కేజ్రీవాల్ కి బెయిల్


ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది.

బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో కేవలం కోర్టులు బెయిలు మంజూరు చేసినా కూడా అదో పెద్ద విజయంగా మారినట్లు కనిపిస్తున్నది.

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండీ, బిజెపి ఆ పార్టీ పైనా, ప్రభుత్వం పైనా, ఢిల్లీ మంత్రుల పైనా వరస పెట్టి అనేక వేధింపులకు గురి చేసిన మాట వాస్తవం. యుపిఏ లేదా కాంగ్రెస్ హయాం లోనూ ఏఏపి ప్రభుత్వం పైన కొన్ని చర్యలు జరిగినప్పటికీ అవి ప్రధానంగా యుపిఏ ప్రభుత్వం ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో జరిగాయి తప్ప దాడి చేసే రీతిలో జరగలేదు.

కానీ బిజెపి నేతృత్వంలో మరీ ముఖ్యంగా నరేంద్ర మోడి, అమిత్ షా ల నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినాక ఏఏపి పైన అనేకానేక కక్ష సాధింపు చర్యలు జరిగాయి. ఒక దాడి తర్వాత మరొక దాడి అనే దశను దాటి, ఒక దాడి నుండి బైటపడే లోపు మరో దాడి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం కంటికి కునుకు లేకుండా చేస్తూ వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం నుండి ఒక్కొక్క అధికారాన్ని లాగేసుకుంటూ, నామ మాత్ర అధికారం కలిగిన రాష్ట్ర ప్రభుత్వంగా మార్చివేస్తూ వచ్చింది.

ప్రధానంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేసిన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఏఏపి ప్రభుత్వానికి అనేక ఇబ్బందుల పాలు చేశారు. ఒకరిని మించి మరొకరు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. ఐఏఎస్ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం మాట వినకుండా చేసి ఇరు పక్షాలను వైరి శిబిరాలుగా మార్చారు. ఇక ఢిల్లీ పోలీసులు ఐతే చెప్పే పనే లేదు. ఏ అవకాశం వచ్చినా ఢిల్లీ మంత్రులు, ఎం.ఎల్.ఏ లపై కేసులు పెట్టేందుకు ఉత్సాహం చూపించారు.

ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన అనేక చట్టాలను ఆమోదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ప్రభుత్వ నిర్వహణను స్తంభింప జెసేందుకు శతధా ప్రయత్నించారు. ఏఏపి ప్రభుత్వానికి పేరు తెచ్చే ఏ చర్య తీసుకున్నా, ఏ నిర్ణయం జరిగినా ఏదో వంకతో వాటిని రద్దు చేసేందుకే ఉత్సాహం చూపించారు. అందుకే ఢిల్లీ ప్రజలు మళ్ళీ మళ్ళీ ఏఏపి పార్టీకే పట్టం కడుతూ 90 శాతం పైన సీట్లు ఆ పార్టీకి అప్పజెపుతూ వచ్చారు. అయినప్పటికీ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తన పద్ధతిని సవరించుకోలేదు. చివరికి సివిల్ సర్వీసుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా సివిల్ సర్వీస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా మోకాలడ్డారు.

ఈ పరిస్ధితుల్లో ఏఏపి ప్రభుత్వం తెచ్చిన సరికొత్త లిక్కర్ విధానం బిజెపి ప్రభుత్వానికి ఒక వరంగా చిక్కినట్లయింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా లిక్కర్ విధానం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అనీ, ప్రభుత్వ నియమ నిబంధనలను అడ్డం పెట్టుకుని ప్రైవేటు పార్టీలకు పూర్తిగా కాంట్రాక్టులు కట్టపెట్టి, వారి నుండి డబ్బు వసూలు చేశారని చెబుతూ సిబిఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంతో ఢిల్లీ ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా తో మొదలుకొని, మరో మంత్రి సంజయ్ నుండి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకూ నిందితులుగా చేశారు.

మొదట ఇడి చేత విచారణ జరిపించడం కొన్ని రోజుల పాటు విచారణ చేసి చివరికి అరెస్టు చేయడం ఒక పద్ధతిగా అమలు చేశారు. ఇడి కేసులో విచారణ జరిగి, కోర్టు హియరింగ్ లు జరిగి, బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు జరిగి, చివరికి ఇడి చార్జి షీటు నమోదు చేశాక కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసే నాటికి అకస్మాత్తుగా సిబిఐ ని రంగం లోకి దింపి అదే నేరంపై, అవే ఆరోపణలతో సిబిఐ కేసు నడిపించి జైలు నుండి బైటికి రాకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయ శాఖ కుటిల చర్యలకు పాల్పడ్డారు.

స్వతంత్ర భారత చరిత్రలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై ఈ రకమైన వేధింపులకు, కేసుల నమోదుకూ, సిబిఐ-ఇడి-ఇన్కమ్ టాక్స్ లాంటి సంస్థలను ఉసి కొల్పటానికి కేంద్ర ప్రభుత్వాలు బరి తెగించిన ఉదాహరణలు లేవు. ఇందిరా గాంధీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించిన ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ విధంగా ప్రతిపక్ష రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని, ముందు కేసులు పెట్టి ఆ తర్వాత తీరిగ్గా సాక్షాలు సేకరించే పనిలో పడటం, సాక్షాలు దొరకకపోతే, తామే సాక్షాలు సృష్టించటం లాంటి వికృత చర్యలకు పాల్పడిన ఉదాహరణలు మాత్రం లేనే లేవు.

ఈ నేపధ్యంలోనే జస్టిస్ సూర్య కాంత్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన సుప్రీం బెంచి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పై కొన్ని పరుష వ్యాఖ్యలు చేసింది. ఇడి కేసులో కేజ్రీవాల్ కు బయిలు మంజూరు అయి విడుదల అవుతున్న పరిస్ధితుల్లో సిబిఐ ని రంగంలోకి దింపి అవే నేరాలపై అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించటం, కేవలం ఆయన విడుదల కాకుండా చూసేందుకే జరిగిందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

జులై 12, 2024 తేదీన ఇడి కేసులో సుప్రీం కోర్టు విధించిన షరతులనే సిబిఐ కేసులోనూ ధర్మాసనం విధించింది. అయితే జస్టిస్ భూయాన్ మాత్రం బెంచి విధించిన షరతులలో రెండు షరతులపైన తనకు తీవ్రమైన రిజర్వేషన్లు ఉన్నట్లు చెప్పటం గమనార్హం. తనకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ ‘జ్యుడీషియల్ క్రమశిక్షణ’ ను అనుసరించి తన అభిప్రాయాలను వెలిబుచ్చకుండా నిభాయించుకుంటున్నాని చెప్పాడు.

మే 10 తేదీన అప్పటి సాధారణ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ తిరిగి సరెండర్ అయ్యాడు. అనంతరం జులై 12 తేదీన ఇడి కేసులో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన విడుదలకు ఏర్పాట్లు జరుగుతుండగానే హఠాత్తుగా సి.బి.ఐ, కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఆయన విడుదల కాకుండా నిరోధించింది.

ఇడి కేసులో బెయిల్ ఇస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం 50,000 రూపాయల బెయిల్ బాండు ఇవ్వటంతో పాటు కింది షరతులు విధించింది.

  • కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గానీ, ఢిల్లీ సెక్రటేరియట్ ని గానీ సందర్శించటానికి వీలు లేదు।
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేదా క్లియరెన్స్ ను పొందవలసిన అవసరం వస్తే, తప్ప, ఆయన అధికారిక ఫైళ్ళ పైన ముఖ్య మంత్రిగా సంతకాలు చేయకూడదు.
  • ప్రస్తుత కేసులో తన పాత్ర విషయంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.
  • సాక్షులు ఎవరితోనూ ఆయన మాట్లాడ కూడదు; లేదా అధికారిక కేసు దస్త్రాలను పరిశీలించడం చేయకూడదు.

నిన్న శుక్రవారం, అనగా 13 సెప్టెంబర్ 2024 తేదీన బెయిల్ ఇస్తూ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ లతో కూడిన ద్విసభ్య బెంచి కూడా అవే షరతులు విధించింది.

  • సిబిఐ దాఖలు చేసిన కేసులో మెరిట్ ల గురించి కేజ్రీవాల్ ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయరాదు.
  • మినహాయింపు లభిస్తే తప్ప ప్రతి ట్రయల్ కోర్టు హియరింగ్ కూ హాజరు కావాలి.
  • కేసు త్వరిత గతిన ముగించేందుకు ట్రయల్ కోర్టుతో పూర్తిగా సహకరించాలి.

అయితే ముఖ్యమంత్రి బాధ్యతలలో కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి కార్యాలయానికి, సెక్రటేరియట్ కూ వెళ్లకుండా నిరోధించే షరతు పట్ల జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అనుమానాలు వ్యక్తం చేశాడు. అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ అవసరం అయ్యే అధికారిక ఫైళ్ళ పైన తప్ప మరే ఇతర అధికారక దస్త్రాల పైనా కేజ్రీవాల్ సంతకం చేయరాదని నిబంధన విధించడం పట్ల కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విభేదించాడు.

అయితే ఏఏపి సీనియర్ అధికారుల ప్రకారం సిఎం ఆఫీసు, సెక్రటేరియట్ లకు వెళ్లకుండా షరతులు విధించినా కూడా కేబినెట్ సమావేశాలను సర్క్యులర్ లను తిప్పడం ద్వారా జరపవచ్చనీ, సూచనలు చేయడం ద్వారా వివిధ ఫైళ్లను ముఖ్యమంత్రి సంతకంతో మూవ్ చేయవచ్చనీ, అంతిమంగా లెఫ్టినెంట్ గవర్నర్ కి పంపవచ్చనీ వారు చెబుతున్నారు. నిర్దిష్ట ఫైళ్ళ పైన సంతకాలు చేయకూడదని చెప్పినంత మాత్రాన కేజ్రీవాల్ అధికారాలకు గుర్తించ తగిన రీతిలో భంగం ఏమీ కలగదని వారి అభిప్రాయం.

ఢిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటరీ అయినందున భారత ఫెడరల్ హైరార్కీలో ఎన్.సి.టి కి ప్రత్యేక స్థానంలో ఉంచబడింది. ఢిల్లీ యూనియన్ టెరిటరీ (కేంద్ర పాలిత ప్రాంతం) అయినప్పటికీ ఆర్టికల్ 239AA కింద రాజ్యాంగం ఎన్.సి.టి ఆఫ్ ఢిల్లీకి సొంత అసెంబ్లీ, మంత్రుల కౌన్సిల్ ఉండవచ్చు. ఎల్.జి (లెఫ్టినెంట్ గవర్నర్), మంత్రివర్గం మధ్య ఏ అంశంలో ఐనా విభేధాలు ఉంటే ఎల్.జి సదరు అంశాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. అనగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అయితే రాష్ట్రపతి నిర్ణయం పెండింగ్ లో ఉన్నప్పటికీ నిర్దిష్ట అంశం “అత్యవసరం” మరియు “అవశ్యము” అయినట్లయితే ఎల్.జి తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఎల్.జి ఢిల్లీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటర్ కూడా అవుతాడు.

ఏ నేపధ్యంలో ఆర్టికల్ 239AA ప్రకారం పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ అనే మూడు అంశాలు తప్ప ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలలో కేజ్రీవాల్ సంతకం చేయవచ్చు. ప్రభుత్వ అధికారుల ప్రకారం సమస్త ఫైళ్ళు చివరికి ఎల్.జి క్లియరెన్స్ కోసం పంపవలసిందే.

“చెట్లు నరకడానికి అనుమతి ఇవ్వటం దగ్గర్నుండి దుకాణాలు 24*7 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వటం నుండి ప్రధాన కేబినెట్ నిర్ణయాల వరకు సమస్త అంశాలు లెఫ్టినెంట్ గవర్నర్ నుండి క్లియరెన్స్, ఆమోద ముద్ర కావాల్సి ఉంటుంది. ఈ క్లాజు వలన మార్చిలో సిఎం అరెస్టు కాక ముందు జరిగినట్లే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పని యధావిధిగా కొనసాగుతుందని మేము భావిస్తున్నాము” అని సీనియర్ పార్టీ ఒకరు చెప్పాడు (ద ఇండియన్ ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 13, 2024 22:21 IST). అయితే కేజ్రీవాల్ సుప్రీం కోర్టు షరతు మేరకు సెక్రటేరియట్ కి వెళ్లబోరు.

ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో బిజెపి కి సొంతంగా మెజారిటీ రాకపోవటం, యుపి, బీహార్ లలో సగానికి పైగా సీట్లు కోల్పోవటం, జెడి(యు), టిడిపి లాంటి పార్టీల మద్దతు పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడవలసి రావడం మరో పక్క బలం, సీట్లు పెరిగిన కాంగ్రెస్ నేతలు మునుపటి కంటే దూకుడుగా వ్యవహరిస్తుండటం… ఇత్యాధి కారణాల వలన బిజెపి ప్రభుత్వం మునుపటి వలే ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను, ఇతర రాజకీయ పార్టీల నేతలను వేధించే అవకాశం తగ్గిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎంతవరకు వాస్తవం అన్నది ఆచరణలో చూడవలసిందే.

2 thoughts on “కేజ్రీవాల్ కి బెయిల్

  1. అన్నింటికి లెప్టినెంట్ గవర్నర్ మీద ఆధారపడితే, ఇక ముఖ్య మంత్రి ఎందుకూ? మామూలు సమయంలో కంటే కక్ష సాదింపు చర్యలు ఉన్నపుడు గవర్నర్ స్వతంత్రంగా ప్రవర్తిస్తాడా? ఈ కథ ఏంటో తెలిసే ముఖ్యమంత్రి ‌ సెక్రటరీయేట్ పోకూడదు అంటే ఆయనకు బెయిల్ మంజూరు చేసి ఏమిప్రయోజనం?

వ్యాఖ్యానించండి