మోడీ పుణ్యం: కార్పొరేట్ల కంటే మిడిల్ క్లాస్ చెల్లించే పన్నులే ఎక్కువ!


ఇండియాలో చాలా మందికి తెలియని సంగతి ఏమిటంటే ఇక్కడి కార్పొరేట్ కంపెనీల కంటే మధ్య తరగతి జీవులు చెల్లిస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ అని. బిజెపి ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలు ఈ పరిస్ధితికి దారితీశాయి.

యుపిఏ హయాంలో కార్పొరేట్లు తెగ పన్నులు కట్టేశాయని కాదు గానీ, కొద్దో గొప్పో మిడిల్ క్లాస్ కంటే కాసింత ఎక్కువ పన్నుల ఆదాయం కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చేది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 2021-22 ఆర్ధిక సం. వరకు కార్పొరేట్ పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కొద్దిగా ఎక్కువగా ఉండేది. 2022-23 నుండి ఈ పరిస్ధితి మారుతూ వచ్చింది. 

బడ్జెట్ ప్రకటనకు ఒక రోజు ముందు, అంటే జులై 22 తేదీన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్ధిక సర్వే ను విడుదల చేశారు. ఇది ప్రతి యేడూ జరిగే ప్రక్రియ. ఈ యేడు విడుదల చేసిన ఆర్ధిక సర్వేలో ప్రభుత్వమే ఈ నిజాన్ని వెల్లడి చేసింది. 

2019-20 సం.లో కార్పొరేట్ కంపెనీలు చెల్లించిన వాస్తవ పన్నుల మొత్తం రు 5,56,876 కోట్లు కాగా ఉద్యోగులు, మధ్యతరగతి చెల్లించిన ప్రత్యక్ష పన్నులు (ఆదాయ పన్ను) రు 4,92,654 కోట్లు. అంటే ఆ యేడు మిడిల్ క్లాస్ ఆదాయ పన్ను కంటే కార్పొరేట్ కంపెనీలు రు 64,222 కోట్లు అధికంగా ప్రభుత్వానికి చెల్లించారు. 

ఆర్ధిక సర్వేలో ఎందుకనో 2020-21 లెక్కలు ఇవ్వలేదు. బహుశా కోవిడ్ కాలంలో తాము విధించిన లాకౌట్ వలన కార్పొరేట్, ప్రజల ఆదాయాలు రెండూ తగ్గిపోయిన సంగతి వెల్లడి అవుతుందన్న సంకోచం వల్లనో ఏమో తెలియదు. ఆర్టికల్ ఆరంభంలో సిఏంఐఇ సంస్థ నుండి సేకరించిన గ్రాఫ్ ద్వారా కార్పొరేట్ పన్నులు 4.69 లక్షల కోట్లు, ఆదాయ పన్ను వసూళ్లు 4.57 లక్షల కోట్లు ఉన్న సంగతి చూడవచ్చు. 

2021-22 ఆర్ధిక సం. లో కార్పొరేట్లు రు 7,12,307 కోట్లు చెల్లించగా మధ్య తరగతి రు 6,96,243 కోట్లు చెల్లించింది. అంటే మిడిల్ క్లాస్ కంటే కార్పొరేట్లు రు 15,794 కోట్లు మాత్రమే ఎక్కువ  ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి చెల్లించారు. కార్పొరేట్లు, మిడిల్ క్లాస్ కంటే చెల్లించిన ఎక్కువ మొత్తం రు 64, 222 కోట్ల నుండి రు 15,794 కోట్లకు తగ్గిపోయింది. ఈ అంకెలు కూడా అంచనా కాదు, వాస్తవంగా వసూలు అయిన మొత్తాలు. 

2022-23 నుండి పరిస్ధితి తిరగబడింది. మిడిల్ క్లాస్ రు 8,33,260 కోట్ల మేర ఆదాయ పన్ను  వాస్తవంగా చెల్లించగా కార్పొరేట్ కంపెనీలు తమ ఆదాయం పైన రు 8,25,834 కోట్లు చెల్లించాయి. అనగా కార్పొరేట్ల కంటే సాధారణ మిడిల్ క్లాస్ వర్గం రు 7,426 కోట్లు అధికంగా  ఆదాయ పన్నుల ఆదాయాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇవి కూడా బడ్జెట్ అంచనా లెక్కలు కాదు. అయితే ఇవి సవరించబడిన అంచనాలు. కొంతకాలం ఆగితే వాస్తవ అంకెలు తెలుస్తాయి.

ఇక 2023-24 సం.కి వస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయం! గత యేడాది అంటే 2023 ఏప్రిల్ 1 తేదీ నుండి 2024 మార్చి 31 తేదీ వరకు మిడిల్ క్లాస్ వర్గం (సవరించిన అంచనాల ప్రకారం) ఏకంగా రు 10,22,325 కోట్ల ఆదాయ పన్ను చెల్లించగా కార్పొరేట్ కంపెనీలు చెల్లించిన ఆదాయ పన్ను రు 9,22,675 కోట్లు మాత్రమే. అనగా మిడిల్ క్లాస్ ప్రజలు, కార్పొరేట్ కంపెనీల కంటే ఏకంగా రు 99,650 కోట్లు ఎక్కువ ప్రభుత్వానికి చెల్లించారు. ఇది లక్ష కోట్ల రూపాయలకు కేవలం రు 350 కోట్లు మాత్రమే తక్కువ. 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25 బడ్జెట్ లో మిడిల్ క్లాస్ పైన కేంద్ర ప్రభుత్వం తన ఆశల్ని ఇంకా పెంచేసుకుంది. ఈ యేడు మిడిల్ క్లాస్ నుండి రు 11,56,000 కోట్ల ఆదాయ పన్ను వసూలు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. కార్పొరేట్ కంపెనీల నుండి రు 10,42,830 కోట్ల ప్రత్యక్ష పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కార్పొరేట్ల కంటే మిడిల్ క్లాస్ నుండి రు 1,13,170 కోట్ల అధిక పన్నులను గుంజాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఈ లెక్కలు ఎవరూ ఊహించి చెబుతున్నవి కావు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే నుండి సేకరించిన వివరాలు మాత్రమే ఇవి. 

గతంలో, నరేంద్ర మోడి ప్రభుత్వం అధికారం లోకి రాక ముందు ఉద్యోగులపై ఆదాయ పన్ను విధించడంలో ఆదాయ పన్ను శాఖ పట్టు విడుపులతో ఉండేది. కొన్ని అంశాలు ఆదాయ పన్ను చట్టంలో ఉన్నప్పటికీ వాటిని స్ట్రిక్ట్ గా అమలు చేయకుండా ముఖ్యంగా మధ్య తరగతి ఆదాయ సెక్షన్ పైన కాస్త పట్టు విడుపులతో వ్యవహరించేది.

ఉదాహరణకి హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకు వాళ్ళు చెల్లించే వడ్డీ మొత్తాన్ని (గరిష్టంగా రెండు లక్షల రూపాయలు) ఆదాయం పన్ను నుండి మినహాయింపు ఉండేది. ఇందులో ఉప నిబంధన ప్రకారం ఉద్యోగులు ఇంటి పైన రెండు, మూడు సార్లు అదనంగా ఆధునీకరణ (రినోవేషన్) కోసం రుణం తీసుకుంటే గనక అలా తీసుకునే అదనపు రుణాలపై పడే మొత్తం వడ్డీని ఆదాయం నుండి మినహాయించ కూడదు, కేవలం ఒక్క రుణం పైన మాత్రమే పూర్తి వడ్డీని మినహాయింపు ఇచ్చి మిగిలిన అన్నీ రుణాలపైన వసూలు చేసే వడ్డీలో కేవలం రు 10,000 లు మాత్రమే మినహాయింపు ఇస్తారు. 

ఉదాహరణకి మొదటి హౌసింగ్ లోన్ పై వడ్డీ ఏడాదిలో రు 1,50,000, రినొవేషన్ నిమిత్తం తీసుకున్న రుణంపై రు 70,000 వడ్డీ చెల్లిస్తే, మొత్తం రు 2,20,000 లు వడ్డీ నిమిత్తం చెల్లించినట్లు. గరిష్ట పరిమితి 2 లక్షలు కనుక ఆ 2 లక్షల మేర మినహాయింపు ఋణ గ్రహీతలు క్లెయిమ్ చేసే వారు. 

కానీ బిజెపి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి హయాంలో పరిస్ధితి మారిపోయింది. మోడీ/బిజెపి పాలనలో మొదటి రుణంపై రు 1,50,000 లు, రెండో రుణం పై వడ్డీ 70,000 చెల్లించినా అందులో రు 10,000 ల వరకు మాత్రమే వడ్డీ మినహాయింపుకు అనుమతించడం ప్రారంభించారు. అనగా గతంలో కంటే మినహాయింపు రు 2 లక్షల నుండి రు 1,60,000 లకు తగ్గిపోయింది. దానితో ఉద్యోగుల నుండి వసూలు అయ్యే ఆదాయ పన్ను 2014-15 నుండి భారీ పెరుగుదల నమోదవటం మొదలయింది. 

మధ్య తరగతి ప్రజలు మరియు ఉద్యోగులకు, కార్పొరేట్ కంపెనీలకు అందరికీ ఆయా వర్గాలకు వర్తించే నిబంధనలను సంపూర్ణంగా అమలు చేస్తే మిడిల్ క్లాస్ పన్నులకూ, కార్పొరేట్ పన్నులకూ ఇంత తేడా ఉండదు. రుణాలను పన్ను నుండి మినహాయించడం అటుంచి వాళ్ళ రుణాల మొత్తాన్ని రైట్-ఆఫ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటోంది.

9 వేల కోట్ల పన్ను ఎగవేసి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యాను, ఐపిఎల్ కుంభకోణానికి పాల్పడిన లలిత్ మోడి, రు 28,000 కోట్ల వజ్రాల కుంభకోణంకు పాల్పడ్డ నీరవ్ మోడి,  ఆయన బందువు మెహుల్ చోస్కీ లను  ఇంటర్ పోల్ ద్వారా, నేరస్థుల అప్పగింత ఒప్పందం ద్వారా వెనక్కి రప్పించే దమ్ము ప్రభుత్వాలకు లేదు. కార్పొరేట్ కంపెనీల రుణాలను లక్షల కోట్ల రూపాయల రుణాలను ఒక్క కలం పోటుతో రైట్-ఆఫ్ చేసేస్తాయి. కానీ ఒక మధ్య తరగతి ఉద్యోగి ఒక 40 లేదా 50 వేల రూపాయలు ఆదాయ పన్ను నుండి మినాయించే అవకాశాన్ని మాత్రం ప్రభుత్వాలు ఇవ్వలేవు. 

ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు ఎలా నమ్మడం?

వ్యాఖ్యానించండి