తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ


Special Intensive Revision in Bihar

బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది.

తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా ఇవ్వాలని ఎన్.జి.ఓ సంస్థ అయిన ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ -ఏడిఆర్) ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కోరింది.

అలాంటి జాబితాలను బిఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) కు ఇచ్చామనీ, కావాలంటే వారిని అడగమని ఇసిఐ చెబుతున్నదని ఏడిఆర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి తెలియజేశాడు. తాము బిఎల్ఓ లను అడిగామనీ, అలాంటి జాబితా ఏదీ తమ వద్ద లేదని బిఎల్ఓ లు చెప్పారని భూషణ్, సుప్రీం కోర్టులో తెలిపాడు.

అయితే తొలగించిన వోటర్ల జాబితాను ఇవ్వటానికి ఇసిఐ నిరాకరించింది. “వోటర్ల జాబితా ముసాయిదా నుండి తొలగించిన వోటర్ల జాబితాను ప్రత్యేకంగా తయారు చేసి ఎవరికైనా ఇవ్వాలని గానీ, వారిని జాబితా నుండి ఎందుకు తొలగించారో కారణాలు తెలియయాలని కానీ ఎలక్షన్ కమిషన్ పైన చట్టపరమైన బాధ్యత ఏమీ లేదు” అని ఇసిఐ కోర్టులో స్పష్టం చేసింది.

జాబితాలు ఇచ్చినట్లయితే వాటిని వాస్తవాలతో సరిచూసుకోవటానికి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వారికి అవకాశం దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే ఓటర్లకు కూడా ఆ అవకాశం ఉంటుంది. అంటే ఎన్నికల కమిషన్ ప్రకటించిన వోటర్ల జాబితాను ఆడిట్ చేయటానికి ప్రజలకు అవకాశం లభిస్తుంది.

సరిగ్గా ఈ అవకాశాన్ని ఇవ్వటానికి ఇసిఐ వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలు గానీ, ప్రజలు గానీ లేదా ఏడిఆర్ లాంటి సంస్థలు గానీ వోటర్ల జాబితా తయారీలో అవకతవకలను కనుగొని బైటపెట్టే అవకాశం ఉన్నది కాబట్టే తొలగింపుల జాబితా ఇచ్చేందుకు ఇసిఐ నిరాకరిస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే మంగళవారం ఆగస్టు 12 తేదీన జరిగిన హియరింగ్ లో అడ్వకేట్ కపిల్ సిబాల్, 12 మంది పేర్లను ఉదహరించి వారంతా చనిపోయినవారుగా ఇసిఐ జాబితా నిర్ధారించిందనీ, కానీ వారు బ్రతికే వున్నారని ఎత్తి చూపించాడు. బ్రతికి ఉన్న వయోజనుల వోటింగ్ హక్కును ఇసిఐ కాల రాచిందని సిబాల్ సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలియజేశాడు.

మరో పిటిషనర్ యోగేంద్ర యాదవ్, ఏకంగా కోర్టు లోపలే ఒక వ్యక్తిని ముందుకు నెట్టి, ఈయన బ్రతికే ఉన్నాడనీ కానీ ఈయన ఓటు హక్కును ఇసిఐ రద్దు చేసిందని తెలిపాడు.

దీనికి బదులిస్తూ ఇసిఐ తరపున వాదించిన ఎస్.జి.ఐ (సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) తుషార్ మెహతా, “ఇంత పెద్ద ప్రక్రియ లో ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం. అంత మాత్రాన వారానికొకసారి కోర్టుకు వచ్చి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని వాదించనవసరం లేదు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

వ్యాఖ్యానించండి