గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!


West Bengal Governor C V Ananda Bose

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు.

గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే గవర్నర్ పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలి. ఆయన అందుకు నిరాకరిస్తే కేంద్ర ప్రభుత్వమే పూనుకుని అలాంటి గవర్నర్ ని వెంటనే పదవి నుండి తప్పించాలి.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ విషయంలో ఈ రెండూ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుని ఆరోపణలపై విచారణకు పోలీసు పెద్దలతో కమిటీ నియమించగా ఆ గవర్నర్ ఏం చేసాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవలసిందే. తన కార్యాలయ సిబ్బందికి ఎక్స్ (గతంలో ట్విట్టర్) లోనే బహిరంగ లేఖ రాస్తూ పోలీసులతో ఎవరూ సహకరించ వద్దని హుకుం జారీ చేసి తనకు సిగ్గూ ఎగ్గూ ఏవీ లేవని ప్రకటించుకున్నాడు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ ను ప్రాసిక్యూట్ చేసే అధికారం కోర్టులకు లేదని ఆ లేఖ ద్వారా తన సిబ్బందిని హెచ్చరించాడు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గారి పేరు సి. వి. ఆనంద బోస్. ఆయనకు ముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పని చేసిన జగ్దీప్ ధన్కర్ కు మల్లేనే ఆనంద బోస్ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, నిత్యం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తూ తనకు లేని అధికారాలాను తానే కట్టబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పని చేయకుండా ఆటంకాలు సృష్టించడంలో నిమగ్నమై ఉన్నాడు.

బిజెపి గవర్నర్ల ఆగడాలు

బి.జే.పి/ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన నాటి నుండీ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన బి.జే.ఫై నేతలను లేదా సివిల్ సర్వీస్ అధికారులను గవర్నర్ లుగా నియమిస్తూ వచ్చింది. వారు ఎలాంటి శిక్షణను కేంద్ర ప్రభుత్వం నుండి అందుకున్నారో లేక ఎలాంటి ఆదేశాలు అందుకున్నారో తెలియదు గానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధులను ఆటంకపరచడం, బిల్లులపై సంతకాలు చేయకుండా నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టడం, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా రాజకీయ ప్రకటనలు చేయడం, ప్రభుత్వం పనిలో వేలు పెట్టి కెలకడం… ఇలాంటి పనులలోనే నిమగ్నమై ఉంటున్నారు.

తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి (మాజీ ఐపిఎస్ అధికారి), కేరళ గవర్నర్ అరివ్ మహమ్మద్ ఖాన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేసిన తమిళిసాయి సౌందర రాజన్ (ఈ బిజేపి నేత ఒక్కసారి కూడా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలవలేక పోయారు), మహారాష్ట్ర గవర్నర్ గా పని చేసిన భగత్ సింగ్ కోష్యారి, జార్ఖండ్ గవర్నర్లు రమేష్ బాయిస్, సి.పి. రాధాకృష్ణన్ లు, కర్ణాటక గవర్నర్ గా పని చేసిన వజుభాయి వాలా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, బెంగాల్ గవర్నర్ గా పని చేసిన జగ్దీప్ ధన్కర్, ఇప్పటి బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్… వీళ్ళందరూ నిర్దిష్ట ఆదేశాలు అందుకున్నట్లుగా ఒకే బాటలో నడిచి ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడంలోనే నిమగ్నం అయ్యారు.

కేరళ, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి గవర్నర్ల ఆగడాలు శృతి మించడంతో గవర్నర్ల వైఖరి పై వివిధ సమయాల్లో సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన వెంటనే హియరింగ్ మొదలయ్యే లోపు వాయిదా వేసిన బిల్లులను ఆమోదించటం చేశారు. అంటే తాము రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్ లు ఆమోదించాక కూడా దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం అని తెలిసి కూడా అటువంటి చర్యలకు పూనుకుంటున్నారని అర్ధం అవుతోంది.

సుప్రీం కోర్టు, పంజాబ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును విచారిస్తూ ఈ అంశాన్నే ఎత్తి చూపింది. “అసలు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసిన తర్వాతే బిల్లులను ఆమోదించడం ఎందుకు జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వచ్చే వరకూ వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు?” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి డి.వై.చంద్ర చూడ్, సొలిసిటర్ జనరల్ ను గట్టిగా నిలదీశారు. కేరళ గవర్నర్, తమిళనాడు గవర్నర్ లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసే వరకూ “బిల్లుల్ని ఆమోదించేది లేనే లేదు” అని మొండిగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసాక, అది విచారణకు వచ్చే లోగా బిల్లుల్ని ఆమోదించి సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యారు.

ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ కూడా ఇదే తరహాలో మమతా బెనర్జీ ప్రభుత్వ బిల్లులపై సంతకం చెయ్యకుండా, వెనక్కి తిరిగి పంపకుండా కాలయాపన చేస్తున్నాడు. రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఆమోదించాలి లేదా పునః పరిశీలన నిమిత్తం వెనక్కి తిరిగి పంపాలి. వెనక్కి పంపిన తర్వాత ఉభయ సభలు మళ్ళీ ఆ బిల్లును ఆమోదిస్తే గనక గవర్నర్ తప్పనిసరిగా ఆ బిల్లుపై సంతకం చేసే చట్టంగా చేయవలసి ఉంటుంది. ఇలా రెండోసారి కూడా చట్ట సభలు బిల్లుని ఆమోదించి పంపకుండా నిరోధించడం ద్వారా ఆ బిల్లును శాశ్వతంగా పెండింగ్ లో ఉంచే ఎత్తుగడను అనుసరిస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల చేతులను గవర్నర్లు కట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బందిలోని మహిళే లైంగిక అత్యాచార ఆరోపణ చేయడంతో త్రిణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అదనుగా భావించింది. “ఆ మహిళ కన్నీళ్లు నా గుండెను బద్దలు చేశాయి” అని ముఖ్యమంత్రి బెనర్జీ నాటకీయ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కోల్ కతా పోలీసులు 8 మంది సభ్యులతో ఒక ప్రత్యెక కమిటీ వేసి గవర్నర్ పై వచ్చిన ఆరోపణల గురించి విచారణ చేపట్టారు. ఈ కమిటీ నేత డిప్యుటీ కమిషనర్ (సెంట్రల్ కోల్ కతా) ఇందిరా ముఖర్జీ, రాజ్ భవన్ లో సిసిటివి ఫుటేజిని తమకు వెంటనే అందజేయాలని రాజ్ భవన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు సమన్లు పంపింది.

గవర్నర్ ఆనంద బోస్ ఏ నేరమూ చేయనట్లయితే పోలీసు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు. తానే స్వయంగా రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవటానికి సిద్ధ పడాలి. అందుకు బదులుగా ట్విట్టర్ లో బహిరంగ విడుదల చేస్తూ రాజ్ భవన్ సిబ్బందిలో ఎవ్వరూ పోలీసుల సమన్ లకు బదులు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశాడు. ఆర్టికల్ 361 ప్రకారం, గవర్నర్ పదవిలో కొనసాగినంత కాలం, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టే అధికారం ఎవరికీ లేదనీ, ఆ మేరకు రాజ్యాంగం గవర్నర్లకు రక్షణ కల్పించిందనీ ఏకరువు పెట్టాడు. కనుక పోలీసులు తనపై తన పైన ఎలాంటి పరిశోధన లేదా విచారణ చేసేందుకు వీలు లేదని, ఒక వేళ పోలీసులు విచారణ చేపట్టి తుది నివేదిక విడుదల చేస్తే, ఆ నివేదికను పరిగణనలోకి తీసుకునే అధికారం ఏ కోర్టుకూ లేదని హుంకరించాడు.

గత ఉదాహరణలు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేత ఎన్.డి.తివారి ప్రతి రోజూ ఆడ పిల్లలను రాజ్ భవన్ కు రప్పించుకుని లైంగిక కార్యకలాపాలలో మునిగి తేలుతున్నట్లు వెల్లడి అయింది. తివారి తెప్పించుకున్న అమ్మాయిలే తివారి చర్యలను వీడియో తీసి పత్రికలకు అందజేయడంతో ఆరోపణలను తిరస్కరించలేని పరిస్ధితిని ఎదుర్కొన్నాడు. దానితో ఆయన “ఆరోగ్య కారణాలు” చూపుతూ గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఆయనను కలుసు కునేందుకు కూడా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

2017లో మేఘాలయ గవర్నర్ వి షణ్ముగ నాధన్ కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేశాడు. రాజ్ భవన్ సిబ్బంది 100 మంది వరకు సదరు గవర్నర్, తన కార్యాలయ గౌరవానికి తీవ్ర అప్రతిష్ట తెచ్చాడనీ, ఆయనను వెంటనే పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేయడంతో గవర్నర్ రాజీనామా చేయక తప్పలేదు.

బాబ్రీ మసీదు కూల్చిన కేసులో బిజేఫై నేతలు ఎల్. కే. అద్వాని, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలపై నేర పూరిత కుట్ర కేసును తిరిగి తెరవాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే అదే కేసులో ఉన్న కళ్యాణ్ సింగ్ పేరును మాత్రం ఆ జాబితాలో కోర్టు చేర్చలేదు. అప్పటికి కళ్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్ గా ఉండడం అందుకు కారణం అని సుప్రీం కోర్టు తెలిపింది. కాని ఆయన గవర్నర్ బాధ్యతల నుండి తప్పుకున్న వెంటనే ఆయనపై కూడా సెషన్స్ కోర్టు ఆరోపణలు పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కళ్యాణ్ సింగ్ 2019లో గవర్నర్ పదవి నుండి తప్పుకున్నాక సిబిఐ ఆయనకు సమన్లు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టును కోరింది. ఆగస్టు 2021లో ఆయన చనిపోవడంతో ఆ కథ ముగిసింది.

అరుణాచల్ గవర్నర్ గా ఉన్న జే.ఫై రాజ్ ఖోవా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 5గురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచి విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు కోరాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని గవర్నర్ కు నోటీసు ఇచ్చింది. అయితే నోటీసు ఇచ్చిన కొద్ది రోజులకే తన నోటీసును వెనక్కి తీసుకుంది. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా చేపట్టే చర్యలపై కోర్టు విచారణ నుండి పూర్తి రక్షణ ఉన్నదని, తాము పొరపాటున నోటీసు ఇచ్చామని తెలియజేసింది.

ఆర్టికల్ 361 – న్యాయ మీమాంస

ఆర్టికల్ 361లో రెండు పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయి. ఒకటి: గవర్నర్ తన ‘విధి నిర్వహణ’ లో భాగంగా చేపట్టే చర్యలకు, ఇచ్చే ఆదేశాలకు గాను ఆ పదవిలో కొనసాగినంత కాలం కోర్టు విచారణ నుండి పూర్తి రక్షణ ఉంటుందని క్లాజ్ (1) లో పేర్కొనబడింది. అలాగే ఏ కోర్టుకూ ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు: ఆర్టికల్ 361 క్లాజ్ (2) లో “ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండైనా సరే గవర్నర్ కు రక్షణ (ఇమ్యూనిటీ) ఉంటుంది” అని పేర్కొనబడింది.

క్లాజ్ (1), క్లాజ్ (2) లు రెండూ పరస్పర విరుద్ధమా లేక క్లాజ్ (1) కి కొనసాగింపుగా క్లాజ్ (2) పొందుపరిచారా అన్న న్యాయ మీమాంస తలెత్తింది. గవర్నర్ కేవలం తన విధి నిర్వహణలో భాగంగా చేపట్టే చర్యల విషయంలో మాత్రమే కోర్టు విచారణ నుండి మినహాయింపు ఉన్నట్లు అర్ధం వస్తుండగా, క్లాజ్ (2) మాత్రం ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండైనా సరే రక్షణ ఉంటుంది అనడంలో గవర్నర్ తన విధి నిర్వహణతో పాటు ఇతర చట్ట విరుద్ధ నేరాలకు పాల్పడినా కూడా కోర్టు విచారణ నుండి రక్షణ ఉంటుందన్న అర్ధం వస్తోంది.

ఈ నేపధ్యంలో బెంగాల్ గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని, ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ ఎలాంటి నేరానికి పాల్పడినా కూడా పూర్తి స్థాయి రక్షణ ఉంటుందా లేదా అన్న అంశాన్ని నిర్ధారించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 361 పట్ల జ్యుడిషియల్ స్క్రూటినీ చేయాలని కోరింది. ఆర్టికల్ 361 కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి ఏ మేరకు రక్షణ కల్పించవచ్చో నిర్ధారిస్తూ నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలను నిర్దేశించాలని కోరింది. ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు జులై 19 తేదీన అంగీకరించింది. ఈ అంశంలో కోర్టుకు సహాయం చేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ని కోరింది. పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఫిర్యాదిదారు మహిళను కోర్టు కోరింది.

రాజ్యాంగ విధులు నిర్వహిస్తూ రాజ్యాంగ సూత్రాలను కాపాడవలసిన గవర్నర్ పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధమైన నేరపూరిత చర్యలకు (హత్య, లైంగిక అత్యాచారం, కుట్ర మొ.నవి) పాల్పడే సి.వి.ఆనంద బోస్ లాంటి వ్యక్తులకు కూడా పూర్తి రక్షణ (బ్లాంకెట్ ఇమ్యూనిటీ) కల్పించవచ్చన్న అర్ధం వచ్చే విధంగా ఆర్టికల్ 361 ను రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించి ఉండరు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

గవర్నర్ లాంటి బాధ్యతాయుత పదవిలో ఉండే వ్యక్తులు ఇలాంటి ఫక్తు విలనీ తరహా నేరాలకు పాల్పడతారన్న అవగాహన రాజ్యాంగ నిర్మాతలకు ఉన్నట్లయితే ఆర్టికల్ 361 ఈ రూపంలో ఉండకపోను. రాజకీయ ప్రత్యర్ధులు గానీ, వ్యక్తిగత విరోధులు గానీ కక్షతో బాధ్యతాయుత మైన అత్యున్నత పదవుల్లో ఉన్న నేతలపై దురుద్దేశంతో బూటకపు కేసులు పెట్టకుండా నిరోధించేందుకు మాత్రమే ఆర్టికల్ 361 ని ఉద్దేశించారు తప్ప సి.వి. ఆనంద బోస్ వలే లైంగిక అత్యాచార నేరాలకు కూడా కోర్టు విచారణ నుండి మినయాయింపు కల్పించే ఉద్దేశ్యం వారికి ఎంతమాత్రం లేదు అనడంలో సందేహం లేదు.

వ్యాఖ్యానించండి