ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!


Deportees entering the U.S. military plane

అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత పాలక వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.

జనవరి 21 తేదీన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరస పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అటు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో, ఇటు అంతర్జాతీయ రాజకీయ రంగంలో కాక పుట్టించాడు. వాతావరణ మార్పులు, ఇమిగ్రేషన్, ఆర్ధికం, వాణిజ్యం, ఫెడరల్ రెగ్యులేషన్స్, జాతీయ భద్రత లాంటి రంగాలలో తన దృష్టిని కేంద్రీకరించి వివిధ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశాడు. జో బైడెన్ కాలంలో ప్రవేశ పెట్టిన అనేక విధానాలను వెనక్కి తిప్పాడు.

ట్రంప్ సంతకం చేసిన ఆర్డర్ల జాబితా మొత్తం ప్రస్తావించాలంటే సాధ్యం కాని పని. మచ్చుకు కొన్ని తీసుకుంటే బైడెన్ హయాంలో వాతావరణ మార్పులు, జాతి సమానత్వం, ఎధిక్స్, ఇమిగ్రేషన్ అంశాలపై తీసుకున్న 78 ఎగ్జిక్యూటివ్ చర్యలను డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసేశాడు. తాత్కాలిక వీసా కలిగి ఉన్న విదేశీయులు గానీ, అధికార పత్రాలు లేని వలసదారులు గానీ అమెరికా నేలపై పిల్లల్ని కంటే వారికి ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం సంక్రమించే నిబంధనను ట్రంప్ రద్దు చేశాడు. అనగా బర్త్ రైట్ సిటిజన్షిప్ నిబంధనను రద్దు చేశాడు. అయితే అమెరికా కోర్టు ఒకటి ఈ నిర్ణయంపై స్టే ప్రస్తుతానికి విధించింది.

అమెరికా దక్షిణాన మెక్సికో దేశంతో ఉన్న సరిహద్దు వెంబడి జాతీయ ఎమర్జన్సీ విధించాడు. అమెరికా పౌరసత్వం కోసం అక్రమంగా వలస వస్తున్న వారిలో మెజారిటీ మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాలో ప్రవేశిస్తారు. ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆసియా ఖండాల దేశాల నుండి బ్రోకర్ల ద్వారా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో ప్రవేశించటానికి మెక్సికో సరిహద్దు అనువుగా ఉంటుంది. ఇండియా నుండి కూడా అనేక మంది బ్రోకర్లకు లక్షలు సమర్పించుకుని ఈ మార్గంలో వెళ్తుంతారు. ఈ నేపధ్యంలోనే ట్రంప్ బోర్డర్ వద్ద నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు.

నేషనల్ ఎమర్జెన్సీ కింద హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సిబ్బందిని దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను వెతికి పట్టుకునే పని అప్పజెప్పాడు. అంతటితో ఆగకుండా కొలంబియా, మెక్సికో, ఇండియా లాంటి దేశాల నుండి వెళ్ళి అధికారిక పత్రాలు లేని వారిని అర్జెంటుగా మిలటరీ రవాణా విమానాల్లో సంకెళ్ళు వేసి మరి ఆయా దేశాలకు వెనక్కి పంపించాడు.

మిలటరీ రవాణా విమానాల్లో కూర్చోనేందుకు 100 వరకు సీట్లు ఉన్నప్పటికీ అవి సాధారణ పౌరులు కూర్చునేందుకు వసతిగా ఉండవు. వెనక్కి వాలి పడుకునేందుకు అసలే అవకాశం ఉండదు. విపరీత స్థాయిలో ఇంజన్ శబ్దం వస్తుంది. సైనికులు, వారితో పాటు ట్యాంకులు, మిలట్రీ ట్రక్కులు లాంటి వాటిని రవాణా చేసేందుకు C 17 లాంటి మిలటరీ విమానాలను ఉపయోగిస్తారు. పైగా అందరికీ సంకెళ్ళు వేసి కనీసం పక్కకు కదిలే అవకాశం లేకుండా గంటల తరబడి ప్రయాణించే దుర్గతిని పట్టించారు.

ట్రంప్ కి లొంగని కొలంబియా

తమ దేశస్థులను ఇలా అమానవీయ పరిస్ధితుల్లో వెనక్కి పంపటం పట్ల కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆగ్రహం ప్రకటించాడు. తమ దేశ ప్రజలను ఆహ్వానించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ కానీ సంకెళ్ళు వేసి సరుకుల మాదిరిగా మిలట్రీ విమానాల్లో కుదేసి క్రిమినల్స్ కు మల్లే రవాణా చేయటం తగదని, తన మిలటరీ విమానాలను వెనక్కి తీసుకెళ్తే కొలంబియా ప్రయాణీకుల విమానాలను కొలంబియా నుండి పంపిస్తామని, సకల మర్యాదలతో, సౌకర్యాలతో తమ దేశ ప్రజలను తమ దేశం తెచ్చుకుంటానని చెప్పాడు. గుస్తావో ప్రకటనను పశ్చిమ పత్రికలు తమ ఇష్టానుసారం భాష్యం చెబుతూ వార్తలు ప్రచురించాయి. కొలంబియా ప్రజలను వెనక్కి తీసుకునేందుకు ఆ దేశాధ్యక్షుడు నిరాకరించాడని తప్పుడు కధనాలు రాశాయి.

Colombia president Gustavo Petro

ఈ తప్పుడు వార్తలకు తగ్గట్టుగా డొనాల్డ్ ట్రంప్ “అమెరికా నుండి వెనక్కి పంపిన కొలంబియన్ క్రిమినల్స్ ని కొలంబియా లోకి అనుమతించకపోతే కొలంబియా దిగుమతుల పైన వెంటనే 25% సుంకాలు విధిస్తానని బెదిరించాడు. మరో వారం రోజులు అదే పరిస్ధితి కొనసాగితే సుంకాలు 50% కి పెంచుతానని బెదిరింపులు తీవ్రం చేశాడు. ఇందుకు సమాధానంగా గుస్తావ్ పెట్రో స్పందిస్తూ మా ప్రజలను తెచ్చుకునేందుకు పౌర రవాణా విమానంతో పాటు అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్నే పంపిస్తానని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా అమెరికా సుంకాలకు ఎదురు సుంకాలను అమెరికా నుండి వచ్చే సరుకులపై విధిస్తామని హెచ్చరించాడు. డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలు విధిస్తే తామూ 25% సుంకాలు విధిస్తామని 50% సుంకాలు విధిస్తే తామూ 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు.

అమెరికా పౌరులు 15,666 మంది అక్రమంగా కొలంబియాలో నివసిస్తున్న సంగతిని గుర్తు చేస్తూ “నేను ట్రంప్ లాంటి వాడిని కాదు. ఏ దేశ ప్రజలనైనా నేను మనుషులుగా గౌరవంగా చూస్తాను. ట్రంప్ చేసినట్లు అక్రమ వలసదారులపై దాడులు చేయబోను” అని స్పష్టం చేశాడు. సుంకాల బెదిరింపులకు స్పందిస్తూ “నువ్వు విధించే దిగ్బంధనం నన్నేమీ భయపెట్ట లేవు. ఎందుకంటే కొలంబియా అందమైన దేశమే కాక ప్రపంచానికి హృదయం లాంటిది కూడా” అని ప్రతి సమాధానం ఇచ్చాడు. అయితే ట్రంప్ తక్కకు తమ దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో అమెరికాతో కొలంబియా అధ్యక్షుడు ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆ ఒప్పందం ప్రకారం కొలంబియా తన సొంత మిలటరీ విమానాలను పంపి చేతులకు, కాళ్ళకు సంకెళ్ళు లేకుండా తన దేశ ప్రజలను వెనక్కి తెచ్చుకున్నాడు.

“ట్రంప్ తన దురాశతో మానవ జాతిని తుడిచి పెట్టటానికి కూడా వెనకాడడు. కొలంబియన్లను తక్కువ జాతిగా ఆయన పరిగణిస్తున్నాడు. నన్ను పదవీచ్యుతిని చేసేందుకు ట్రంప్ తమ ఆర్ధిక బలంతో, గర్వాతిశయంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కానీ నేను ఎదురు తిరిగి పోరాడతాను తప్ప లొంగే ప్రసక్తే లేదు” అని ప్రకటించాడు. “ఈ రోజు నుండి కొలంబియా దేశం ప్రపంచం అంతటికీ ద్వారాలు తెరుచుకుని ఉంటుంది. నిండు చేతులతో కొలంబియాకు ఎవరినైనా ఆహ్వానిస్తాము” అని ప్రకటించి డొనాల్డ్ ట్రంప్ జాత్యహంకారానికి జాతుల సమ భావనతో బదులిచ్చాడు.

ఇండియా స్పందన

అమెరికాకు అక్రమంగా వలస వెళ్ళిన భారతీయులను కూడా కొంత మందిని అమెరికా వెనక్కి పంపింది. 104 మంది భారతీయులను C-17 అనే మిలటరీ రవాణా విమానంలో కాళ్ళకు, చేతులకు కూడా సంకెళ్ళు వేశారు. అంతటితో ఆగకుండా వారిని చెక్క బల్లలపై వెనక్కి తాళ్ళతో అటూ ఇటూ కదలకుండా కట్టి పదేశారు. భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ అధికారులు ఎంత కక్ష పూరితంగా వ్యవహరించారు అంటే ఇండియన్లు మిలటరీ విమానంలోకి కాళ్ళకు, చేతులకు వేసిన సంకెళ్ళ వాలని ఇబ్బందిగా నడుస్తూ మిలటరీ విమానం లోకి ఎక్కటాన్ని, వాళ్ళని విమానంలో కట్టి పడేయటాన్ని వీడియో తీసిన అమెరికా బోర్డర్ పెట్రోల్ అధిపతి మైఖేల్ W బ్యాంక్స్ ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లో ఆయన ఇలా రాశాడు:

“USBP (అమెరికా బోర్డర్ పెట్రోల్) మరియు తన భాగస్వాములు ఇండియా నుండి వచ్చిన చట్ట వ్యతిరేక అలియెన్లను ఇండియాకు ఇప్పుడే పంపేశాము. దీనితో అత్యంత సుదూర ప్రాంతానికి కూడా అమెరికా బహుష్కృతులను మిలటరీ రవాణా ద్వారా వెనక్కి పంపినట్లయింది. ఈ చర్య అమెరికా వలస చట్టాలను అమలు చేయటం లోనూ, త్వరితగతిన అక్రమ వలసదారులను అమెరికా నుండి తొలగించటం లోనూ మా నిబద్ధతను తెలియజేస్తుంది.”

“అక్రమంగా సరిహద్దు దాటి వస్తే, మిమ్మల్ని తప్పనిసరిగా తొలగించి తీరతాము.”

—– Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025

https://twitter.com/i/status/1886946028185682347

పంజాబ్ లో అమృత్సర్ లో దిగిన అమెరికా మిలటరీ విమానం నుండి దిగిన భారతీయులు తాము అమెరికా వెళ్ళటానికి పడిన కష్టాలను మిలటరీ విమానంలో కనీసం 24 గంటల పాటు జరిగిన కంటక ప్రయాణాన్ని గురించి కధలు కధలుగా చెప్పారు. తాము అమెరికా వెళ్ళే మార్గంలో కొండలు ఎక్కి దిగామని, బురద నేలల్లో నడిచామని, అడవులను తొలుచుకుంటూ కొన్ని వందల కిలో మీటర్లు నడిచామని, అనేక దేశాల సరిహద్దులను దాటుకుంటూ వెళ్లామని వారు వాపోయారు. ఈ వలసదారుల్లో అత్యధికులు అప్పులు చేసి పెద్ద పెద్ద మొత్తాలను బ్రోకర్లకు సమర్పించుకున్నారు.

ఉదాహరణకి 36 యేళ్ళ జస్పాల్ సింగ్ అమెరికాకి అక్రమంగా వెళ్ళేందుకు రు 30 లక్షలు ఒక ఏజెంట్ కి సమర్పించాడు. కానీ అమెరికా బోర్డర్ పెట్రోల్ వాళ్ళు జనవరి 24 తేదీన జస్పాల్ ను అరెస్ట్ చేశి 11 రోజులు నిర్బంధించారు. తమని వెనక్కి పంపుతున్నారని తెలియదని, అమెరికాలోనే ఒక డిటెన్షన్ సెంటర్ నుండి మరో డిటెన్షన్ సెంటర్ కి తరలిస్తున్నారని అనుకున్నామని జస్పాల్ చెప్పాడు. తాము అమృత్సర్ లో దిగేంత వరకూ కాళ్ళు, చేతులకు వేసిన సంకెళ్ళు విప్పలేదని చెప్పాడు. హర్విందర్ సింగ్ అయితే ఏజెంటు కి 42 లక్షలు ఇచ్చాడు. అతన్ని కతార్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికరాగువా, మెక్సికో దేశాల ద్వారా అమెరికాకు తరలించబడ్డాడు. “రోజుల తరబడి నడిచాము. కొండలు దాటాము. దాదాపు సముద్రంలో ముంగినంత పనీ అయింది. ఒక వ్యక్తి పనామా అడవుల్లో చనిపోవటం చూశాను. మరొకరు సముద్రంలో మునిగిపోవటాన్ని చూశాను. దాదాపు 17, 18 కొండలు దాటాము. ఎవరైనా దారిలో జారి పడితే అతను బతికి బట్టకట్టే అవకాశం లేదు. ఎవరైనా గాయపడితే అతన్ని దారిలో వదిలేసి వెళ్లిపోతారు. మేము వస్తున్న మార్గంలో అనేకమంది శవాల్ని చూశాము” అని హర్విందర్ తన భయానక ప్రయాణాన్ని వివరించాడు. వీళ్ళు తమ సంపాదన మొత్తంతో పాటు ఇంట్లో వాళ్ళ ఆస్తులను సమస్తం అమ్ముకుని వెళ్ళినవాళ్లు. లేదా భారీ అప్పులు తీసుకుని, ఇళ్లను తాకట్టు పెట్టి వెళ్లారు. అమెరికాలో భద్రమైన ఉపాధి, భారీ వేతనాలు చెల్లించే పని దొరుకుతుందని, ఆ డబ్బుతో ఇండియాలో కుటుంబాన్ని సంపదలతో ముంచెత్తవచ్చన్న ఆశతో వెళ్ళిన వాళ్ళు.

అమెరికా బోర్డర్ పెట్రోల్ పెట్రోల్ చీఫ్ భారతీయ వలసదారులను అలియెన్స్ అని సంబోధించాడు. అలియెన్ అంటే గ్రహాంతరవాసి అని అర్ధం. భారతీయ వలసదారుల పట్ల ఒక అమెరికా ఉన్నతాధికారికి ఉన్న గౌరవపూరిత అభిప్రాయం అది!? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వలసదారులను క్రిమినల్స్ అనీ, అలియెన్స్ అనీ తప్ప మరొక పేరుతో సంబోధించడు. అమెరికాకి వలస రావటాన్ని “దండయాత్ర” గా ట్రంప్ ఎప్పుడూ పేర్కొంటాడు. ఈ రవాణా ద్వారా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఒక సందేశం పంపించాడు. ఆ సందేశం పరమ జాత్యహంకారంతో కూడిన సందేశం. అమెరికా కేవలం తెల్లవారికి చెందిన దేశం మాత్రమే అన్నది ఆ సందేశం.

నిజానికి అమెరికా తెల్లవాళ్ళ దేశం కాదు. రెడ్ ఇండియన్లు మాత్రమే అమెరికాలోని అసలు సొంత నివాసులు తప్ప మరొకరు కాదు. బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లాంటి ఐరోపా దేశాల నుండి వలస వెళ్ళిన తెల్లజాతి ప్రజలు రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి వాళ్ళని తూర్పు నుండి దక్షిణానికి తరుముకుంటూ వెళ్ళి కనపడ్డ ప్రతి ఆదిమ తెగనీ నిర్మూలిస్తూ, రక్తపుటేరులు పారిస్తూ అమెరికాని ఆక్రమించుకున్నారు. ప్రధానంగా బ్రిటన్, ఐర్లాండ్ ల నుండి వెళ్ళిన ఈ తెల్లజాతి ప్రజలు ఆఫ్రికా ప్రజలను కట్టుబానిసలుగా అత్యంత అమానవీయ పరిస్ధితుల్లో ఓడల్లో రవాణా చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయించుకుని సంపదలు కూడ బెట్టారు. అమెరికా సివిల్ వార్ కూడా ఆఫ్రికన్ తదితర తెల్లేతర ప్రజలను బానిసలుగా ఉంచుకోవాలా లేదా అన్న అంశం పైనే జరగడం గమనార్హం. బానిస వ్యవస్థ ప్రధాన ఆధారంగా నడుస్తున్న ఆర్ధిక వ్యవస్థ, సదరు ఆర్ధిక వ్యవస్థపైన రాజకీయ నియంత్రణ.. ఈ అంశాల పైనే అమెరికా దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య సివిల్ వార్ నడిచింది. ఇది వేరే కధ!

భారత వలసదారుల పట్ల అంత దారుణంగా వ్యవహరించిన అమెరికా పట్ల ఇండియా ఎలా స్పందించింది? కొలంబియా అధ్యక్షుడికి మల్లే పౌరుషం ఏమన్నా చూపించారా? కనీసం ఖండించారా? కొలంబియా అధ్యక్షుడే స్వయంగా దూకుడుగా అమెరికా నీతిని దునుమాడినట్లు భారత ప్రధాని ఏమన్నా మాట్లాడారా? అబ్బే! అదేమీ లేదు. అసలు ఆ అంశం పైన భారత ప్రధాని నరేంద్ర మోడి ఇంతవరకు ఒక ముక్కా మాట్లాడిన పాపాన పోలేదు. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని చల్లబరచటానికా అన్నట్లు భారత ప్రధాని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా సందర్శించి డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు చేయనున్నారు. భారత కంపెనీలు, ఎగుమతిదారులు మోడి-ట్రంప్ చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని ఇండియా ఎగుమతులపై సుంకం విధించే ఆలోచనను ట్రంప్ విరమించుకుంటాడని ఎదురు చూస్తున్నారు.

Tariff differentials with the U.S.

అయితే రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చి ఇండియా ఎగుమతులపై సుంకాలు విధించకుండా ఉండేందుకు భారత ప్రధాని కొన్ని త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ప్రకటించటంతో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు గొల్లు మంటున్నాయి. ట్రంప్ భయంతో ఇండియా షేర్ సూచీలు రెండూ గత 5 రోజులుగా నష్టాలు ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లోనే (ఫిబ్రవరి 10, 11) భారత స్టాక్ లు 180 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోల్పోయాయని తెలుస్తున్నది. మంగళవారం ఫిబ్రవరి 11 తేదీన నిఫ్టీ 50 సూచీ 1.32% పతనం కాగా, సెన్సెక్స్ సూచీ కూడా అంతే మొత్తంలో నష్టపోయింది. ముఖ్యంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు భారీగా 5% వరకు నష్టపోయాయి. మంగళవారం నిఫ్టీలో లిస్ట్ అయిన 2,918 స్టాక్ లలో 2,532 స్టాక్ లు నష్టాలు ఎదుర్కొన్నాయని రాయిటర్స్ తెలిపింది. అమెరికా సరుకులపై సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తానని ఆదివారం (ఫిబ్రవరి 9) డొనాల్డ్ ప్రకటించడమే భారత షేర్ మార్కెట్ల పతనానికి కారణమని దాదాపు విశ్లేషకులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు.

అదీకాక అమెరికా సరుకులపై ఇండియా విధించే సుంకాలు భారీగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్, అతని అధికార గణం ఎప్పటి నుండో అదే పనిగా విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తానని బెదిరించినప్పటికీ నవంబర్ 25 తర్వాత చైనా స్టాక్ లు 1.7% లాభాలు నమోదు చేయగా, కెనడా స్టాక్ లు 1% లాభాలు నమోదు చేశాయి. కానీ ఇండియా సూచీలు 4.7% నష్టపోగా, మెక్సికో స్టాక్ సూచీలు 5.4% నష్టపోయాయి. డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయినప్పుడు భారత ప్రధాని తమ దేశం అమెరికా సరుకులపై విధించే సుంకాలను భారీగా తగ్గిస్తామని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా ఇంధనం (ఎనర్జీ), రక్షణ రంగాలకు సంబంధించి దిగుమతులను ఇండియా భారీగా పెంచుతుందని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.

భారత ప్రధాని ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు అమెరికా వెళ్తుండగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫిబ్రవరి 6 తేదీన పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇస్తూ అమెరికా, భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి, కుర్చీలకు కట్టివేసి మిలటరీ విమానంలో రవాణా చేయటాన్ని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. “అమెరికా ఇలా చేయటం కొత్త కాదు కదా” అని ప్రశ్నించాడు. “అక్రమ వలసదారులకు సంకెళ్లతో నిర్బంధించి తరలించటం అమెరికా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగంగానే జరిగింది” అంటూ ఇందులో భారత ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదన్నట్లు సమాధానం ఇచ్చాడు. “అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి భారతీయ బహిష్కృతులను వెనక్కి పంపేటప్పుడు ఏ విధంగానూ అమర్యాదకరంగా వ్యవహరించకుండా ఉండేటట్లుగా మాట్లాడతాము” అని హామీ ఒకటి ఇచ్చాడు తప్ప ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది తెలియలేదు.
2009 నుండి అమెరికా మొత్తం 15,756 మంది భారతీయులను బహిష్కరించి ఇండియాకు పంపిందని రాజ్యసభలో జైశంకర్ చెప్పాడు. “విదేశాల్లో భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిస్తే వారిని వెనక్కి తీసుకునే బాధ్యత ఆయా దేశాలకు ఉంటుంది” అని లోక్ సభలో చెప్పాడు. జైశంకర్ చెప్పినట్లు భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఇండియాపై ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఎంపిలు అడిగింది అది కాదు కదా? భారతీయులను అమానుషంగా సంకెళ్లు వేసి ఒకే ఒక్క టాయిలెట్ ఉండే మిలటరీ విమానంలో కుదేసి, కుర్చీలకు కట్టి పడేసి, సంతకు పశువుల్ని తరలించినట్లు తరలిస్తుంటే భారత ప్రభుత్వం అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఎందుకు ఉన్నది అని ఎంపిలు అడిగారు. ఇండియా కంటే చిన్న దేశమైన కొలంబియా దేశ అధ్యక్షుడు అమెరికా మిలటరీ విమానాలు తమ దేశంలో ల్యాండ్ కాకుండా వెనక్కి పంపి సొంత విమానాలను అమెరికాకు పంపించి మర్యాదగా, తగిన సౌకర్యాలతో తమ దేశ ప్రజలను వెనక్కి తెచ్చుకున్నట్లే భారత ప్రభుత్వం ఎందుకు వ్యవహరించలేదు అని ప్రతిపక్ష ఎంపిలు అడిగారు.

విదేశీ మంత్రి ఎంతసేపటికీ అమెరికా అమానుష చర్యను అమెరికా చట్టాల ప్రకారం సబబు అన్న సంగతి వివరిస్తూ వెనకేసుకు రావటం తప్ప కనీస ఖండన కూడా ఎందుకు జారీ చేయలేకపోయారు? అక్రమంగా విదేశాల్లో నివసించటాన్ని ప్రోత్సహించకుండా ఉండటం మనందరి ఉమ్మడి బాధ్యత అని సుద్దులు కూడా చెప్పారు విదేశీ మంత్రి! ఆ విషయం భారత ప్రజలకు ఎప్పుడన్నా ప్రభుత్వం చెప్పిందా? “అరే బాబూ, అమెరికా లాంటి చోట్లకు సరైన పత్రాలు లేకుండా వెళ్లవద్దు. అలా వెళితే అక్కడ చట్టాల ప్రకారం మిమ్మల్ని దారుణంగా ట్రీట్ చేస్తారు. కలో గంజో ఇక్కడే తాగి బ్రతకండి” అని ఏ ప్రభుత్వం అన్నా చెప్పిందా? గత 11 సంవత్సరాల్లో ఎన్.డి.ఏ ప్రభుత్వం అయినా భారత ప్రజలను ఆ దిశలో ఎడ్యుకేట్ చేసిందా? ఆ బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ప్రభుత్వ కంపెనీలను అయినకాడికి అమ్మేసి ప్రభుత్వ ఉపాధిని శాశ్వతంగా రద్దు చేసి, చివరికి రిటైల్ వ్యాపారాన్ని కూడా ప్రైవేటీకరించటం ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశాలను కూడా రద్దు చేసేసిన తర్వాత “ఉపాధి కోసం విదేశాలకు వెళ్లవద్దు” అని భారతీయ నిరుద్యోగ యువతకు సలహా ఇవ్వగల ధైర్యం ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వానికి లేదు. అందుకే అలాంటి సలహా ప్రభుత్వాలు ఎప్పుడూ జనానికి ఇవ్వలేదు. వాస్తవం ఇది కాగా, అక్రమంగా వలస వెళితే ఇలాగే జరుగుతుందని అమెరికా చర్యలను వెనకేసుకు రావటం అసంబద్ధం. కేంద్ర మంత్రి పదవులు వెలగబెడుతున్న పెద్దలకు ఇది తగని పని.

ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా అమెరికా, రష్యా ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించటంతో సదరు ఆంక్షలను అమలు చేసేందుకు ఇండియా సుముఖత చూపలేదు. పైగా రష్యా నుండి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుని భారీగా లబ్ది పొందింది. (ఈ లబ్దిని మోడి ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రజలకు చేరనీయకుండా అడ్డుపడి, ఆదాని లాంటి వారి కంపెనీలు లబ్ది పొందేందుకే వినియోగించాడు.) రష్యా నుండి దిగుమతి చేసుకున్న చమురును శుద్ధి చేసి ఇండియా కొన్ని ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. ఎలా మారు బేరానికి రష్యా చమురు ఎగుమతి చేయటం ద్వారా అదాని, అంబానీ గ్రూపులకు చెందిన చమురు శుద్ధి కంపెనీలు దండిగా లాభాలు సంపాదించాయి. ఇంకా ఘోరం ఏమిటంటే రష్యా నుండి దిగుమతి అయిన చౌక చమురును రిలయన్స్. నయారా లాంటి ప్రైవేటు కంపెనీలు భారత వినియోగదారులకు అమ్మకుండా అత్యధిక భాగాన్ని ఐరోపా దేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందగా ఇండియాలోని ప్రైవేటు కంపెనీల వినియోగదారులకు కూడా ప్రభుత్వ కంపెనీలు అధిక ధరకు కొన్న చమురును సరఫరా చేయాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ చమురు కంపెనీలకు లాభాలకు బదులు నష్టాలు దక్కగా, లాభాలనన్నీ రిలయన్స్, నయారాలు దండుకున్నాయి.

ట్రంప్ తెచ్చిన మార్పుల్లో ఒకటి మరణ శిక్షను విస్తృతం చేయటం. తీవ్ర నేరాలకి గాను మరణ శిక్ష విధించటం అధికం చేయాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు ఇచ్చాడు. మరణ శిక్ష అమలు చేసేందుకు చట్టపరంగా ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిస్తానని హామీ ఇచ్చాడు. ప్రజల భద్రత, న్యాయం అందించే పేరుతో ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియేన్సీ పేరుతో కొత్త విభాగం ఏర్పాటు చేసి విచిత్రంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ను దాని బాధ్యతలు అప్పజెప్పాడు. కొన్ని తరహాల ఉద్యోగాలకు ఉపాధి భద్రత సౌకర్యాన్ని తొలగించాడు. ఉపాధి కల్పనను స్తంభింపజేశాడు. ప్యారిస్ క్లైమెట్ ఒప్పందం నుండి అమెరికాను తప్పించాడు. జనవరి 6, 2020 తేదీన కేపిటల్ హిల్ పైకి దండుగా వెళ్ళిన ట్రంప్ అనుచరులపైన బైడెన్ ప్రభుత్వం కేసులు పెట్టగా, ఆ కేసులన్నింటినీ ట్రంప్ రద్దు చేశాడు. ట్రాన్స్ జెండర్ లకు రక్షణ చర్యలను రద్దు చేశాడు. ఆ కోవలోని ఇతర తరగతులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్దతు ఉపసంహరించాడు. మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాలలో డ్రగ్స్ వ్యాపారాన్ని పెంచి పోషిస్తూ వాటిని నియంత్రించేది సి.ఐ.ఏ కాగా కేవలం లాటిన్ అమెరికా దేశాల డ్రగ్స్ వ్యాపారస్తులను మాత్రమే టెర్రరిస్టులుగా ప్రకటించాడు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నుండి అమెరికాను తప్పించాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మార్చుతూ చట్టం చేశాడు. USAID ప్రపంచ వ్యాపితంగా అందజేస్తున్న సహాయంపై తాత్కాలిక స్తంభన విధించాడు. అమెరికా ప్రయోజనాలను, జాతీయ భద్రతను పరిరక్షించే విధంగా ఎవరెవరకి సహాయం అందజేయాలో తమ ప్రభుత్వం మదింపు వేశాక తిరిగి సహాయం ప్రారంభిస్తామని ప్రకటించాడు. అమెరికా విదేశాంగ విధానాన్ని, అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసేట్లుగా పునః మూల్యాంకన చేయాలని ఆదేశాలు ఇచ్చాడు. నిజానికి అమెరికా ఎన్నడూ ఇతర దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేదు. మొదటి నుండీ అమెరికా బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే ఆ దేశ విదేశాంగ విధానం అమలు చేస్తూ వచ్చింది.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా దోపిడీ విధానాలకు, పెత్తనానికి ఇంతవరకు తొడిగిన మర్యాదకర ముసుగులను కొనసాగించే ఉద్దేశంలో లేడు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, టెర్రరిజం వ్యతిరేక పోరాటం… ఇలాంటి ముసుగులు వేసుకుని అమెరికా దురాక్రమణ యుద్ధాలకు, డ్రోన్ బాంబుల దాడులకు, టెర్రరిస్టు సంస్థలను పెంచి పోషించటానికి తెగబడింది. ఇలాంటి ముసుగులు అక్కర్లేదనీ ట్రంప్ భావిస్తున్నాడు. ఈ ముసుగుల వలన, అమెరికా నిర్ణయాత్మకంగా లేకపోవటం వలన, ఇతర దేశాలు అమెరికాని ఉపయోగించుకుంటున్నాయని, అమెరికాపై భారం మోపుతున్నాయని ట్రంప్ చెబుతున్నాడు. ఆ మార్గం లోనే “సిరియా చమురు కోసమే మేము ఆట్-తనఫ్ ప్రాంతాన్ని ఆక్రమించి స్ధావరం ఏర్పాటు చేశాము” అని డొనాల్డ్ ట్రంప్ నిర్మొహమాటంగా ప్రకటించాడు. ఒబామా, బైడెన్ ప్రభుత్వాలెమో సిరియాలో నియతృత్వ పాలన తప్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపించటానికి కృషి చేస్తున్నాము అని చెబుతూ వచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఎలాంటి తాయిలమూ చూపించకుండా, పంచకుండా అమెరికా దోపిడీ కొనసాగించాలని చూస్తున్నాడు. తాయిలాల ఖర్చు అమెరికా భరించనక్కర్లేదనీ భావిస్తున్నాడు. గ్లోబలైజేషన్ విధానాలను కేవలం అమెరికా వైపు మొగ్గు చూపెంతవరకే అమలు చేయాలని, వాణిజ్య ఒప్పందాలు, బహులపక్ష ఒప్పందాల పేరుతో అమెరికా కూడా ఒప్పందాలకు కట్టుబడి ఉండే పద్ధతి పాటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాడు. తద్వారా గ్లోబల్ దేశాల దోపిడీలో పశ్చిమ ఐరోపా లాంటి ఇతర సామ్రాజ్యవాదులకు వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. లేదా వారి వాటా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఈ తరహా రాజకీయ-సామాజిక విధానాలు కొత్తగా ఎదుర్కొంటున్నది. ఆర్ధిక లాభాలు మొత్తం ఒకే ఒక దిశలో -అమెరికా దిశలో- ప్రవహించటానికి అనువైన ఏర్పాట్లు లేనందున, అమెరికాతో పాటు వివిధ జూనియర్ / అనుచర సామ్రాజ్యవాద దేశాలకు కూడా మిగులులో వాటా ప్రవహించే ఏర్పాట్లు కొనసాగుతున్నందున ట్రంప్ విధానాలకు ప్రతిఘటన ఎదురవుతున్నది. ట్రంప్ ప్రవేశ పెడుతున్న ఏకపక్ష దోపిడీ, ఇతర సామ్రాజ్యవాద రాజ్యాలు కోరుతున్న బహుళపక్ష దోపిడీ… ఈ రెండు వ్యవస్థలు లోలోపల ఘర్షణ పడుతూ ఎక్కడో ఒక దగ్గర రాజీ పడవలసి ఉంటుంది. లేనట్లయితే పశ్చిమ సామ్రాజ్యవాద రాజ్యాల మధ్యనే తగవులు పెరిగి ఘర్షణలు బహిరంగం అయ్యే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే చేజేతులా బహుళ ధృవ ప్రపంచం ఏర్పాటుకు అవకాశాన్ని అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాలు బంగారు పళ్ళెంలో పెట్టి చైనా, రష్యా, ఇరాన్, వెనిజులా తదితర దేశాలకు అప్పగించినట్లే అవుతుంది.

యుద్ధాల వలన, వరుస పెట్టుబడిదారీ సంక్షోభాల వలనా అమెరికా సామ్రాజ్యవాదంతో పాటు మొత్తంగా సామ్రాజ్యవాద వ్యవస్థ సైతం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. ఈ సంక్షోభాలకు తోడు చైనా, రష్యాల నుండి ఎదురవుతున్న సవాళ్ళు అమెరికా ఏకపక్ష పెత్తనం చెలాయించే పరిస్ధితి రద్దయింది. అమెరికా ఈ దుర్గతి నుండి బైటపడి, ఎప్పటిలా ఏక పక్షంగా పెత్తనం చేయాలని, ప్రపంచ పోలీసు పాత్ర తిరిగి సొంతం చేసుకోవాలని అమెరికా సామ్రాజ్యవాద వర్గం లోని ఒక సెక్షన్ బలంగా కోరుతోంది. ఆ కోరికే డొనాల్డ్ ట్రంప్ రూపంలో వ్యక్తం అవుతోంది. గత వైభవాన్ని తలచుకుంటూ దూకుడుగా వెళ్ళినట్లయితే పూర్వ స్థానాన్ని సంపాదించుకోవచ్చని ఈ సెక్షన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ భావనతోనే ఏక పక్ష చర్యలతో, దూకుడుతో కూడిన ప్రకటనలతో, డాంబిక పదజాలంతో ఒక అనిశ్చిత పరిస్ధితిని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షరికం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ లోనూ, సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ లోనూ సృష్టించింది.

అయితే ఈ అనిశ్చిత పరిస్ధితినే రష్యా, చైనాలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. కొన్ని ఎదురు దెబ్బలు తింటున్నప్పటికీ రష్యా, చైనాలతో పాటు ఇరాన్, టర్కీ, ఇండియా లాంటి దేశాలు ప్రాంతీయ పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ ప్రతిఘటన న్యాయమైనదే అయినప్పటికీ ఆ న్యాయమైన దశ దాటాక అదే తరహాలో గాజా, లెబనాన్, యెమెన్ లాంటి పీడిత దేశాలకు మద్దతు కొనసాగిస్తుందా అన్నది అనుమానమే. టర్కీ, ఇండియాలది అన్యాయమైన విస్తరణవాదం. అమెరికా, రష్యా, చైనా, పశ్చిమ ఐరోపా దేశాల అంతర్గత ఘర్షణలను ఉపయోగించుకోగల స్థితిలో అంతర్జాతీయ కార్మికవర్గం లేదు. కనీసం ఈ బలహీనతనైనా అధిగమించటానికి విప్లవ సెక్షన్లు కృషి చేయాలి. అమెరికా, చైనా, రష్యా, పశ్చిమ ఐరోపా దేశాల సామ్రాజ్యవాదానికి, టర్కీ, ఇండియా పాలకవర్గాల విస్తరణ వాద కాంక్షలకు వ్యతిరేకంగా కార్మికవర్గ ప్రజానీకం ఐక్యం కావలసి ఉన్నది.

వ్యాఖ్యానించండి