిస్తున్నట్లు సూచించింది.
ఈ తొలగింపులకు ఇసిఐ గుండుగుత్త సమాధానం చెప్పింది. 22.34 లక్షల మంది వోటర్లు చనిపోయారని, 36.28 లక్షల వోటర్లు శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని లేదా ఆచూకీ లభ్యం కాలేదనీ, 7.01 లక్షల వోటర్లు ఒకటి కంటే ఎక్కువ (డూప్లికేట్) ఎంట్రీలు కలిగి ఉన్నారని అనగా ఒకటి కంటే ఎక్కువ చోట్ల వోటు హక్కు నమోదు అయి ఉన్నారని ప్రకటించింది.
అనేక మంది వోటర్లు నేపాల్, బంగ్లాదేశ్, మియాన్మార్ ల నుండి ఇండియాకు వలసవచ్చి ఇక్కడ వోటు హక్కు సంపాదించారని, ఈ సంగతి ఇంటింటికి తిరిగి జరిపిన సర్వేలో బైటపడిందని జులై 13 తేదీన ఇసిఐ ప్రకటించింది. అసలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ చేసే పనిని బిఎల్ఓ లు ఆపేయగా, ఆ ఇంటింటికి తిరిగి చేసిన సర్వేలోనే విదేశీ వోటర్లు ఉన్నట్లు ఇసిఐ చెప్పటం బొత్తిగా అతకని సంగతి! వోటర్ల తొలగింపుకు తగిన భూమికను ఇసిఐ ముందే వేసుకుందా అన్న అనుమానాలు తలెత్తడానికి ఈ వ్యవహారం దోహదపడింది.
ఆ తర్వాత ఆగస్టు 4 తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ఇసిఐ ప్రకటించింది. ద హిందూ పత్రిక జనవరి 2025 నెలలో ఇసిఐ ప్రకటించిన జాబితాను ఆగస్టు 4 తేదీన ప్రకటించిన జాబితాను సరిపోల్చి తేడాలను తెలియజేసింది.
దాని ప్రకారం జనవరి 2025 నాటి జాబితాతో పోల్చితే ఆగస్టు 4 జాబితా లో 56 లక్షల మంది ఓటర్లు తక్కువ ఉన్నారు. పురుష వోటర్లు 25 లక్షల మంది తగ్గిపోగా, మహిళా వోటర్లు 31 లక్షల మంది తగ్గిపోయారు. అనగా, పురుషుల కంటే మహిళా వోటర్లు 6 లక్షల మంది ఎక్కువ తగ్గిపోయారు.
ఈ తగ్గిన వోటర్ల గురించి ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవిఎం ల విషయంలో గానీ, ఈవిఎం లను భద్రంగా దాచటం విషయంలో గానీ, వోట్ల లెక్కింపు విషయంలో గానీ, లెక్కించాక ఫలితాలు ప్రకటించే విషయంలో గానీ ఎలక్షన్ కమిషన్, బిజెపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ పలు అవకతవకలకు, అక్రమాలకు పాల్పడుతున్నదని ప్రతిపక్షాలు పలు యేళ్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈవిఎం లను హ్యాక్ చేసేందుకు వీలు లేదని ఎలక్షన్ కమిషన్ బల్ల గుద్ది చెబుతున్నది. కానీ ఈవిఎం లను ఎలా హ్యాక్ చేయవచ్చో తెలియజేస్తూ ఒక బిజేపి నాయకుడు తనకు స్వయంగా చేసి చూపించాడని శివసేన (ఉద్ధవ్) పార్టీ నాయకుడు ఉద్ధవ్ ధాకరే కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి గుర్తు చేసుకోవడం సముచితం.
అలాగే X (గతంలో ట్విట్టర్) అధినేత, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సిఈఓ అయిన ఎలాన్ మస్క్ కూడా X లోనే ఒక బిజెపి నేతకు బదులిస్తూ “ఎలాంటి మిషన్ ని అయినా చక్కగా హ్యాక్ చెయ్యొచ్చు” అని స్పష్టం చేసిన సంగతిని కూడా గుర్తు చేసుకోవచ్చు.
ఇన్ని అనుమానాల మధ్య మోడి ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రక్రియ మొత్తంగా అనుమానాల ప్రక్రియగా, రాజకీయ అవినీతి ప్రక్రియగా మారిపోయిన నేపధ్యంలో, ఎన్నికల కమిషన్ కూడా తాను స్వతంత్ర సంస్థని అన్న సంగతి మర్చిపోయి కేంద్ర ప్రభుత్వ ఆజ్ఞలకు బద్ధురాలై నడుచుకుంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అందుకే బీహార్ ఎస్.ఐ.ఆర్ నేపధ్యంలో ఇంత రగడ జరుగుతోంది.