
అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్-అవీవ్ లోని పలు మిలటరీ స్థావరాల పైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసి నాశనం చేసింది.
ఇరాక్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇజ్రాయెల్ మళ్ళీ ప్రకటించింది. ఇరాన్ నేతలను, ఇరాన్ మిత్ర సంస్థలైన హమాస్, హిజ్బొల్లా అత్యున్నత నాయకులను ఇజ్రాయెల్ చంపినా సరే ఇరాన్ స్పందించకుండా గమ్మున ఉండాలని ఇజ్రాయెల్ ఈ ప్రకటన ద్వారా హుంకరించింది.
అయితే ఇరాన్ గమ్మున ఊరుకోలేదు. వరస పెట్టి మధ్య ప్రాచ్యం లోని వివిధ గల్ఫ్ దేశాల అరబ్ నేతలతో సమావేశాలు జరిపింది. సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల నేతలతో సమావేశమై చర్చలు జరిపింది. ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ ఇరాన్ పైన మిసైల్ దాడులు చేయాలంటే సదరు మిసైళ్లు గల్ఫ్ రాజ్యాల గగనతలం గుండానే ప్రయాణించాలి. ఈ సంగతిని గుర్తు చేస్తూ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు గల్ఫ్ దేశాల గగనతలాన్ని వినియోగించేందుకు ఆ దేశాలు అనుమతి ఇచ్చినట్లయితే అది ఇరాన్ పైన గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం ప్రకటించినట్లే అవుతుందని సున్నితంగా హెచ్చరించింది.
మిడిల్ ఈస్ట్ పరిణామాలు అంతటితో ఆగలేదు. మరో పక్క రష్యా కూడా రంగం లోకి దిగింది. త్వరలో రష్యాలోని కాజన్ నగరంలో జరగనున్న బ్రిక్స్ కూటమి సమావేశాల సందర్భంగా రష్యా-ఇరాన్ లు చర్చలు జరపాలని నిశ్చయించాయి. ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య సమగ్ర భద్రతా ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందం జరిగితే ఇరాన్ పైన ఏ దేశం దాడి జరిపినా అది రష్యా పైన కూడా దాడి జరిపినట్లుగా భావించి రష్యా కూడా ఇరాన్ తరపున యుద్ధం లోకి ప్రవేశిస్తుంది.
అక్టోబర్ 20 తేదీన జరగనున్న బ్రిక్స్ సమావేశాలలో రష్యా, ఇరాన్ లు ద్వైపాక్షిక సమావేశాలు జరపవలసి ఉన్నది. ఈ లోగానే ఇజ్రాయెల్ ఒకసారి ఇరాన్ పైన దాడి చేసి హమాస్ నేత హనీయే ను హత్య చేసింది. మరోసారి లెబనాన్ పైన దాడి చేసి హసన్ నాసరల్లా, మరో 7 గురు కమాండర్లను చంపేసింది. గాజా పైన జరిపిన దాడుల్లో పలువురు హమాస్ కమాండర్లను చంపేసింది. [ఇరాన్-సిరియా-ఇరాక్-హమాస్-హిజ్బొల్లా-యెమెన్ దేశాలు మధ్య ప్రాచ్యంలో ఒక కూటమిగా (యాక్సిక్ ఆఫ్ రెసిస్టెన్స్) ఏర్పడి ఇజ్రాయెల్, అమెరికాల దుర్మార్గాలను ప్రతిఘటిస్తున్నాయి.] దానితో రష్యా, ఇరాన్ లు తమ చర్చలను ముందు తేదీకి జరుపుకున్నాయి.
అక్టోబర్ 11 తేదీ శుక్రవారం నాడే తుర్కుమెనిస్థాన్ రాజధాని అష్గబత్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్, ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లు సమావేశం అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపధ్యంలో ఇరాన్ ఇప్పటికే రష్యాకు వేల కొద్దీ డ్రోన్ లు సరఫరా చేసింది. అలాగే డ్రోన్ టెక్నాలజీని రష్యాకు అందజేసి రష్యాయే స్వయంగా సదరు డ్రోన్ లు తయారు చేసుకునేందుకు సాయ పడింది. కాగా రష్యా కూడా ఇంరాన్ కు అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ గా పరిగణించబడుతున్న ఎస్-400 వ్యవస్థలను ఇరాన్ కు సరఫరా చేసింది. (వీటిని ఇండియా కూడా, అమెరికా అభ్యంతరాల మధ్య, కొనుగోలు చేసింది.)
సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ పైన పలు ఆరోపణలు చేశాడు. గాజా, లెబనాన్ లలో బాంబులు, మిసైళ్ళు, డ్రోన్ లతో దాడులు చేసి పదుల వేల మంది పౌరులను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేస్తున్నదని ఆరోపించాడు. గాజాలో 42,000 మంది కి పైగా పౌరులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ చెబుతుండగా, మానవ హక్కుల సంస్థలు ఈ సంఖ్య 1,86,000 వరకు ఉంటుందని అంచనా వేశాయి. ద్వైపాక్షిక సమావేశంలో పరస్పర సంబంధాలతో పాటు మధ్య ప్రాచ్యం పరిస్ధితిని కూడా చర్చిస్తామని రష్యా తెలియజేసింది.

ISRAEL CABINET MEET
ఇరాన్-రష్యా సమావేశం నేపధ్యంలో మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుటిన్ తో ఫోన్ లో మాట్లాడేందుకు అనేక సార్లు ప్రయత్నించాడు. అయితే నెతన్యాహుతో సంభాషణ జరిపేందుకు పుటిన్ నిరాకరించాడు. ఇజ్రాయెల్ ప్రధాని అనేక మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అవేవీ ఫలించలేదు. దానితో ఇరాన్ పై దాడి చేస్తే రష్యా నుండి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఇజ్రాయెల్ కు అర్ధం అయింది. ఫలితంగా ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రష్యా రంగ ప్రవేశం చేయటంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ వెనకడుకు వేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇజ్రాయెల్ దాడి చేసినా చేయకపోయినా ముందస్తు దాడి చేసేందుకు ఇరాన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది (టైమ్స్ ఆఫ్ ఇండియా, అక్టోబర్ 12, 2024). ఇరాన్ విదేశీ మంత్రి వివిధ ప్రపంచ దేశాలకు లేఖలు రాస్తూ ఇజ్రాయెల్ దాష్టీకాన్ని, ఇజ్రాయెల్ దుర్మార్గాల పట్ల ఆయా దేశాలు మౌనం పాటించటాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. జియోనిస్టు ఇజ్రాయెల్ గాజా, లెబనాన్ లపై నిరంతరాయం దాడి చేస్తూ వేల మంది పౌరులను బలిగొంటున్నదని ఎత్తి చూపాడు. వేలాది మంది గాయపడుతున్నారని, గాయపడిన వారు వైద్యం పొందకుండా ఆసుపత్రుల పైన కూడా దాడి చేస్తున్నదని, అంతర్జాతీయ వైద్య సహాయం, ఆహార సహాయం తెస్తున్న ట్రక్కులను కూడా బాంబు దాడులతో నాశనం చేస్తున్నదని ఎరుకపరిచాడు.
అంతర్జాతీయ ఎయిడ్ వర్కర్లను, డాక్టర్లను చంపుతున్నదని చెప్పాడు. లక్షలాది గృహాలను, ప్రభుత్వ నిర్మాణాలను, పాలనా వ్యవస్థ నిర్మాణాలను నేలమట్టం చేసిందని తెలిపాడు. ఇజ్రాయెల్ చర్యలు ప్రాంతీయ భద్రత, శాంతిలతో పాటు అంతర్జాతీయ శాంతి, భద్రతలకు కూడా తీవ్ర విఘాతం అని వివరించాడు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు, మానవత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడుతూ సామూహిక మానవ హత్యాకాండ (జీనోసైడ్) కు పాల్పడుతున్నదని తెలిపాడు.
ఇజ్రాయెల్ కు తాను చేస్తున్న నేరాలకు శిక్ష ఎదుర్కొకుండా అపరిమితమైన రక్షణను అంతర్జాతీయ సమాజం ఇస్తున్నదని తన లేఖలో సయ్యద్ అబ్బాస్ ఆరాఘ్చి ఆరోపించాడు. ఫలితంగా, ఇజ్రాయెల్ తన దురాక్రమణ దాడులను, హంతక దుర్మార్గాలను కొనసాగిస్తూ పోతున్నదని, ముఖ్యంగా లెబనాన్ కు వ్యతిరేకంగా పౌర నివాసాలపై విస్తృతంగా వైమానిక దాడులు నిర్వహిస్తున్నదని వివరించాడు. అమెరికా తయారు చేసిన బంకర్ విచ్ఛేద బాంబులను వినియోగించిందని ఎత్తి చూపాడు. ఐరాస భద్రతా సమితి తన విధి నిర్వహణలో విఫలం కావటంతో యుద్ధ-ఆకలితో దహించుకుపోతున్న ప్రాంతీయ శక్తులు (ఇజ్రాయెల్) మరింత ధైర్యంతో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించాడు.
మరో పక్క ఇజ్రాయెల్ కు నేరుగా ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ పై దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతి దాడిని తమ రక్షణ కోసం చేయాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఎలాంటి దాడినైనా తిప్పి కొట్టేందుకు ఇరాన్ పూర్తి సిద్ధంగా ఉన్నదని ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చి స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ పై మిసైల్ దాడి జరిపినప్పుడు కూడా తాము నిగ్రహం కోల్పోకుండా కేవలం మిలటరీ టార్గెట్ ల పైనే కేంద్రీకరించాము తప్ప పౌరుల ఆవాసాల జోలికి పోలేదని గుర్తు చేశాడు. తద్వారా అమెరికా, ఇరాన్ కు ప్రైవేటుగా హామీ ఇచ్చిన ప్రకారం గాజా లో కాల్పుల విరమణ జరుగుతుందని ఆశించామని తెలిపాడు. అందుకు బదులు కాల్పుల విరమణ జరగకపోగా లెబనాన్ పై దాడులు చేసి మరిన్ని వేలమందిని ఇజ్రాయెల్ చంపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాజా, లెబనాన్ లలో ఇజ్రాయెల్ దాడుల వలన ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశాడు.
కాగా రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. ఇరాన్ పై దాడి చేసే సాహసానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. ఇరాన్ పై ఎలాంటి దాడి చేయాలో నిర్ణయించేందుకు అక్టోబర్ 10 తేదీన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశం జరిపినప్పటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. భారీ దాడికి సిద్ధంగా ఉండమని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించినప్పటికీ నిర్ణయం మాత్రం ఇంకా పెండింగ్ లో ఉండిపోయింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అమెరికా పర్యటనకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. అమెరికాతో చర్చించి ఇరు దేశాల కో-ఆర్డినేషన్ తో దాడి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ నేపధ్యంలో లావరోవ్ హెచ్చరిక వెలువడింది. ఇరాన్ అణు కేంద్రాల పైనా, పారిశ్రామిక కేంద్రాల పైనా, చమురు కేంద్రాలపైనా దాడి చేస్తే సహించేది లేదని లావరోవ్ హెచ్చరించాడు. ఈ ప్రకటనతో రష్యా, ఇరాన్, చైనా ల మధ్య రక్షణ, భద్రతా రంగంలో సహకారం, స్నేహం, కో-ఆర్డినేషన్ పెంపొందుతున్నదని భావించవలసి వస్తున్నది. ఇరాన్ త్వరలో అణు బాంబు అభివృద్ధి చేయనున్నదని అదే జరిగితే ఇజ్రాయెల్ ఉనికికే సమస్య ఏర్పడుతుందని ఇజ్రాయెల్ చెబుతున్నది.
కానీ ఇజ్రాయెల్ ఇప్పటికే ఫ్రాన్స్ సహాయంతో అణు బాంబులు తయారు చేసుకుంది. ఇజ్రాయెల్ వద్ద 200 నుండి 600 వరకు అణు బాంబులు ఉండవచ్చని వివిధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ అణు కేంద్రాల తనిఖీకి పురమాయించిన ఫలితంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు గురైన సంగతి బహిరంగ రహస్యం. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్, సి.ఐ.ఏ లోని ఒక సెక్షన్ ఈ హత్యకు పధకం వేశారని తర్వాత కాలంలో వెల్లడి అయింది. తాను అణు బాంబులను గుట్టలుగా పేర్చుకుని ఇరాన్ కు మాత్రం ఆ హక్కు లేదని జాత్యహంకార ఇజ్రాయెల్ అహంకరించటం నాగరిక సమాజం అనుమతించరానిది.
ఈ సంగతి ప్రస్తావిస్తూ లావరోవ్ “ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయటాన్ని అనుమతించబోము. ఇరాన్ అణు కేంద్రాలను ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఏ.ఇ.ఏ) నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ఇరాన్ తన అణు పరిజ్ఞానాన్ని బాంబు తయారీకి తరలించినట్లుగా ఐ.ఏ.ఇ.ఏ ఇంతవరకు అనుమానించలేదు. అలాంటిది ఇజ్రాయెల్, ఇరాన్ పైన ఎలా ఆధారం లేని ఆరోపణలు చేస్తుంది?” అని ప్రశ్నించాడు.
అక్టోబర్ 1 తేదీన ఇరాన్, ఇజ్రాయెల్ పైన “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ II” పేరుతో డ్రోన్ లు మరియు, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ లోని మూడంచెల మిసైల్ రక్షణ వ్యవస్థలు (యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్) కొన్ని డ్రోన్ లను నిరోధించినప్పటికీ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోలేకపోయింది. ఇరాన్ ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణులు ఇరాన్ కు చెందిన వైమానిక, మిలటరీ స్థావరాలను విజయవంతంగా ఛేదించాయి. దానితో ఇజ్రాయెల్ వద్ద అత్యాధునికమైన, దుర్భేధ్యమైన మిసైల్ రక్షణ వ్యవస్థలు ఉన్నాయంటూ ఇంతకాలం ప్రపంచ దేశాలు నమ్ముతుండగా, ఆ నమ్మకం కాస్తా వమ్మయింది. ఐరన్ డోమ్ వ్యవస్థలను అమ్మకానికి పెట్టాలన్న ఇజ్రాయెల్ వాణిజ్య పధకాలకు కూడా గండి పడింది.
మరో వైపు టర్కీ కూడా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్ కు తన యుద్ధ నౌకలను పంపించింది. ఇజ్రాయెల్ ను “జియోనిస్టు టెర్రరిస్టు సంస్థ” గా టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయిప్ ఎర్దోగన్ అభివర్ణించాడు. గాజా, లెబనాన్ లపై దాడులను ఖండించాడు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నందుకు అమెరికాను విమర్శించాడు. (టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, అక్టోబర్ 10). టర్కీ లోని ఇన్సిర్లిక్ ప్రాంతంలో అతి పెద్ద మిలట్రీ స్థావరం అమెరికా నెలకొల్పిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. కతార్, బహ్రయిన్ లలో కూడా అమెరికా మిలట్రీ స్థావరాలు ఉన్నాయి.
ఇరాన్ కు మద్దతుగా రావటం అంటే రష్యా, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు మద్దతుగా రావటమే. ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యాన్ని, జాత్యహంకారాన్ని ఇరాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ (హిజ్బొల్లా), పాలస్తీనా (హమాస్), యెమెన్ (ఆన్సర్ అల్లా) మధ్య ప్రాచ్యంలో ప్రతిఘటిస్తున్నాయి. ఇజ్రాయెల్ ను ప్రాంతీయంగా ప్రతిఘటించడం అంటే ప్రపంచ రంగంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తున్నట్లే లెక్క! ఎందుకంటే అమెరికా ఆయుధ సరఫరా లేకపోతే ఒకటి రెండు రోజులకి మించి ఇజ్రాయెల్ యుద్ధం చేయలేదు. పైగా పశ్చిమాసియాలో అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చటమే ఇజ్రాయెల్ కు అప్పగించిన కర్తవ్యం. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు మద్దతుగా రంగం లోకి దిగడం ద్వారా ఒక మైలు రాయిని రష్యా నాటింది. ఇప్పటి వరకు లోపాయకారీగా కొనసాగిన రష్యా మద్దతు రష్యా-ఇరాన్ ల మధ్య భద్రతా సహకార ఒప్పందం ద్వారా బహిరంగం అవుతుంది. ఇది బహుళ ధృవ ప్రపంచ స్థాపన వైపుగా నిర్ణయాత్మకంగా పడిన అడుగు!