అమెరికా ఎన్నికల్ని రష్యా, చైనా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయిట!


“ఆడలేక మద్దెల ఓడు” అన్నాట్ట వెనకటికొకడు! ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన ప్రాజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మాది అని ఒకటే ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి దేశాలపై దుర్మార్గమైన దాడులు చేసి ఆ దేశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు తగుదునమ్మా అంటూ “మా దేశ ఎన్నికలని ప్రభావితం చేస్తున్నాయ్ బాబోయ్” అంటూ తెగ ఏడ్చి చస్తోంది!

“అయినా…, మన బంగారం మంచిది కానప్పుడు…” అన్న సామెత తెలుగు ప్రజలకు కరతలామలకమే! (కరతలామలకం అంటే అరచేతిలో ఉండే ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత వివరంగా తెలిసిన విషయం అని అర్ధం.) డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడని భావిస్తున్న అమెరికా డీప్ స్టేట్ లోని ప్రధాన పాత్రధారులు, ట్రంప్ గెలిచాక ఏమేమి ఆరోపణలు చేసి ఆయన ఎన్నికను వివాదాస్పదం చేయాలో ముందుగానే ఒక పధకాన్ని రచించి పెట్టుకుని దాన్ని అమలు చేయటం మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది.

లేకపోతే అమెరికా లాంటి శక్తివంతమైన రాజ్యంలోని అధ్యక్ష ఎన్నికలను రష్యా, చైనా, ఇరాన్ లు ప్రభావితం చెయ్యటం ఏమిటి? ఈ ఆరోపణ ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న అమెరికన్ ప్రజలు అంత తెలివి హీనురనీ, రష్యా-చైనా-ఇరాన్ లు ఏం చెబితే అది నమ్మేస్తారనీ, సోషల్ మీడియాలో రష్యా-చైనా-ఇరాన్ దేశాలు చేస్తున్నాయని చెబుతున్న పరోక్ష ప్రచారాన్ని అంతా పొల్లు పోకుండా నమ్మేసి దాని ప్రకారం ఓటు వేస్తారని అమెరికా ప్రభుత్వం చెబుతున్నట్లే కాదా?

Donald Trump vs. The Deep State

2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ రష్యా అధ్యక్షుడు పుటిన్ పైన పొగడ్తలు కురిపించాడు. తాను అధ్యక్షుడిని అయితే రష్యాతో సంబంధాలను రీసెట్ చేస్తానని చెప్పాడు. కానీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక రష్యాతో సంబంధాలని రీసెట్ చేసుకోవటం అటుంచి శత్రు సంబంధాలని తగ్గించే ప్రయత్నాలు కూడా చేయలేదు. పైగా చైనాను ప్రధాన శత్రువుగా ప్రకటించి చైనా-అమెరికా వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తినే విధానాలు అవలంబించాడు. రష్యా సహాయంతో సిరియా ప్రభుత్వం ఆల్-ఖైదా, ఐసిస్ లాంటి టెర్రరిస్టు ముఠాలను తరిమి కొడుతుంటే ఆ ముఠాలకు మద్దతుగా అనేకసార్లు వైమానిక దాడులు జరిపించాడు. ఐసిస్ ముఠాలు తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం వచ్చినప్పుడల్లా సిరియా సైన్యం పైన తాను వైమానిక దాడులు చెయ్యటమే కాకుండా ఇజ్రాయెల్ చేత కూడా చేయించి సిరియా ప్రజల ఉసురు తీసుకున్నాడు.

అట్లాంటి డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ఈసారి రష్యాతో పాటు చైనా, ఇరాన్ లని కూడా కలిపేసి ఆ మూడూ మా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తున్నది. చైనా, ప్రధానంగా డౌన్-బ్యాలట్ రేసులను ప్రభావితం చేయటం పైన దృష్టి కేంద్రీకరించిందని అమెరికా సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారట (ఎకనమిక్ టైమ్స్, 6 సెప్టెంబర్ 2024). ఇరాన్ అయితే గతంలో కంటే ఇంకా చురుగ్గా వ్యవహరిస్తూ అధ్యక్ష ఎన్నికలనూ ఆ తర్వాత రెండేళ్లకు జరిగే కాంగ్రెస్ ఎన్నికలను కూడా ప్రభావితం చేసే పనిలో ఉన్నదట. “అడిగే వాడికి చెప్పేవాడు లోకువ” అని విన్నాం. ఇప్పుడు కొత్తగా “చెప్పేవాడికి వినేవాడు లోకువ” అని చెప్పుకోవాలి.

ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం రష్యా, చైనా, ఇరాన్ లు ప్రయత్నిస్తున్నాయని అమెరికా అధికారులు నేరుగా చెప్పటం లేదు. అలా చెబితే ఎవరూ నమ్మరని వాళ్ళకి తెలుసు. వివరాలు గానీ, ఆధారాలు గానీ ఏమీ చెప్పకుండా “ఓటర్లను ఒక వైపుకి మొగ్గేలా చేయటానికి” ప్రయత్నాలు చేస్తున్నారు అని మాత్రమే చెబుతారు. అమెరికా ప్రజలు ఎటువైపు మొగ్గితే ఆ మూడు దేశాలకు మేలు జరుగుతుందని ఆ మూడు దేశాలు భావిస్తున్నాయో అన్న వివరాలు మాత్రం ఏవీ ఉండవు.

నిజానికి ట్రంప్ 2016 ఎన్నికల్లో గెలిచాక చైనా, ఇరాన్ లకు తీవ్ర వాణిజ్య నష్టాల్ని ట్రంప్ కలిగించాడు. ఒబామా హయాంలో అమెరికా నేతృత్వంలో పశ్చిమ దేశాలు ఇరాన్ తో జె.సి.పి.ఓ.ఏ (జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం క్రింద ఇరాన్ పై విధించిన ఆంక్షలని కొన్ని సడలించారు. అమెరికా, పశ్చిమ దేశాల వద్ద ఉన్న ఇరాన్ కు చెందిన బిలియన్ల డాలర్ల నిధులపై ఉన్న ఆంక్షలని సడలించారు. ఇరాన్ చమురు రవాణా పైన ఉన్న ఆంక్షలని కూడా పాక్షికంగా సడలించారు. కానీ ట్రంప్ వచ్చాక ఈ ఒప్పందాన్ని రద్దు చేసి పారేశాడు. తర్వాత అధికారం చేపట్టిన జో బైడెన్ మళ్ళీ ఒప్పందం అమలు చేస్తామని చెప్పినా అది జరగలేదు.

ఇక చైనా పైన అయితే ట్రంప్ లెక్కలేనన్ని ఆంక్షలు విధించాడు. దాదాపు 300 బిలియన్ డాలర్ల మేర చైనా వాణిజ్యం పైన ట్రంప్ ఆంక్షలు విధించటంతో చైనా అనివార్యంగా రష్యాతో వాణిజ్య, రక్షణ, రాజకీయ ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. రష్యా పైన విధించిన ఆంక్షల వలన అనేక సరుకులు, టెక్నాలజీ తానే అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాల పెంపు కోసం దృష్టి మరల్చింది. ఆ విధంగా అమెరికాయే రష్యా, చైనా మరియు ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగేందుకు దోహదం చేసింది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా డీప్ స్టేట్ ఆజ్ఞల్ని పూర్తిగా ఆలకించడు. అలాగని అసలు ఆలకించడని కాదు. డొనాల్డ్ ట్రంప్ కి తనకంటూ సొంత ఐడియాలు ఉంటాయి. అమెరికా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు లాభాల కోసం చౌకగా లేబర్ లభించే చైనా, వియత్నాం, ధాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాలకు తరలి వెళ్ళడం డొనాల్డ్ ట్రంప్ కి ఇష్టం లేదు. ఐ.టి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎక్స్ (ట్విటర్) మొ.న కంపెనీలు కూడా చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ఎత్తేసి అమెరికా రావాలని కోరుతాడు.

అలాగే డబల్యూ‌టి‌ఓ తో పాటు వివిధ బహుళపక్ష వాణిజ్య ఒప్పందాల వలన అమెరికాకు నష్టం జరిగి చైనా, ఆగ్నేయాసియా, మెక్సికో లాంటి దేశాలు లబ్ది పొందుతున్నాయని కాబట్టి అలాంటి ఒప్పందాలను రద్దు చేయాలని భావిస్తాడు. అమెరికా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు చైనాకు తరలిపోవటం వల్లనే చైనా ఆర్ధిక శక్తి విపరీతంగా పెరిగిందని నమ్ముతాడు.

ఈ నమ్మకాలతోనే నాఫ్తా (NAFTA) లాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ లాంటి బహుళపక్ష ఒప్పందాల నుండి బైటికి వచ్చేశాడు. ఐరాస మానవ హక్కుల సంస్థ, యునెస్కో ల నుండి అమెరికాని తప్పించాడు. పర్యావరణ ఒప్పందం అయిన పారిస్ అగ్రిమెంట్ నుండి బైటికి వచ్చేశాడు. రష్యాతో కుదుర్చుకున్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందం రద్దు చేశేశాడు. వీటన్నింటికీ “అమెరికా ఫస్ట్” అనే నినాదాన్ని జత చేశాడు.

కానీ ఈ ఒప్పందాల వలన అమెరికా కి చెందిన బడా బడా కంపెనీల లాభాలు విపరీతంగా పెరిగాయి. చైనా, వియత్నాం, ఇంసోనేషియా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోని చీప్ లేబర్ ఆ కంపెనీలకి లాభాల్ని అనేక రెట్లు పెంచాయి. ఇండియా లాంటి దేశాల ఐ.టి కంపెనీలకి సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులు ఔట్ సోర్సింగ్ చేయటం ద్వారా అమెరికా ఉద్యోగులకి చెల్లించే వేతనాల కంటే అనేక రెట్లు తక్కువ వేతనాలు ఇండియన్ ఐ.టి ఉద్యోగులకి చెల్లించడం ద్వారా లాభాలు పెంచుకున్నాయి. ఇలా లాభాల కోసం విదేశాలకి తరలిపోవటం వలన అమెరికాకి ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత, భౌగోళిక రాజకీయ శక్తి సన్నగిల్లాయని, అమెరికా మాట ఇప్పుడు ఎవడూ వినటం లేదని ట్రంప్ నమ్మకం.

అమెరికా లోని డీప్ స్టేట్ కి (వాల్ స్ట్రీట్ ద్రవ్య కంపెనీలు, మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కంపెనీలు, టూ-బిగ్-టు-ఫెయిల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు… వీటన్నింటినీ కంట్రోల్ చేసే సూపర్ ధనిక వర్గాల, గ్రూపు కంపెనీల యజమానులతో కూడిన గుంపునే ‘డీప్ స్టేట్’ గా పరిగణిస్తారు. అమెరికాలో సమస్త వాణిజ్య, మిలట్రీ, విదేశీ విధాన పోకడలని ఈ గుంపే నిర్ణయిస్తుంది. డీప్ స్టేట్ లో కూడా వివిధ గ్రూపులు ఉంటాయి. బిల్డెన్ బర్గ్ సంఘం అనీ, ఎఫ్.బి.ఐ-సిఐఏ-పెంటగాన్, వివిధ దేశాల్లో యుద్ధాల్ని నడిపే మిలటరీ కాంట్రాక్టర్లు… వీళ్ళంతా డీప్ స్టేట్ లో భాగమే. వీళ్ళకి లాభాలు ముఖ్యం. అమెరికా గ్రేట్ నెస్ లాంటి సెంటిమెంట్లు వాళ్ళకి ఉండవు. ట్రంప్ కి అమెరికన్ నేషనలిస్ట్ సెంటిమెంట్ జాస్తిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.

అయితే అంతిమ పరిశీలనలో మూడో ప్రపంచ దేశాల ప్రయోజనాల దృష్టిలో చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు నేరుగా నష్టాన్ని కలిగిస్తాయి. డీప్ స్టేట్ విధానాలు ఏదో ప్రయోజనాన్ని ఒరగబెడుతున్నట్లు కనిపిస్తూ వాస్తవంలో మరింత దోపిడీకి తెగబడుతూ మరిన్ని లాభాల్ని పోగేసుకునేందుకు విధానాల్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలపై రుద్దుతాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ముసుగు తొడగని బందిపోటు అయితే అమెరికా డీప్ స్టేట్, మేక తోలు తొడిగిన పెద్ద పులి లాంటి క్రూర జంతువుతో సమానం. ట్రంప్ విధానాలు అమెరికా ఒక పెద్ద దోపిడీ దొంగ అన్న సంగతి ప్రత్యక్షంగా వెల్లడి చేస్తాయన్నదే ఆయన వ్యతిరేకుల భయం. వాళ్ళకి కావలసింది బైడెన్, ఒబామా, జార్జి బుష్ జూనియర్ అండ్ సీనియర్ లాంటి విధేయులు. అందుకే ట్రంప్ గెలవకుండా చూడాలని వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక వేళ ట్రంప్ అన్ని అడ్డంకులు దాటుకుని గెలిస్తే ఆయన వైట్ హౌస్ లోకి ప్రవేశించ కుండానే కుట్రలు చేసి ఆయన ఎన్నిక చెల్లకుండా చేసేందుకు గానీ లేక అసలు ఎన్నికలలో ట్రంప్ పోటీ పడకుండా అనర్హుడిని చేసేందుకు గానీ తీవ్ర స్థాయిలో కుట్రలు అమలు చేస్తున్నారు. అయితే డీప్ స్టేట్ ని ఎదుర్కొనే క్రమంలో తనకంటూ ఒక డీప్ స్టేట్ ని ట్రంప్ తయారు చేసుకున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Trump build his own Deep State? Maybe

అందులో భాగంగానే ఎలాంటి ఆధారాలు చూపకుండా అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలని రష్యా, చైనా, ఇరాన్ లు ప్రభావితం చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నాయని ఇప్పటి నుండే ప్రచారం లంకించుకున్నారు. రష్యాతో ట్రంప్ కుమ్మక్కు అయ్యాడని ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే అనేక కేసులు, విచారణలు నడిపినా కూడా అవేవీ రుజువు కాలేదు. అనేక దొంగ సాక్ష్యాలు ప్రవేశ పెట్టినా కూడా అవన్నీ వీగిపోయాయి.

అమెరికా డీప్ స్టేట్ దృష్టిలో అమెరికా సర్వ శక్తివంతమైన దేశంగా అన్ని దేశాల పైనా పెత్తనం చేసే స్థానంలో కొనసాగాలి. డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో అమెరికా శక్తివంతమైన దేశంగా ఉండాల్సిందే. కానీ ఆ పేరుతో అమలు చేస్తున్న విదేశీ, వాణిజ్య విధానాలు అమెరికాని ఆచరణలో బలహీనం చేస్తూ ఇతర దేశాలు బలపడేందుకు దోహదం చేస్తున్నాయన్నది ఆయన అవగాహన, ఆరోపణ. ఈ ఇరు శక్తులూ ప్రపంచ దేశాలకి ప్రమాదకరమే. ట్రంప్ అమెరికా ప్రమాదాన్ని ప్రత్యక్షంగా కనపడేట్లు చేస్తే ఆయన వ్యతిరేకులు అమెరికా అందరి మంచిని కాంక్షిస్తునట్లు కనపడుతూ వాస్తవంలో తెరవెనుక పెత్తనం చేస్తూ ఉండేలా చూస్తారు.

రష్యా, చైనా, ఇరాన్ లపై అమెరికా చేస్తున్న ఎన్నికల ఆరోపణలు కేవలం అమెరికా లోని అంతర్గత రాజకీయ ఘర్షణలకు పైన కనపడుతున్న రూపం మాత్రమే. ఈ ఆరోపణల ద్వారా డొనాల్డ్ ట్రంప్ ని ఒక బూచిగా అమెరికా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా గ్రూపుల మధ్య ఘర్షణ ప్రపంచ దేశాల నెత్తి మీద పిడుగులా వచ్చి పడే ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా బ్రిక్స్ కూటమి పైన ఈ ప్రభావం బలీయంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి