
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.
జగన్ నాయకత్వం లోని గత రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం మొత్తం 1,29,503 కోట్ల రూపాయల మేరకు నష్టాలు పోగు చేసిందని ప్రకటించాడు. “వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల పైన గత ఐదు సంవత్సరాలలో రు 32,166 కోట్ల పెను భారం మోపిందని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆరోపించాడు. ప్రజల నెత్తిన ‘ట్రూ-అప్’, ‘ట్రూ-అప్ ఫ్యూయెల్’ పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేశాడని వివరించాడు. రాష్ట్ర విద్యుత్ కంపెనీలు రు 49,496 కోట్ల అప్పుల్లో ఉండగా, అసమర్ధ పాలన వలన మరో రు 47,471 కోట్ల నష్టాలు పేరుకున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పిన వివరాల ప్రకారం “2018-19 లో 54,555 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా 2023-24 నాటికి 69,113 మిలియన్ యూనిట్లకు అది పెరిగింది. ఆయన ప్రకారం ఈ పెరుగుదల 4.8 శాతం మాత్రమే. ఎపి తలసరి విద్యుత్ వినియోగం 2018-19 నుండి 2023-24 నాటికి కేవలం 123 కిలో వాట్ అవర్ (kWh) లు మాత్రమే పెరిగిందనీ జాతీయ సగటు పెరుగుదల 146 kWh లతో పోల్చితే ఇది చాలా తక్కువ. విద్యుత్ సుంకాలను అధిక స్థాయిలో పెంచడం, అసమర్ధ ప్లానింగ్ వలన కరెంటు కోతలను తిరిగి ప్రవేశపెట్టడమే విద్యుత్ డిమాండ్ తగ్గుదలకు కారణం. దీనివల్ల రాష్ట్ర జి.ఎస్.డి.పి కూడా బాగా తగ్గిపోయింది.”
విద్యుత్ సమీకరణలో సరైన ప్లానింగ్ లేకపోవడం వలన విద్యుత్ కోతలు అధికం అయ్యాయని చంద్రబాబు చెప్పారు. పోలవరం హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు (960 MW), ఎస్.డి.ఎస్.టి.పి.ఎస్ (కృష్ణపట్నం) స్టేజ్-II యూనిట్-3 (800 MW), వి.టి.పి.ఎస్ స్టేజ్-V యూనిట్-8 (800 MW) స్టేషన్లను పూర్తిచేసి ప్రారంభించడంలో ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేయడమే ఈ పరిస్ధితికి కారణమని వివరించారు. అన్ని తరగతుల వినియోగదారులు కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామీణ గృహ వినియోగదారులు రోజుకి గంట చొప్పున, పట్టణ గృహ వినియోగదారులు రోజుకి అర గంట చొప్పున, నిరంతరం పని చేసే పరిశ్రమలకు రోజుకి 12 గంటల చొప్పున, నాన్-కంటిన్యువస్ పరిశ్రమలకు రోజుకి 15 గంటల చొప్పున, వాణిజ్య వినియోగదారులకు రోజుకి 12 గంటల చొప్పున, వ్యవసాయ వినియోగదారులకు రోజుకి 2 గంటల చొప్పున కోతలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
విద్యుత్ రంగంలో అప్పుల లెక్కలను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంద్ర ప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా మొర పెట్టుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? నిజానికి కరెంటు కోతలు 2004లో ముగిసిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గృహ వినియోగదారులు సహితం రోజులో అనేక గంటల పాటు ఎదుర్కొన్న అనుభవం రాష్ట్ర ప్రజలకు ఉన్నది. గత అనుభవాల దృష్ట్యా, ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి 1999-2004 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిన విషయమే.
సంస్కరణలలో భాగంగా అప్పటి విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎపిఎస్ఇబి ని మూడు ముక్కలు చేయడమే కాకుండా ప్రైవేటు కంపెనీలకు విద్యుత్ రంగాన్ని ధారాదత్తం చేసే సంస్కరణలు ప్రవేశ పెట్టాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి అనేక రోజుల పాటు సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. వివిధ కార్మిక ప్రజా సంఘాలు ఛలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చాయి. ఆందోళనకారులపై బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. వారి స్మృత్యర్ధం గత ఏడు కార్మిక సంఘాలు బషీర్ బాగ్ బ్రిడ్జి వద్ద సమావేశమై శ్రద్ధాంజలి ఘటించి జగన్ ప్రభుత్వ విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చాయి కూడా.

1999-2004 నాటి చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగ కార్మికులతో పాటు ఆర్.టి.సి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఆర్.టి.సి కార్మికులు, అనేక ప్రజా సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున సమ్మెలకు పాల్పడ్డారు. దానితో ఆర్.టి.సి ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రికి తమ సమస్యలు మొర పెట్టుకునేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలను పోలీసుల చేత గుర్రాలతో తొక్కించి అపకీర్తి మూట కట్టుకున్నాడు. ఎస్.సి వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు కార్యకర్తలు వేల సంఖ్యలో హైదరాబాద్ వచ్చినప్పుడు వారిపై పోలీసులు తీవ్ర స్థాయిలో లాఠీ చార్జీ చేయడంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. (మాల మహానాడు సంస్థ అవలంబించిన వర్గీకరణ వ్యతిరేక విధానం రిజర్వేషన్ విధానం యొక్క మౌలిక పునాది సిద్ధాంతానికి వ్యతిరేకం అన్నది వేరే విషయం!)
2004 ఎన్నికలలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మన్మోహన్, అప్పటి వరకు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడును, వరల్డ్ బ్యాంక్-ఐ.ఎం.ఎఫ్ నిర్దేశించిన సంస్కరణలను తు.చ తప్పకుండా అమలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించి కృతఙ్ఞతలు తెలియజేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం. అనగా ప్రపంచ కాబూలీ వాలా సంస్థలు ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు మన దేశంపై రుద్దిన సంస్కరణలను అమలు చేయడంలో టి.డి.పి, కాంగ్రెస్ పార్టీలకు ఏ మాత్రం తేడా లేదని ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అంశం.
వరుసగా ప్రజా వ్యతిరేక విధానాలను, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అనుకూలమైన విధానాలను అనుసరించడం, ప్రజలపై నిర్బంధం అమలు చేయడంతో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటికే పాదయాత్ర పేరుతో రాష్ట్రం చుట్టి వచ్చిన రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఇటీవలి చరిత్ర. విద్యుత్ రంగాన్ని కెలికిన చంద్రబాబు (టిడిపి) ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్న నేపధ్యంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ రంగం జోలికి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే విద్యుత్ చార్జీలను పెంచే సాహసానికి కూడా పూనుకోలేదు.
అయితే రాజశేఖర్ రెడ్డి అనుసరించిన వివిధ ఉచిత పంపిణీ పధకాల వలన ప్రజల్లో సానుకూలత లభించడం (ఉచిత పధకాల మాటున రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా వరల్డ్ బ్యాంక్, ఐ.ఎం.ఎఫ్ విధించిన సంస్కరణల విధానాలను అమలు చేసిన సంగతి విస్మరించలేని విషయం), ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడంతో ఏర్పడ్డ సానుకూలత, టిడిపి ప్రభుత్వ వ్యతిరేకత… ఇవన్నీ 2014లో వై.ఎస్.ఆర్.సి.పి అధికారం చేపట్టేందుకు మార్గం ఏర్పరిచాయి. ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ జగన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు.
కానీ వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగ పరిచింది. అయన అనుసరించిన ఇసుక విధానం రియల్ ఎస్టేట్ రంగంలో కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బ తీసింది. రాష్ట్రం మొత్తానికి తన సొంత కంపెనీల మద్యాన్ని సరఫరా చేయడం, సదరు మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం, ఆ మద్యానికి నాణ్యత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఉన్న మద్యం వ్యసనపరులకు ఆగ్రహం తెప్పించింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే తేదీని పదే పదే వాయిదా వేసి చివరికి మంత్రి అంబటి రాంబాబు చేత “పోలవరం ప్రాజెక్టు నాకే అర్ధం కాలేదు. అది ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదు” అని చెప్పించడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని మూట గట్టుకున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు అందుతాయో తెలియని అయోమయ, అనిర్దిష్ట పరిస్ధితి సృష్టించి ఉద్యోగుల ఆగ్రహాన్ని పోగు చేసుకున్నాడు. ఆటో డ్రైవర్లు, మహిళలు, పింఛన్లు, అమ్మ ఒడి… ఇలా నవరత్నాల పేరుతో డబ్బు పంపిణీ చేసినప్పటికీ రోడ్లు, వంతెనలు, నీటి పారుదల లాంటి శాశ్వత ఆదాయ వసతులు కల్పించే మౌలిక నిర్మాణాలను పక్కకు తోసేయటాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా గమనిస్తూ వచ్చారు. ఓ పక్క ఎన్ని ఉచితాలు ఇచ్చినప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ పోవడం, అటో డ్రైవర్లపై చిన్న దానికి పెద్ద దానికి పోలీసుల చేత వేలకు వేలు అపరాధ రుసుములు వసూలు చేయడంతో “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఇచ్చిన దానికంటే అధికంగా లాక్కోవడం” గా ప్రజల అనుభవం లోకి వచ్చింది.
అన్నింటి కంటే ప్రధానంగా రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ విషయంలో జగన్ ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాట ప్రజలలో ఏవగింపు కలిగించింది. సౌత్ ఆఫ్రికా ‘దేశాన్ని’ ఉదాహరణగా చూపిస్తూ ఆంద్ర ప్రదేశ్ ‘రాష్ట్రానికి’ మూడు రాజధానులు అని ప్రకటించి ప్రజల్ని అయోమయానికి గురి చేశాడు. చెప్పడానికి మూడు రాజధానులు అని చెప్పినా, ఆచరణలో మాత్రం రాష్ట్రానికి ఒక చివర ఉన్న విశాఖ పట్టణం ను అసలు రాజధానిగా చేయనున్న సంగతిని ప్రజలు అర్ధం చేసుకున్నారు. వాస్తవంలో మాత్రం రాష్ట్రానికి అసలు రాజధాని ఏది? అన్న ప్రశ్నకు ప్రజలకు సమాధానం, రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా తెలియని స్థితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం పైన ఏర్పడిన తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు నాయకత్వం లోని టి.డి.పి వైపుకు ప్రజలు మరలేందుకు దారితీసింది. అత్యధిక మెజారిటీతో టిడిపి-బిజేఫై-జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఎదో గొప్ప గొప్ప పనులు చేయబోతున్నాడని మెజారిటీ ప్రజలు ఆశగా చూస్తున్నారు. కానీ ప్రజలు కాస్త నిదానించి నింపాదిగా ఆలోచించి చూస్తే తత్వం బోధపడుతుంది.
ఏమిటా తత్వం? ఏమిటంటే టిడిపి ప్రభుత్వం కేంద్రం లోని బిజేపి ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకుని ఉండడమే ఆ తత్వం! బిజేపి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక సంస్కరణ విధానాలను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే వేగంగా, మరింత లోతుగా, ఎటువంటి వెనకడుగు లేకుండా పచ్చిగా అమలు చేస్తున్న సంగతిని ఖచ్చితంగా గమనంలో ఉంచుకోవాలి.
ఆ సంగతిని చంద్రబాబు గారే స్వయంగా అంగీకరించడం గమనార్హం. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగంలో నేను అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టాను. నేను తెచ్చిన సంస్కరణలు దేశం మొత్తానికి ఒక నమూనా (మోడల్) అయ్యాయి. ఈ సంస్కరణల వలన నేను అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు గానీ సానుకూల మార్పులకు నేను పునాది రాయి వేసినందుకు గర్విస్తున్నాను” అని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ప్రకటించుకున్నారు.
ఏ సంస్కరణలయితే 2004 ఎన్నికలలో తన ఓటమికి కారణం అయ్యాయో అవే సంస్కరణల పట్ల తాను గర్వపడుతున్నానని, నిజానికి అవి దేశానికే మోడల్ గా మారాయని చంద్రబాబు చెబుతున్నారు. ఆ సంస్కరణల విధానాలనే గత పదేళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం శర వేగంగా అమలు చేసిన సంగతిని గమనంలో ఉంచుకున్నట్లయితే, సదరు మోడీ ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రజల వ్యతిరేకత వల్ల నిలిపివేయవలసిన సంస్కరణలను, ఇప్పుడు భయం లేకుండా అమలు చేయబోతున్నాడని ఆయన విడుదల చేసిన శ్వేతపత్రం మనకు చెబుతోంది.
మునుముందు ఇక కరెంటు కోతలు ఉండబోవని, నాణ్యమైన విద్యుత్ అందజేస్తామనీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కూడా. ఇదే మాట 1999-2004 నాడు విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టేటప్పుడు కూడా చంద్రబాబు చెప్పారు. అంటే ఢిల్లీ, గుజరాత్, ముంబై, వెస్ట్ బెంగాల్, ఒడిషా తదితర రాష్ట్రాలకు మల్లేనే ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలను పాక్షికంగా (ఏరియాల వారిగా) గానీ, లేదా పూర్తిగా గానీ అప్పగిస్తామని ముఖ్యమంత్రి సూచిస్తున్నారా అన్న అనుమానాలు ఉదయిస్తున్నాయి.
“ప్రజల జీవితాలు విద్యుత్ తో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయి. విద్యుత్ ను సమర్ధంగా వినియోగించినట్లయితే అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. తన హయాంలో విద్యుత్ రంగానికి 145 అవార్డులు వచ్చాయని ఆయన చెప్పుకున్నారు. అలాంటి విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పుకొచ్చారు. తాను ఇటీవలే ఢిల్లీ సందర్శించి వివిధ కేంద్ర మంత్రులను కలిశానని వారి సహకారాన్ని కోరానని చెప్పారాయన.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకు అర్ధం ఏమిటి అన్నది ఆయన ప్రకటించబోయే/అమలు చేయబోయే విధానాల ద్వారానే తెలుస్తుంది తప్ప ఆయన మాటలు కాదు. వైసిపి (జగన్) నాయకత్వం లోని ప్రభుత్వం పాలనను ఒక పధ్ధతి అంటూ లేకుండా స్వార్ధ ప్రయోజనాలే పరమార్ధంగా చిత్తం వచ్చిన రీతిలో సాగించిన మాట వాస్తవమే కావచ్చు గానీ జగన్ ప్రభుత్వ తప్పులు టిడిపి ప్రభుత్వం అమలు చేయబోయే ప్రైవేటీకరణ విధానాలకు సమర్ధన కాజాలవు. ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజోపయోగ విధానాలు అమలు చేయవలసి ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతొ రాష్ట్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రజల ఆదాయ వనరులను కొద్ది మంది ప్రయివేటు ధనిక వర్గాలకు అప్పగించకుండా ప్రజలే అప్రమత్తతగా ఉండవలసిన అవసరం ఉన్నది.