
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనగా జులై 23 తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎప్పటి లాగానే కార్పోరేట్ సూపర్ ధనిక వర్గాలకు రాయితీలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి మధ్య తరగతి ఉద్యోగులకు మాత్రం నాలుగు మెతుకులు విధించారు.
ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధింపును ఉద్యోగులు కలిగి ఉన్నారు. ఒకటి ఓల్డ్ రెజిం, రెండు కొత్త రెజిం. రెండేళ్ళ క్రితం కొత్త రెజిం అంటూ బిజెపి ఆర్ధిక మంత్రి ప్రకటించిన ఆదాయ పన్ను విధానంలో రాయితీలను పూర్తిగా తొలగించారు. కేవలం 50 వేల రూపాయల మేర స్టాండర్డ్ డిడక్షన్ కు మాత్రమే అనుమతించారు. ప్రస్తుత బడ్జెట్ లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ ను రు 75,000 లకు పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆదాయంలో అంత మొత్తాన్ని తగ్గించి అక్కడి నుండి ఆదాయ పన్ను లెక్కలు మొదలు పెడతారు.
వాస్తవానికి బడ్జెట్ కు ముందు స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల నుండి లక్ష రూపాయలకు పెంచనున్నట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగులు పోనీలే, ఇప్పుడన్నా మా గురించి పట్టించుకుంటున్నారు అని కాస్త ఆశ పడ్డారు. తీరా చూస్తే ముష్టి విదిల్చినట్లు కేవలం మరో పాతిక వేలు మాత్రమే స్టాండర్ డిడక్షన్ పెంచి ఉద్యోగులను ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడేలా చేశారు.
ఆదాయం పన్ను స్లాబ్ లలో కూడా స్వల్ప మార్పులను ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టారు. మొదటి స్లాబ్ నుండి నాలుగవ స్లాబ్ వరకు ఒక లక్ష రూపాయల చొప్పున పెంచారు. కానీ 20 శాతం 30 శాతం పన్నులు విధించే చివరి రెండు స్లాబ్ ల పరిమితిని మాత్రం యధావిధిగా ఉంచేశారు. ఈ మార్పుల వల్ల మధ్య తరగతికి భలే మేలు జరుగుతుందని, వాళ్ళ జేబుల్లో మరింత డబ్బు మిగులుతుందని ప్రధాని మోడీ కితాబు ఇచ్చారు. కానీ ఆయన చెప్పినంత సీన్ లేదని స్లాబ్ లను చూస్తే అర్ధం అవుతుంది.
| 2023-24 | పన్ను రేటు | 2024-25 | పన్ను రేటు |
| Rs 3 లక్షల వరకు | సున్న | Rs 3 లక్షల వరకు | సున్న |
| Rs 3 – 6 లక్షలు | 5% | Rs 3 – 7 లక్షలు | 5% |
| Rs 6 – 9 లక్షలు | 10% | Rs 7 – 10 లక్షలు | 10% |
| Rs 9 – 12 లక్షలు | 15% | Rs 10 – 12 లక్షలు | 15% |
| Rs 12 – 15 లక్షలు | 20% | Rs 12-15 లక్షలు | 20% |
| Rs 15 లక్షలకు పైన | 30% | Rs 15 లక్షలకు పైన | 30% |
పై పట్టిక ద్వారా మనకు అర్ధం అయ్యేది ఏమిటి అంటే కేవలం 12 లక్షల వార్షిక ఆదాయం (నెలకు లక్ష రు.) ఉన్న వారికి మాత్రమే నలుసంత ఉపశమనం ఉంటుంది. ఈ ఉపశమనం ఎంతయ్యా అంటే మొత్తం మీద 15 వేల రూపాయల పన్ను తగ్గుతుంది. అంటే నెలకు రు 1250 లు వారికి మిగులుతుంది. ఈ 1250 రూపాయలకు ఎన్నెన్ని సరుకులు ఉద్యోగులు కొనగలరో ఆర్ధిక మంత్రి, ప్రధాన మంత్రి గార్లు చెప్పి ఉంటే బాగుండేది.

ఇలా అడగడం ఎందుకు అంటే బడ్జెట్ ప్రకటించాక మోడీ ఇలా వాకృచ్చారు. “ఈ బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గం నూతన శక్తిని పుంజుకుంటుంది. వారి విద్య, నైపుణ్యం పెంచుకునేందుకు సువర్ణావకాశం లభిస్తుంది”. రు 1250 లతో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంత శక్తి, ఎంత విద్య, ఎంత నైపుణ్యం సాధిస్తారో చూడాలిక!
నెలకు లక్ష రూపాయల వేతనం అనగానే చాలా మందికి అమ్మో అంతా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసి నెలకు 2 లక్షల పై చిలుకు ఆదాయం ఉన్న ఉద్యోగి అన్ని కటింగ్ లు పోను నెలకు మూడు వేలు అందుకుంటున్నాడు. మరో నాలుగేళ్ళలో రిటైర్ అవ్వబోయే ఆయన పరిస్ధితి అలా ఉంది.
ముచ్చటపడి ఒక ఫోన్ కొంటే ఇఎంఐ కట్టాలి (ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించే పరిస్ధితి లక్ష రూపాయల జీతగాడికి కూడా లేదు, ఈ రోజుల్లో.) కొడుకు, కూతురు చదువులకు ఎల్.కే.జి నుండి ఇంటర్ వరకు పదుల వేల ఫీజులు కట్టాలి. ప్రైవేటు కార్పోరేట్ బడులు, కాలేజీలకు విస్తృతంగా అవకాశాలు ఇచ్చేసి, సర్కార్ బడి, కాలేజీలను చల్లగా, మెల్లగా మూసేస్తూ వచ్చాక కాస్త నాణ్యమైన విద్య అందుకోవాలంటే లక్ష రూపాయలను తాకే ఫీజులు చెల్లించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. పిల్లల ఫీజుల కోసం అప్పులు చేసి ప్రతి నెలా ఇఎంఐలు చెల్లించేందుకు ఉద్యోగులు అలవాటు పడిపోయారు. అంటే రాబోయే పది, పదిహేను సంవత్సరాల ఆదాయాన్ని కూడా ఇప్పుడే ఖర్చు చేసేసే పరిస్ధితి!
ఇక పెట్రోలు, గ్యాస్ ల నుండి బియ్యం, పప్పులు, కూరగాయలు, చివరకు ఉల్లి పాయలు కూడా మధ్య తరగతి ఉద్యోగి జేబుకి భారీ చిల్లులు పెడుతున్నాయి. విచిత్రంగా ధరలు ఇంతలా పెరుగుతున్నా ద్రవ్యోల్బణం కట్టడి చేసేశామని ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి ధరలను లెక్కలోకి తీసుకుని ద్రవ్యోల్బణం లెక్కిస్తున్నారన్నది ప్రజలకు ఒక మిస్టరీ! ప్రజలు చెల్లించేది రిటైల్ ధరలు, ప్రభుత్వం ద్రవ్యోల్బణం ను లెక్కించేది మాత్రం హోల్ సేల్ ధరలతో! రిటైల్ ద్రవ్యోల్బణం కూడా లెక్కిస్తున్నారు గానీ ప్రభుత్వ విధానాలు మాత్రం హోల్ సేల్ ధరలపై ఆధారపడిన ద్రవ్యోల్బణంను పరిగణిస్తూ రూపొందిస్తున్నారు.
మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల పరిస్ధితి ఇలా ఉంటే అనేక పరిశ్రమల్లో, ఫ్యాక్టరీలలో, రియల్ ఎస్టేట్ రంగంలో, హోటళ్ళు ఆసుపత్రులు లాంటి సేవల రంగంలో భవన నిర్మాణ రంగంలో, పొలాల్లో పని చేసే పదుల కోట్ల కూలీ జనం పరిస్ధితి ఎలా ఉంటుందో ఎవరికి వాళ్లు ఊహించుకోవలసిందే. కాంట్రాక్టీకరణ మొదలయ్యాక పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ కార్మిక వర్గం శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను గంగలో నిమజ్జనం చేసేశారు.