
The US’ marines attacked in Izmir, Turkey
నాటో సభ్య దేశం అయిన టర్కీలో అమెరికా సైనికులకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్మీర్ పట్టణ వీధుల్లో సంచరిస్తున్న అమెరికన్ మెరైన్ సైనికులపై టర్కిష్ యువకుల బృందం దాడి చేశారు. ఒక సైనికుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.
అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ వాస్ప్, ఇటీవల వరకు ఇజ్రాయెల్ తీరాన మోహరించింది. సదరు నౌక టర్కీ రేవు ఇజ్మీర్ లో లంగరు వేసింది (కాల్ ఆఫ్ పోర్ట్). యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రిక్రియేషన్ విభాగం యుఎస్ఎస్ వాస్ప్ లో ఉన్న సైనికులను రిక్రియేషన్ నిమిత్తం నగరంలోకి అనుమతించగా 6 గురు అమెరికా సైనికులు ఇజ్మీర్ వీధుల్లో సంచరిస్తున్నారు.
టర్కీ ప్రతిపక్ష పార్టీ అయిన ‘వతన్ పార్టీ’ కి అనుబంధ యువజన సంఘం యూత్ యూనియన్ ఆఫ్ టర్కీ (టిజిబి) కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. అమెరికా సైనికులపై దాడికి దిగుతూ టర్కీ యువకులు ఒక సైనికుడి తల పై నుండి ప్లాస్టిక్ గోతామును తొడిగేందుకు ప్రయత్నం చేశారు. అతను హెల్ప్ హెల్ప్ అని కేకలు వేయటంతో తోటి అమెరికా సైనికులు 5 గురు యువకుల నుండి తమ వాడిని విడిపించే ప్రయత్నం చేశారు. టర్కిష్ యువకులు మరో అమెరికన్ సైనికుడి పైన కూడా దాడి చేసి దాడి చేసి కొడుతూ “యాంకీ, గో హోమ్” (యాంకీలూ మీ ఇళ్లకు వెళ్లిపోండి) అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన చివరికి చిన్నపాటి అమెరికా వ్యతిరేక ప్రదర్శనగా మారింది.
20 సంవత్సరాల క్రితం జులై 4, 2003 తేదీన (అప్పటికే అమెరికా ఇరాక్ పై దురాక్రమణ దాడిలో మునిగి ఉన్నది) టర్కీ సైనికులు ఉత్తర ఇరాక్ లో కుర్దిష్ గెరిల్లా సైన్యంతో తలపడుతూ ఇరాక్ లోకి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమెరికా సైనికులు టర్కీ సైనికులను పట్టుకుని వారి తలలపై నుండి ప్లాస్టిక్ గోతాములు తొడిగి ఇంటరాగేషన్ నిమిత్తం పట్టుకెళ్లారు.
ప్రత్యేక కుర్దిస్తాన్ కోసం కృషి చేస్తున్న కుర్దులలో ఒక వర్గం, ముఖ్యంగా సిరియన్ కుర్దులు, అమెరికాకు అనుకూలంగా ఉంటారు. (కమ్యూనిస్టు గెరిల్లా వర్గం మాత్రం స్వతంత్ర కుర్దిస్తాన్ కోసం సాయుధం పోరాటం చేస్తున్నది. ఇది టర్కీలోని కుర్దులలో కూడా పని చేస్తూ టర్కీ ప్రభుత్వంతో పోరాడుతోంది. టర్కీ మాత్రం కుర్దు గ్రూపులు రెండింటినీ ఒకే గాటన కట్టి కుర్డులపై తీవ్ర అణచివేత అమలు చేస్తుంది) ఈ నేపధ్యంలో టర్కీ సైనికులను అమెరికా సైన్యం 60 గంటల పాటు బందీలుగా ఉంచుకున్నారు. టర్కీ గట్టి నిరసన తెలియజేయడంతో వారిని అమెరికా విడుదల చేసింది. ఈ ఘటన ‘హుడ్ (ముసుగు) ఘటన’ గా పేరు పొందింది. ఘటన పట్ల తర్వాత అమెరికా విచారం వ్యక్తం చేసినప్పటికీ (ఆపాలజీ కాదు) హుడ్ ఈవెంట్ ను తమకు జరిగిన అవమానంగా టర్కీ దేశస్థులు భావిస్తారు.

Aircraft carrier ‘USS Wasp’
హుడ్ ఘటనకు ప్రతీకారంగానే ఇజ్మీర్ లో టిజిబి కార్యకర్తలు అమెరికా సైనికులపై ప్లాస్టిక్ గోతాములు తొడిగి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. గాజాపై విరామం లేకుండా హత్యాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తుండడంతో అమెరికా పట్ల టర్కీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనీ, గాజా హత్యాకాండ నేపధ్యంలో కూడా అమెరికా సైనికులపై టర్కీ యువకులు దాడి చేశారని భావిస్తున్నారు.
టర్కీ, అమెరికా మిత్ర దేశాల్లో ఒకటి. పశ్చిమ దేశాల మిలటరీ కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో సభ్య దేశం కూడా. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం టర్కీ అనేక సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ దేశానికి ఇంతవరకు ఇయు సభ్యత్వ ఇవ్వలేదు.
టర్కీ, అమెరికా దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ సజావుగా లేవు. మధ్యప్రాచ్యంలో టర్కీ ప్రభావశీల శక్తిగా ఎదగాలని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తపన పడుతూ ఉంటాడు. 2003 నుండి 2014 వరకు టర్కీ ప్రధాన మంత్రిగా పని చేసిన ఎర్డోగన్, దేశ సెక్యులర్ రాజ్యాంగాన్ని మార్చివేసి ఇస్లామిక్ మత ప్రధాన దేశంగా టర్కీని తీర్చి దిద్దేలా అధ్యక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చాడు. 2014 నుండి టర్కీకి అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. ఒకప్పటి ఒట్టోమాన్ సామ్రాజ్య వైభవాన్ని పునఃస్థాపించాలని, శక్తివంతమైన దేశంగా ఎదిగి ప్రాంతీయ పెత్తనం చెలాయించాలని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ కు బలమైన కోరిక.
దక్షిణ టర్కీలోని ఇన్సిర్లిక్ నగరంలో అమెరికాకు అతి పెద్ద వాయు సైనిక (ఎయిర్ ఫోర్స్) స్థావరం ఉన్నది. 5000 మంది అమెరికా సైనికులు ఇక్కడ తిష్ట వేశారు. టర్కీ వాయు సేన సైనికులు కూడా ఈ స్థావరంలో ఓ పక్క ఉంటారు. బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్, కొందరు సైనికులను ఈ స్థావరంలో తిష్టవేయించింది. స్పెయిన్ సైన్యం కూడా అవసరం వచ్చినపుడు ఈ స్థావరాన్ని వినియోగించుకుంటుంది.
టర్కీ, ఇరాక్, సిరియాలలో ఉన్న కుర్దు ప్రాంతాలను కలిపి కుర్దిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కుర్దులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర ఇరాక్ ప్రాంతం కొండలు, అడవులకు నిలయం. కుర్దు కమ్యూనిస్టు గెరిల్లాలు కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పేరుతో ఉత్తర ఇరాక్ కేంద్రంగా పని చేస్తున్నారు. ఉత్తర ఇరాక్ ను అదుపులోకి తీసుకుని అక్కడ కుర్దు ప్రజల తిరుగుబాటును అణచివేయాలని టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది జరగటం లేదు.
సిరియాలో ఐసిస్, ఆల్-ఖైదాలను ప్రవేశ పెట్టి కిరాయి తిరుగుబాటు నడిపించిన అమెరికా, ఈశాన్య సిరియాలో తమకు అనుకూలంగా ఉన్న కుర్దులతో ప్రత్యేక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ఐసిస్ నుండి కుర్డులకు రక్షణ కల్పించే పేరుతో తూర్పు సిరియాలో ఆల్-తనాఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరం నిర్మించుకుని ఈశాన్య సిరియా, రఫా ప్రాంతాల్లో చమురును దొంగిలించే పనిలో నిమగ్నమై ఉన్నది. సిరియాలోని చమురు బావుల నుండి టర్కీ కూడా చమురు దొంగిలిస్తోంది. అమెరికా, టర్కీలు సిరియా చమురును దొంగిలిస్తున్న సంగతి బహిరంగ రహస్యం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిరియా నుండి చమురు తరలిస్తున్నామని స్వయంగా, అదొక అచీవ్మెంట్ లాగా చెప్పుకున్నాడు. కేవలం చమురు దోపిడీకే ఆల్-తనాఫ్ లో సైనిక స్థావరం నిర్మించి అక్కడికి సమీపం లోని ఐసిస్ తీవ్రవాదులకు ఆయుధ, ధన సహాయం అందిస్తున్నది. అమెరికా అధికారులు ఐసిస్ తో పోరాటం కోసం సిరియాలో తమ సైనికులు ఉన్నారని చెబుతుంటే, “కేవలం చమురు కోసమే మా సైనికులు సిరియాలో ఉన్నారు” అని ఎలాంటి మొహమాటం లేకుండా ప్రకటించాడు.
అమెరికా సైనికులపై టర్కీ యువకుల దాడి గురించి పశ్చిమ పత్రికలు హాహాకారాలు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా దేశాలపై దాడులు చేసి, దురాక్రమించి, ఒకప్పుడు అత్యంత అభివృద్ధికర ధనిక దేశాలుగా వెలుగొందిన ఆ దేశాల రాజకీయ, సామాజిక, ఆర్ధిక వ్యవస్థలను సర్వ నాశనం చేసిన అమెరికాకు ఇవే పత్రికలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కేవలం ఆరుగురు అమెరికా సైనికులను టర్కీ పౌరులు చుట్టుముట్టి అవమానించినందుకే ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లు హాహాకారాలు చేస్తున్నాయి. పశ్చిమ దేశాల (అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఐరోపా) ప్రభుత్వాలు, పత్రికలు, ప్రజలు (కొందరు ఆలోచనాపరులు లేకపోలేదు) ప్రదర్శించే హిపోక్రసీ, నిజాయితీ రాహిత్యం, పర్వర్టెడ్ మనస్తత్వం మనకు మరే దేశం లోనూ కనిపించదు అంటే అతిశయోక్తి కాదు.