ఓటమి దిశలో ఉక్రెయిన్!


Mariupol city destroyed in war

ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఉక్రెయిన్ ఓటమితో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికుల పోరాట పటిమ గురించీ, రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సైన్యం చెమటలు పట్టించడం గురించీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పడంలో ఇన్నాళ్లూ మునిగి ఉన్న పశ్చిమ కార్పొరేట్ పత్రికలు మెల్లగా ఉక్రెయిన్ సైన్యం వెనక పట్టు పట్టడం గురించి వార్తలు ప్రచురిస్తున్నాయి. దానితో ఉక్రెయిన్ ఓటమి దగ్గర పడుతోందన్నదే నిజమైన వార్తగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రెండు రోజుల క్రితం సిఎన్ఎన్ ప్రచురించిన వార్తా కధనం వాస్తవ జర్నలిస్టు పరిశీలన మరియు విశ్లేషణతో కూడిన కధనంగా కనిపిస్తోంది. సాధారణంగా సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, సి.ఎన్.బి.సి, ఎం.ఎస్.ఎన్.బి.సి, బోస్టన్ గ్లోబ్ లాంటి పత్రికలు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆరంభం అయినప్పటి నుండీ వాస్తవాలను వాస్తవాలుగా నివేదించిన పాపాన పోలేదు. యుద్ధంలో ఏ పరిణామం జరిగినా దానిని రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్ కు అనుకూలంగా (తద్వారా అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాలకు అనుకూలంగా) చిత్రించడం పైనే దృష్టి కేంద్రీకరించాయి.

ఉదాహరణకి యుద్ధం ఆరంభం అయ్యాక నెల రోజుల లోపలే ఉక్రెయిన్ శాంతి చర్చలకు, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. ఒప్పందం దాదాపు ఖరారు అయింది కూడా. శాంతి చర్చలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ రాజధాని కీవ్ చుట్టుపక్కల నుండి ఉపసంహరించుకుంది. అటువంటి ప్రాంతాలలో బుచా పట్టణం ఒకటి.

అయితే అమెరికా, పశ్చిమ ఐరోపా తరపున బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన ఉక్రెయిన్ రాజధానికి వచ్చి యుద్ధం విరమించటానికి వీల్లేదని ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చాడు. కావలసినన్ని ఆయుధాలు, ధన సహాయం అందజేస్తామని, యుద్ధం విరమించటానికి వీలు లేదని ఉక్రెయిన్ ప్రభుత్వానికి నచ్చజెప్పాడు (ఆదేశాలు ఇచ్చాడు అనడమే సరైనది).

ఈ లోపు పశ్చిమ పత్రికలు బుచా పట్నంలో రష్యా సైనికులు, బుచా ప్రజలపై సామూహిక హత్యాకాండ సాగించారని, యుద్ధ నేరానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున కధనాలు ప్రచురించి ప్రచారం చేయటం ప్రారంభించాయి. రోడ్డు పొడవునా శవాలు పడి ఉన్నట్లు వీడియోలు ప్రచురించాయి. నిజానికి హత్యాకాండ జరిగిందని పశ్చిమ చెప్పిన పత్రికలు చెప్పిన రోజుకు రెండు రోజుల ముందే రష్యా సైనికులు బుచా పట్టణాన్ని ఖాళీ చేశాయి. పశ్చిమ వార్తా సంస్థలు ప్రచురించిన వీడియోలలో శవాలుగా చెప్పిన వాళ్ళలో కొందరు కెమెరా అక్కడి నుండి ముందుకు వెళ్లిపోయిందని భావించి లేచి నిలబడటం రికార్డు అయింది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసినప్పుడే ఈ సంగతి అర్ధం అయింది.

ఇది చూసుకోకుండానే వీడియోలు విడుదల చేయడంతో బుచా హత్యాకాండ అన్న కధనం ఒట్టి బూటకం అని తేలిపోయింది. ఇలాంటి ఎన్నో పశ్చిమ కధనాలు గత రెండేళ్లలో ప్రపంచం అంతా ప్రచారం అయ్యాయి. భారతీయ ఆంగ్ల పత్రికల వరకూ ఆ కధనాలు వచ్చి చివరికి ప్రాంతీయ పత్రికలను కూడా చేరాయి.

తూర్పు ఉక్రెయిన్ లోని నాలుగు రాష్ట్రాలను (లుగాన్స్క్, డోనెట్స్క్, జపోరీఝియా, ఖేర్సన్) అక్కడి ప్రజల అభీష్టం మేరకు విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే ప్రకటించే నాటికి లుగాన్స్క్ లో కొంత భాగం, డోనెట్స్క్ లో సగానికి పైగా భాగం, జపోరీఝియాలో పావు భాగం, ఖేర్సన్ లో దాదాపు 20 శాతం భూభాగం ఉక్రెయిన్ స్వాధీనంలోనే ఉన్నాయి. ఈ భాగాలను కూడా వశం చేసుకునేందుకు రష్యా, రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ గత రెండేళ్లుగా యుద్ధం చేస్తున్నాయి.

ప్రస్తుతం లుగాన్స్క్ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వచ్చేయగా డోనెట్స్క్ లో 25 శాతం వరకు మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్నది. జపోరీఝియా, ఖేర్సన్ లలో కూడా కొద్ది భాగం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్నది. కాగా డోనెట్స్క్ రాష్ట్రంలో రష్యా బలగాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ సరికొత్త పధకానికి రూపు దిద్దింది. ఉత్తరాన ఉన్న సుమీ రాష్ట్ర సరిహద్దులో రష్యా వైపున భద్రత బలహీనంగా ఉన్న సంగతి గ్రహించి ఆగస్టు 6 తేదీన రష్యాకు చెందిన కర్స్క్ రాష్ట్రం లోకి ఉక్రెయిన్ సైన్యం దూసుకెళ్లింది. రష్యా భూభాగం ఆక్రమిస్తే తమను ఎదుర్కునేందుకు రష్యా సైన్యం ఉక్రెయిన్ లోని డోనెట్స్క్ నుండి కర్స్క్ రక్షణ కోసం తరలి వస్తుందనీ, తద్వారా డోనెట్స్క్ రాష్ట్రంలో రష్యా పురోగమనాన్ని అడ్డుకోవచ్చని భావించింది.

అయితే రష్యా అధ్యక్షుడు కర్స్క్ చొరబాటును అస్సలు ఏ మాత్రం లెక్క చేయలేదు. కర్స్క్ చొరబాటు నుండి ఉక్రెయిన్ సైన్యాన్ని అడ్డుకునేందుకు పరిమిత సైన్యాన్ని పంపిస్తూనే డోనెట్స్క్ లో యుద్ధం చేస్తున్న సైన్యాన్ని మాత్రం అక్కడే ఉంచాడు. ఇప్పటికి నెల రోజులు దాటినా కర్స్క్ చొరబాటును పుతిన్ తేలికగానే తీసుకున్నాడు. పైగా “మా ప్రధాన లక్ష్యం తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలను విముక్తి చేయటమే. కర్స్క్ చొరబాటు అసలు లక్ష్యం మా దృష్టి మళ్లించడమే. ఆ ట్రాప్ లో మేము పడ దలచుకోలేదు” అని ప్రకటించడం ద్వారా కర్స్క్ చొరబాటును తిప్పి కొట్టడం తమకు లెక్కలోనిది కాదని పరోక్షంగా చాటి చెప్పాడు.

ఈ నేపధ్యంలో వెలువడిన సి.ఎన్.ఎన్ కధనం ఉక్రెయిన్ సైన్యం దీన పరిస్ధితి గురించి కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రచురించడం లోనే ఉక్రెయిన్ ను ఇక అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాలు పట్టించుకోబోవు అన్న సందేశాన్ని సి.ఎన్.ఎన్ వార్తా కధనం ద్వారా అమెరికా పశ్చిమ దేశాలు సందేశం ఇస్తున్నట్లయింది. అంటే సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్ కు ఆయుధ సహాయం అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాల నుండి ఉక్రెయిన్ కి ఆందే అవకాశాలు లేవు అని భావించవచ్చు.

సి.ఎన్.ఎన్ ప్రకారం “ఉక్రెయిన్ సైన్యం సంఖ్య బాగా తగ్గిపోయింది. అతి తక్కువ మనోబలంతో, యుద్ధరంగాన్ని విడిచి సైనికులు పారిపోతున్న పరిస్ధితిని ఉక్రెయిన్ సైన్యం ఎదుర్కొంటున్నది.” తూర్పు ఉక్రెయిన్ లో భూభాగాల్ని వేగంగా కోల్పోతున్నారని సి.ఎన్.ఎన్ తెలిపింది.

ఒక బెటాలియన్ కమాండర్ 800 మంది సైన్యాన్ని కోల్పోయి కమాండ్ చేసేందుకు సైనికులు లేక కీవ్ లో మిలట్రీ ఆఫీసు పనిలో చేరిన సంగతితో సి.ఎన్.ఎన్ తన కధనాన్ని ప్రారంభించింది. “యుద్ధరంగాన్ని వదిలి పోరిపోవటం, కమాండర్ ఆజ్ఞలను లెక్క చేయకపోవటం విస్తృతంగా జరుగుతున్నది. ముఖ్యంగా కొత్తగా రిక్రూట్ అయిన సైన్యంలో ఇది బాగా ఎక్కువగా ఉన్నది” అని ఆ కమాండర్ చెప్పాడు. “సైనికులు అందరూ తమ స్థానాల్ని వదిలి వెళ్ళటం లేదు గానీ, మెజారిటీ సైన్యం పరిస్ధితి అలాగే ఉన్న మాట వాస్తవం” అని మరో కమాండర్ చెప్పాడు. “వాళ్ళు తమకు అప్పగించిన స్థానంలో ఉండరు, యుద్ధంలోకి వెళ్ళేందుకు నిరాకరిస్తారు లేదా ఆర్మీని విడిచి వెళ్ళేందుకు మార్గాలు వెతుకుతారు” అని ఆయన చెప్పాడు.

కొత్తగా రిక్రూట్ అయిన సైనికుల్ని బలవంతంగా సైన్యంలో రిక్రూట్ చేయటంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా నుండి సహాయం అందకపోవటంతో సైన్యంలో మనోబలం దెబ్బతిన్నదని సి.ఎన్.ఎన్ అంచనా వేసింది. అయితే అమెరికా ఆయుధాలు దండిగా అందిన 2023 లో కూడా ఉక్రెయిన్ సైన్యం ప్రారంభించిన ప్రతిదాడి (కౌంటర్ అఫెన్సివ్) ఘోరంగా విఫలం అయిన సంగతిని సి.ఎన్.ఎన్ దాచి పెట్టింది. అంటే అమెరికా సాయంతో నిమిత్తం లేకుండానే ఉక్రెయిన్ సైన్యం ఎప్పుడూ రష్యాపై పై చేయి సాధించిన ఉదాహరణ లేదు.

చిన్న డ్రోన్ విమానాల సాయంతో రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్ సైన్యానికి పెద్ద సమస్య అయినట్లు తెలుస్తోంది. డ్రోన్ విమానాలు, ముఖ్యంగా ఆత్మాహుతి డ్రోన్ లు నేరుగా ట్యాంకుల్ని, సైనికుల్ని తెచ్చే మిలట్రీ వాహనాలని, చివరికి నేరుగా సైనికుల పైకి కూడా దూసుకొచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఈ డ్రోన్ లకు సమాధానం ఉక్రెయిన్ వద్ద లేదని తెలుస్తోంది. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు సమకూర్చే డిఫెన్స్ మిసైళ్ళు ఒక్కొక్కటి మిలియన్ పైగా డాలర్లు ఖరీదు చేస్తాయి. కాగా రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్ లు కేవలం 10 వేల నుండి 20 వేల లోపు డాలర్లు మాత్రమే ఖరీదు చేస్తాయి. అంత తక్కువ ఖరీదు చేసే డ్రోన్ లను తిప్పి కొట్టేందుకు మిలియన్ డాలర్ల డిఫెన్స్ మిసైళ్లను ప్రయోగించడం బొత్తిగా దండగ ఖర్చనీ, అలాగని డిఫెన్స్ ఆయుధాలు ప్రయోగించకుండా ఉండలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

యుద్ధంలో సైన్యానికి విశ్రాంతి ఇచ్చేందుకు రొటేషన్ పద్ధతిని అనుసరిస్తారు. అయితే పెద్దగా శిక్షణ లేకుండానే బలవంతగా సైనికుల రిక్రూట్ జరుగుతున్న పరిస్ధితుల్లో రొటేషన్ల మధ్య సమయం తగ్గిపోతూ వస్తున్నది. చివరికి సుశిక్షితులైన సైనికులకు రొటేషన్ పూర్తిగా అందుబాటులో లేని పరిస్ధితి వస్తున్నది. దానితో సైనికులు యుద్ధరంగం విడిచి పోవడం పెరిగిపోతున్నది. సి.ఎన్.ఎన్ ప్రకారం 2024 లో మొదటి 4 నెలల్లోనే 19,000 మంది సైనికుల పైన యుద్ధ రంగాన్ని విడిచి పెట్టినందుకు గాను క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టింది.

దానితో అనేక మంది కమాండర్లు యుద్ధ రంగాన్ని వదిలి పోతున్న సైనికుల పైన ఫిర్యాదు చేయటం తగ్గించారు. అలాగయినా పారిపోయిన వాళ్ళకు, శిక్షలు వేయబోమని నచ్చజెప్పి తిరిగి యుద్ధరంగానికి రప్పించవచ్చని వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ పరిస్ధితి ఎంత మామూలు అయిందంటే చివరికి యుద్ధరంగం వదిలిపోయే చర్యను నేరంగా పరిగణించే నిబంధనను, మొదటిసారి వరకు, రద్దు చేసేంతగా!

Ukraine and Big Powers

కర్స్క్ చొరబాటు ద్వారా రష్యా దృష్టి మరల్చడం, ఉక్రెయిన్ సైన్యంలో మనోబలాన్ని పెంచటం లక్ష్యాలుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పెట్టుకున్నాడని కానీ ఈ రెండూ నెరవేరలేదని సి.ఎన్.ఎన్ విశ్లేషించింది. ఈ నేపధ్యంలో తమను తూర్పు ఉక్రెయిన్ రక్షణ నుండి తప్పించి కర్స్క్ చొరబాటుకు ఎందుకు తరలించారని కొందరు కమాండర్లు ప్రశ్నిస్తున్నారట.

ఈ పరిస్ధితుల్లో, సి.ఎన్.ఎన్ రిపోర్టును బట్టి చూస్తే ఉక్రెయిన్ సైన్యం తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 2023లో (ఖేర్సన్) ప్రతిదాడి విఫలం కావటం, బలవంతంగా సైన్యంలోకి రిక్రూట్ చేయటం, జెలెన్ స్కీ తలపెట్టిన కర్స్క్ చొరబాటు లక్ష్యాలు రెండూ నెరవేరకపోవటం, ఫలితంగా మరిన్ని ఓటములు, మరింత మంది యుద్ధరంగం వదిలి వెళ్లిపోవటం… మొ.న కారణాలు ఉక్రెయిన్ సైన్యంలో సంక్షోభానికి తోడ్పడుతున్నాయి.

ఈ నేపధ్యంలో కర్స్క్ చొరబాటును మరింత తీవ్ర స్థాయిలో కొనసాగించటం ద్వారా రష్యాను చర్చల బల్ల వద్దకు రప్పించవచ్చని జెలెన్ స్కీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జెలెన్ స్కీ ఆమోదయోగ్యమైన, వాస్తవికంగా ఆచరించగల ప్రతిపాదనలు అన్నవి ఇంతవరకు చేయలేదు. ఆయన ప్రధాన డిమాండ్, రష్యా తూర్పు ఉక్రెయిన్ నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాలని. అది జరిగే పని కాదు. తూర్పు ఉక్రెయిన్ లోని నాలుగు రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ జరిపాయి. రష్యాలో కలవాలని అక్కడి ప్రజలే డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా రష్యన్ ప్రజలే. రష్యన్ భాష వారి మాతృ భాష. 2014 అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాల ప్రేరేపిత కుట్ర అనంతరం ఉక్రెయిన్ ఈ తూర్పు రాష్ట్రాల ప్రజలపై తీవ్ర స్థాయిలో యుద్ధం చేసింది. దాదాపు 14,000 మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ సైనిక దాడుల్లో, నయా నాజీ గ్రూపుల హింసాత్మక చర్యలలో చనిపోయారు. అలాంటి రాష్ట్రాలు తిరిగి ఉక్రెయిన్ లో కలవడం జరిగే పని కాదు.

అమెరికా ఎన్నికలు ముగిసిన అనంతరం పశ్చిమ రాజ్యాలు, రష్యాను ఎలాగైనా లొంగదీసుకోవాలన్న లక్ష్యంతో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే వైపుగా చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అమెరికా, ఐరోపాలు అతి చర్యలకు పాల్పడితే అణు బాంబు ప్రయోగాని కైనా సిద్ధమే అని పుటిన్ ఇప్పటికే ప్రకటించినందున ఉక్రెయిన్ పాలకులు వాస్తవికంగా ఆలోచించి తదుపరి చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉన్నది.

ఇండియా ప్రధాన మంత్రి ఇటీవల రష్యా, ఉక్రెయిన్ లు పర్యటించి ఇరు దేశాల నాయకులతో చర్చలు జరిపారు. యుద్ధ విరమణ ఇరు పక్షాలకు, ప్రపంచానికి శ్రేయస్కరమని తాను ఇరువురికీ చెప్పానని మోడి ప్రకటించారు. ఇరు దేశాలు వెళ్ళి వచ్చాక ప్రధాని మోడి అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి ఉక్రెయిన్-రష్యా పర్యటన వివరాలు చెప్పినట్లు ప్రకటించాడు. కానీ అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి మాత్రం భారత ప్రధాని కేవలం బంగ్లాదేశ్ పరిణామాలు గురించి మాత్రమే తమ అధ్యక్షుడితో చర్చించారని భిన్న ప్రకటన చేశారు. వీరిలో ఎవరు చెప్పింది నిజమో ఎలా తెలిసేను?

వ్యాఖ్యానించండి