
అనుమానించినట్లే జరుగుతున్నది. ఇరాన్ గడ్డపై హమాస్ సంస్థ పోలిటికల్ లీడర్ ను హత్య చేయడం పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీ ఆదేశాలు ఇచ్చాడు.
ఆలీ ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక జులై 31 తేదీన తెలియజేసింది. సుప్రీం నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) అత్యవసరంగా జరిపిన సమావేశంలో ఖమెనీ ఈ ఆదేశాలు ఇచ్చాడని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐ.ఆర్.జి.సి) కు చెందిన ఇద్దరు సమాచారం ఇచ్చారని సదరు పత్రిక తెలిపింది. హనియే హత్య గురించి ప్రకటన వెలువడిన వెంటనే ఎస్.ఎన్.సి అత్యవసరంగా సమావేశం అయినట్లు తెలుస్తున్నది.
దాడికి, మరియు రక్షణకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలీ ఖమెనీ ఇరాన్ సైన్యం మరియు ఐ.ఆర్.జి.సి లకు ఆదేశాలు ఇచ్చాడు. దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ చేయబోయే ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలన్నది ఆలీ ఖమెనీ ఉద్దేశం. “యుద్ధం విస్తరించి, ఇజ్రాయెల్, అమెరికాలు రెండూ ఇరాన్ పై దాడికి దిగే పక్షంలో కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరాడు.
అమెరికా యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రం తూర్పు భాగానికి బయలుదేరాయని కొన్ని పత్రికలు తెలియజేశాయి. బయలుదేరడం కాదు, అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో తిష్టవేశాయి అని మరికొన్ని పత్రికలు తెలిపాయి.
ఇజ్రాయెల్ పైన ఒకే సమయంలో సంయుక్త దాడులు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ మిత్ర పక్షాలైన ఇరాక్, సిరియా, లెబనాన్ (హిజ్బోల్లా), హమాస్ లు ఒకేసారి ఇజ్రాయెల్ పై దాడి చేయవచ్చని తెలుస్తున్నది. కొన్ని నెలల క్రితం ఇదే తరహాలో, ఇరాన్ సైన్యం మరియు దాని మిత్ర పక్షాలు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, హైఫా నగరాల చుట్టుపక్కల ఉన్న మిలట్రీ లక్ష్యాలపై సంయుక్త దాడులు నిర్వహించాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం జరిగిందని పత్రికలు చెప్పాయి.
గత ఏప్రిల్ నెలలో సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరానియన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ డ్రోన్ లతో దాడి చేసింది. రాయబార కార్యాలయంకు అనుబంధంగా ఉన్న భవనంలో బస చేస్తున్న 18 మంది ఐ.ఆర్.జి.సి కుద్స్ ఫోర్స్ సభ్యులు ఈ దాడిలో చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యంతో పాటు, ఇరాక్ లోని పాపులర్ మిలీషియా, యెమెన్ లోని హుతీ సైన్యం, లెబనాన్ లోని హిజ్బొల్లా సైన్యం సంయుక్తంగా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి.
ఇరాన్, మిత్రపక్షాలు చేయనున్న దాడి ఏప్రిల్ దాడి తరహాలోనే ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఏప్రిల్ లో జరిగినట్లు గానే ఇజ్రాయెల్ కు చెందిన మిలట్రీ లక్ష్యాల పైనే ఈసారి కూడా దాడి జరగవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ లో పౌరుల ఆవాసాలపై దాడికి గురి కాకుండా ఇరాన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని ఇరాన్ అధికారులు చెప్పారు (ఎన్.వై.టి). ఏప్రిల్ దాడి తరహా దాడులతో పాటు ఇతర అవకాశాలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నది.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం వీలైనంత గరిష్ట ప్రభావం కలిగించేందుకు ఇరాన్ సైన్యం, తమ మిత్రులతో కలిసి సంయుక్త దాడి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుందని ఇరాన్ మిలటరీ కమాండర్లు చెప్పారు. దాడిలో యెమెన్, సిరియా, ఇరాక్ లు పాల్గొనే అవకాశం ఉన్నది.
ఇస్మాయిల్ హనీయే హత్యను ధృవీకరించడం మినహా ఇతర వివరాలేవీ ఇరాన్ అధికారులు ఇంతవరకు వెల్లడి చేయలేదు. దాడి మేమే చేశామని ఇజ్రాయెల్ కూడా ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు. కాగా అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, చెప్పింది కూడా చెప్పీ చెప్పనట్లుగా చెప్పటం, లేదా ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉండడం… ఇవన్నీ ఇజ్రాయెల్ అనుసరించే ఎత్తుగడలు. తానే దాడి చేశానని చెప్పకుండానే దాడికి తనదే బాధ్యత అన్న సంకేతాలను పరోక్షంగా పత్రికలకు అందజేయడం కూడా ఇజ్రాయెల్ అనుసరించే ఒక విధానం. దాడికి ఇజ్రాయెల్ దే బాధ్యత అని ఇరాన్, మిత్రపక్షాలు చేసే ప్రకటనను ఖండించకుండా మౌనంగా ఉండడం కూడా ఇజ్రాయెల్ అనుసరించే ఎత్తుగడలలో ఒకటి.
హనీయే తన హత్యకు ముందు ఇరానియన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమెనీతో సమావేశం అయ్యాడు. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వ ప్రారంభ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇరాన్ లో ఉండగా హనీయే హత్య జరిగింది.
“ఈ చర్య ద్వారా క్రిమినల్ మరియు జియోనిస్టు పాలకులే తమపై కఠిన శిక్ష అమలు అయేందుకు తగిన భూమికను ఏర్పరచుకున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గడ్డ పైనే ఆయన అమరుడు అయినందున హనియే చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం మా విధిగా మేము భావిస్తున్నాం” అని ఇరాన్ మత నాయకుడు అయితోల్లా ఆలీ ఖమెనీ ప్రకటించాడు.
హనియే హత్యకు ముందు ఇజ్రాయెల్ లిబనాన్ రాజధాని బీరుట్ పై కూడా దాడి చేసింది. ఈ దాడిలో హిజ్బొల్లా కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్ ఫాడ్ షుకూర్ ని హత్య చేసింది. కనుక హిజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ పై దాడికి సహకరిస్తుంది అనడంలో సందేహం లేదు.
ఇరాన్ నుండి స్పందనను ముందుగానే అంచనా వేసిన ఇజ్రాయెల్ తన గగన తలాన్ని హనియే హత్యకు ముందే మూసి వేసింది. జులై 31 తేదీన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ “చాలెంజింగ్ రోజులు ముందున్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. మనపై జరిగే దురాక్రమణ దాడికి అత్యధిక మూల్యం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం” అని ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరిస్తూ వాగ్దానం చేశాడు.
ఇరాన్ పై దాడి చేసి హనియే ని చంపడం ద్వారా పూర్తి స్థాయి యుద్ధాన్ని రెచ్చగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పదవి పోతుందన్న భయంతో సుప్రీం కోర్టు అధికారాలను కత్తిరిస్తూ చట్టం కూడా చేసిన బెంజిమిన్ నేతన్యాహుకు గాజా నుండి జరిగిన దాడి ఒక వరంలా కలిసి వచ్చింది. గాజాపైనా, ఇరాన్, సిరియా, లెబనాన్ ల పైనా దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నదని, ఈ యుద్ధంలో అమెరికా, పశ్చిమ ఐరోపాలు తప్పనిసరిగా ఇజ్రాయెల్ కు మద్దతుగా వస్తాయని ఇజ్రాయెల్ ప్రధాని భావిస్తున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.