
నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడి లను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరినీ జైలు పాలు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి జార్ఖండ్ హై కోర్టు నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ భూ కుంభ కోణానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్షాలు లేవు అని చెబుతూ హై కోర్టు ఆయనకు జూన్ 28 తేదీన సాధారణ బెయిలు మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తు రెండింటిని ఆయన సోదరులు ఇద్దరు సమర్పించడంతో హేమంత్ సొరేన్ బెయిల్ పై విడుదల అయ్యాడు.
“కేసు వివరాలన్నీ పరిశీలించిన పిదప వివిధ అంశాలన్నింటిని బట్టి చూస్తే ‘8.86 ఎకరాల భూమి ఆక్రమణ మరియు స్వాధీనం లేదా మరుగుపరచడం అన్న నేరానికి సంబంధించిన ధన సంచయంతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పిటిషనర్ తో సంబంధం ఉన్నట్లు వెల్లడి కావటం లేదు. రిజిస్టర్ లేదా రెవిన్యూ రికార్డులు ఏవీ భూమి ఆక్రమణ, స్వాధీనం లలో పిటిషనర్ ప్రత్యక్ష జోక్యం ఉన్నట్లు ప్రతిబింబించడం లేదు” అని జార్ఖండ్ హై కోర్టు పేర్కొంది (ద హిందూ జూన్ 28, 2024).
“ప్రాధమిక ఆధారాల ప్రకారం (prima facie) హేమంత్ సొరేన్ నేరం చేయలేదు. బెయిల్ పై విడుదల అయ్యాక పిటిషనర్ మరే నేరానికీ పాల్పడే అవకాశం లేదు అని కోర్టు పేర్కొంది” అని హేమంత్ సొరేన్ కౌన్సెల్ లలో ఒకరైన అరునభ్ చౌదరి పిటిఐ తో చెప్పాడు. (ఎం.డి.టి.వి, జూన్ 28)
“పిఎంఎల్ఎ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) చట్టం సెక్షన్ 45 ప్రకారం ఈ కోర్టు రికార్డు చేసిన అంశాలను బట్టి చూస్తే ఇడి ఆరోపించినట్లుగా పిటిషనర్ నేరస్థుడు కాదు అని కోర్టు నమ్మేందుకు తగిన కారణం ఉన్నట్లు కోర్టు నమ్ముతున్నది” అని జార్ఖండ్ హై కోర్టు బెయిల్ పిటిషన్ తీర్పులో ప్రకటించింది.
రాంచి లోని బద్గాయ్ ప్రాంతంలో భూమి పత్రాలను ఫోర్జరీ చేసి అసలు సొంతదారు రాజ్ కుమార్ పహాన్ నుండి 8.86 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాడని, అందుకు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్రడని, ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని ఇడి ఆరోపించింది.
జార్ఖండ్ హై కోర్టు తీర్పుతో కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల పైనా, ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రుల పైనా ఎన్ఫోర్స్^మెంట్ డైరెక్టర్ చేత వరుస దాడులు చేయించడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకులను భయాందోళనలకు గురి చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతోంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ను ఇడి జనవరి 31, 2024 తేదీన అరెస్టు చేసింది. అంతకు మునుపే ఇడి నుండి వరుసగా సమన్లు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి తనను అరెస్టు చేసేందుకే నిర్ణయించారని గ్రహించి గవర్నర్ వద్దకు వెళ్లి ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. గవర్నర్ నివాసం నుండి బైటికి వచ్చిన వెంటనే అక్కడే ఉన్న ఇడి అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్ళి 7 గంటల పాటు ప్రశ్నించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
హేమంత్ సొరేన్ అరెస్టు తర్వాత అతని భార్య కల్పనా ముర్ము సొరేన్ ను ముఖ్యమంత్రిని చేస్తారని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నేత చంపాయ్ సొరేన్ ముఖ్య మంత్రి పదవి స్వీకరించాడు.
విడుదల అనంతరం తన తండ్రి షిబు సొరేన్ ఇంటికి వెళ్ళిన హేమంత్ అక్కడే విలేఖరులతో మాట్లాడాడు. “5 నెలల తర్వాత జైలు నుండి విడుదల అయ్యాను. జార్ఖండ్ ప్రజలు, గిరిజనులు చింత పడి ఉండొచ్చు. నన్ను ఎందుకు జైలుకు పంపారో దేశం మొత్తానికి తెలుసు. ఒత్తిడి చేసి నన్ను బిజేపి లో చేర్చాలన్నది వారి లక్ష్యం. కోర్టు పట్ల నాకు గౌరవం ఉన్నది. కానీ రాజకీయ నాయకులు, రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వీరందరి నోళ్ళు మూయించాలని ఒక పధ్ధతి ప్రకారం అణచివేత అమలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించాడు.
“నా లాగా ఇంకా అనేక మంది జైలులో ఉన్నారు. జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా న్యాయం దక్కవలసి ఉంది. న్యాయం దక్కేందుకు సుదీర్ఘ కాలం పడుతోంది. తమ తమ రంగాల్లో నిజాయితీగా పని చేస్తున్నవారిని కష్టపెడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని నా విడుదల ద్వారా దేశానికి సందేశం అందింది” అని హేమంత్ సొరేన్ అన్నాడు.
ఈ కేసులో దాదాపు 25 మందికి పైగా అధికారులను, నేతలను, ఉద్యోగులను ఇడి అరెస్టు చేసింది. రాంచి లోని కమలేశ్ సింగ్ అనే వ్యక్తీ ఇంటిపై జరిపిన దాడుల్లో రు. 1 కోటి డబ్బు, 100 రౌండ్ల బులెట్లు స్వాధీన చేసుకున్నట్లు జూన్ 22 తేదీన ఇడి ప్రకటించింది. అయితే ఇది హేమంత్ పై ఆరోపణలకు సంబంధించిన భూమి విషయంలో కాదని వేరే ఇతర భూ లావాదేవీలకు సంబంధించిన సొమ్ము అనీ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెల్లడించడం విశేషం.