ఇజ్రాయెల్ ఘాతుకం: హమాస్ నేత హనియే హత్య!


Ismail Haniyeh

ఇజ్రాయెల్ మరో ఘాతుకానికి తెగబడింది. హమాస్ సంస్థ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం ప్రారంభోత్సవం నిమిత్తం ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉండగా ఇస్మాయిల్ హనియే బస చేస్తున్న భవనంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హనియే మరణించినట్లు వివిధ వార్తా సంస్థలు తెలియజేశాయి. 

జులై 31 ఉదయం జరిగిన ఈ హత్యలో, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో హమాస్ నాయకులు అనేక మందిని ఇజ్రాయెల్ హత్య చేసింది. కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ప్రవాసం గడుపుతున్న అనేక మంది హమాస్ నేతలను మొసాద్ గూఢచారులు విష ప్రయోగంతో, కిరాయి హంతకులతో, డ్రోన్ దాడులతో హత్యలకు పాల్పడటం పరిపాటి అయినప్పటికీ ఈ హత్యలను పశ్చిమ దేశాలు ఏనాడూ ఖండించిన పాపాన పోలేదు.

హనియే హత్యను ఇరాన్ అత్యున్నత మిలటరీ సంస్థ ఇస్లామిక్ గార్డ్స్ కార్ప్స్ ధృవీకరించింది. హనియేతో పాటు ఆయనకు బాడీ గార్డ్ గా నియమించిన ఇరానియన్ సైనికుడు ఒకరు చనిపోయినట్లు తెలుస్తున్నది.

ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమ సంస్థగా తనను తాను చెప్పుకునే హమాస్, తమ నాయకుడి మరణంపై ప్రకటన విడుదల చేసింది. “టెహరాన్ లోని తన నివాసం పైన విద్రోహి జియోనిస్టు జరిపిన దాడిలో మరణించిన సోదరుడు, నాయకుడు, అమరుడు, ముజాహిద్ ఇస్మాయిల్ హనియే మరణాన్ని మన గొప్ప పాలస్తీనా ప్రజలకు, అరబ్ మరియు ఇస్లామిక్ జాతికి, ప్రపంచంలోని స్వేచ్ఛాయుత పౌరులందరికీ అశ్రునయనాలతో తెలియజేస్తున్నది” అని హమాస్ ప్రకటించింది.

అమెరికా నాయకత్వం లోని పశ్చిమ సామ్రాజ్యవాద కూటమి (అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జపాన్) కి మధ్య ప్రాచ్యంలో ప్రత్యక్ష ప్రతినిధిగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్నది. అమెరికా నేతృత్వం లోని ఈ ఆధిపత్య కూటమిని, ఇరాన్ నేతృత్వం లోని ప్రతిఘటనా కూటమి (ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, లెబనాన్ లోని హిజ్బొల్లా, హమాస్) తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది.

ఈ ప్రతిఘటనను బలహీనపరిచి అణచివేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ద్వారా అనునిత్యం గాజా, ఇరాక్, లెబనాన్, ఇరాన్, యెమెన్ లపై అనేక యేళ్లుగా దాడులు చేస్తున్నది. ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమెరికాయే స్వయంగా రంగం లోకి దిగి ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్ లపై అనేకసార్లు డ్రోన్ దాడులు జరిపి అనేక మంది నాయకులను హత్య కావించింది.

తాను ఆల్-ఖైదా, ఐసిస్ టెర్రరిస్టులపై దాడులు చేస్తున్నట్లు అమెరికా చెప్పుకుంటుంది. కానీ ఈ రెండు టెర్రరిస్టు సంస్థలకు ప్రాణ ప్రతిష్ట చేసింది అమెరికాయే. మధ్య ప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తున్న దేశాలలో వారిని ప్రవేశపెట్టి టెర్రరిస్టు చర్యలు జరిపించేది కూడా అమెరికాయే. ఒక్కోసారి టెర్రరిస్టు సంస్థల నాయకులు తమ సొంత నిర్ణయాలు చేసినప్పుడు, తన మాట విననప్పుడు వారిని కూడా డ్రోన్ దాడులతో అమెరికా చంపేస్తుంది. అమెరికా ప్రవేశపెట్టిన టెర్రరిస్టులకు తగిన సహాయం చేయటంలో బ్రిటన్, ఫ్రాన్స్ లు ఎప్పుడూ ముందు వరసలో ఉంటాయి. తద్వారా మధ్య ప్రాచ్యం లోని చమురు దేశాలలో చమురు దోపిడిలో తగిన వాటా పొందుతాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ అయితొల్లా ఆలీ ఖమేనీతొ ఇస్మాయిల్ హనీయే

హమాస్ నేత హనియే ఎప్పుడూ చెప్పే మాట పాలస్తీనా సాధన జరగాలంటే అత్యధిక మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. “మేము ఈ మూల్యం చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాం. పాలస్తీనా కోసం, శక్తిమంతుడైన దైవం కోసం, మన జాతి గౌరవాన్ని కాపాడటం కోసం అమరత్వాన్ని ముద్దాడేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధం” అన్న హనియే మాటలను హమాస్, మరో ప్రకటనలో పునరుద్ఘాటించింది.

గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఒక దాడిలో ఇస్మాయిల్ హనియే కు చెందిన ముగ్గురు కుమారులు, నలుగురు మనుమలు దుర్మరణం చెందారు.

ఇజ్రాయెల్ నిరంతర దాడుల నేపధ్యంలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియే 2019లో గాజా వదిలి పెట్టి కతార్ లో ప్రవాసం గడపడం మొదలు పెట్టాడు. గాజాలో ఆయన స్థానంలో టాప్ కమాండర్ గా యెహ్యా సినావర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్ నిర్మించిన ఇనప కంచెను ఛేదించి ఆ దేశంపై దాడి చేసి 200 మంది వరకు యూదు సైనికులను, పౌరులను కిడ్నాప్ చేసిన ఘటనకు యెహ్యా సినావర్ కీలక వ్యూహ కర్తగా వ్యవహరించాడని ఇజ్రాయెల్ భావిస్తున్నది.

ఈ నేపధ్యంలో యెహ్యా సినావర్ ను ఎలాగైనా చంపి తీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. గాజాపై అత్యంత క్రూరమైన యుద్ధానికి తెగబడిన ఇజ్రాయెల్, సినావర్ బదులు ఇప్పటి వరకు 40,000 మంది గాజా పౌరులను బలి తీసుకుంది. సమస్త ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను, గృహాలను నేలమట్టం చేసింది. రోడ్లు, వంతెనలను నాశనం చేసింది. చనిపోయిన వారిలో నాలుగింట మూడు వంతుల మంది స్త్రీలు, పిల్లలే అని గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

హనియే హత్యను వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఖండించాడు. “ఇది ఇజ్రాయెల్ పిరికి చర్య” అని అబ్బాస్ ప్రకటించాడు. “ఈ హత్య, మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ప్రమాదకర రీతిలో విస్తరించేందుకు దారి తీస్తుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాలస్తీనా స్వతంత్ర ఉద్యమ నేత యాసర్ అరాఫత్ ను పోలోనియం విష ప్రయోగంతో ఇజ్రాయెల్ హత్య చేసిన దరిమిలా, ఫతా మరియు పాలస్తీనా ఆధారిటీ అధ్యక్షుడుగా పదవి చేపట్టిన మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా స్వతంత్ర ఉద్యమానికి ద్రోహిగా అవతరించాడు. ఇజ్రాయెల్ తో కుమ్మక్కైనాడు. వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్, అక్రమ యూదు సెటెల్మెంట్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రతిఘటించకుండా మిన్నకుండిపోయాడు. పైరవీలతో ఆస్తులు పెంచుకున్నాడు.

యాసర్ అరాఫత్ నాయకత్వంలో శక్తివంతంగా ఎదిగిన సెక్యులర్ ఫతా ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు, కతార్ సహాయంతో ఇస్లామిక్ సంస్థ హమాస్ ఏర్పడి అభివృద్ధి చెందడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వమే ప్రోత్సాహం అందజేసింది. అనంతరం హమాస్ ను టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. అమెరికా చేత హమాస్ ను టెర్రరిస్టు సంస్థగా ప్రకటింప జేసింది. ఇప్పుడు హమాస్ టెర్రరిస్టు సంస్థ కాబట్టి పాలస్తీనా స్వతంత్ర ఉద్యమంపై ఎన్ని రకాలుగా దాడి చేసినా అది న్యాయబద్ధమైనదే అన్న ఆమోదాన్ని తనకు తాను ఇచ్చేసుకుంది. ఈ అమానుష ఆమోదాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు ఐరాస ద్వారా న్యాయబద్ధం చేశాయి.

అమెరికా-ఇజ్రాయెల్ జాత్యహంకార పాలనకు, వలస ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతిఘటనా అక్షం (ఇరాన్, ఇరాక్, సిరియా, హిజ్బొల్లా, హమాస్, యెమెన్) కు నాయకత్వం వహిస్తున్న ఇరాన్ అంటే ఇజ్రాయెల్ కు భయం. తన ఉనికికి ఇరాన్ ఎప్పుడైనా ప్రమాదకరమే అని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తున్నదంటూ ప్రచారం చేసి ఆ దేశంపై పశ్చిమ దేశాలు అనేకానేక అమానవీయ షరతులు విధింపజేసింది. మెడికల్ ప్రయోజనాల నిమిత్తం ఇరాన్ నిర్మించుకున్న రియాక్టర్ లను, అణు ఇంధన శుద్ధి కర్మాగారాలను కంప్యూటర్ హ్యాకింగ్ ద్వారా కూల్చివేసేందుకు, వ్యర్ధం చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇరాన్ అణు శాస్త్రవేత్తలు అనేక మందిని మొసాద్ చేత హత్య చేసింది.

ఇప్పుడు హనియే హత్య ద్వారా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెట్రేగిపోవటానికి ఇజ్రాయెల్ కారణంగా నిలిచింది. హనియేను ఇరాన్ లోనే హత్య చేసినందుకు, ఇరాన్, ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్య తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ చర్య ఈ రూపంలో ఉండబోతున్నది అన్న అంశం పైన అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.

వ్యాఖ్యానించండి