
బిజేపి ప్రభుత్వాల మతతత్వ పూరిత ఆదేశాలు నానాటికి శృతి మించుతున్నాయి. ఏదో విధంగా ముస్లింలపై వ్యతిరేకతను సృష్టించి తగవులు పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించినప్పటికీ లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఐనప్పటికీ బిజేపి నేతృత్వం లోని ఉత్తరాది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో తమ ప్రయత్నాలు మానుకోవడం లేదు.
తాజాగా ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు కన్వర్ యాత్ర పొడవునా ఉన్న వివిధ ఆహార పదార్ధాల తయారీ దుకాణాల యజమానులు తమ దుకాణం ముందు ఆ దుకాణం యజమాని పేరు, దుకాణంలో పని చేసే సిబ్బంది పేర్లు వెల్లడి చేస్తూ బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశాయి.
మొదట ముజఫర్ నగర్ జిల్లా ఎస్.ఎస్.పి జులై 17 తేదీన ఈ ఆదేశాలు జారీ చేయగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఆదేశాలను తీవ్రంగా ఖండించాయి. బిజెపిలో ఎప్పటినుంచో పని చేస్తూ కేంద్ర మంత్రిగా, బిజేపి అధికార ప్రతినిధిగా, ముఖ్య నేతగా ఉంటూ వచ్చిన ముక్తార్ అబ్బాస్ నక్వీ సైతం ఈ ఆదేశాలను తీవ్ర స్థాయిలో ఖండించాడు. “ఈ ఆదేశాలు అంటరానితనాన్ని తిరిగి కొత్త రూపంలో ప్రవేశ పెట్టడానికి దారి తీస్తాయి” అని నిరసించాడు.
కానీ ముఖ్తర్ అబ్బాస్ నక్వీ ఖండనను బిజేపి పార్టీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకోలేదు. పైగా ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా రంగం లోకి దిగి ఈ ఆదేశాలు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని జులై 19 తేదీన సరికొత్త ఆదేశాలు జారీ చేశాడు. ఆ వెంటనే ఈ ఆదేశాలను ఒక అంటు రోగంలా ఇతర రాష్ట్రాలు కూడా అంటించు కోవటం మొదలు పెట్టాయి. ఉత్తర ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవే ఆదేశాలను అమలు చేయాలని తమ తమ రాష్ట్రాల్లో ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ముఖ్తర్ తన ఖండనను వెనక్కి తీసుకుని “ఈ ఆదేశాలు యాత్ర పరిశుద్ధతను కాపాడేందుకు ఉద్దేశించినవి మాత్రమే. అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి, ఒక ప్రత్యేక గ్రూపును ఉద్దేశించిన ఆదేశాలు కావు” అంటూ వెనక్కి తగ్గాడు. దుకాణాల యజమానుల పేర్లు ప్రకటిస్తే యాత్ర ఎలా పరిశుద్ధం ఎలా అవుతుందో నక్వీ చెప్పి ఉండాల్సింది. అసలు ఇన్నాళ్ళూ యాత్ర పరిశుద్ధంగా జరగలేదనా నక్వీ, బిజెపిల ఉద్దేశ్యం?!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం మరీ ఘోరం. అసలు కన్వర్ యాత్ర ఆ రాష్ట్రం గుండా ఏ దశలోనూ ప్రవేశించదు. అయినా కూడా మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దుకాణం, యజమాని మరియు సిబ్బంది పేర్లు రాసిన బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
కన్వర్ యాత్ర గురించి…
కన్వర్ యాత్ర ప్రతి ఏటా శ్రావణ మాసంలో జరుగుతుంది. శివ భక్తులు గంగా నది ఒడ్డున 240 కి.మీ దూరం మేర వివిధ పూజా వస్తువులను కావడిలో మోస్తూ కాలి నడకన ప్రయాణం చేస్తూ హిందూ పుణ్య క్షేత్రాలైన హరిద్వార్, గోముఖ్, గంగోత్రి (ఉత్తర ఖండ్), ఆజగైభినాథ్, సుల్తాన్ గంజ్ (భాగల్పూర్, బీహార్) లను సందర్శిస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా గుండా ఈ యాత్ర సాగుతుంది. యాత్ర చేసే వారిని కన్వరియాలు లేదా భోలే అని పిలుస్తారు. వివిధ పుణ్య క్షేత్రాల వద్ద (పవిత్ర) గంగా జలాన్ని పాత్రలలో నింపుకుని కావిళ్లలో మోస్తూ స్థానిక శివాలయాల్లో (భాగ్ పట్ జిల్లా లోని పురా మహాదేవ్ ఆలయం, మీరట్ లోని అగర్ నాథ్ ఆలయం, వారణాసి లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, దియోఘర్ లోని బైద్యనాథ్ ఆలయం మొ.వి) శివలింగాన్ని అభిషేకం చేస్తారు.
ఈ యాత్రలో కోట్ల మంది పాల్గొంటారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2022 లో 4 కోట్ల మంది, 2023లో 4.07 కోట్ల మంది (ఇందులో 21 లక్షల మంది మహిళలు ఉన్నారట) యాత్రలో పాల్గొన్నారని తెలుస్తోంది. గత ఏడు 46 లక్షల వాహనాలలో భక్తులు హరిద్వార్ ను సందర్శించారట. దేశం నలుమూలల నుండి జనం ఈ యాత్రలో పాల్గొంటారని పత్రికలు చెబుతున్నాయి. కానీ దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ యాత్ర గురించి విన్నవారు చాలా తక్కువ. తిరుపతి (కొన్ని దశాబ్దాలుగా అయ్యప్ప) తప్ప మరొక పుణ్యక్షేత్రం దక్షిణ భారతంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. అందుకే తిరుపతి కేంద్రంగా బిజేపి నేతలు ఘర్షణలు రగిల్చేందుకు ప్రయత్నించి విఫలమైనారు. ఈ ఏడు కన్వర్ యాత్ర జులై 22 నుండి ప్రారంభం కానుంది.
ఈ యాత్రను మొదట శివ భక్తుడు పరశురాముడు (విష్ణువు అవతారాల్లో ఒకటి) చేసినట్లు కాదు, కాదు మొదట రావణుడు చేశాడు అనీ పురాణ కధలు ప్రచారంలో ఉన్నాయి. పరశురాముడు మొదట ఈ యాత్ర చేశాడన్న కధలో మధ్య యుగాల్లో శైవులు, వైష్ణవుల మధ్య తలెత్తిన తీవ్ర ఘర్షణలను నివారించే ఉద్దేశ్యం ఉండి ఉండవచ్చు. రావణుడి యాత్ర గురించిన కధ మరింత ఆసక్తికరం పాల కడలి చిలకడం, మొదట వచ్చిన గరళాన్ని శివుడు మింగి గొంతులో ఉంచుకోవడం, విషం వల్ల వేడిమితో రగిలిపోవటం, రావణుడు యాత్ర జరిపి గంగా జలంతో లింగాభిషేకం చేయడంతో ఆ వేడిమి చల్లారడం వరకు ఈ కధ నడుస్తుంది.
మత విద్వేషం రగల్చడమే లక్ష్యం?
కన్వర్ యాత్ర పొడవునా దుకాణాలు తమ యజమానులు, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలన్న ఆదేశం వెనుక ముస్లింలను వేధించి, వారి వ్యాపారాలను దెబ్బ తీసి, పనిలో పనిగా ఇరు మతాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే ఉద్దేశ్యంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్, బి.ఎస్.పి, ఎస్.పి పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలు కఠిన వాస్తవం అనడంలో సందేహం లేదు.
కన్వర్ యాత్ర వెంట, ముఖ్యంగా ముజఫర్ నగర్ జిల్లాలో సాగే యాత్ర పొడవునా ప్రధానంగా ముస్లింల దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా యుపితో పాటు, ఈ ఆదేశాలు జారీ చేసిన మరో రాష్ట్రం ఉత్తర ఖండ్ లో హిందువుల దుకాణాల్లో కూడా ముస్లిం సిబ్బంది అనేక మంది పని చేస్తున్నారని పత్రికలు వెల్లడించాయి. యజమాని, సిబ్బంది పేర్లు బోర్డుల్లో రాసి ప్రదర్శించాలన్న ఆదేశాల వెనుక ముస్లింలు యజమానిగా ఉన్న దుకాణాలు, హిందువు యజమానిగా ఉన్నప్పటికీ ముస్లింలకు పని కల్పించిన హిందూ యజమానుల దుకాణాలను ఇతర దుకాణాల నుండి వేరు చేసి చూపడమే ప్రధాన లక్ష్యం. తద్వారా ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది ఉన్న దుకాణాలను యాత్రీకులు సందర్శించకుండా చేసే కుటిల ప్రయత్నానికి బిజేపి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలపై మొదట అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఎపిసిఆర్) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత టిఎంసి పార్టీకి చెందిన బెంగాల్ ఎంపి మహువా మొయిత్ర, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ ఝా, కాలమిస్టు ఆకార్ పటేల్ లు కూడా వేరు వేరుగా పిటిషన్ లు దాఖలు చేశారు. కన్వర్ యాత్ర సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు మత విభజనను రగుల్కొలిపే ప్రమాదం ఉందని పిటిషన్లు వాదించాయి. రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 15, 17, 19 లు పౌరులకు గ్యారంటీ చేసిన ప్రాధమిక హక్కులను ఇవి ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా దుకాణాల యజమానులు, సిబ్బంది లు మతపరమైన దాడులకు తేలిక లక్ష్యంగా మారుతారని పిటిషనర్లు వాదించారు.
పిటిషనర్ల తరపున కాంగ్రెస్ నేత, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ డా. అభిషేక్ మను సింఘ్వీ ప్రధానంగా వాదించాడు. ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలా లేక పత్రికా ప్రకటనలా అని సుప్రీం కోర్టు ఆరా తీసింది. మొదట పత్రికా ప్రకటనగా వెలువడ్డ ఆదేశాలు తర్వాత ముఖ్యమంత్రి యోగి కూడా సమర్థించడంతో అధికారులు కఠినంగా అమలు చేయడం మొదలు పెట్టారని సింఘ్వీ చెప్పాడు.
“ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. వాటికి చట్టపరమైన మద్దతు కూడా లేదు. హాకర్లు, టీ దుకాణాలు, దాబాలు, ఆహార తయారీ దారులు అందరికీ ఆదేశాలను బలవంతంగా వర్తింపజేస్తున్నారు” అని సింఘ్వీ కోర్టుకు తెలిపాడు. ఆదేశాలను ఆర్టికల్ 13 స్క్రూటినీ నుండి తప్పించుకునేలా తెలివిగా ముసుగు కప్పి ఇచ్చారనీ, ఆదేశాలు అమలు చేస్తే ఒక ఇబ్బంది, చెయ్యకపోతే మరో ఇబ్బంది ఎదుర్కొనేలా చేశారని వివరించాడు. ఆదేశాలు అమలు చేయకపోతే 2 వేల నుండి 5 వేల వరకు ఫైన్ వేస్తున్నారని, అమలు చేస్తే దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదాన్ని దుకాణదారులు ఎదుర్కుంటారని వివరించాడు. ప్రైవసీ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వాదించాడు.
దశాబ్దాలుగా ఈ యాత్ర జరుగున్నదనీ, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధ మతస్థులు అందరూ యాత్రీకులకు సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చారని సింఘ్వీ కోర్టుకు తెలియజేశాడు. ఈ సందర్భంగా జస్టిస్ భట్టి తన అనుభవాన్ని పంచుకున్నారు. కేరళలో తాను జడ్జిగా ఉన్నపుడు ఓ చోట హిందువు నిర్వహిస్తున్న హోటల్, ముస్లిం నిర్వహిస్తున్న హోటల్ ఉండేవని, హిందూ హోటల్ యజమాని తరచుగా ముస్లిం నిర్వహించే శాకాహార హోటల్ కి వెళ్ళేవాడని, ముస్లిం నిర్వహించే హోటల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశుభ్రత పాటించడమే అందుకు కారణం అని జస్టిస్ భట్టి చెప్పారు.
వాలంటరీగా ఆదేశాలు పాటించాలని చెబుతూనే రెండు వేల నుండి ఐదు వేల వరకు అపరాధ రుసుం ప్రకటించారని, ఈ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సిబ్బంది పేర్లు కూడా ప్రదర్శించాలని ప్రకటించడంతో పోలీసులు ఆయన ఆదేశాలను బలవంతంగా అమలు చేస్తున్నారని సింఘ్వీ చెప్పాడు. దానితో అనేక మంది ముస్లింలు పని కోల్పోయి వీధిన పడ్డారని తెలిపాడు. చివరికి ఇది డొమినో ఎఫెక్ట్ గా మారి ఉత్తర ఖండ్ తో పాటు కన్వర్ యాత్ర మార్గం లో లేని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవే ఆదేశాలు జారీ చేసిందనీ తెలిపాడు.
ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 కింద తయారు చేసిన ఆహార భద్రతా ప్రమాణం (లేబిలింగ్ మరియు ప్రదర్శన) నిబంధనలు 2020 ప్రకారం హోటళ్ళు, తినుబండారాల దుకాణదారులు తమ పేర్లు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలన్న నిబంధన లేదని గుర్తు చేశాడు. వివిధ వంటకాల లోని కెలోరీలు, మరియు ఆహార స్వభావం (వెజ్ లేదా నాన్-వెజ్) గురించి మాత్రమే సమాచారం ఇవ్వవలసి ఉంటుంది తప్ప పేర్ల నిబంధన ఏమీ చట్టంలో లేదని గుర్తు చేశాడు. కానీ ఈ నిబంధనలు కూడా సెంట్రల్ లైసెన్స్ అవసరం లేని స్టాళ్లు, ఈటరీలు పాటించాల్సిన అవసరం లేదని వివరించాడు. తామే తయారీ దారులుగా ఉండే చిన్న దుకాణదారులు, చిన్న రిటైలర్లు, హాకర్లు, ఒక చోటు నుండి మరొక చోటుకు తిరుగుతూ అమ్ముకునే వాళ్ళు, చిన్న తరహా కాటేజీ ఆహార స్టాళ్లు.. వీటిల్లో వేటికీ 2006 చట్టం సెక్షన్ 31 ప్రకారం నిబంధనలు వర్తించవని అభిషేక్ సింఘ్వీ సుప్రీం ధర్మాసనానికి నివేదించాడు.
పిటిషనర్ల వాదనలు విన్న జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి లతో కూడిన బెంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయరాదని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ఉత్తర్వులు దాబా యజమానులు, రెస్టారెంట్లు, షాపులు, పండ్ల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, హాకర్లు మొ.న అందరికీ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. దుకాణదారులు తాము అమ్మకానికి పెట్టిన ఆహారాలు శాకాహారమా లేక మాంసాహారమా అన్నది తెలియజేయాలి తప్ప యజమానులు, ఉద్యోగుల పేర్లు వెల్లడించవలసిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
దురుద్దేశాలు
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి సీట్ల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. 2014 ఎన్నికల్లో బిజెపికి 71 సీట్లు, 2019 ఎన్నికల్లో 62 సీట్లు రాగా, 2024 ఎన్నికల్లో 33 సీట్లు మాత్రమే సాధించింది. 2024 ఎన్నికల్లో ఎస్.పి అత్యధికంగా 37, కాంగ్రెస్ 6 సీట్లు సాధించాయి. ప్రతిపక్ష ఐ.ఎన్.డి.ఐ.ఎ కూటమి 43 సీట్లు పాలక ఎన్.డి.ఏ కూటమికి 37 సీట్లు వచ్చాయి. కాగా 72 లోక్ సభ నియోజక వర్గాల్లో 2019 కంటే 2024లో వెయ్యి నుండి 2,20,000 వరకు ఓట్లు తగ్గాయి.
మరీ ముఖ్యంగా రాం లల్లా కోసం అయోధ్యలో రామాలయం నిర్మించి హామీని నిలబెట్టుకున్నామని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు ఇతర బిజేపి స్టార్ కేంపయినర్లు అందరూ అట్టహాసంగా ప్రచారం చేశారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజక వర్గంలో 54.5 వేల మెజారిటీతో సమాజ్ వాది పార్టీ నిలబెట్టిన దళిత నేత అవదేశ్ ప్రసాద్ గెలుపొందడం బిజెపికి తీరని అవమానాన్ని మిగిల్చింది.

2024 లోక్ సభ ఫలితాల నుండి పాఠాలు నేర్చుకునేందుకు బిజెపి నేతలు సిద్ధంగా లేరు. హిందూత్వ విద్వేష కార్యాచరణను మరింత తీవ్రంగా అమలు చేస్తే 2014 తరహాలో ఫలితాలు రాబట్టగలమని బిజెపి-ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ తలంపుతోనే ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికలు ఒక్కో దశ ముగిసే కొద్దీ తమకు సీట్లు తగ్గనున్నాయన్న సమాచారం అందిన నేపధ్యంలో మరింత పచ్చిగా ముస్లిం వ్యతిరేక ప్రచారానికి దిగాడు. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఇండియాలో ముస్లింలు అంతా చొరబాటుదారులే అనీ, వాళ్ళు భారతీయుల సంపదలను వశం చేసుకుంటారని, చివరకు హిందూ మహిళల మంగళ సూత్రాలు సైతం లాక్కుంటారని ప్రకటించి ఓట్లు, సీట్ల కోసం బిజెపి ఎంతకైనా దిగజారుతుందని చాటి చెప్పాడు. భారతీయ సంపదపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నపుడు చెప్పిందని ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ సంపద లాక్కుని ముస్లింలకు పంపకం చేస్తుందనీ ఆరోపించాడు. ఈ ఆరోపణలకు ఆధారాలు ఏవీ ఆయన చూపలేదు.
ఉత్తర ప్రదేశ్ లో ఘోరంగా దెబ్బ తిన్న బిజెపి 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే తయారవుతున్నట్లు కనిపిస్తోంది. కన్వర్ యాత్రలో దుకాణదారులు తమ పేర్లు, సిబ్బంది పేర్లు ప్రదర్శించడం మొదలు పెట్టిన తర్వాత మత ఘర్షణలు రేపడం సులువుగా మారుతుంది. ఒక వేళ ప్రజలు సంయమనం పాటించినా, ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ల ద్వారా ఘర్షణలు రెచ్చగొట్టడం కాంగ్రెస్ పాలన నుండి జరుగుతున్న తంతే. ఎక్కడో ఒక దుకాణం వద్ద కావాలనే తగవు పెట్టుకుని, ఆపై కొట్టడమో, తీవ్రంగా గాయపరచడమో జరిగితే ఇక పోలీసులు రంగంలోకి దిగడం, పై నుండి ఆదేశాలతో దెబ్బలు తిన్న ముస్లింల పైనే కేసులు పెట్టి ముస్లింలలో అభద్రత సృష్టించడం జరిగిపోతుంది. సదరు అభద్రత కాస్తా వారు ఆత్మరక్షణ కోసం ఆర్గనైజ్ కావడం జరుగుతుంది. ఫలితంగా ఇరు మతాల ఘర్షణలు విస్తరించటానికి ఇక ఏంతో కాలం పట్టదు. ఇలాంటి ఎత్తుగడలు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మహా రాష్ట్ర లాంటి రాష్ట్రాలలో పరీక్షించబడి, ప్రభావశీలమైనవిగా ఇప్పటికే నిర్ధారించబడినవే.
ఈ క్రమం 2026 ఎన్నికల వరకు దశల వారీగా కొనసాగిస్తే అప్పటికి వాతావరణం ఛార్జ్ అయి ఉండడం, ఓటర్లు పోలరైజేషన్ కు గురి కావటం ఇప్పటి వరకు వివిధ చోట్ల జరిగిన తంతు. సిటిజెన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ సిటిజన్స్ రిజిష్టర్ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో చెలరేగిన ఉద్యమాన్ని పక్కదారి పట్టించి అల్లర్లుగా మార్చేందుకు ఇలాగే కృషి జరిగింది. అల్లర్లపై విచారణ సందర్భంగా కోర్టులు అనేక సార్లు పోలీసులకు అక్షింతలు వేయటం, అనేక మంది ముస్లిం నిందితులు నిర్దోషులుగా విడుదల కావటం నిన్న మొన్నటి ఉదాహరణలే.
కనుక కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన నియమ నిబంధనల ఉద్దేశం, లక్ష్యం ఏమిటో తెలుసుకోవటానికి బుర్ర బద్దలు కొట్టుకునే అవసరం లేదు. 2002 నుండి గుజరాత్ లోనూ, 2013 నుండి ఉత్తర ప్రదేశ్, డిల్లీ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో జరిగిన మత ఆధారిత ఘర్షణలను పరిశీలిస్తే కన్వర్ యాత్ర వెంబడి దుకాణదారులకు అందిన ఆదేశాల లక్ష్యం ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది. కనుక ఉత్తర భారత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు బిజెపి విధానాలను సమర్ధవంతంగా ఎదుర్కునే బదులు ఒట్టి ప్రకటనలతో సరి పెట్టడం, ప్రజలను మీ చావు మీరు చావండి అన్నట్లుగా వదిలివేయటం అత్యంత ఘోరమైన విషయం. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ పార్లమెంటరీ పంథా పట్ల అచంచల విశ్వాసంతో కొనసాగుతుండగా రివల్యూషనరీ పార్టీలు బలహీన స్థాయి నుండి నిర్మాణాత్మక ఉద్యమాలను నిర్మించడంలో విఫలం కావటం కొనసాగుతూనే ఉంది. ఈ బలహీన పరిస్ధితి నుండి రివల్యూషనరీ పార్టీలు ఎంత త్వరగా బైట పడితే బలహీన వర్గ, కుల, మత, జాతి, జెండర్, ప్రాంత ప్రజలకు అంత ఉపశమనం కలుగుతుంది.