
Yoav Gallant and Benjamin Netanyahu
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది.
ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియే, సాయుధ ప్రతిఘటనా నేత యాహ్యా సినావర్ ల అరెస్టుకు కూడా ఐసీసీ అరెస్టు వారంట్ జారీ చేయాలని ఐసీసీ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. అలాగే హమాస్ కి చెందిన మరో నేత మహమ్మద్ డేఫ్ అరెస్టుకు కూడా వారంట్ జారీ అయింది.
కానీ హమాస్ నేత ఇస్మాయిల్ హనియే, కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించే నిమిత్తం ఇరాన్ కి వచ్చి ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉండగా ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) ఆయన ఉంటున్న బంకర్ పైన వరస పెట్టి వేల టన్నుల బాంబులు ప్రయోగించి చంపేసింది.
హమాస్ ప్రతిఘటనా యుద్ధ నేత యాహ్యా సినావర్, గాజా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష సామూహిక హత్యాకాండను ప్రతిఘటిస్తూ తీవ్రంగా గాయపడి ఒక భవనం శిధిలాల మధ్య కదలలేని పరిస్ధితిలో ఉండగా గుర్తించిన ఐడిఎఫ్, ఆయనపై మరోసారి ట్యాంకుతో ఫిరంగి గుండ్లు పేల్చి చంపేసింది.
ఈ పిరికిపంద చర్యను ఇజ్రాయెల్ వీడియోలో రికార్డు చేసి సగర్వంగా లోకం ముందు ప్రదర్శించుకుంది. ఈ నేపధ్యంలో ఇస్మాయిల్ హనియే, యాహ్యా సినావర్ ల అరెస్టు వారంట్ కు విజ్ఞప్తి చేసిన ఐసీసీ ప్రాసిక్యూషన్ సదరు విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది.
మహమ్మద్ డేఫ్ పైన ఐసీసీ అరెస్టు వారంట్ ప్రకటన వెలువడిన వెంటనే ఇజ్రాయెల్ ఆయనను కూడా తాము అప్పటికే చంపేశామని ప్రకటించింది.
మానవులు అని భావించటానికి సైతం ఏ మాత్రం అర్హత లేని బెంజిమిన్ నెతన్యాహూ, యెవ్ గాలంట్ ల పైన అరెస్టు వారంట్ జారీ చేస్తూ ఐసీసీ కోర్టు ఇలా పేర్కొన్నది:
“ఈ ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా గాజాలో నివసిస్తున్న పౌర జనాభా కనీసం బ్రతికి ఉండటానికి అత్యంత అవసరమైన ఆహారం, తాగు నీరు, ఔషధాలు, వైద్య పరికరాల సరఫరా… మొదలైన వస్తువులతో పాటు ఇంధనం, విద్యుత్ లు కూడా అందకుండా చేశారని నమ్మేందుకు సకారణమైన ఆధారాలు ఉన్నాయని ఈ ఛాంబర్ పరిగణిస్తున్నది.”
ఇస్మాయిల్ హనియే, యాహ్యా సినావర్ ల అరెస్టుకు వారంట్ ఇవ్వాలని ప్రాసిక్యూషన్ చేసిన విజ్ఞప్తిని ఆనాడే హమాస్ విమర్శించింది. దాదాపు 5 వేల సంవత్సరాల నుండి పాలస్తీనా భూభాగంపై నివసిస్తున్న పాలస్తీనా అరబ్ ప్రజలను బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వలసలుగా మార్చుకుని మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడే పాలస్తీనా ప్రజల సొంత నేలపై ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేస్తామని కుట్ర బుద్ధితో ప్రకటించాయి.
అప్పటి నుండి ఐరోపా దేశాలలో స్థిరపడిన యూదు ప్రజలను నెమ్మదిగా బ్రిటిష్ మ్యాండేట్, ఫ్రెంచి మ్యాండేట్ పేరుతో పాలస్తీనా భూభాగంలోకి తరలించడం ప్రారంభించాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయించి 2/3 వంతు ఉన్న పాలస్తీనా అరబ్బులకు 44 శాతం భూభాగం, 1/3 వంతు ఉన్న యూదులకు 56 శాతం భూభాగం అప్పగిస్తున్నట్లు ప్రకటింపజేశాయి.
ఈ తీర్మానంపై ఆగ్రహించిన అరబ్బు దేశాలు 1948-49లో ఇజ్రాయెల్ అనబడే ఆక్రమణదారుని పై యుద్ధం ప్రకటించాయి. కానీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అండ ఉన్న ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయాయి. 1956 సూయజ్ కెనాల్ సంక్షోభంలో ఈజిప్టు, సిరియా నేతృత్వంలో అరబ్ దేశాలు మరోసారి ఇజ్రాయెల్ ను తరిమేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాయి.
1967 లో మళ్ళీ అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య 6 రోజుల యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఆరంభంలో అరబ్ దేశాలు పై చేయి సాధించాయి. కానీ అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఆధునిక ఆయుధాలు సరఫరా చేయటంతో చివరికి ఇజ్రాయెల్ దే పై చేయి అయింది. ఈ విజయంతో ఇజ్రాయెల్ సిరియా నుండి గోలన్ హైట్స్, ఈజిప్టు నుండి సినాయ్, జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్ లను ఆక్రమించుకుంది.
ఆ తర్వాత అరబ్ దేశాల నేతలను, ప్రభుత్వాలను కుట్రలు, కుతంత్రాలతో, ఆర్ధిక ప్రతిష్టంభన బెదిరింపులతో లొంగదీసుకుని తమ కీలు బొమ్మ ప్రభుత్వాలను అమెరికా, ఐరోపాలు నిలబెట్టుకున్నాయి. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుని, చమురు సరఫరాకు అంగీకరించిన ఈజిప్టుకు సినాయ్ ని అప్పగించింది ఇజ్రాయెల్. జోర్డాన్ రాజు సైతం ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుని వెస్ట్ బ్యాంక్ ని శాశ్వతంగా ఇజ్రాయెల్ కి అప్పగించేశాడు. అప్పటి నుండి గోలన్ హైట్స్ (సిరియా), వెస్ట్ బ్యాంక్ మరియు తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్ (పాలస్తీనా) లు ఇజ్రాయెల్ వలస ఆధీనంలో ఉన్నాయి.
1967 యుద్ధం ముగిసిన మరునాడే ఐరాస ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలను ఆక్రమించటాన్ని ఖండించింది. 1967 యుద్ధం ముందునాటి సరిహద్దుల ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, తూర్పు జెరూసలేం లను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని, ఈ ప్రాంతాలతో పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. 1948 తీర్మానాన్ని ఉత్సాహంగా అమలు చేసిన అమెరికా, ఐరోపాలు 1967 తీర్మానం అమలు చేసేందుకు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. మాటల్లో మాత్రం 1967 తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని, సదరు తీర్మానం ప్రకారం Two State Solution (రెండు రాజ్యాల పరిష్కారం – పక్క పక్కనే ఇజ్రాయెల్, పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు) మాత్రమే సరైన పరిష్కారం అంటూ దొంగ కబుర్లు చెబుతూ ఆచరణలో ఒక్క అడుగు కూడా వేయకుండా కాలం గడుపుతూ వచ్చాయి.
అమెరికా, పశ్చిమ ఐరోపాల నిష్క్రియాపరత్వానికి కారణం అవి ఇజ్రాయెల్ కి సంపూర్ణ మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకోవటమే. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ద్వారా పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక మరియు ఎత్తుగడల ప్రయోజనాలు రెండింటినీ నెరవేర్చుకుంటుంది. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ పాల్పడే ప్రతి ఒక్క దారుణ కృత్యానికి అమెరికా ఎలాంటి తడబాటు లేకుండా మద్దతు ఇస్తుంది.






అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ లాబీ -AIPAC (అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ) ఇతర లాబీలలో కెల్లా అత్యంత శక్తివంతమైన లాబీ. ఇతర లాబీలు అంటే ప్రపంచం లోని ప్రధాన దేశాలు అమెరికా కాంగ్రెస్, సెనేట్ లలో తమ ప్రయోజనాల కోసం కొంతమంది సభ్యులను మేపుతూ ఉంటారు. ఇండియా, పాకిస్తాన్ లు కూడా చిన్న చిన్న లాబీలను మేపుతూ ఉంటాయి.
సూపర్ రిచ్ యూదుల చేతుల్లో భారీ కార్పొరేట్ కంపెనీలు, మీడియా సంస్థలు, వాల్ స్ట్రీట్ కంపెనీలు, మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కంపెనీలు ఉన్నాయి. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి, రాష్ట్రాల గవర్నర్ పదవులకీ పోటీ చేసే వాళ్ళు ఈ ఇజ్రాయెల్ లాబీని మంచి చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అమెరికా విదేశీ విధానాలను ఇజ్రాయెల్ లాబీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ కారణాల వల్ల ఇజ్రాయెల్ ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా కూడా చెబుతుంటారు.
ఇజ్రాయెల్ ఎలాంటి కారణం లేకుండా గాజా పైన లెక్కలేనన్ని సార్లు దాడులు చేసి ప్రభుత్వ భవనాలను, పౌరుల ఇళ్లను, పౌరులు నివసించే అపార్ట్మెంట్లను, ఆసుపత్రులను బాంబుదాడులతో సర్వనాశనం చేసింది. వాటిని తిరిగి నిర్మించుకోకుండా గాజా లోకి సిమెంటు, ఇటుక లాంటి నిర్మాణ సామాగ్రి రవాణా కాకుండా గాజా చుట్టూ భారీ ఎత్తున గోడ, కంచె నిర్మించింది. దానితో గాజా ప్రజలు ఎన్నుకున్న హమాస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ సొరంగాలు తవ్వుకుని వాటి ద్వారా ఆర్ధిక కార్యకలాపాలు అభివృద్ధి చేసుకుంది. ఈ సొరంగాలను కూల్చటానికి ఇజ్రాయెల్ అనేకసార్లు ప్రయత్నించి విఫలం అయింది కూడాను.
గాజాలోని పాలస్తీనా అరబ్బులు ఇన్ని కష్టాలు పడుతున్నా, వారిని ఆదుకోవలసిన అరబ్బు రాజ్యాలు (ఈజిప్టు, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్ మొ.న దేశాలు), అమెరికాతో కుమ్మక్కై ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందాలు చేసుకుని గాజా, వెస్ట్ బ్యాంక్ (ఐరాస గుర్తించిన పాలస్తీనా భూభాగాలు) లను వాటి మానాన వాటిని వదిలేశాయి. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పి.ఎల్.ఓ) నాయకుడు యాసర్ అరాఫత్ ను ఇజ్రాయెల్ వేగులు విషప్రయోగంతో చంపేశాక పి.ఎల్.ఓ నాయకత్వాన్ని స్వీకరించిన మహమ్మద్ అబ్బాస్ కూడా ఇజ్రాయెల్ తో కుమ్మక్కయ్యాడు. ఫలితంగా హమాస్ గాజా ఎన్నికల్లో విజయం సాధించి, వెస్ట్ బ్యాంక్ లో బలమైన శక్తిగా అవతరించింది.
పశ్చిమాసియాలో ముస్లిం దేశాలలో ఇరాన్ ఒక్కటే గాజా ప్రజలకు అండగా నిలబడింది. టర్కీ గోడ మీద పిల్లి వాటం అనుసరిస్తుంది. ఓ పక్క పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు ఇస్తూనే ఇజ్రాయెల్ కు గ్యాస్ సరఫరా చేస్తుంది. అరబ్బు రాజ్యాల్లో సిరియా, లెబనాన్, ఇరాక్, గత పదేళ్లుగా యెమెన్ లు గాజాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్ నేతృత్వంలో లెబనాన్ (హిజ్బొల్లా), ఇరాక్ (పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్), యెమెన్ (అన్సర్అల్లా అలియాస్ హుతీ) లు ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రభుత్వాన్ని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తూ గాజా ప్రజలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ కారణం చేత ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్, గాజా లు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ (ప్రతిఘటనా అక్షం) గా పేరు పొందాయి.
అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల మద్దతు ఉండటం వలన అంతర్జాతీయ సంస్థలు ఐరాస, భద్రతా సమితి, ఐసిసి (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్), ఐసిజె (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) లు ఇంతవరకు ఇజ్రాయెల్ ను తాకనైనా తాకలేకపోయాయి.
అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సాగిస్తున్న పైశాచిక, అమానుష, మానవత్వ వ్యతిరేక దారుణ సామూహిక హత్యాకాండ ఇజ్రాయెల్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాలు కళ్ళారా చూసి నివ్వెర పోయాయి. ఒక పదేళ్ళ క్రితం వరకు పశ్చిమ కార్పొరేట్ కంపెనీలు ఏమి రాస్తే అదే నిజంగా చెలామణి అయ్యేది. ఇప్పుడు పరిస్ధితి మారింది. సోషల్ మీడియా తో పాటు, అనేక మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు సొంతగా న్యూస్ పోర్టల్ లను స్థాపించి నిజాలను ప్రపంచ ప్రజలకు తెలియజేయజేస్తున్నాయి. వారిలో అత్యధికులు అమెరికన్లే కావటం గమనార్హం.
గతంలో సిఐఏ అమెరికా ఇంటలిజెన్స్ సంస్థల్లో, అమెరికన్ మిలట్రీలో, అమెరికన్ బ్యూరోక్రసీలో అత్యున్నత పదవులు నిర్వహించిన నాయకులు కూడా ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానెల్స్ లో కనిపించి అమెరికా, ఇజ్రాయెల్ ల నిజ స్వరూపాలను బట్టబయలు చేస్తున్నారు. అనేక ఇండిపెండెంట్ వార్తల వెబ్ సైట్లలో అమెరికా, పశ్చిమ ఐరోపా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్య రాజకీయాల గురించి, కుట్రల గురించీ, యుద్ధోన్మాదం గురించీ నిజాలు వెల్లడి చేస్తూ ఆర్టికల్స్ రాస్తున్నారు.
ఈ నేపధ్యంలో గాజా లోనూ, ఆ తర్వాత దక్షిణ లెబనాన్ లోనూ ఇజ్రాయెల్ సాగించిన దారుణ సామూహిక హత్యాకాండల వార్తలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. ప్రపంచ దేశాలు అనేకం, ఇజ్రాయెల్ ను ఛీ కొడుతున్నాయి. గాజా ప్రజలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఉదాహరణకి కొద్ది రోజుల క్రితం 15 మంది సభ్యుల భద్రతా సమితిలో గాజాలో కాల్పుల విరమణ పాటించాలని తీర్మానం ప్రతిపాదిస్తే తీర్మానికి అనుకూలంగా 14 సభ్య దేశాలు ఓటు వేయగా అమెరికా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేసింది. 14 దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు ఇజ్రాయెల్ దారుణాలను, గాజా ప్రజల దయనీయ స్థితిని వివరిస్తూ ఐరాస, భద్రతా సమితి ల క్రియా రాహిత్యాన్ని తూర్పారపట్టాయి. 14 దేశాల సభ్యుల ప్రసంగాలను యూట్యూబ్ లో వివిధ చానెళ్లు రికార్డు చేసి ప్రసారం చేశాయి. పాఠకులు ఈ వీడియోలను సబ్ టైటిల్స్ సహాయంతో వీక్షించి నట్లయితే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.
గాజాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 43,000 మందిని ఇజ్రాయెల్ బాంబు దాడులతో, యుద్ధ ట్యాంకు దాడులతో, మిసైళ్ళ దాడులతో చంపేసింది. గాజాలో సమస్త భవనాలను, ప్రభుత్వ-ప్రైవేటు అన్న తేడా లేకుండా, ఆసుపత్రులతో సహా అన్నింటినీ ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ఈ భవనాల శిధిలాల క్రింద ఎంతమంది చనిపోయి ఉన్నారో లెక్క తెలియదు. అధికారిక లెక్కలోని 43,000 లో సగం మందికి పైగా స్త్రీలు, పిల్లలే. పౌరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ ఇజ్రాయెల్ చంపేసింది. ఇజ్రాయెల్ మంత్రులు గాజా ప్రజలను జంతువులుగానూ, అనాగరికులుగానూ, బ్రతకటానికి అర్హత లేనివారు గానూ ప్రకటించి, గాజా ప్రజలను ఎంతమందిని చంపితే అంతమందిని చంపాలని ఇజ్రాయెల్ సైనికులను ప్రోత్సహించి మరీ మారణకాండను జరిపించారు.
ఈ ప్రోత్సాహం ఇజ్రాయెల్ సైనికులకు ఎంతగా తలకు ఎక్కిందో, గాజాలో హమాస్ తో యుద్ధం తర్వాత దక్షిణ లెబనాన్ లో ప్రవేశించి హిజ్బొల్లాతో యుద్ధంలో చనిపోయిన ఒక యూదు (ఇజ్రాయెల్) సైనికుడి మరణానంతరం నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ అతని సహచర సైనికులు చెప్పిన మాటలు వింటే అర్ధం అవుతుంది. “గాజా మహిళలపైన, పిల్లల పైన, నీ కంటబడ్డ ప్రతి దాని పైనా, ఎంత తీవ్రంగా వీలయితే అంత తీవ్రంగా ప్రతీకారం తీర్చుకునేందుకు గాజాలో ప్రవేశించావు. మమ్మల్ని ప్రోత్సహించటానికి గాజాలో సరదాగా ఒక ఇంటిపై దాడి చేసి అనుమతి లేకుండానే నిలువునా కూల్చేశావు” అని స్మరించుకున్నాడు. మరో సైనికుడు మాట్లాడుతూ గద్గద స్వరంతో “ఈ లోకానికి దేవుడా, మాకు ప్రతీకారం కావాలి. ఈ రోజున సిమ్చాట్ (Simchat) తోరాకు సంవత్సరం తర్వాత శత్రువును ఊచకోత కోస్తామని, ప్రతి ఒక్కరినీ హత్యాకాండలో బలి చేస్తామని, దేశం నుండి తరిమేస్తామని వాగ్దానం చేస్తూ నీ అంత్యక్రియల దగ్గర నిలబడి నిన్ను సమాధి చేస్తున్నాము” అంటూ స్మరించుకున్నాడు. (వీడియో చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయగలరు).
ఇలాంటి ఇజ్రాయెల్ పైన సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. ఇజ్రాయెల్ జీనోసైడ్ కు పాల్పడుతున్నదని, యుద్ధ నేరాలకు పాల్పడుతున్నదని, జెనీవా ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పౌరులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తున్నాడని ఈ నేరాలకు గాను ఐసిసి, ఇజ్రాయెల్ నేతలను శిక్షించాలను తన అప్పీలులో కోరింది. తన ఆరోపణలకు మద్దతుగా అనేక పత్రాలను ఐసిసి కి సమర్పించింది.
అంతవరకు ఇజ్రాయెల్ ను తప్పు పట్టని వాళ్ళు, ఇజ్రాయెల్ మారణకాండకు హమాస్ దాడే ప్రధాన కారణమని నమ్ముతున్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా, ఐసిసి కి సమర్పించిన పత్రాలను చదివి నివ్వెరపోయారు. “సందేహం లేదు, ఇది అత్యంత ఘోరమైన జాతి హత్యాకాండ” అని వాళ్ళు అనకుండా ఉండలేకపోయారు.
నిజానికి రెండు నెలల క్రితమే ఐసిసి తీర్పు ఇవ్వాల్సి ఉండగా అమెరికా పశ్చిమ దేశాల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురు కావడంతో ఐసిసి తీర్పు ప్రకటించలేకపోయింది. ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ నేరాలు కొనసాగుతూ పోవడంతో ఐసిసి తన తీర్పు ప్రకటించింది. తీర్పులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యెవ్ గాలంట్ లు యుద్ధ నేరాలకు (war crimes), మానవతా వ్యతిరేక నేరాలకు (crimes against humanity) తగిన సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 7 నాటి దాడికి బాధ్యుల్ని చేస్తూ అప్పటికే చనిపోయిన హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయే, ప్రతిఘటన నేత యాహ్యా సినావర్ ల పైన కూడా అరెస్ట్ వారంట్ జారీ చేసింది. వారు చనిపోవటంతో ఆ తర్వాత వారిపైన వారంట్లను ఉపసంహరించుకుంది.
———-22/11/2024 21:37