క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…


సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు.

అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే అనుసరించి తీర్పులు ఇవ్వాలన్న సంగతి, తమకు నచ్చిన పుస్తకాలను, బోధనలను, సూత్రాలను తమ తీర్పులకు మద్దతుగా తేవటానికి వీలు లేదన్న సంగతి వారి దృష్టిలో ఉంటుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది.

ఎస్.సి కులాల్లో క్రీమీ లేయర్ ని గుర్తించాలన్న చర్చగానీ, సమస్య గానీ సుప్రీం కోర్టు ముందు లేదు. ఓబిసి కులాలలో క్రీమీ లేయర్ ని గుర్తించి రిజర్వేషన్ల నుండి తొలగించాలన్న అంశం లోనే అనేక వివాదాలు దేశంలో ఉన్నాయి. క్రీమీ లేయర్ నియమం కారణంగా నిజంగా వెనుకబడిన అనేక మంది బిసి కులాల ప్రజలు రిజర్వేషన్ సౌకర్యం పొందటానికి నానా అగచాట్లు పడుతున్నారని బి.సి కులాల వాళ్ళే తరచుగా ఆరోపిస్తున్నారు.

ఓబిసిల పరిస్థితే ఇలా ఉంటే పిలవని పేరంటానికి వచ్చినట్లు 7 గురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ఎస్.సి లలో క్రీమీ లేయర్ ని గుర్తించాలని పేర్కొనడం బొత్తిగా అర్ధం కానటువంటి సంగతి. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ అంశాన్ని చర్చించిన న్యాయమూర్తులలో దళిత న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ అగ్రభాగాన నిలబడటం.

జస్టిస్ బి.ఆర్. గవాయ్ తన తీర్పులో ఒక ప్రశ్న అడిగి తానే సమాధానం ఇచ్చుకున్నారు. అది ఏమిటంటే గ్రామంలో అట్టడుగున ఉన్న ఒక దళిత వ్యక్తి పిల్లలను, ఐ.ఏ.ఎస్-ఐ.పి.ఎస్ లాంటి సివిల్ సర్వీస్ లకు ఎంపికైన వ్యక్తుల పిల్లలను ఒకే గాటన కట్టి ఇద్దరికీ ఒకే విధంగా రిజర్వేషన్లు వర్తింప జేయవచ్చా? అని. ప్యూన్ లేదా అటెండర్ లాంటి ఉద్యోగాల్లో పని చేసే ఉద్యోగులు అభివృద్ధి చెందినవారిలో భాగంగా చూడలేమని కూడా ఆయన ఒక మాటగా చెప్పారు.

సరే! దళిత ప్యూన్లు, అటెండర్ లను అభివృద్ధి చెందిన వారిగా చూడొద్దు. మరి గుమస్తాలు, బ్యాంకు ఆఫీసర్లు, స్టేట్ గవర్నమెంట్ లలోని గ్రూప్ I, II, III అధికారులు లేదా ఉద్యోగులు… వీరిలో ఎవరు అభివృద్ధి చెందారని క్రీమీ లేయర్ గా గుర్తించవచ్చు? ఎస్.సి లలో క్రీమీ లేయర్ ను గుర్తించటానికి ఓబిసి లలో క్రీమీ లేయర్ గుర్తించేందుకు ఉపయోగించిన పద్ధతి కాకుండా వేరే కొలమానం ఉపయోగించాలని జస్టిస్ గవాయ్ చెప్పారు. కానీ ఆ కొలమానం ఏమిటో, ఎలా ఉండాలో, అది అసలు ఓబిసి లకు భిన్నంగా ఎందుకు ఉండాలో ఆయన చెప్పలేదు.

తెలిసి చేశారో లేక తెలియక చేశారో తెలియదు గానీ జస్టిస్ బి.ఆర్. గవాయ్, భవిష్యత్తులో తన తీర్పును అడ్డం పెట్టుకుని ఎస్.సి, ఎస్.టి ల నుండి ఒక్కో కులాన్ని, లేదా కులాల సమూహాలనూ తొలగిస్తూ, చివరికి రిజర్వేషన్ కల్పించేందుకు ఎవరూ మిగల్లేదు అని ప్రభుత్వాలే ప్రకటించేందుకు తగిన చట్టబద్ధమైన బాటను, మార్గాన్ని జస్టిస్ గవాయ్ వేశారు. ఇలా బాట వేసినందుకు కారకులుగా జస్టిస్ గవాయ్ పేరునే చెబుతారు తప్ప దానికి మద్దతుగా వచ్చిన ఇతర ముగ్గురు న్యాయమూర్తుల పేర్లు పెద్దగా ముందుకు రావు. “మీ వాడే కదా ఈ సిఫారసు చేసింది?” అని వాదించేందుకు ఆయన అనుకూలంగా ఉన్నారు మరి!

అసలు ఎస్.సి, ఎస్.టి లకు రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? రాజ్యాంగం ఆ రిజర్వేషన్ ఎందుకు కల్పించింది? ఆర్ధిక వెనుకబాటుతనమా? కానే కాదు. ఆర్ధిక వెనుకబాటుతనం ఒక కారణం మాత్రమే. వారు ఆర్ధిక వెనుకబాటుతనంలో మగ్గి పోవటానికి కూడా ఒక మూల కారణం ఉన్నది. అదే అంటరానితనం, ఆ అంటరానితనానికి హిందూమతం అంటగట్టిన దైవత్వం. భగవద్గీత ద్వారా హిందూ మతం ప్రభోదించిన వర్ణ వ్యవస్థ శ్లోకాల్లో ఉన్నది గానీ సమాజంలో ఉన్నదీ లేనిదీ తెలియదు. కానీ కులం మాత్రం వేలయేళ్లుగా ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

వేల యేళ్లుగా వాళ్ళు సామాజికంగా అత్యంత హీనమైన అణచివేతకు గురి అయ్యారు. అంటరానివారుగా వారు సమస్త ఉత్పత్తి కార్యకలాపాలకు దూరంగా ఉంచబడ్డారు. అంటరానితనం వల్ల మాత్రమే ఎస్.సి, ఎస్.టి లకు రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్.సి, ఎస్.టి ల రిజర్వేషన్ కు ఉన్న ప్రాతిపదిక, ఓబిసి కులాల రిజర్వేషన్ కు పాటించిన ప్రాతిపదిక… ఈ రెండు ప్రాతిపదికలకు పొంతనే లేదు. బి.సి కులాలు అంటరాని కులాలు కాదు. ఎస్.సి, ఎస్.టి లు మాత్రమే వేల యేళ్లుగా అంటరానితనం అనుభవించారు. ఇంకా అనుభవిస్తున్నారు.

ఒక మాల, ఒక మాదిగ, ఒక మాల దాసు, ఒక రెల్లి ఇత్యాదిగా గల దళిత కులాలకు చెందిన వ్యక్తి ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అయినా సరే అంటరానితనం ఎదుర్కొంటున్న సంగతి ఒక కఠిన వాస్తవం. ఒక దళిత ఐఏఎస్ అధికారి రిటైర్ అయిన అగ్రకుల ఐఏఎస్ అధికారిని ‘అయ్యగారు, తమరు అని సంభోదించటం ఈ బ్లాగర్ కి తెలుసు.

అంతెందుకు? అంబేద్కర్ చదివిన చదువు ఎంత ఉన్నతమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పశ్చిమ దేశాల్లోని మహా మహా యూనివర్సిటీలలో ఆయన డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్నారు. ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం తమకు గౌరవంగా అమెరికన్, బ్రిటిష్ యూనివర్సిటీలు భావించాయి. అంత చదువు చదివినా సరే ఆయన పార్లమెంటులో అడుగు పెట్టకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ లోని అగ్రకుల పెద్దలు ఎన్ని కుట్రలు చేయలేదు? చివరికి ఆయన తప్ప మరొకరికి అంత శక్తి, జ్ఞానం లేదు గనకనే అంబేద్కర్ ని పార్లమెంటులో/రాజ్యాంగ సభలోకి అడుగు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీయే పూనుకోగలసి వచ్చింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రి అయ్యాక కూడా అంతరానితనం ఎదుర్కొన్న ఉదాహరణలు లేవా? ఉన్నాయి. ఆయన ఛాంబర్ బైట నిలబడే ప్యూన్ అంబేద్కర్ పైకి ఫైళ్ళు విసిరిన ఘటనలు ఉన్నాయి. కేంద్ర మంత్రి అంటే ఎంత అభివృధ్ధి చెంది ఉండాలి? అంత అభివృద్ధి చెందినా ఆయన అంటరానితనాన్ని ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? ఎందుకంటే భారత సమాజం ఎస్.సి, ఎస్.టి లు ఎంత అభివృద్ధి చెందినా అంటరాని వారుగానే చూసే భావ దారిద్రం తో భావజాల పరంగా, నాగరికత పరంగా తీవ్ర స్థాయిలో వెనుకబడి ఉన్నారు కనుక!

దళితులు సామాజిక అణచివేత ఫలితంగా సమాజంలో ఆస్తులు పొందలేక పోయారు. ఇప్పటికీ ఒక రెండు కుంటల భూమి లేక కూలీ నాలీ చేసి బ్రతుకుతున్న ఎస్.సి, ఎస్.టి లు పదుల కోట్ల మంది ఉన్నారు. ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేసే ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులకు పెద్ద పెద్ద నగరాల్లో గానీ, పట్టణాల్లో గానీ అద్దెకు ఇళ్ళు ఇస్తున్నారా? పరోక్షంగా కులం అడిగేవారు కొందరైతే, ప్రత్యక్షంగా కులం అడిగి, మొఖం మీదే తలుపులు దఢేల్ మని మూసుకునే వాళ్ళు కోకొల్లలు. కులం పేరు చెప్పేందుకు తటపటాయిస్తుంటే “మీరు మాల, మాదిగ అయితే గనక, అద్దెకు ఇచ్చేది లేదు” అని హెచ్చరించే వారికి కొదవే లేదు.

నాకు తెలిసి ఒక బ్యాంకు ఆఫీసర్ ఉన్నాడు. ఎస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్ అతను. ఆయన దక్షిణ కోస్తా లోని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన పట్టణానికి బదిలీ అయ్యాడు. ఆయన కోసం నేనే ఇళ్ళు వెతికేందుకు ప్రయత్నించాను. నా కొలీగ్ ఇంటిలో ఖాళీ పోర్షన్ ఉంటే వెళ్ళాను. అద్దె ఇంటి కోసం తిరుగుతున్న సంగతి కూడా తెలుసు. ఆయన కనీసం నన్ను చూసి హలో కూడా అనలేదు. నన్ను చూసి ఇంటి వెనక్కి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నట్లు నటించాడే తప్ప మర్యాదకు కూడా పలకరించలేదు. ఆయన భార్య బైటికి వచ్చి “ఎవరికో ఇచ్చేశారట” అని చెప్పారు. నాకు పరిస్ధితి అర్ధమై తల వాల్చుకుని వెనక్కి వచ్చేశాను.

మరో ఇంటికి వెళ్ళాను. కులం ఏంటి అని డైరెక్ట్ గా అడిగాడు. నేను చెప్పాను. వెంటనే కొర్చీ లోంచి లేచి లోపలకి వెళ్లిపోయాడు. ఇచ్చేదీ, ఇస్తున్నదీ కూడా చెప్పలేదు. మరి ఆ బ్యాంక్ మేనేజర్ అభివృద్ధి చెందినట్లా లేదా?

దళితుడిని ప్రేమించినందుకు సొంత కూతురిని, చెల్లెలిని చంపుకుంటున్న గొప్ప కులాల ప్రజలు ఉన్నారు. తన కూతురినో, చెల్లెలినో ప్రేమించిన దళితుడిని కొడవలితో, వేట కత్తితో నరికి చంపిన ఉదాహరణలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో ఎన్ని పరువు హత్యలు జరగడం లేదు? ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన దళితుడు కూడా తన కూతురిని ప్రేమించేందుకు అనర్హుడే నని అగ్రకుల సమాజం ఎలుగెత్తి చాటుతున్నా సుప్రీం కోర్టు కి కనపడటం లేదా? వినబడటం లేదా?

కోర్టుల్లో చిన్న చిన్న నేరాలను అంటగట్టి లక్షల మంది దళిత కులాల, తెగల యువకులు బెయిల్ మొత్తం చెల్లించలేక, తనఖా పెట్టేందుకు కనీస ఆస్తి లేక రిమాండ్ ఖైదీలుగా జీవితాల తరబడి జైళ్ళలో బతుకులు వెళ్ళ దీస్తున్నారని సుప్రీం కొర్టే అనేకసార్లు చెప్పింది.

ఈ క్రీమీ లేయర్ ప్రతిపాదనకు నాయకత్వం వహించిన జస్టిస్ గవాయ్, తనకు రిజర్వేషన్ వల్లనే రెండేళ్ళు ముందుగా సుప్రీం కోర్టులో చోటు దొరికిందని స్వయంగా చెప్పుకున్నాడు. తొమ్మిదేళ్లుగా సుప్రీం కోర్టులో దళిత న్యాయమూర్తి లేకపోవడంతో తనకు రెండేళ్ళు ముందుగా సుప్రీం జడ్జి పదవి ఇచ్చారని చెప్పారు. ఆయన హై కోర్టు న్యాయమూర్తిగా అభివృద్ధి చెందిన క్రీమీ లేయర్ లో ఉన్నట్లే కదా? ఆయన రిజర్వేషన్ ద్వారా హై కోర్టు నుండి సుప్రీం కోర్టుకు వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే దళిత జడ్జిలు లేదా సీనియర్ లాయర్లు, సుప్రీం కోర్టు తర్వాత సంగతి, జిల్లా కోర్టుకు వెళ్లగలగడం కూడా గొప్ప సంగతి గనక. హై కోర్టు వరకు జస్టిస్ గవాయ్ వెళ్లారంటే కోర్టుల్లో దళిత జడ్జిలు ఉన్నారు అని చెప్పుకునేందుకు ఒకరో ఇద్దరో ఉండాల్సిన ఆగత్యాన్ని దేశంలో పెద్దలు ఎదుర్కొన్నారు గనక!

ఇంతకీ జస్టిస్ బి.ఆర్ గవాయ్ క్రీమీ లేయర్ కిందికి వస్తారా? వస్తే సుప్రీం కోర్టుకు రెండేళ్ళు ముందుగా ఎందుకు వచ్చారు?

జస్టిస్ గవాయ్ మొదలు పెట్టాక ఇతర ముగ్గురు జడ్జిలు క్రీమీ లేయర్ పాత ఎత్తుకున్నారని పత్రికల ద్వారా తెలుస్తున్నది. జస్టిస్ విక్రమ్ నాధ్ అయితే భగవద్గీతను సాక్ష్యంగా తెచ్చుకుని పూర్వం ఇండియాలో వర్ణ వ్యవస్థ ఉన్నదని, కుల వ్యవస్థ లేదని చెప్పేశాడు. అసలు కృష్ణ భగవానుడు రెండు మూడు క్షణాల్లో అర్జునుడికి 18 అధ్యాయాల (అసలు మొదట్లో ఉన్నది 15 అధ్యాయాలే అనీ 9 అంకె కోసం హిందూ పెద్దలు మరో 3 అధ్యాయాలు జోడించారని అంబేద్కర్ నిర్ద్వంద్వంగా ససాక్ష్యంగా నిరూపించారు) మేటర్ ని బోధించారని చెబుతున్న భగవద్గీతను సాక్ష్యంగా తెచ్చుకునే వెసులుబాటు ఆయనకు రాజ్యాంగం ఇచ్చిందా?

ఇక లేటెందుకు? మను ధర్మ శాస్త్రాన్ని తెచ్చి భారత రాజ్యాంగంగా మార్చితే ఒక పని అయిపోతుంది గదా? ఇక రిజర్వేషన్లు, క్రీమీ లేయర్లు అంటూ వృధా చర్చలు చేసే అవసరం ఉండదు మరి!

జస్టిస్ విక్రమ్ నాధ్ రిజర్వేషన్లు అనే ఆఫర్మేటివ్ యాక్షన్ వల్లనే ఇండియా మళ్ళీ కుల వ్యవస్థలోకి జారుకుందని ఎంత అర్ధరహితంగా వాకృచ్చారో చూడండి! “ప్రిమిటివ్ ఇండియాలో అసలు కుల వ్యవస్థ లేదు. వర్ణ వ్యవస్థను మెల్లగా కుల వ్యవస్థగా మార్చివేశారు… స్వతంత్రం తర్వాత రాజ్యాంగం అమలు చేయడం ద్వారా మనం మళ్ళీ కులరహిత సమాజంగా మారేందుకు ప్రయత్నించాము. కానీ సామాజిక సంక్షేమం పేరుతో, అణచివేతకు గురవుతున్న, వెనుకబడిన తరగుతులను అభివృద్ధి (uplift) చేయాలన్న పేరుతో మనం మళ్ళీ కుల వ్యవస్థ ట్రాప్ లోకి పడిపోయాము!”

భారత దేశ కుల వ్యవస్థను ఇంత ఘోరాతిఘోరంగా అర్ధం చేసుకున్న వ్యక్తి సుప్రీం కోర్టు న్యాయమూర్తి గా ఎంపికై ఎస్.సి కులాల వర్గీకరణ గురించిన తీర్పులు ఇచ్చే స్థానానికి ఎగబాక గలిగారంటే అది ఒక్క భారతదేశంలోనే సాధ్యం. జడ్జిల పదవులు కొన్ని కుటుంబాల మధ్యనే పంపకాలు జరుగుతున్న పరిస్ధితిని అనేకమంది గతంలో విమర్శించారు. ఈ పరిస్ధితి ఇక ఎలాంటి అభివృద్ధిగా చూడాలో జస్టిస్ విక్రమ్ నాధ్ ని అడిగితే భగవద్గీత లోని కర్మ సిద్ధాంతాన్ని వల్లించి సమర్ధిస్తారు కాబోలు!

అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాత్రం ఈ క్రీమీ లేయర్ గొడవ జోలికి పోలేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు ముందు ఉన్నది రెండే రెండు అంశాలు. రిజర్వడ్ కులాలను ఉప-వర్గీకరణ చేయడం అనుమతించవచ్చా లేదా? 2. ఇ.వి.చెన్నయ్య వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, (2005) 1 ఎస్.సి.సి 394 కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో “ఆర్టికల్ 341 కింద నోటిఫై చేసిన షెడ్యూల్డ్ కులాలు ఏకీకృత గ్రూపుగా పేర్కొనబడింది గనుక, ఆ తర్వాత ఆ కులాలను ఉప-వర్గీకరణ చేయడం కుదరదు” అని పేర్కొనడంలో వాస్తవికత (correctness) ఉన్నదా?

ఇవే సుప్రీం కోర్టు ముందు ఉన్న ప్రశ్నలు. ఎస్.సి, ఎస్.టి లకు క్రీమీ లేయర్ సిద్ధాంతం అప్లై చేయొచ్చా లేదా అని ఎవరూ అడగలేదు. కానీ జస్టిస్ బి.ఆర్. గవాయ్ అత్యుత్సాహానికి పోయారు. ఆయన అత్యుత్సాహంలో మిగిలిన ముగ్గురు భాగం పంచుకోవటమే కాకుండా భగవద్గీతను కూడా తెచ్చి చట్టాల్లో ఇరికించి పారేశారు. చివరికి రిజర్వేషన్లే దేశంలో కుల వ్యవస్థ కొనసాగటానికి కారణమని తేల్చేసేవరకూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెళ్ళిపోయారు. ఇలాంటి మేధావులా ప్రజల్లోని నేరస్తులను గుర్తించి, నేరాలను నిర్ధారించి శిక్షలు వేస్తున్నది?

హత విధీ!

మాజీ సుప్రీం న్యాయమూర్తి ఏ.ఏం.ఖన్వీల్కర్ ఇచ్చిన ఘోరమైన తీర్పును ఉపయోగించుకుని మోడి ప్రభుత్వం గుజరాత్ లో ముస్లింల మారణకాండకు బలైన బాధితుల తరపున పని చేసిన తీస్తా సెతల్వాద్ పై బూటకపు కేసు పెట్టి కక్ష సాధించేందుకు ప్రయత్నించింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్ తదితర నలుగురు జడ్జిలు చేసిన పరిశీలను, అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకుని, వాటిని ఉపయోగించుకుని రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే చర్యకు ఆర్.ఎస్.ఎస్/బి.జె.పి ప్రభుత్వాలు తెగబడితే అందుకు బాధ్యత ఈ నలుగురు జడ్జిలే వహించాల్సి ఉంటుంది.

వ్యాఖ్యానించండి