గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?


గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు, మర ఫిరంగి గుళ్లూ, ఫైటర్ జెట్ విమాన దాడులూ వేస్తూనే, చేస్తూనే ఉన్నది.

ఈ ఆయుధాలు అన్నింటినీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలు సరఫరా చేస్తూనే పాలస్తీనీయుల పట్ల బూటకపు జాలి ప్రకటిస్తున్నారు. విచిత్రంగా దాడి చేస్తున్నది ఇజ్రాయెల్ అయితే ‘ఇజ్రాయెల్ కి తనను తాను డిఫెండ్ చేసుకునే హక్కు ఉన్నది’ అని ఈ దేశాలు ప్రకటిస్తున్నాయి. శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం జరక్కుండా వెర్రి మొర్రి షరతులతో అడ్డం పడుతున్న ఇజ్రాయెల్ ని పల్లెత్తు మాట అనకుండా శాంతికి కలిసి రావటం లేదని హమాస్ ని నిందిస్తున్నాయి.

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ పరిస్ధితి ఎలా ఉన్నదంటే….

యాక్టివిస్టులు: అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ కి గాజా హత్యాకాండ కొనసాగించడం సాధ్యం కాదు.

నిపుణులు: అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ కి గాజా హత్యాకాండ కొనసాగించడం సాధ్యమే కాదు.

బైడెన్ – హ్యారిస్ (అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు): (ఇజ్రాయెల్ కి ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నారు.

బైడెన్ – హ్యారిస్: గాజాలో హత్యాకాండ కొనసాగటానికి ఇక ఎంత మాత్రం వీలు లేదు.

*********

ఇజ్రాయెలి ఇన్సైడర్లు (అంతర్గత నిపుణులు/ఐడిఎఫ్ అధికారులు etc..): ఇజ్రాయెల్ పై ఆయుధ సరఫరా నిషేధం విధిస్తే ఐడిఎఫ్ సాగిస్తున్న జాతి హత్యాకాండ అనివార్యంగా ఆగిపోతుంది.

బైడెన్ – హ్యారిస్: ఇజ్రాయెల్ పై ఆయుధ సరఫరా నిషేధం విధింపుకు మేము వ్యతిరేకం.

*********

ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికాకు తెలుసు. కానీ అదేమీ తనకు తెలియనట్లు నటిస్తుంది. (ఇజ్రాయెల్ అణు కేంద్రాల తనిఖీకి ఆదేశించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ ని మొస్సాద్, సి.ఐ.ఏ లోని ఒక వర్గం కుట్ర చేసి చంపేసింది.)

శాంతి ఒప్పందం కుదరకుండా ఇజ్రాయెల్ ఆటంకాలు సృష్టిస్తున్నదని అమెరికాకు తెలుసు. కానీ శాంతికి హమాస్ సంస్థే కారణమని నమ్ముతున్నట్లు అమెరికా నటిస్తుంది.

ఇజ్రాయెల్, పాలస్తీనా జాతి హత్యాకాండ సాగిస్తున్నదని అమెరికాకు తెలుసు. కానీ అలా చెప్పటం అంటే యాంటీ-సెమెటిజం (యూదు-విద్వేషం) అవుతుందని అమెరికా నటిస్తుంది.

ఇజ్రాయెల్ ఉద్దేశ పూర్వకంగానే పాలస్తీనా పౌరులను టార్గెట్ చేసుకుని బాంబింగ్ చేస్తున్నదని అమెరికాకు తెలుసు. కానీ ఇజ్రాయెల్ కేవలం హమాస్ సైనికులనే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నదని నమ్ముతున్నట్లు నటిస్తుంది.

ఇజ్రాయెల్, గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నదని అమెరికాకు తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చెయ్యటం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని కూడా అమెరికాకు తెలుసు. కానీ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు సరైన సాక్ష్యాలు లేవని నమ్ముతున్నట్లు అమెరికా నటిస్తుంది.

ఇజ్రాయెల్, ఐరాస తీర్మానం చేసిన ‘రెండు-రాజ్యాల పరిష్కారం’ (1967 నాటి సరిహద్దుల ప్రకారం గాజా మరియు వెస్ట్ బ్యాంక్ లతో తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ఏర్పడటం; మిగిలిన భూభాగాలతో ఇజ్రాయెల్ ఉనికి కొనసాగటం) కు ఎప్పటికీ ఒప్పుకోదని అమెరికాకు తెలుసు. కానీ రెండు-రాజ్యాల పరిష్కారం ‘ఇదిగో, దగ్గరలోనే ఉన్నది’ అని నమ్ముతున్నట్లు నటిస్తుంది.

ఇప్పుడు ఉన్నట్లుగా ఇజ్రాయెల్ ఉనికి ఉన్నట్లయితే (గాజా నుండి పాలస్తీనా ప్రజలను తరిమి కొట్టడం, వెస్ట్ బ్యాంక్ లో అత్యధిక భూభాగం ఇజ్రాయెలీ తీవ్రవాద సెటిలర్ల చేతుల్లో ఉండడం) మధ్య ప్రాచ్యంలో, కనీసం పాలస్తీనా-ఇజ్రాయెల్ లలో శాంతి మరియు సుస్థిరత నెలకొనడం అసాధ్యం అన్న సంగతి అమెరికాకు తెలుసు. కానీ కంటికి ఎదురుగా కనిపిస్తున్న ఈ స్పష్టమైన వాస్తవాన్ని అంగీకరించేందుకు అమెరికా నిరాకరిస్తుంది.

పాలస్తీనా-ఇజ్రాయెల్ లో ఉన్న వాస్తవాలను అమెరికా తలకిందులుగా ఉన్నట్లు నమ్ముతుంది. పైన ఉన్నది కింద ఉన్నట్లుగా, కింద ఉన్నది పైన ఉన్నట్లుగా నమ్మినట్లు నటిస్తూ అందరినీ నమ్మమంటుంది. రాత్రిని పగలు అనీ, జామ కాయని పైన్ యాపిల్ అనీ నమ్ముతున్నట్లు నటిస్తుంది. కానీ ప్రైవేటుగా అవన్నీ నిజం కాదని అమెరికాకు తెలుసు. ఒక స్థిరమైన ధృఢత్వంతో అమాయకత్వం నటిస్తూ వాస్తవాల స్థానంలో బూటకపు కధనాలను ప్రచారంలో పెడుతుంది.

*********

తమను తాము లిబరల్స్ గా సగర్వంగా చాటుకునే వాళ్ళు “నేను పాలస్టీనియన్లనూ, ఇజ్రాయెల్ నూ ఇద్దరికీ మద్దతు ఇస్తాము అంటారు.

మరి నేనో, నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా. నేను ఎల్లప్పుడూ బాధితుడినీ, బాధించే వాడినీ ఇద్దరినీ సమర్ధిస్తాను. తీవ్రంగా దెబ్బలు తిన్న భార్యనూ, ఆమెను కొట్టి బాధించిన భర్తనూ ఇద్దరినీ సమర్ధిస్తాను. లైంగిక వేధింపులకు గురయిన పసి బాలికనూ, ఆ బాలికను లైంగికంగా వేధించిన పశు సమానుడినీ ఇద్దరినీ సమర్ధిస్తాను.

*********

మితవాద పదజాలానికి అర్ధాలు

“ఇది కమ్యూనిజమే” = పెట్టుబడిదారులు పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నాడు

“ఇది మార్క్సిజమే” = ఇది పెట్టుబడారులు పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయటమే

“వీరు నయా మార్క్సిస్టు” = పెట్టుబడిదారులు పెట్టుబడిదారీ విధానం పాటిస్తున్నాడు

సందర్భం: ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) అధినేత, డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు అయిన ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్ ప్రకటించిన పన్ను విధానాలను చూసి “ఇవి ఫక్తు కమ్యూనిజమే” అని వ్యాఖ్యానించాడు.

*********

సైకియాట్రిక్ డాక్టర్ల దృష్టి లోకి ఇంకా రాని సైకోపాత్ లు, సోషియో పాత్ లు తమ శాడిస్టు ఫ్యాంటసీలను రియలైజ్ చేసుకోవటానికి యుద్ధ క్షేత్రాలకు వెళ్ళేందుకు తమను తాము రిజిస్టర్ చేసుకుంటారనుకుంటాను. గాజా లాంటి చోట్ల మనం చూస్తున్న అత్యంత దారుణ హింసలు, పాలస్తీనీయులను అధమ మానవులుగా పరిగణించాలని జియోనిస్టు యూదులకు పుట్టినప్పటి నుండే ఉగ్గు పాలతో నేర్పిస్తున్నారన్న ప్రాపంచిక వ్యవస్థాగత వివరణలకు అద్దం పడుతున్నాయని నాకు ఖచ్చితంగా తోస్తుంది. (జియోనిజం అన్నది రాజకీయ యూదు ఆధిపత్య వాదం. ఇండియాలో రాజకీయ హిందూయిజంను హిందూత్వ అంతున్నట్లే -విశేఖర్). అలాగే పాలస్తీనీయులు అని కాకుండా తోటి మానవులను హింసించడం ద్వారా వారి నెప్పి, చావులు ఎలా ఉంటాయో చూడాలని తపించే వారు కూడా స్వచ్ఛందంగా ఐడిఎఫ్ లో చేరుతున్నారని కూడా నాకు అనిపిస్తుంది.

ఇదే గాజాలో, సామూహిక మిలటరీ హింస అమలు చేస్తున్న ప్రతి చోటా ఇది జరుగుతున్నదని నేను ఖచ్చితంగా చెప్పగలను. వార్ జోన్ అన్నది లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిన చోటుకు మరో పేరు. ఇక్కడ బలవంతుడు చెప్పేదే నిజం, తుపాకి ఉన్న వాడే నిబంధనలు శాసిస్తాడు. హింసించి చంపాలన్న ఫ్యాంటసీలను నిజం చేసుకుంటే జైలు శిక్ష పడుతుందని భయపడే వాళ్ళు యుద్ధ సమయాల్లో బలవంతులుగా, తుపాకి ధరించిన వారీగా మారే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. నిస్సహాయులైన జనాభా శాడిస్టులకు ఏం చేసేందుకైనా అందుబాటులో ఉంటారు.

మరింత మంది పశ్చిమ దేశాల ఆర్టిస్టులు, పశ్చిమ దేశాల మద్దతుతో నడుస్తున్న గాజా జాతి జాత్యాకాండను, ఇతర పశ్చిమ దేశీయుల అరాచకాలను నిరసించకపోవడం అత్యంత అసహ్యకరమైన విషయం. వాటిని తమ ఆర్ట్ లో కేంద్ర అంశంగా మలచకపోవటం మరింత అసహ్యకరం. హత్యలకోరు (murderous) నాగరికతలో నివసిస్తున్నప్పుడు, మీ చేతుల్లో ఒక శక్తివంతమైన కళ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగపెట్టి నిరసనలో భాగం కాకుండా ఎలా ఉండగలరు?

కవులు కవిత్వ కళతో కవిత్వం రాస్తారు; హిప్ హాప్ ఆర్టిస్టులు ర్యాపింగ్ ని ర్యాప్ చేస్తారు; ఇప్పుడిప్పుడే విరగబూస్తున్న రొమాన్స్ గురించి నవలా రచయితలు లక్ష కోటవ (ట్రిలియన్త్) కధను చెబుతాడు; పాప్ ఆర్టిస్టులు ఇప్పటి పీడకల లాంటి వాతావరణంలో తాము ఎంత గొప్పగా సమయం గడుపుతున్నారో వివరిస్తూ పాటలు రాసి పాడతారు. అందరిలోకెల్లా అత్యంత చెత్త రాసే స్క్రిప్టు రైటర్లు పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం లు సాగిస్తున్న అరాచకాలను నార్మలైజ్ చేస్తూ యధాతధ స్థితిలో అందరూ ఆనందంగా గడుపుతున్నట్లు చిత్రిస్తూ, పశ్చిమ దేశాల సైనికుల, పోలీసుల, వేగుల వీరోచిత గాధలను చూపిస్తూ ఉంటారు.

కళ ద్వారా ప్రజల కళ్ళు తెరిపించవచ్చు. కానీ పశ్చిమ కళాకారులు కళ్ళు మూసుకుని బ్రతికేస్తుంటారు. ఆఫ్ కోర్స్! వాళ్ళు ఏం చేయటానికి పుట్టారో అది చేస్తూ జీవనం గడపడం అసాధ్యం అయిపోయిన పరిస్ధితులని ఎదుర్కొంటూ ఉంటారు. ఘర్షణ రహితమైన మరియు యధాతధ స్థితిని కొనసాగింప జేసే కళను ప్రదర్శితే తప్ప మనలేని పరిస్ధితిని ఎదుర్కొంటారు. ఉనికిలో ఉన్న వ్యవస్థల నుండి లబ్దిపొందే ధనిక వర్గమే వ్యవస్థలను శాసిస్తున్నందున, వారికి సవాలు విసరని కళల సృష్టిలో నిమగ్నమై పోతారు.

కానీ మన సృజనాత్మకత హైజాక్ కి గురి కాకుండా నేర్పు, ఓర్పు, లోదృష్టి, కాస్త ధైర్యం… ఇవి ప్రతి కళాకారుడికీ ఉండి తీరాలి. తమలో మంటలు రగులుతున్న కళాకారులే తమకు అబ్బిన బహుమానాన్ని ప్రజల్లో, అసౌకర్యమైన చోట్ల చైతన్యం రగుల్కొలిపేందుకు ఉపయోగించాలి. వారు నాటే విత్తనాల నుండి ఒక రోజున ఒక ఆరోగ్యకరమైన ప్రపంచం వృద్ధి చెందటం మొదలు కావచ్చు. అక్కడే గొప్ప గొప్ప అంశాలు దొరుకుతాయి. గానం గురించిన పాటలు, రొమాన్స్ గురించిన కవిత్వం, నిజమైన విలువైన స్థానాన్ని పొందగలుగుతాయి.

అప్పటి వరకూ, మానవ రక్తాన్ని ఇంధనంగా మండించే సామ్రాజ్యం నీడలో నివసిస్తున్నంత కాలం నిజంగా ఏమి జరుగుతున్నదో అనునిత్యం ఎత్తి చూపిస్తూ, మనకు వీలైనన్ని అన్నీ మార్గాల్లో ఆ సమస్యలను ఎదుర్కొనే దారి చూపాలి; తెగువ చూపాలి; వెలుగు నాటాలి; చైతన్యం పరిఢవిల్లింప జేయాలి; కొత్త ప్రపంచాన్ని రుచి చూపించాలి.

———- బ్రిటిష్ రచయిత్రి, కవి, జర్నలిస్టు, ప్రెజెంటర్, క్యాటలిన్ జాన్ స్టోన్

వ్యాఖ్యానించండి