తుఫాను సాయం ప్లీజ్ -ఆగ్నేయ అమెరికా!


ఆగ్నేయ అమెరికన్లు: హెలెనే తుఫాను సాయం చేయండి, ప్లీజ్!

వాషింగ్టన్: సారీ, ఇజ్రాయెలీ యుద్ధ పిపాసులకు మద్దతుగా మరిన్ని వేల మంది అమెరికా సైన్యాన్ని పంపించాలనా మీరు అడుగుతున్నది?

ఆగ్నేయ అమెరికన్లు: కాదు మహా ప్రభో! హెలెనే హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాం, కాస్త సాయం చేయమని అడుగుతున్నాం.

వాషింగ్టన్: ఒకే. మీకు పరిస్ధితి ఏమీ అర్ధం అవుతున్నట్లు లేదు. కానీ మన సైన్యం ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండలో ఒక చెయ్యి వేసేందుకు వెళ్ళే దారిలో ఉన్నారు.

————-కేటలిన్ జాన్ స్టన్, 02/10/2024

********

అమెరికా 10 ఈశాన్య రాష్ట్రాల్లో హరికేన్ ‘హెలెనే’ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు 215 కి పైగా చావులు నమోదయ్యాయి. అయితే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అద్వైజర్ లిజ్ షెర్వుడ్-ర్యాందాల్ ప్రకారం 600 మందికి పైగా చనిపోయారు (జీరో హెడ్జ్, అక్టోబర్ 1) పరిస్ధితి కుదుట పడే కొద్దీ, వాస్తవంగా ఎంతమంది చనిపోయిందీ తెలుస్తుంది. హెలెనే వలన ఏర్పడిన నష్టాన్ని పూద్చేందుకు వచ్చే పదేళ్ళలో 200 బిలియన్ డాలర్లు అవసరమని ప్రభుత్వం అంచనా.

కాగా అమెరికాలో పెను తుఫాను గురించి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పుష్కలంగా లభించే లిధియం ఖనిజ నిల్వలను తవ్వి తీసేందుకు వీలుగా బడా పెట్టుబడిదారీ కంపెనీలు ప్రభుత్వంతో కూడబలుక్కుని వాతావరణంలో మార్పులు తెచ్చే టెక్నాలజీ ద్వారా “హెలెనే హరికేన్” సంభవించేలా ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాట్లు చేశారన్నది ఈ పుకార్ల సారాంశం. పుకార్లను వైట్ హౌస్ ఖండించింది. (ద గార్డియన్, అక్టోబర్ 5)

ఒక్కో కుటుంబానికి కేవలం 750 డాలర్ల సాయం మాత్రమే అందుతుందని మరో పుకారు వ్యాపించింది. ఈ పుకారుని కూడా వైట్ హౌస్ ఖండించింది. కానీ ఎంత ఇచ్చేదీ మాత్రం చెప్పలేదు.

కానీ బైడెన్ ప్రభుత్వం ప్రస్తుతం హెలెనే బాధితులకు సాయం చెయ్యటం కంటే మధ్య ప్రాచ్యంలోని గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, ఇరాన్ దేశాలపై మిసైల్ దాడులు చేస్తూ, ప్రజా నిర్మాణాలను, ఇళ్లను నేలమట్టం చేస్తూ వేలాది మంది పౌరులను చంపేస్తూ మానవ విలయాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ కు మరిన్ని ప్రాణాంతక బాంబులు, మిసైళ్ళు, డ్రోన్ లు తరలించడం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

ఇరాన్, లెబనాన్, ఇరాక్, సిరియా దేశాలపై విధ్వంసక దాడులకు, సామూహిక మారణకాండలకు, తెగబడటం ద్వారా ఇరాన్ నుండి ప్రతిస్పందన వచ్చేటట్లు చేసి తద్వారా అమెరికాను మిడిల్-ఈస్ట్ లో మరో యుద్ధం లోకి దించేలా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ, యుద్ధ విశ్లేషకులు ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు.

వ్యాఖ్యానించండి