
మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది.
చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. కానీ డాలర్ ఆధిపత్యాన్ని కూలగొట్టడం ఏమంత తేలికైన సంగతి కాదు. ప్రపంచ మార్కెట్లలో అత్యధిక భాగం అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ఆధీనంలో ఉన్నందున ప్రపంచ వ్యాపారంలో మెజారిటీ డాలర్లలో కొనసాగుతున్నది.
అయితే చైనా మాత్రం డీ-డాలరైజేషన్ వైపు అనగా డాలర్ పెత్తనాన్ని అధిగమించే వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాలు చైనాతో జరుపుతున్న వాణిజ్యంలో వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. అంటే దాదాపు తాను వాణిజ్యం చేసే అన్ని దేశాలతో చైనా వాణిజ్య మిగులు కలిగి ఉన్నది.
అసలు చైనా వద్ద పెద్ద మొత్తంలో ఫైనాన్స్ నిల్వలు పోగు బడేందుకు ప్రధాన కారణం అమెరికాతో వాణిజ్యంలో చైనా అనేక సంవత్సరాల పాటు వాణిజ్య మిగులు కలిగి ఉండడమే. ఈ మిగులు వలన ప్రతి యేటా చైనా వద్ద 500 బిలియన్ల నుండి 1 ట్రిలియన్ డాలర్ వరకు ఫైనాన్స్ నిల్వలు వాణిజ్య మిగులుగా పేరుకుంటూ వచ్చింది. ఈ ఫైనాన్స్ నిల్వలనే వివిధ ఇన్ఫ్రా స్ట్రక్చర్ నిర్మాణాల (పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, భారీ భవనాలు మొ.వి) కోసం రుణాలుగా మంజూరు చేసి వడ్డీ ఆదాయం పొందుతోంది.
రుణాలు చెల్లించలేని చోట తాను నిర్మించిన పోర్టులను, రోడ్లను, ఎయిర్ పోర్టులను తానే లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. తద్వారా వాణిజ్య మార్గాలను తన అదుపులో ఉంచుకుంటున్నది. శ్రీలంక దక్షిణ చివర ఉన్న హంబన్ తోట పోర్టును చైనా నిర్మించింది. నిర్మాణం నిమిత్తం ఇచ్చిన రుణం శ్రీలంక తీర్చలేక పోవటంతో పోర్టును చైనాకు 99 యేళ్ళ పాటు లీజుకు ఇచ్చేసింది. దానితో హిందూ మహా సముద్రంలో అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న పోర్టు చైనా నియంత్రణ లోకి వెళ్లిపోయింది.
చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) లక్ష్యం వ్యాపార మార్గాలను (అది సముద్ర మార్గం, భూతల మార్గం, వాయు మార్గం ఏదైనా సరే) తన ఆధీనంలోకి తెచ్చుకుని నియంత్రించడమే. తద్వారా చైనా వాణిజ్యానికి అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల నుండి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నది. దానితో పాటు వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాల వాణిజ్యం పైన కూడా పూర్తిగా కాకుండా పాక్షికంగా నైనా సరే నియంత్రణ సాధిస్తున్నది.
అందుకే బిఆర్ఐ లో చేరకుండా ఉండాలని అమెరికా అనేక గ్లోబల్ సౌత్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నది. ఎంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ అమెరికా, పశ్చిమ ఐరోపాల ఏకపక్ష పెత్తందారీ ధోరణిని సహించలేని అనేక దేశాలు అనివార్యంగా రష్యా సైనిక సహాయాన్ని, చైనా ఆర్ధిక సహాయాన్ని ఆర్ధిస్తూ ఆ రెండు దేశాలకు సహకరిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి ఇంజన్ గా (గ్రోత్ ఇంజన్ గా) చైనా ఆర్ధిక వ్యవస్థయే పని చేస్తున్నది. అనగా చైనా ఆర్ధిక వ్యవస్థ వృద్ధి వలన మాత్రమే ప్రపంచ ఆర్ధిక వృద్ధి కొద్దో గొప్పో పాజిటివ్ అంకెలను నమోదు చేస్తున్నది. లేకుంటే నెగిటివ్ అంకెలనే (ఆర్ధిక వృద్ధికి బదులు ఆర్ధిక కుదింపు లేదా economic contraction ను) నమూదు చేస్తూ ఉండేది.
ఈ నేపధ్యంలోనే మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, చైనా, వియత్నాం, ఇండియా, మెక్సికో, ధాయిలాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు తరలి వెళ్ళిన అమెరికన్ మానుఫాక్చరింగ్ పరిశ్రమలు అన్నింటినీ అమెరికాకి తిరిగి రావాలని గట్టిగా కోరుతున్నాడు. అవి అమెరికాకి తిరిగి వచ్చినట్లయితే అమెరికాలోని కార్మిక చట్టాలను అనుసరించాల్సి ఉంటుంది. సదరు చట్టాల ప్రకారం యూనియన్లు అనుమతించాలి. కనీస వేతన చట్టాలను (ఇండియన్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం కంటే పదుల రెట్లు వేతనం అమెరికా ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది) అమలు చేయాలి. అలాగే కాలుష్య నివారణ ఏర్పాట్లపై ఉన్న చట్టాలను తుచ తప్పకుండా అమలు చేయాలి. కార్మిక హక్కుల చట్టాలను ఉల్లంఘించ కూడదు.
వీటన్నింటినీ అమలు చేస్తే అమెరికా కంపెనీలకు, (అమెజాన్, గూగుల్, వాల్ మార్ట్, ఐకెఇఏ, యాహూ, ఫేస్ బుక్, ఎక్స్ లేదా ట్విట్టర్, ఐబిఎం, సిస్కో మొ.న భారీ సాఫ్ట్ వేర్ కంపెనీలతో సహా) ఇప్పుడు వస్తున్న లాభాలు అమాంతం పడిపోతాయి. మూడో ప్రపంచ దేశాల్లో వస్తున్న లాభాల వల్లనే అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు, లండన్ ఫైనాన్స్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఆయుధ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదిస్తున్నాయి. ఈ లాభాలే అమెరికా ప్రపంచాధిపత్యం కోసం సహకరిస్తున్నాయి.
అందుకే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారం లోకి వస్తాడని అమెరికా డీప్ స్టేట్ కంపెనీలు, వ్యక్తులు, గ్రూపులు హడలి చస్తున్నాయి. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ పైన ఇప్పటికీ రెండు మార్లు హత్యాయత్నాలు జరిగాయి. ట్రంప్ పైన మరో పోటీదారు కమలా హ్యారిస్ ప్రీ పోల్ సర్వేలలో పై చేయి సాధిస్తున్నట్లు అమెరికన్ పత్రికలు ఒకటే ఊదరగొడుతున్నప్పటికీ, అది వాస్తవ పరిస్ధితి కాదనీ, కేవలం ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలుగ జేసి ఓటర్లను కమలా హ్యారిస్ వైపు తిప్పేందుకే పత్రికలు తప్పుడు సర్వేలు ప్రచురిస్తున్నాయని ప్రచురిస్తున్నవారితో పాటు ప్రభావశీల సెక్షన్లకు తెలిసిన విషయమే.
చైనా డీ-డాలరైజేషన్!
చెప్పొచ్చేది ఏమిటంటే డీ-డాలరైజేషన్ కు చైనా, రష్యా లతో పాటు కొద్దో గొప్పో బ్రిక్స్ దేశాల (10 సభ్య దేశాల) కూటమి కూడా ప్రయత్నిస్తుండగా, అమెరికా అంతర్గతంగా వివిధ పెత్తందారీ గ్రూపుల మధ్య నెలకొన్న వైరుధ్యాలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.
చైనా తన అంతర్జాతీయ వ్యాపారాన్ని డాలర్లకు బదులు యువాన్ లలో చేసే వైపుగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. యువాన్ కరెన్సీని రెన్ మిన్ బి (RMB) అని కూడా పిలుస్తారు. చైనా, విదేశాలతో చేసే వ్యాపారంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఇప్పుడు యువాన్ లలోనే చేస్తున్నది. అంటే చైనా అంతర్జాతీయ వ్యాపారంలో డాలర్ల చెల్లింపులు గతంలో కంటే 50 శాతం పైగా పడిపోయాయి.
అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) ప్రచురించిన డేటా ప్రకారం మే 2023 నెలలో చైనాకు అందిన విదేశీ చెల్లింపులు, మరియు చైనా చేసిన చెల్లింపులలో సగానికి పైగా యువాన్ లలోనే జరిగాయి. 2010 నాటితో పోల్చితే ఇది చాలా ఎక్కువ. 2010లో డాలర్లలో చైనా చేసిన చెల్లింపులు గానీ చైనాకు జరిగిన చెల్లింపులు గానీ మొత్తం చైనా వ్యాపారంలో 80 శాతానికి పైగానే ఉండడం విశేషం. ఈ వాటా కేవలం 13 సంవత్సరాల కాలంలో 50 శాతం కంటే తక్కువకు పడిపోవటం చిన్న విషయం కాదు.

డీ-డాలరైజేషన్ ప్రక్రియను చైనా ఒక్క వాణిజ్యానికే పరిమితం చేయలేదు. తన సేవింగ్స్ లో కూడా అత్యధిక భాగాన్ని డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలలో చేస్తున్నది. ఉదాహరణకి గత దశాబ్ద కాలంలో చైనా సెంట్రల్ బ్యాంకు (PBOC – పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా) అమెరికా జారీ చేసే ట్రెజరీ సెక్యూరిటీలను (వీటిని క్లుప్తంగా ట్రెజరీస్ అనీ, సావరిన్ డెట్ బాండ్స్ లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అనీ అంటారు) క్రమ క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నది. అమెరికా ట్రెజరీ జారీ చేసే ట్రెజరీ సెక్యూరిటీలను చైనా కొనుగోలు చేయటం అంటే చైనా, అమెరికాకు అప్పు ఇస్తున్నట్లు అర్ధం. వివిధ సార్వభౌమ ప్రభుత్వాలతో పాటు, వాల్ స్ట్రీట్ కంపెనీలు, లండన్ లేదా హాంకాంగ్ లేదా ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ) లేదా కబుటోచో (జపాన్) లలోని ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు కూడా కొనుగోలు చేస్తాయి. ట్రెజరీలను కొనుగోలు చేయటాన్ని ట్రెజరీలలో ఇన్వెస్ట్ చేయటం అని కూడా చెప్పొచ్చు.
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2014లో 1.3 ట్రిలియన్ డాలర్ల మేర అమెరికా ట్రెజరీలలో ఇన్వెస్ట్ చేసింది. కాగా ఈ మొత్తం మార్చి 2024 నాటికి 767.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. అనగా 2014తో పోల్చితే 2024 లో అమెరికన్ ట్రెజరీల్లో చైనా సెంట్రల్ బ్యాంకు పెట్టుబడులు ఏకంగా 43.27 శాతం పడిపోయాయి. ఒకప్పుడు చైనాయే అత్యధిక అప్పు అమెరికాకు ఇవ్వగా ఇప్పుడు ఆ స్థానాన్ని జపాన్ ఆక్రమించింది. 2000 సం.లో 556.3 బిలియన్ డాలర్లు ట్రెజరీల్లో ఇన్వెస్ట్ చేసిన జపాన్ ఏప్రిల్ 2024 నాటికి ఆ మొత్తాన్ని 1.1 ట్రిలియన్ డాలర్లకు పెంచేసింది.
ఓ పక్క చైనా, రష్యాలతో పాటు బ్రెజిల్, సౌదీ అరేబియాలు అమెరికన్ ట్రెజరీలలో పెట్టుబడులు తగ్గిస్తుండగా జపాన్ లాంటి దేశాలు పెంచుకుంటున్నాయి. ఫలితంగా అమెరికాకు ఋణ లభ్యతలో లేదా అమెరికన్ ట్రెజరీ అమ్మకాలలో వస్తున్న తేడా గణనీయ మొత్తంలోనే ఉంటున్నది. అంకెల్లో చూస్తే 2014 లో ఇతర దేశాల ప్రభుత్వాలు అమెరికా ట్రెజరీల్లో 33.9 శాతం (8.0 ట్రిలియన్లు) పెట్టుబడి పెట్టగా, అది ఏప్రిల్ 2024 లో 7.9 ట్రిలియన్లుగా నమోదయింది. ఇది మొత్తం అప్పులో 22.9 శాతానికి సమానం. దానర్ధం చైనా, రష్యా, బ్రిక్స్ దేశాల డీ డాలరైజేషన్ వలన అమెరికా ఋణ లభ్యతలో ప్రభుత్వాల సెంట్రల్ బ్యాంకుల వాటా తగ్గుతూ వస్తున్నది. మునుముందు పరిస్ధితి ఎలా ఉంటుందన్నది ఊహించేందుకు నిపుణులు, విశ్లేషణా సంస్థలు, రేటింగ్ కంపెనీలు అంచనా వేసేందుకు వెనకడుగు వేస్తుండటం ఒక వాస్తవం.

బ్రిటన్, లగ్జెంబర్గ్, కెనడా లాంటి దేశాలు కూడా జపాన్ వలే అమెరికా ట్రెజరీల్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. ఉదాహరణకి బ్రిటన్ ఏప్రిల్ 2014లో 172.0 బిలియన్ డాలర్ల ట్రెజరీలు కలిగి ఉండగా ఏప్రిల్ 2024 నాటికి $690.2 బిలియన్లకు పెంచేసింది. కెనడా ఇదే కాలంలో $60.7 బిలియన్ల నుండి $328.7 బిలియన్లకు పెంచుకుంది. లగ్జెంబర్గ్ $141.2 బిలియన్ల నుండి $373.5 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. యుఎస్ ట్రెజరీల్లో ఇండియా పెట్టుబడి 2011లో $58.78 బిలియన్లు ఉండగా 2024 నాటికి అది $226.95 బిలియన్లకు పెరిగింది. ఇందుకు భిన్నంగా బ్రెజిల్ పెట్టుబడి 2011లో $306.40 బిలియన్లు ఉండగా 2014 నాటికి అది $217.33 బిలియన్లకు తగ్గించుకుంది. ఇక రష్యా అయితే 2011లో $201.92 బిలియన్లు ఇన్వెస్ట్ చేయగా 2022 నాటికి దాదాపు సున్నా కు తగ్గించేసింది. 2022లో రష్యాపై అమెరికా, ఐరోపాలు ఆంక్షలు విధించిన దరిమిలా అమెరికా ట్రెజరీలలో పెట్టుబడి పెట్టే దారి కూడా రష్యాకు లేదు.
అయితే అమెరికా మిత్ర దేశాల సహకారం డాలర్ ఆధిపత్యం ఉన్నంతవరకే కొనసాగుతుంది. డాలర్ పెత్తనం కూలిపోవటమో లేదా కనీసం డాలర్ ప్రాధాన్యత తగ్గినా కూడా అమెరికా మిత్ర దేశాల సహకారం ఇప్పుడు ఉన్నంతగా ఉంటుందా లేదా అన్నది అనుమానమే. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్న సామెత తెలియని వారు ఎవరున్నారు గనక?
చైనా జిడిపిలో అమెరికాలో పెట్టే పెట్టుబడుల శాతం ఈ కారణాల రీత్యా క్రమంగా తగ్గిపోతున్నది. ఒక్క ట్రెజరీ సెక్యూరిటీలలోనే కాకుండా వివిధ అమెరికన్ ఏజన్సీలు జారీ చేసే బాండ్ల లోనూ, ఈక్విటీల లోనూ కూడా చైనా పెట్టుబడులు బాగా తగ్గిపోయాయి. చైనా 2001లో WTOలో చేరిన నాటితో పోల్చితే ఇప్పటి అమెరికా పెట్టుబడులు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. అమెరికన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే బదులు చైనా, రష్యాలు బంగారం కొనుగోళ్లను విపరీతంగా పెంచేశాయి.
డాలర్-బంగారం లింక్
ఈ సందర్భంగా ఒక సంగతి చెప్పుకోవడం అవసరం. అమెరికా 1970లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులకు దోహదం చేసిన చర్యలు రెండు చేపట్టింది. అవి, ఒకటి: బంగారానికి డాలర్ కూ ఉన్న లింక్ ని తెంచేయటం. రెండు: తన చమురు అమ్మకాలను కేవలం అమెరికన్ డాలర్లలోనే చేసేందుకు సౌదీ అరేబియాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవటం. ఈ చర్యతో అప్పటి వరకు ప్రపంచ దేశాల కరెన్సీలకు బంగారం ప్రధాన రిఫరెన్స్ గా ఉండడంతో పాటు బంగారమే అంతర్జాతీయ కరెన్సీగా చెలామణిలో ఉండేది. బంగారం-డాలర్ మధ్య లింక్ తెంచేయడంతో పాటు చమురు దేశాలన్నీ సౌదీ అరేబియాను అనుసరించడంతో డాలర్ ఆధిపత్యం అమాంతంగా పెరిగిపోయి, అమెరికన్ డాలర్ ప్రధాన అంతర్జాతీయంగా చెల్లుబాటు కావటం మొదలయింది.
ఒక కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీగా మారినట్లయితే ఆ కరెన్సీ సొంతదారు అయిన దేశం ఎన్ని కరెన్సీ నోట్లను (ప్రస్తుత ఉదాహరణలో డాలర్లను) ఎన్ని ముద్రించుకున్నా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా ఉండబోదు. ఎందుకంటే డాలర్లు ప్రపంచం మొత్తం చెల్లుబాటు అవుతాయి కనుక డాలర్ ప్రాతిపదికన ఏర్పడే ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరిస్తుంది. ఈ డాలర్ ద్రవ్యోల్బణం కాస్తా వివిధ దేశాలలో సొంత కరెన్సీల ద్రవ్యోల్బణంగా మారిపోతుంది. దానితో ప్రధానంగా మూడో ప్రపంచ దేశాలు డాలర్ల ముద్రణ వలన తమ తమ దేశాల్లో సొంత ఆర్ధిక విధానాలకు, సరుకుల ధరలకు అతీతంగా ద్రవ్యోల్బణం ఎదుర్కోవలసి వస్తుంది. కనుక డాలర్ ఆధిపత్యం అమెరికాకు అత్యంత భారీ సానుకూలత కల్పిస్తుండగా, మూడో ప్రపంచ దేశాలకు భారీ స్థాయిలో ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది.
సౌదీ అరేబియాతో ఒప్పందం వలన పెట్రో డాలర్ల మొత్తం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రో డాలర్లు అంటే పెట్రోలియం అమ్మగా వచ్చే డాలర్లు అని అర్ధం. ‘పెట్రో డాలర్‘ అని ప్రత్యేకంగా అనడం ఎందుకంటే ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థల పైన పెట్రోలియం అమ్మకాలకు చెల్లించే డాలర్లు లేదా ఇంకేదైనా కరెన్సీ ప్రతి దేశానికీ అవసరం అవుతాయి గనుక. ప్రతి దేశానికీ తప్పనిసరిగా ఇంధనం (ఎనర్జీ) కావలసిందే. ఇంధనం లేకుండా ఏ ఒక్క దేశమూ, ఏ ఒక్క మనిషీ మనుగడ కొనసాగించడం కష్టం. ప్రతి వినియోగ వస్తువుకీ ఇంధనం కావలసిందే.
విద్యుత్ ఉత్పత్తి నదీ ప్రవాహం, బొగ్గు, అణు పరిశ్రమల ద్వారా జరిగినప్పటికీ అది కొన్నింటి అవసరాలు మాత్రమే తీర్చగలవు. కానీ దైనందిన సరుకుల రవాణాకు పెట్రోలియం ఉత్పత్తులే గతి. కనుక ప్రపంచం అంతా వినియోగించే ఒక సరుకు విలువ కట్టే కరెన్సీ ఆటోమేటిక్ గా ప్రధాన కరెన్సీగా, చివరికి ప్రపంచ కరెన్సీగా అవుతుంది. ఆ విధంగా డాలర్ ఇతర సరుకులకు కూడా మారకపు కరెన్సీగా అవతరించింది. అయితే వాస్తవంగా చూస్తే అధికారికంగా బంగారమే ఇప్పటికీ అంతర్జాతీయ కరెన్సీ. ఆచరణలో మాత్రం డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా చెలామణిలో ఉన్నది.
రష్యా, చైనాలు అదే పనిగా బంగారం కొనుగోలు చేయడం వెనుక భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయని భావించవచ్చు. ఈ సంగతి గ్రహించి ఇతర దేశాలు క్రమంగా డాలర్ కి దూరం జరిగి సొంత కరెన్సీలతో పాటు తాము వాణిజ్యం చేసే దేశాల కరెన్సీలను కూడా నిల్వ చేసుకోవడం మొదలు పెడితే డాలర్ ఆధిపత్యానికి క్రమంగా చెల్లు చీటీ పలికినట్లు అవుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రాసుకున్నంత/చెప్పుకున్నంత తేలిక కాదు. డాలర్ ఆధిపత్యానికి తెర పడే రోజున అమెరికా స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే మరి!
జె పి మోర్గాన్ అధ్యయనం
అయితే డీ-డాలరైజేషన్ గురించి అమెరికా ఇప్పుడైతే ఏమీ బెంగ పడటం లేదు. అది ఎంత కష్టమో అమెరికాకి తెలుసు. అమెరికాలో ఆస్తుల రీత్యా అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు జె పి మోర్గాన్ బ్యాంకు. ఈ బ్యాంకు లోని ఆర్ధికవేత్తలు 2023 లో డీ-డాలరైజేషన్ గురించి ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. “పరిమిత డీ-డాలరైజేషన్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ డీ-డాలరైజేషన్ వేగంగా జరిగే అవకాశం మాత్రం లేదు” అని ఈ పత్రం పేర్కొంది.
అదే పత్రం “అందుకు బదులుగా పాక్షిక డీ-డాలరైజేషన్ -అలీన దేశాలు మరియు చైనా వాణిజ్య భాగస్వామ్య దేశాలలో ప్రస్తుతం డాలర్ నిర్వహిస్తున్న విధులను రెన్ మిన్ బి స్వీకరిస్తుంది- కు ఎక్కువ అవకాశం ఉన్నది. ముఖ్యంగా వ్యూహాత్మక పోటీ నేపధ్యంలో ఈ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉన్నది” అని కూడా పేర్కొన్నది.
జె పి మోర్గాన్ ఆర్ధిక వేత్తలు పేర్కొన్న మరొక అంశం ఎన్నదగ్గది. “ఈ పరిస్ధితి కాల క్రమేణా ప్రాంతీయవాదానికి దారి తీయవచ్చు. భిన్నమైన ఆర్ధిక మరియు ఫైనాన్షియల్ ప్రభావిత ప్రాంతాలు ఏర్పడి, ఆయా ప్రాంతాలలో భిన్నమైన కరెన్సీలు, బిన్నమైన మార్కెట్లు కేంద్ర పాత్ర పోషించే అవకాశం ఉన్నది.”
పై పేరాలో జెపి మోర్గాన్ కంపెనీ ఆర్ధిక వేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయమే సరిగ్గా భవిష్యత్తులో ఏర్పడనున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రతిబింబించే అవకాశం ఎక్కువగా ఉన్నదని భావించవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రభావం తగ్గిపోవటం అంటే అర్ధం అమెరికా మాట వినే దేశాలు అసలు ఉండనే ఉండవని కాదు. దాని అర్ధం అమెరికా ప్రభావిత ప్రాంతం కుచించుకుపోయి వివిధ ఆర్ధిక శక్తులు లేదా ఆర్ధిక కేంద్రాలలో అమెరికా ఒక ఆర్ధిక శక్తి లేదా ఆర్ధిక కేంద్రంగా ఉంటుందని మాత్రమే అర్ధం. అమెరికా సాధించిన ఆర్ధిక, ద్రవ్య, సాంకేతిక, పారిశ్రామిక ప్రగతి అంతా కేవలం దాని పలుకుబడి తగ్గినంత మాత్రాన అంతర్ధానం అయిపోవు.
అమెరికా శక్తి, పలుకుబడి తగ్గిపోవడం అంటే ఏమిటి? అమెరికా గతంలో ప్రపంచంలో ఏ మూలన ఉన్న దేశంలో నైనా తనకు అవసరమైన ముడి సరుకులు (ముడి ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు మొ.వి) డిమాండ్ చేసి తీసుకునేది. దానికి అతి తక్కువ ధర చెల్లించేది. అందుకు బదులుగా అక్కడి ప్రభుత్వంలోని రాజకీయ నేతలను, అధికారులను లంచాలతో కొనేసి, సదరు లంచాలను విదేశీ బ్యాంకుల్లో దాచుకునే సౌకర్యం కలిగించేది. ప్రజలు తిరుగుబాటు చేసి వారికి ప్రమాదం ఏర్పడితే వారిని క్షేమంగా అమెరికాకి తీసుకెళ్లి చట్టబద్ధమైన రక్షణ కల్పించేది. లేదా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలు సంక్షోభాలకు గురి చేసి అప్పు కోసం ఐఏంఎఫ్, వరల్డ్ బ్యాంకుల శరణు జోచ్చేలా చేసేది. ఈ సంస్థల షరతుల సాయంతో అక్కడి వనరులను చౌక బేరానికి సొంతం చేసుకునేది.
కానీ ఇప్పుడు అవే ముడి సరుకులను చైనా లాంటి దేశాలు మరింత ధర చెల్లించి, అమెరికా లాగా కఠిన షరతులకు గురి చేయకుండా చైనా కొనుగోలు చేయగలుగుతోంది. అలాగే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాల్లో తానే తిరుగుబాట్లు రెచ్చగొట్టి, తానే టెర్రరిస్టులను ప్రవేశ పెట్టి, వారి నుండి రక్షణ పేరుతో తన సైన్యాన్ని రక్షణగా పంపేది. తన సైన్యాన్ని పంపినందుకు ఛార్జీలు వసూలు చేసేది. (ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి.) ఇప్పుడు ఆఫ్రికా దేశాలలో టెర్రరిస్టులను పారద్రోలెందుకు రష్యా తన సైన్యాన్ని పంపిస్తోంది. టెర్రరిస్టులను పంపేదే అమెరికా అన్న సంగతి గ్రహించిన ఆఫ్రికా దేశాలు ఫ్రాన్స్, అమెరికా సేనలను తన్ని తగలేసి రష్యా నుండి సైనిక సహాయం తీసుకుంటున్నాయి. ఐసిస్ టెర్రరిస్టుల చేతుల్లో దాదాపు ఓటమి అంచున ఉన్న సిరియా దేశం ఇప్పుడు అత్యధిక భూభాగం నుండి ఐసిస్, ఆల్-ఖైదా టెర్రరిస్టులను తరిమి కొట్టడంలో రష్యా ఇచ్చిన సైనిక సహకారం ఏ మాత్రం తక్కువ కాదు. రష్యా సైన్యం సహకారం లేనట్లయితే సిరియా ఈ పాటికి టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళి లిబియాకు మల్లే కుక్కలు చింపిన విస్తరిలా అయి ఉండేది.
ఇండియా లాంటి దేశాలతో పాటు ధాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, మెక్సికో లాంటి దేశాలు, అప్పుడప్పుడు ఆస్ట్రేలియా కూడా అమెరికాతో ఒప్పందాలు చేసుకునే క్రమంలో ఎదురు బొదురుగా కూర్చొని (పైకి చూసేందుకైనా సరే) దాదాపు సమాన స్థాయిలో చర్చలు చేయగలుగుతున్నాయి అంటే రష్యా, చైనాల వలన అమెరికా పలుకుబడి క్షీణించడమే. ఈ పరిణామాల వలన ఇండియా లాంటి దేశాల పాలకులు తమ బేరసారాల శక్తిని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలతో పెంచుకోగలిగాయి. ఒక పదేళ్ళు వెనక్కి వెళితే, లేదా కనీసం అయిదారేళ్లు వెనక్కి వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్ధితి లేదు.
2008-09 నాటి ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఆర్ధికంగా అమెరికా, పశ్చిమ ఐరోపాలు కూలబడగా, చైనా తన ప్రభుత్వరంగ బలిమితో చెక్కు చెదరకుండా నిలబడ గలిగింది. కేవలం అమెరికాతో ఫైనాన్స్ సంబంధాలు పెట్టుకున్న మేరకు, అమెరికాపై ఆధార పడ్డ ఎగుమతుల మేరకు మాత్రమే చైనా ఆర్ధిక వ్యవస్థలో తగ్గుదల జరిగింది తప్ప చైనా మౌలిక ఆర్ధిక వ్యవస్థ సంక్షోభం వలన ఏ విధంగానూ దెబ్బ తినలేదు. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల మౌలిక ఆర్ధిక సంక్షోభం కొనసాగుతుండడంతో చైనా ఆర్ధిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల ఎదుర్కొంటున్నది. అదీ కాక చైనా మౌలికంగా పెట్టుబడిదారీ దేశం. అది పరిపక్వం అయ్యే కొద్దీ అనివార్యంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించ వృద్ధి రేటు పడిపోవటం జరుగుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి అవమానకర ఉపసంహరణ, ఇరాక్ లో స్వతంత్రంగా ఏర్పడిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ నుండి అమెరికా సైనిక స్థావరం నిత్యం దాడులను ఎదుర్కొంటుండడం, ఇజ్రాయెల్ కు గాజా (హమాస్), లెబనాన్ (హిజ్బోల్లా), యెమెన్ (ఆన్సర్అల్లా/హుతీ), సిరియాల నుండి గతంలో లేని విధంగా పెను సవాళ్ళు ఎదుర్కొనడం, సౌదీ అరేబియా చైనాకు చేసే చమురు అమ్మకాలకు డాలర్ బదులు యువాన్ లు తీసుకునేందుకు ఒప్పందం చేసుకోవటం…. ఇవన్నీ అమెరికా రాజకీయ బలిమిని కూడా బలహీనపరిచాయి. ఇరాన్ నుండి గట్టి సైనిక సవాలును అమెరికా, ఇజ్రాయెల్ లు ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిణామాలన్నీ తప్పనిసరిగా అమెరికా ఆర్ధిక సంబంధాలకు అనుబంధంగానే జరుగుతున్నాయి తప్ప స్వతంత్రంగా కాదు. రాజకీయాలకు మరొక రూపంలో కొనసాగింపు యుద్ధం కాగా ఆర్ధిక పరిణామాలకు మరొక రూపంలో కొనసాగింపు రాజకీయ పరిణామాలు. వెరసి రాజకీయ, ఆర్ధిక పరిణామాలకు యుద్ధం ఒక కొనసాగింపు మాత్రమే. ఆర్ధిక పరిణామాలను, హెచ్చు తగ్గులను రాయబార సంబంధాల ద్వారా గానీ రాజకీయాల ద్వారా గానీ పరిష్కరించుకోలేని నాడు వివిధ శిబిరాలు యుద్ధం ద్వారా పరిష్కారం చేసుకునేందుకు సిద్ధపడతాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా ఈ విధంగానే జరిగాయి. కనుక అమెరికన్ డాలర్ ఆధిపత్యం, తద్వారా తన ఆర్ధిక, సైనిక పెత్తనం కొనసాగింప చేసుకోవటానికే అమెరికా గాజా యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధంలకు బీజం వేసింది. చైనాతో ఘర్షణకు తైవాన్ వివాదాన్ని పుండును కెలికినట్లు కెలుకుతోంది.
అమెరికా తన డాలర్ ఆధిపత్యాన్ని అంత తేలికగా వదులుకోదు. అలాగని ప్రత్యర్ధి శిబిరాలు కూడా తమ ఆర్ధిక ప్రయోజనాలను అమెరికాకు లొంగి ఉండేలా అనుమటించేందుకు కూడా సిద్ధంగా లేరు. సమీప భవిష్యత్తులో లేదా మధ్య కాలిక భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ప్రపంచ దేశాల్లోని కార్మిక వర్గానికి, రైతాంగానికి, దిగువ-ఎగువ మధ్య తరగతితో పాటు మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు కూడా వినాశకరంగా మారనున్నాయి. ఆ వినాశకర పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలు, విప్లవ సంస్థలు సంసిద్ధంగా ఉండని పక్షంలో సామాన్యులు ఎదుర్కోనున్న కష్టాలను, అణ్వాయుధాలను వైరి శిబిరాలు రెండూ గుట్టలుగా పేర్చుకున్న నేపధ్యంలో, ఊహించడం కూడా సాధ్యం కాదు.