ఉక్రెయిన్ లో నాటో సైన్యం, సమీపంలో WW-3?


రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం వరుస ఓటములు ఎదుర్కొంటోంది. రష్యా సైన్యం రోజు రోజుకీ ముందడుగు వేస్తున్నది. దీనితో అమెరికా గంగవెర్రులు ఎత్తుతోంది. ఉక్రెయిన్ కి ఓటమి తప్పదన్న భయం అమెరికాకి పట్టుకుంది. ఈ పరిస్ధితుల్లో నాటో కూటమి సైనికులు వివిధ రూపాల్లో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం ఎక్కువ అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

నిజానికి నాటో మిలటరీ కాంట్రాక్టర్లు మొదటి నుండి ఉక్రెయిన్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి సలహా, సూచనలు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కాకుంటే వారు ప్రధానంగా పశ్చిమ ఉక్రెయిన్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ ఇస్తూ వచ్చారు. అలాగే రష్యన్ సైనిక వ్యూహాల ఆనుపానులపై రెక్కీ నిర్వహించే డ్రోన్ లు పంపి వాటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందజేశారు.

నాటో రెక్కీ విమానాల సహాయం లేనట్లయితే రష్యా లోపలి భూభాగంపై దాడులు చెయ్యడం గానీ, రష్యా-క్రిమియా ద్వీప కల్పాన్ని కలిపే పొడవైన రోడ్ కం రైల్వే వంతెనపై బాంబు దాడులు మరియు సముద్ర డ్రోన్ దాడులు చెయ్యడం గానీ ఉక్రెయిన్ కి సాధ్యం అయ్యేది కాదు. ఈ సంగతి రష్యాకి బాగానే తెలుసు.

అప్పుడప్పుడూ నాటో కమాండర్లు ఫ్రంట్ లైన్ లోకి వచ్చి డైరెక్షన్ ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే నాటో సహాయక పాత్ర, పరోక్ష పాత్ర ఎంత ఉన్నప్పటికీ ఉక్రెయిన్ వరుస ఓటములను ఎదుర్కొనడం ఆగలేదు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లోని నాలుగు రాష్ట్రాలు పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్ళే పరిస్ధితి కనిపిస్తున్నది. ఈ నాలుగు రాష్ట్రాల వద్ద ఉన్న ఫ్రంట్ లైన్ కుప్ప కూలితే ఇక పశ్చిమ ఉక్రెయిన్ లో రష్యా పురోగమనాన్ని అడ్డుకోవడం ఉక్రెయిన్ సైన్యంకు సాధ్యం కాదు.

ఎందుకంటే ఉన్న సైన్యం అంటా తూర్పు ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. రష్యా లెక్కల ప్రకారం ఉక్రెయిన్ ఇప్పటికే 5 లక్షలకు పైగా సైన్యం కోల్పోయింది. సైన్యంలో చేరగల వయసులోని ఉక్రేయినియన్లు ఇప్పుడు ఉక్రెయిన్ లో లేరు. వారు ఎన్నడో తూర్పు, పశ్చిమ ఐరోపా దేశాలకు వెళ్లి తలదాచుకున్నారు. వారు యుద్ధం కోసం ఉక్రెయిన్ కి వెనక్కి వచ్చే ఉద్దేశ్యంలో లేరు.

ఉక్రెయిన్ లో మిగిలిన యువకుల్లో దాదాపు అందరూ యుద్ధంలో ఆహుతి కావడంతో రోగులను, మానసిక రోగులను 50 ఏళ్ళ పై బడిన వృద్ధులను కూడా బలవంతంగా సైన్యంలో చేర్చి ఫ్రంట్ లైన్ కు పంపిస్తున్నారు. అక్కడ వారు చనిపోవడమో లేక రష్యన్ సైన్యానికి లొంగిపోవడమో జరుగుతోంది.

నాటో రెగ్యులర్ సైన్యం ప్రవేశం

ఈ నేపధ్యంలో నాటో కూటమి లోని పోలండ్, ఫ్రాన్స్, యుకే, ఫిన్లాండ్ (ఇది ఇటీవలే నాటోలో చేరింది) దేశాలకు చెందిన రెగ్యులర్ సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రంట్ లైన్ లోనే యుద్ధంలో పాల్గొనడం పెరిగింది. ఈ దేశాల కాంబాట్ ట్రూప్స్ (యుద్ధం కోసం శిక్షణ పొందిన బలగాలు) నేరుగా యుద్ధంలో పాల్గొంటున్నారు. వాళ్ళు మెర్సినరీలు (కిరాయి సైనికులు) కాదు. వారు రహస్యంగా కూడా లేరు. తమ తమ దేశాల సైనిక యూనిఫారంలు, జెండాలు ధరించి యుద్ధంలో పాల్గొంటున్నారు.

నాటో కూటమి దేశాల నుండి మెర్సినరీలు కూడా ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పాల్గొంటున్నారు. రష్యా ప్రకారం వారి సంఖ్య కనీసం 3,100 వరకూ ఉంటుంది. ఈ కిరాయి బలగాలు ప్రధానంగా అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్, జార్జియా దేశాల నుండి వచ్చారు (టాస్ వార్తా సంస్థ, 25 ఏప్రిల్ 2024). జనవరిలో ఈశాన్య ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ లో బస చేసిన భవనంపై రష్యన్ మిసైల్ దాడి జరగడంతో 60 మంది ఫ్రెంచి కిరాయి సైన్యం చనిపోగా 20 మంది గాయపడిన వార్త సంచలనం సృష్టించింది. ఫ్రాన్స్ ఇది రష్యా ప్రాపగాండాగా కొట్టి పారేసింది. కానీ పశ్చిమ పత్రికలన్నీ ఈ వార్తను ప్రచురించాయి.

మొత్తం 256 ఫ్రెంచి కిరాయి సైన్యంలో 147 మంది మరణించారని రష్యా మార్చి 2024లో తెలిపింది. మొత్తం మీద మార్చి నాటికి 5,962 మంది కిరాయి బలగాలని మట్టు పెట్టామని వారిలో అత్యధికులు (2,960 మందిలో 1,497 మంది మరణించారు) పోలండ్ నుండి వచ్చారని రష్యా ప్రకటించింది. యుకే నుండి వచ్చిన 822 మందిలో 360 మంది చనిపోయారు. అమెరికా నుండి వచ్చిన 1,113 మందిలో 491 మంది చనిపోయారు.

తమ సైనికులు ఎవరూ ఉక్రెయిన్ లో లేరని కేవలం మిలటరీ సలహాదారులు మాత్రమే ఉక్రెయిన్ లో ఉన్నారని అమెరికా చెబుతుంది. అయితే ఇది వాస్తవ దూరం. వియత్నాం యుద్ధంలో కూడా అమెరికా స్పెషల్ ఫోర్సెస్ బలగాలను దింపి వారంతా సలహాదారులు అని బొంకింది. క్రమంగా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని పంపటం, 20 ఏళ్ళ పాటు వియత్నాం కమ్యూనిస్టు బలగాలపై యుద్ధం చేసి, ఆనక యుద్ధం గెలవలేక చావు తప్పి కన్ను లొట్ట బోయి వెనక్కి వచ్చేసింది.

ఇప్పుడు ఉక్రెయిన్ లోనూ అదే జరుగుతోంది. నాటో బలగాలు ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం లేదనీ తాము పంపిన అత్యాధునిక ఆయుధాలను ఆపరేట్ చేసేందుకే వారు అక్కడ ఉన్నారని బొంకుతోంది. అయితే ఈ విధంగా తమ ఆయుధాలను ఆపరేట్ చేస్తున్నారు అంటే దానర్ధం రష్యన్ సైన్యం మీద దాడులు చేస్తున్నట్లే అర్ధం. కనుక నాటో బలగాలు రష్యన్ బలగాలతో నేరుగా యుద్ధం చేస్తున్నట్లే అర్ధం. ఇంత స్పష్టంగా చెబుతూ తాము యుద్ధంలో పాల్గొనడం లేదని నాటో (అమెరికా) బొంకడం దేనికో అర్ధం కాని విషయం.

“ఉక్రెయిన్ లోకి నాటో బలగాలను దించడానికి మేము వ్యతిరేకం” అని అమెరికా అధ్యక్షుడు పైకి ప్రకటిస్తాడు. వాస్తవం ఏమిటంటే, విశ్లేషకుల అంచనా ప్రకారం, అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ప్రకటనలు చేస్తున్నాడు. ఎన్నికల్లో గెలిచాక (ఒక వేళ గెలిస్తే) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు బైడెన్, అమెరికా సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం ఖాయం. అమెరికన్లు ఇప్పటికే ఆఫ్ఘన్, ఇరాక్ యుద్దాలతో విసిగిపోయి ఉన్నారు. యుద్ధాల వల్ల సంభవించిన ఆర్ధిక సంక్షోభం, ప్రాణ నష్టం వారిని యుద్ధ విముఖులుగా మార్చింది. ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు తమ సైన్యం ఉక్రెయిన్ వెళ్ళబోదని చెబుతున్నాడు.

ఇటీవల ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు 60 బిలియన్ డాలర్ల ఆయుధ, రుణ సహాయం చేయటానికి బైడెన్ చేసిన ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఆమోదించింది. దీన్ని బట్టి రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ (ప్రతినిధుల సభ) కూడా రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి తలపడాలన్న బైడెన్ వాంఛలను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

నాటో సైన్యం ప్రవేశించకపొతే రష్యా విజయం తధ్యం అన్న నిర్ణయానికి అమెరికా, నాటో దేశాలు వచ్చినట్లు తెలుస్తున్నది. ఇది ఎంత మాత్రం నాటో కూటమికి, ముఖ్యంగా అమెరికాకి, ఆమోదయోగ్యం కాదు. అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థ దృష్టిలో రష్యా విజయం సాధించడం అంటే తమ మిలటరీ ఆధిపత్యానికి అంత్య దశ వచ్చినట్లే.

సంపన్న వనరులు

మరీ ముఖ్యంగా అమెరికాకు ఉక్రెయిన్ లోని సహజ వనరులు అంటే ఎనలేని ప్రేమ. “ఉక్రెయిన్ మాకు బంగారు గని లాంటిది. 10 నుండి 12 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కీలకమైన ఖనిజ సంపదకు ఉక్రెయిన్ నిలయం. అలాంటి ఉక్రెయిన్ ను మేము వదులుకోబోవడం లేదు” అని అమెరికా లోని ప్రముఖ సెనేటర్, అత్యంత క్రూరమైన యుద్ధ పిపాసి లిండ్సే గ్రాహం జూన్ 14 తేదీన సిగ్గు లేకుండా ప్రకటించాడు (రాయిటర్స్).

“ఐరోపా మొత్తంలో అత్యంత ధనిక దేశం అయ్యే అవకాశం ఉక్రెయిన్ కి ఉంది. అలాంటి ఉక్రెయిన్ లోని ధన రాశులను పుటిన్ కు ఇవ్వటానికి, చైనాతో పంచుకునేలా రష్యాకు అనుమతి ఇవ్వటానికి నేను అంగీకరించను” అని లిండ్సే గ్రాహం వ్యాఖ్యానించాడు. ఈ త్రాష్టుడు, ఉక్రెయిన్ అంటే వట్టి నేల, ఖనిజాలు కాదనీ అక్కడ 3.9 కోట్ల ప్రజలు (ఇప్పుడు వారి సంఖ్య 3.7 కోట్లకు తగ్గింది) ఉన్నారనీ ఉక్రెయిన్ సహజ సంపద ఆ ప్రజలకు చెందుతుంది అన్న సంగతిని పూర్తిగా విస్మరించాడు. ఇప్పుడు ఉక్రెయిన్ కు యుద్ధంలో సహాయం చేస్తున్నందుకు గాను ఉక్రెయిన్ సహజ వనరులు తమకు అప్పజెప్పాలని కూడా లిండ్సే గ్రాహం స్పష్టం చేస్తున్నాడు.

పేరు మోసిన అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ “ఉక్రెయిన్ యుద్ధం అక్కడ ఉన్న ఖనిజ, ఇంధన వనరుల కోసం జరుగుతున్న యుద్ధం” అని 2022 లోనే ప్రకటించడం విశేషం. “ఉక్రెయిన్ లో ప్రపంచంలో అత్యధిక టైటానియం, ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయి. ఇంకా తవ్వకాలకు నోచుకోని లిదియం నిల్వలు ఉన్నాయి (మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, స్మార్ట్ వాచ్ లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ కార్లు వీటన్నింటికీ లిధియం అత్యవసరం). బొగ్గు నిల్వలకు లెక్కే లేదు. వాటి మొత్తం ఖరీదు పదుల ట్రిలియన్ల మేర ఉంటుంది” అని అమెజాన్ కంపెనీ యజమాని (జెఫ్ బెజోస్) కి చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలియజేసింది. “ఇంకా అక్కడ సహజ వాయువు, చమురు, అరుదైన ఖనిజాల నిల్వలు ఉన్నాయి. ఇవి హై-టెక్ కంపెనీ ఉత్పత్తులకు చాలా అవసరం. విస్తృతంగా ఉపయోగించే 120 రకాల ఖనిజాలు, లోహాలలో 117 ఉక్రెయిన్ లో ఉన్నాయి” అని పోస్ట్ తెలిపింది. ఈ కీలక వనరులు రష్యా, చైనాల ఏలుబడిలోకి వెళ్తాయని అమెరికా, నాటో లు భయపడుతున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాకు పూర్తిగా లొంగిపోయాడు. తన ప్రజలు అమెరికా రేపిన యుద్ధంలో మొత్తంగా ఆహుతి అవుతున్నా వెనకడుగు వేయడం లేదు. నిజానికి జెలెన్ స్కీ పదవీ కాలం ముగిసినా అమెరికా, పశ్చిమ దేశాల మద్దతుతో పదవిలో కొనసాగుతున్నాడు. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం ముగిశాక ఎన్నికలు జరగక పొతే వేర్ఖోవ్నా రాడా (ఉక్రెయిన్ పార్లమెంటు) స్పీకర్, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి. అయితే ఇప్పటికే జెలెన్ స్కీ ఉక్రెయిన్ పై ఉక్కు పాదం మోపాడు. ప్రతిపక్ష నాయకులను జైళ్ళ పాలు చేశాడు. ప్రతిపక్ష పార్టీ అన్నదే లేకుండా చేశాడు. సొంత పార్టీలోని అసమ్మతి వాదులని కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టాడు. ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకునే అమెరికా నుండి, జెలెన్ స్కీ ఫాసిజం పట్ల ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం కావటం లేదు.

నాటో రష్యా బలాబలాలు

ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 2022 నాటి కంటే ఇప్పటి రష్యన్ సైన్యం 15 శాతం పెరిగింది. రష్యా సైన్యం పలు యుద్ధాలలో (జార్జియా, చెచెన్, సిరియా, లిబియా) ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం కలిగి ఉన్నది. అమెరికాకు చెందిన హై-టెక్ ఆయుధ వ్యవస్థను ఎలక్ట్రానిక్ పరికరాలతో జామ్ చేయడం, తప్పుడు సమాచారాన్ని అమెరికన్ రెక్కీ విమానాల్లో చొప్పించడం లాంటి ప్రయోగాలను ఉక్రెయిన్ యుద్ధంలో బాగా అభివృద్ధి చేసుకుంది. ఇరాన్, నార్త్ కొరియా దేశాల నుండి అత్యంత చవకగా లభించే డ్రోన్ లను వేల కొద్దీ దిగుమతి చేసుకుంది. వాటితో నాటో బలగాల ట్యాంకులు, విమాన స్థావరాలను నాశనం చేస్తున్నది.

మరో పక్క నాటో దేశాల వద్ద ఉన్న ఆయుధాలు చాలా వరకు ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగించబడ్డాయి. ముఖ్యంగా ఐరోపా దేశాల వద్ద సొంత రక్షణ రంగానికి కూడా అవసరమైన ఆయుధ నిల్వలు అందుబాటులో లేవు. అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన ప్రధాన ట్యాంకర్లు, మిసైళ్ళ సత్తా ఏపాటిదో ఉక్రెయిన్ యుద్ధంలో వెల్లడి అయింది. అమెరికన్ అబ్రాం ట్యాంకర్, బ్రిటన్ ఛాలెంజర్ 2 ట్యాంకు, జర్మనీ లెపర్డ్ 2 ట్యాంకు, ఫ్రెంచి లెక్లార్క్ ట్యాంక్… ఇవన్నీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్లు, ఇరానియన్లు తయారు చేసిన చవక డ్రోన్ ల ముందు వెలతెలా పోయాయని యుద్ధ వార్తల ద్వారా తెలుస్తోంది. తన ట్యాంకు పరువు పోతున్న పరిస్ధితుల్లో అమెరికా అబ్రాం ట్యాంకులను ఉక్రెయిన్ కు ఇవ్వడం నిలిపివేయటమే కాకుండా వాటిని ఫ్రంట్ లైన్ యుద్ధంలో వినియోగించవద్దని ఉక్రెయిన్ కు తాఖీదు పంపింది.

అమెరికా, ఐరోపా దేశాల యుద్ధ పరికరాలు ఖరీదైనవి. వాటి తయారీకి ఎక్కువ కాలం పడుతుంది. రష్యా వద్ద ఆయుధాల కొరత లేదు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే అనేక చోట్ల వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి కుప్పలు తెప్పలు ఆయుధాలు తయారు చేస్తున్నది. ఎప్పటి కప్పుడు ఫ్రంట్ లైన్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. అదీ కాకుండా తన ఆయుధాలను ప్రతి రెండు మూడు నెలలకు అభివృద్ధి చేస్తున్నది. యుద్ధంలో వస్తున్న అనుభవాలను బట్టి తన ఆయుధాలను మరింత మేరుపరుస్తోంది. 2022లో ఉపయోగించిన ఆయుధాలు 2023 లో లేవనీ, 2023లో ప్రయోగించిన అనేక ఆయుధాలు 2024 నాటికి సరికొత్తగా అభివృద్ధి చెంది యుద్ధంలో ప్రవేశించాయని ఉక్రెయిన్ సైన్యమే చెబుతోంది.

అయితే రష్యా సైన్యం ఏ స్థాయిలో నష్టం జరుగుతున్నదో, మరణాల సంఖ్య ఏ మేరకు ఉన్నదో సరైన సమాచారం అందడం లేదు. పశ్చిమ పత్రికలైతే రష్యా సైన్యం పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని, ఉక్రెయిన్ విజయం ఖాయమని చెబుతున్నాయి. రష్యా డిఫెన్స్ మంత్రి ఉక్రెయిన్, రష్యా సైన్యాల నష్టం 1:10 గా ఉన్నదని ప్రకటిస్తున్నాడు. స్వతంత్ర పరిశీలకుల ప్రకారం రష్యా సైనిక నష్టం ఉక్రెయిన్ స్థాయిలో లేకున్నప్పటికీ వారికి జరుగుతున్న నష్టం కూడా తక్కువ కాదని స్పష్టం చేస్తున్నారు.

మరో వైపు ఉక్రెయిన్ సైన్యం లో పేరు పొందిన బ్రిగేడ్లు కూడా కమాండ్ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. రష్యన్లతో యుద్ధానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఉదాహరణకి 25వ ఎయిర్ బార్న్ అస్సాల్ట్ బ్రిగేడ్, 67వ మెకనైజ్డ్ బ్రిగేడ్ లు చాసివ్ యార్ లో తమ ఫ్రంట్ లైన్ పొజిషన్ లను రక్షణ రహితంగా వదిలి పెట్టి వెళ్ళిపోయాయి. 115వ బ్రిగేడ్ కమాండ్ ఆదేశాలను పాటించేందుకు నిరాకరించింది. 47వ మెకనైజ్డ్ బ్రిగేడ్ తాము సం. పైగా ఫ్రంట్ లైన్ లో ఉన్నామని వెంటనే రొటేషన్ కావాలని డిమాండ్ చేసింది. ఇవన్నీ ఉక్రెయిన్ ఆర్మీలో అత్యంత పేరు మోసిన సైనిక విభాగాలు కావటం విశేషం.

ఈ సమాచారం ఎప్పటికప్పుడు రష్యాకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆర్మీ యూనిట్లను మట్టు బెడుతూనే మరో పక్క విదేశీ బలగాలను టార్గెట్ చేస్తున్నది. ప్రతి రోజూ ఉక్రెయిన్ సైనిక మరణాలు, గాయాల సంఖ్య పెరుగుతూ పోతున్నది. కొత్త రిక్రూట్ల కోసం ఉక్రెయిన్ ఆత్రుతగా వెతుకుతూ వయసుతో నిమిత్తం లేకుండా పురుషులను ఫ్రంట్ లైన్ కు తరలిస్తోంది. ఇటీవల స్త్రీలు కూడా యుద్ధానికి సిద్ధం కావాలని జెలెన్ స్కీ ఆదేశాలు ఇచ్చాడు. ఐరోపా దేశాలకు పారిపోయిన ఉక్రెయిన్ యువకులను యుద్ధం నిమిత్తం ఉక్రెయిన్ కు బలవంతంగా అయినా సరే తిరిగి పంపాలని ఉక్రెయిన్ పశ్చిమ, తూర్పు ఐరోపా దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నది. లిధుయేనియా, పోలండ్ దేశాలు ఈ విజ్ఞప్తిని స్వీకరించి ఆ పనిలో నిమగ్నం అయ్యాయి.

ఉక్రెయిన్ ఎన్నాళ్ళుగానో అమెరికా నుండి ఎఫ్-16 ఫైటర్ జెట్లు పంపాలని డిమాండ్ చేస్తూ రావడంతో 15 ఫైటర్ జెట్లు ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. కాని ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలు నడపడానికి కనీసం 5 ఏళ్ళ శిక్షణ కావాలి. అయినా కొంత మంది ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు జర్మనీ పూనుకుంది. కానీ భాషా కష్టాలు, పశ్చిమ యుద్ధ విమానాల వ్యవస్థలు అర్ధం చేసుకోవటమే ఉక్రేయినియన్లకు ఒక బ్రహ్మ పదార్ధంగా ఉండడంతో శిక్షణ సజావుగా సాగలేదు. చివరికి ఐరోపా దేశాలకు చెందినా రిటైర్డ్ పైలట్లు ఎఫ్-16 ఫైటర్లు నడపాలని నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్ధితుల్లో అమెరికా ఎన్నికల ముగింపు కోసం ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల్లో బైడెన్ విజయం సాధిస్తే గనక అమెరికా సైన్యం ఉక్రెయిన్ లో అడుగు పెట్టడం ఖాయంగా పలువురు విశ్లేషిస్తున్నారు. అమెరికా సైనికులు ప్రవేశిస్తే వారిపై దాడులు చేయకుండా రష్యా చేతులు ముడుచుకు కూర్చోదు. ఆ విధంగా అమెరికా-రష్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా నాటో కూటమికి నాయకత్వ దేశం. కనుక ఐరోపా లోని నాటో దేశాలు తప్పనిసరిగా యుద్ధంలోకి ప్రవేశిస్తాయి. ఇది అనివార్యంగా ౩వ వరల్డ్ వార్ కు దారి తీస్తుంది.

అయితే ఇది బైడెన్ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే జరిగే వ్యవహారం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే ఏమి జరుగుతుందో ఊహించటం అంత సులభం కాదు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఊహించలేము. ఇప్పటికైతే ఉక్రెయిన్ యుద్ధం ముందుకు సాగకుండా నిరోదిస్తానని రష్యాతో ఒప్పందానికి చర్యలు తీసుకుంటానని ట్రంప్ చెబుతున్నాడు. మరోసారి “ఉక్రెయిన్ సర్వైవల్ ముఖ్యమైన విషయం. ఉక్రెయిన్ రక్షణ అమెరికా కంటే ఐరోపా దేశాలకే ఎక్కువ అవసరం. కాబట్టి ఐరోపా మరింత సాయం ఉక్రెయిన్ కు చెయ్యాలి. మరింత డబ్బు రక్షణ బడ్జెట్ కు కేటాయించాలి” అని ప్రకటించాడు. తాను అధ్యక్షుడుగా ఉన్నట్లయితే ఉక్రెయిన్ యుద్ధమే మొదలై ఉండేది కాదు అని చెప్పే ట్రంప్ తాను అధ్యక్షుడుగా గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపి ఒప్పందం చేయిస్తారా అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వటం లేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయి. ఈ లోపు ఉక్రెయిన్ సరెండర్ అయ్యేలా చూసేందుకు రష్యా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పత్రికలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ రష్యా లోపలి భూభాగాలపై జరిగే దాడులకు అమెరికా ఆయుధాలు ప్రయోగించేందుకు అనుమతించిన నేపధ్యంలో ఐరోపాలో భారీ ఘర్షణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి ఘర్షణ మూడవ ప్రపంచ యుద్ధంగా పరిణమించక పొతే ఆశ్చర్యమే!

వ్యాఖ్యానించండి