
Rafah Border
సహజవాయువు, టూరిజం
2021లో ఈజిప్టు ఇంధన శాఖ మంత్రి తారెక్ ఆల్-మొల్లా ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ఇంధన మంత్రి యువాల్ స్టీనిట్జ్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ లతో ఓ ప్రధాన సహకార ఒప్పందం గురించి చర్చలు జరిపాడు. వాషింగ్టన్ డి.సి. లోని అరబ్ సెంటర్ నివేదిక ప్రకారం, “పాలస్తీనా సముద్ర తీరం లోని లెవియాథన్ చమురు ఫీల్డ్ నుండి వెలికి తీసిన సహజ వాయువును సముద్రం అడుగు నుండి వేసిన కొత్త పైప్ లైన్ ద్వారా ఈజిప్టు లోని ద్రవీకరణ ఫ్యాక్టరీలకు చేరవేయనున్నారు. ప్రస్తుతం లెవియాథన్ ఫీల్డ్ నుండి గ్యాస్ ను సినాయ్ ద్వీప కల్పం గుండా వెళ్లే పైప్ లైన్ ద్వారా ఈజిప్టుకు చేరవేస్తున్నారు. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం ఈ కొత్త ప్రాజెక్టు అంతిమ లక్ష్యం గ్యాస్ ను ఈజిప్టు నుండి నానాటికి డిమాండ్ పెరుగుతున్న ఐరోపా దేశాలకు సరఫరా చేయడం.”
ఈ ప్రాజెక్టు వెనుక దాగిన ఇజ్రాయెల్ మరో లక్ష్యం గ్యాస్ రవాణా సహకారం ద్వారా ఈజిప్టు ఆర్ధిక వ్యవస్థను ఇజ్రాయెల్ ఆర్ధిక వ్యవస్థతో ముడి పెట్టడం. తద్వారా భవిష్యత్తులో ఈజిప్టు పాలకుడు ఎవరైనా ఇరు దేశాల సంబంధాలను వెనక్కి తిప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా ముందర కాళ్లకు బంధం వేయడం. ఈజిప్టు వైపు నుండి చూస్తే ఈ ప్రాజెక్టు ద్వారా ఈజిప్టు సహజ వాయు రవాణాకు ఒక ప్రధాన కేంద్రంగా అవతరించవచ్చని ఆశించడం. మధ్యధరా సముద్రం లోని ఈజిప్టు తీరం వెంబడి జోహర్ ఒక పెద్ద సహజవాయు నిక్షేపాల గనిని 2015లో కనుగొన్నారు. అనంతరం ఈజిప్టు చొరవతో సైప్రస్, గ్రీస్, ఇజ్రాయెల్, ఇటలీ, జోర్డాన్, పాలస్తీనా అథారిటీ లతో కలిసి “తూర్పు మధ్యధరా గ్యాస్ ఫోరం” ను ఏర్పాటు చేశారు. ఇందులో ఫతా నేతృత్వం లోని పాలస్తీనా అథారిటీ ఉండడానికి ఉంది గానీ అది పూర్తిగా ఇజ్రాయెల్ అదుపాజ్ఞలకు లోబడి పని చేస్తుంది. కనుక ఇజ్రాయెల్ కు వచ్చిన భయం ఏమీ లేదు. ఫతా ప్రభుత్వం నడుస్తున్న వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ యూదు సెటిల్‌మెంట్ లను విస్తరిస్తూ పోతున్నప్పటికీ పాలస్తీనా అథారిటీ నుండి కనీస ప్రతిఘటన లేకపోవడం గమనించవలసిన విషయం.
మార్చి 2021లో ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్ మంత్రి ఎలి కోహెన్, ఈజిప్టు ఇంటలిజెన్స్ శాఖ ఉప మంత్రి నాసర్ ఫామి తో కలిసి చర్చలు జరిపాడు. సినాయ్ లో ఈజిప్టు టూరిస్టుల భద్రత కోసం ఈజిప్టు చేయవలసింది అంతా చేస్తున్నదని ఈ సమావేశంలో ఇజ్రాయెల్ మంత్రి సర్టిఫికేట్ ఇచ్చాడు (మిడిల్ ఈస్ట్ మానిటర్, మార్చి 11, 2021). గమనార్హం ఏమిటంటే ఇజ్రాయెల్ మంత్రితో పాటు 60 మంది ఇజ్రాయెలీ అధికారులు, వ్యాపార సంస్థల అధినేతలు ఈజిప్టు వెళ్ళారు. రానున్న కాలంలో ఇరు దేశాల మధ్య టూరిజం సంబంధాలు బలీయం చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు దీని ద్వారా స్పష్టం అయింది. కోహెన్ నేతృత్వం లో ఒక డెలిగేషన్ ఈజిప్టు వచ్చిన సమాచారం పత్రికలకు తెలియకుండా ఈజిప్టు ప్రభుత్వం తొక్కి పెట్టింది. పాలస్తీనా జాతీయ ఉద్యమం పట్ల ఇప్పటికీ తీవ్ర సానుభూతితో ఉన్న ఈజిప్టు ప్రజలకు ఈ సమాచారం తెలియడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. “ఇజ్రాయెల్ తో అన్ని రంగాలలో సహకారం పెంపొందించేందుకు ఈజిప్టు ఆసక్తిగా ఉంది. భవిష్యత్తులో ఆర్ధిక, ద్వైపాక్షిక సంబంధాలు బలీయం కావించడం కొనసాగిస్తాము” అని కోహెన్ ఈ సమావేశంలో పేర్కొన్నాడు.

ఈజిప్టు పాలకులు ఇజ్రాయెల్ తో కుమ్మక్కై స్వార్ధ ప్రయోజనాల నిమిత్తం పాలస్తీనా విమోచనకు ద్రోహం చేసే పనిలో ఉండగా అక్కడి ప్రజలు మాత్రం పాలస్తీనా విమోచనకు గట్టి సానుభూతిపరులుగా కొనసాగుతున్నారు. జాగ్బీ రీసెర్చ్ సర్వీసెస్ అనే సంస్థ ఈ అంశంపై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఈజిప్టులో 79 శాతం ప్రజలు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పరిష్కారం “చాలా ముఖ్యం (very important)” అని చెప్పగా 15 శాతం మంది “కొంత మేరకు ముఖ్యమే (somewhat important) అని చెప్పారు. 6 శాతం మంది “కొంత మేరకు ముఖ్యం కాదు లేదా అసలు ముఖ్యం కాదు” అని చెప్పారు. వెస్ట్ బ్యాంక్ ను ఇజ్రాయెల్ కలుపుకునే అవకాశం గురించి ప్రశ్నించగా “అదే జరిగితే ఇజ్రాయెల్ తో సహకారాన్ని వెంటనే నిలిపి వేయాలి” అని 75 శాతం ప్రజలు బదులిచ్చారు. అనగా 94 శాతం ఈజిప్టు ప్రజలు పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. 75 ఏళ్ళ తర్వాత ఈజిప్టులో ఉన్న ప్రజలలో అత్యధికులకు పాలస్తీనా పరిణామాల గురించి ఫస్ట్ హ్యాండ్ సమాచారం తెలిసే అవకాశం లేదు. అయినప్పటికీ పాలస్తీనా సమస్య గురించి చర్చించడం వారు మానలేదు. ఇదే ఈజిప్టు పాలకులను నిత్యం భయపెట్టే అంశం.
అందుకే ఇజ్రాయెల్ తో సహకారం విషయం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఫతే ఆల్-సిసి వెల్లడి చేయగల సమాచారంపై తీవ్ర పరిమితులు ఏర్పడి ఉన్నాయి. అరబ్ శాంతి కోసం చొరవ చేసే విషయం నుండి ఈజిప్టు దూరం జరిగిపోయింది అన్న సంగతి తెలిస్తే ఈజిప్టు ప్రజలు తీవ్ర ఆందోళనలకు దిగడం ఖాయం. అమెరికా లోని జియోనిస్ట్ (ఇజ్రాయెల్) లాబీ నుండి మద్దతు పొందాలంటే, తద్వారా అమెరికా-ఇజ్రాయెల్ నుండి ఆర్ధిక, రాజకీయ మద్దతుతో పాటు వ్యూహాత్మక ప్రాజెక్టులు సాధించాలంటే ఇజ్రాయెల్ తో ఘర్షణ వైఖరి కూడదని ఈజిప్టు పాలకవర్గం నిర్ణయించుకుంది. అంతే కాక ఈజిప్టు నుండి ఇజ్రాయెల్ కు సహకారం అందకపోతే ఈజిప్టు పాలకుడు ఆల్-సిసి, సినాయ్ లో జరిపిన మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసిజే), ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) లలో ప్రాసిక్యూషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు.
అనేక మంది ఆఫ్రికా దేశాల పాలకులను ఐసిజే చేత ప్రాసిక్యూషన్ చేయిస్తానని బెదిరించి అమెరికా తన దారికి తెచ్చుకున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. సూడాన్ అధ్యక్షుడిని ఇలాగే బెదిరించిన అమెరికా, సెర్బియా నాయకులను ఐసిజే ద్వారా జైలు పాలు చేసింది. నిజానికి యుగోస్లోవియా లోని సెర్బియన్ల పైన అమానుషంగా బాంబు దాడులు చేసి వేల మందిని చంపేసి దేశాన్ని 6 ముక్కలుగా విడగొట్టిన క్రూర చరిత్ర అమెరికా, నాటో ల సొంతం. అంతటితో ఆగకుండా సెర్బియా నుండి కొసావో, వోజ్వోడినా రాష్ట్రాలను సెర్బియా నుండి విడగొట్టేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారు. కనుక అసలు ప్రధానంగా శిక్షలు పడవలసింది అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ లకు!
ఐసిజే న్యాయమూర్తులు సాధారణంగా అమెరికా, ఈయు లు ముఖ్యంగా అమెరికా చెప్పినట్లే చేస్తారు. వాళ్ళు న్యాయ చట్టాలు అనుసరించకుండా అమెరికా చూస్తుంది. ఒక వేళ ఒకరిద్దరు అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తామంటే, సిఐఎ, మొస్సాద్ లు రంగంలోకి దిగుతాయి. వాళ్లని బెదిరించి, భయపెట్టి దారికి తెచ్చుకుంటాయి. కనుక దేశాల పాలకులు దేశంలో హత్యాకాండలకు, మానవ పౌర హక్కుల అణచివేతకు పాల్పడినప్పటికీ అమెరికా అండ ఉంటే చాలు. అంతర్జాతీయ న్యాయస్థానం గురించి భయపడ వలసిన అవసరం ఉండదు. ఈ ధైర్యం తోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతృత్వం లోని తీవ్రవాద జియోనిస్ట్ ప్రభుత్వం (ఐడిఎఫ్ – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) విచ్చలవిడిగా, విచక్షణా రహితంగా గాజా ప్రజలపైనా, ఆసుపత్రుల పైనా, నివాసాల పైనా, ఐరాస సహాయ ట్రక్కుల పైనా ట్యాంకులు, మర ఫిరంగులు, మిసైళ్ళతో దాడులు చేయగలుగుతోంది.
అమెరికా, ఇజ్రాయెల్ లతో అంట కాగుతున్న ఈజిప్టు అధ్యక్షుడు అక్టోబర్ 7 తర్వాత జర్నలిస్టులు ఎవరినీ గాజా వెళ్లకుండా నిషేధం విధించాడు. ఈ అంశం గురించి ఈజిప్టు విదేశీ మంత్రి సమేహ్ షౌక్రి, “జర్నలిస్టులను గాజా లోకి అనుమతించే విషయంలో ఈజిప్టు ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా, అది తగని పనిగా (ఇజ్రాయెల్) పరిగణించే అవకాశం ఉంది. గాజాకు సహాయం పంపేందుకు ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య ఏర్పడిన అవగాహన లోని ఇతర భాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు” అని వ్యాఖ్యానించాడు. కానీ జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధించి కూడా ఆహార సహాయ ట్రక్కులను పూర్తిగా వదలడం లేదు. గాజాలో ప్రవేశం పొందాలంటే ఇజ్రాయెల్ అనుమతి తీసుకొమ్మని ఈజిప్టు ప్రభుత్వం కైరోలోని జర్నలిస్టులకు చెప్పింది. కాని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రతినిధిని అడిగితేనేమో “పర్మిట్లు జారీ చేసే అధికారమే మాకు లేదు. ఇది కేవలం సాకు మాత్రమే. మిమ్మల్ని అటు ఇటు తిప్పేందుకే వారలా చెప్పి ఉంటారు” అని కుండ బద్దలు కొట్టింది.
అలా ఇజ్రాయెల్, ఈజిప్టులు పరస్పర సహకారంతో గాజాలో ఇజ్రాయెల్ 9 నెలలుగా సాగిస్తున్న జీనోసైడ్ గురించి అంతర్జాతీయ మీడియాకు సమాచారం అందకుండా నిరోధిస్తున్నాయి. ఈ దిగ్బంధానికి ప్రధాన చోదక శక్తి ఇజ్రాయెల్ కాగా ఈజిప్టు అందులో మనస్ఫూర్తిగా పాలు పంచుకుంటోంది. ఆ విధంగా ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్టు రాజ్యం అన్న నిజం ప్రపంచ ప్రజలకు చేరకుండా సహకరిస్తోంది.
మొస్సాద్ మాఫియా కుట్రలు
గ్లోబల్ సౌత్ దేశాల మద్దతుతో, అమెరికా, ఇయుల నిరసనల మధ్య పాలస్తీనాను సార్వభౌమ దేశంగా ఐరాస జనరల్ అసెంబ్లీ గుర్తించింది. ఈ గుర్తింపు పాలస్తీనాను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) సభ్య దేశంగా చేరేందుకు మార్గం సుగమం అయింది. దానితో జనవరి 2015 నుండి ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్ సంస్థ మొస్సాద్ ఐసిసి పైన యుద్ధం ప్రారంభించింది. మొస్సాద్ ఏజెంట్లు ఐసిసి చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ కదలికల పైన నిఘా పెట్టడం రొటీన్ అయింది. ఈ నిఘాలో మొస్సాద్ తో పాటు మరో గూఢచార ఏజన్సీ షిన్ బెట్, నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీలు పాల్గొన్నాయి. ఐసిసి కి నివేదికలు పంపిస్తున్న పాలస్తీనా మానవ హక్కుల సంఘాల పైన ఇజ్రాయెల్ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రి గిలాద్ ఎర్డాన్ నిఘా పెట్టించాడు. సీనియర్ ఐసిసి అధికారులను తన ఏజెంట్లుగా మార్చుకునేందుకు మొస్సాద్ సకల ప్రయత్నాలు చేసింది.

Benjamin Netanyahu, Fatou Bensouda, Yossi Cohen
మొస్సాద్ మాజీ అధిపతి కోహెన్, అప్పటి ఐసిసి ప్రాసిక్యూటర్ ఫటు బెన్సుడా (పాలస్తీనాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలు, మానవతా వ్యతిరేక నేరాలపై విచారణ నిర్వహించాలని ఆమెయే నిర్ణయించింది) తో రహస్యంగా అనేక మార్లు కలిసి బెదిరించాడు. “మీ గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు మీరు మాకు సహాయం చెయ్యాలి. మీ భద్రత, మీ కుటుంబ భద్రతలు ప్రమాదంలో పడే వ్యవహారాల్లోకి వెళ్లాలని మీరు కోరుకోరు” అని బెదిరించాడు (ది గార్డియన్, 28 మే 2024). బెన్సుడా భర్త ఫోన్ సంభాషణలు రికార్డ్ చేసి వాటిని బయట పెడతామని మొస్సాద్ బెదిరించింది. ఓ సారి బెన్సుడా, డి.ఆర్.సి కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబిలా తో సమావేశంలో ఉండగా కోహెన్ చెప్పా పెట్టకుండా ఆ సమావేశం లోకి జొరబడ్డాడు. (కబిలా మొస్సాద్ పే రోల్ -చెల్లింపులు- లో ఉన్నాడని ఆ సంఘటన తెలిపింది.) బెన్సుడా తర్వాత ఆ పదవిలోకి వచ్చిన కరీం ఖాన్ ను కూడా మొస్సాద్ టార్గెట్ చేసింది. “అనేక రూపాల్లో బెదిరింపు సంభాషణల ద్వారా ఐసిసి కార్యకలాపాలను ప్రభావితం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి” అని ఐసిసి స్వయంగా ధృవీకరించింది కూడా (ది గార్డియన్). ఐసిసి అధికారులపై నిఘా పెట్టి బెదిరించే ఆపరేషన్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ స్వయంగా పాల్గొని సూచనలు ఇచ్చాడని తెలుస్తోంది.
ఫాల్స్ ఫ్లాగ్ టెర్రరిజం
సముద్ర ప్రయాణంలో నౌకలు ఏ దేశానికి చెందినవో తెలిసేందుకు ఆ దేశ జెండాను నౌకపై ఎగరేసి ఉంచుతాయి. జెండాను బట్టి నౌక (సరుకు రవాణా లేదా పాసింజర్ రవాణా) సమాచారాన్ని వివిధ దేశాల కోస్ట్ గార్డులు తెలుసుకుంటారు. తద్వారా ఘర్షణలు నివారిస్తారు. అవతలి వైపు వారిని తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశ్య పూర్వకంగా తమది కాని జెండా నౌకపై ఉంచితే అది ‘ఫాల్స్ ఫ్లాగ్’ అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఈ తరహా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లు చేయడంలో ఆరి తేరాయి. ఉదాహరణకి సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ తన సొంత దేశ ప్రజల పైనే బాంబులు వేసి చంపుతున్నాడని తప్పుడు ప్రచారం చెయ్యాలని నిర్ణయించాయి. అప్పుడు అవి తమ నియంత్రణలో ఉన్న ఐసిస్ శ్రేణులకు ఆదేశాలు ఇస్తాయి. ఐసిసి సిరియాలో ఏదో ఒక చోట టెర్రరిస్టు దాడి చేస్తుంది. దాడి జరిగిన వెంటనే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఆ దాడికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాయి. ఆ దాడి బషర్ ఆల్-అస్సాద్ చేయించాడని ఢంకా బజాయిస్తాయి. తన ప్రజల్ని తానే చంపుతున్నాడని మసాలా జత చేస్తాయి. ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ (SOHR) సంస్థ తమకు ఈ సమాచారం పంపిందని చెబుతాయి.
ఇంతకీ ఈ అబ్జర్వేటరీ ఎక్కడిదా అని ఆరా తీస్తే అది లండన్ నడి బొడ్డున ఉందని తేలుతుంది. దానిని నడుపుతున్నది ఒకే ఒక వ్యక్తి అనీ అతనికి బ్రిటిష్ ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని, సిరియాలో ఐసిస్ టెర్రరిస్టులకు అతనికీ సమాచార వ్యవస్థ కూడా బ్రిటిష్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందనీ తెలుస్తుంది. ఇలాంటి తరహా ఆపరేషన్‌లను ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ నిజంగా జరిపేది ఒకరైతే దానికి మరొకరిని బాధ్యులుగా ప్రచారం చేసి తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి ఆపరేషన్‌లను అమెరికా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిపించింది. సిరియాలో సిఐఎ, మొస్సాద్ లు ఉమ్మడిగా ఇలాంటి ఆపరేషన్లు జరిపించి నెపాన్ని బషర్ ఆల్-అస్సాద్ మీదికి నెట్టాయి. మార్ఫ్ చేసిన వీడియోలు, ఫొటోలు కూడా ప్రచురిస్తాయి. అన్నీ చేసి ఆ వీడియోల సాధికారతకు తాము గ్యారంటీ ఇవ్వలేము అని రాస్తాయి. తద్వారా తప్పుడు ప్రచారం చేసిన బాధ్యత నుండి తప్పుకుంటాయి. ఇండియా లాంటి దేశాల్లోని వార్తా సంస్థలు (తెలుగు లాంటి ప్రాంతీయ భాష పత్రికలతో సహా) ఆ సమాచారానికి ఇంకా చిలవలు పలవలు అల్లి తాటికాయంత అక్షరాల హెడ్డింగులతో నమ్మకమైన వార్తలుగా ప్రచురిస్తాయి.
ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌లను పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని భ్రష్టు పట్టించేందుకు మొస్సాద్ అనేకం జరిపించింది. మధ్య ప్రాచ్యంతో పాటు ప్రపంచం నలుమూలల అనేక దేశాల్లో కుట్రలకు పాల్పడింది. ఇవి జియోనిస్ట్ ఉద్యమంలో విడదీయరాని భాగం అయ్యాయి. ఉదాహరణకి లెబనాన్ లో FLLF పేరుతో ఒక బూటకపు టెర్రరిస్టు గ్రూపు ఏర్పరిచింది. లెబనాన్ లో మొస్సాద్ జరిపిన టెర్రరిస్టు దాడులకు ఆ సంస్థ బాధ్యత తీసుకునేది. ముస్లింలు మరియు కమ్యూనిస్టులను బాధ్యులుగా చేసేందుకు 1954 లో ఈజిప్టు, పశ్చిమ దేశాలకు చెందిన పౌర భవనాలపై బాంబు దాడులు చేసింది. సోవియట్ రష్యాను అప్రతిష్ట పాలు చేసేందుకు అక్కడ యూదులపై తానే దాడులు చేసి సోవియట్ రష్యాలో ‘సరికొత్త ఎర్ర యాంటీ సెమిటిజం’ (యూదు వ్యతిరేకత) ఉద్భవించింది అని ప్రచారం చేసింది. ఆ మేరకు పుస్తకాలు ప్రచురించింది.
మొరాకో లో వందల మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ లో సెటిల్ చేయించి వారి ద్వారా మరింత మంది యూదు సెటిలర్లు ఇజ్రాయెల్ వచ్చేలా చేసింది. “ఆపరేషన్ మూరల్’ పేరుతో దీన్ని నిర్వహించారు. బ్రిటన్ అణు ఆకృత్యాలను బైట పెట్టిన ‘మార్డ్ చాయ్ వనును’ బ్రిటన్ నుండి ఇటలీకి కిడ్నాప్ చేసేందుకు అందమైన యువతిని ఎర వేసింది. ఇప్పటికీ ఆయన ఆచూకి తెలియదు. ప్రఖ్యాత పాలస్తీనా కార్టూనిస్టు నాజ్ ఆల్-అలీ ని లండన్ వీధుల్లో హత్య చేసింది. (ఇందుకు మొస్సాద్ వేగును అప్పటి ప్రధాని థాచర్ దేశం నుండి బహిష్కరించింది.) 2010లో దుబాయ్ లో ఉన్న పాలస్తీనా నేతను హత్య చేసేందుకు బ్రిటిష్, ఫ్రెంచి, ఐరిష్ పాస్-పోర్ట్ లు వినియోగించింది.
వేగులే కాకుండా ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్ సంస్థలకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సహాయ సహకారాలు అందజేసేందుకు ఒక ఇన్ ఫార్మర్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రపంచ వ్యాపితంగా నిర్మించుకుంది. వాళ్ళు సాధారణ పౌరులకు మల్లే ఆయా దేశాల్లో జీవనం సాగిస్తారు. తమకు ఆదేశాలు అందినప్పుడు ఇజ్రాయెల్ వేగులకు అవసరమైన ఏర్పాట్లు చేసి పెడతారు. ఈ వ్యవస్థను “ద సయానిం” (The Sayanim) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ సాయంతో మొస్సాద్ ప్రపంచ వ్యాపితంగా మోసం, దొంగతనం, బలవంతపు వసూల్లు, బ్లాక్ మెయిల్, టార్చర్, రాజకీయ హత్యలు, ఫాల్స్ ఫ్లాగ్ బాంబు దాడులకు పాల్పడింది. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. మొస్సాద్ మాజీ వేగు విక్టర్ ఒస్ట్రోవ్ స్కీ ప్రకారం ఒక్క యునైటెడ్ కింగ్డమ్ లోనే అనేక వేల మంది సయానిం కార్యకర్తలు ఉన్నారు. బ్రిటిష్ పత్రిక మిర్రర్ తో పాటు అనేక పబ్లిషింగ్ కంపెనీల అధిపతి, బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు కూడా అయిన రాబర్ట్ మాక్స్ వెల్ సయానిం కార్యకర్త లేదా మొస్సాద్ ఏజెంటు. ఈయన కూతురు గిషేలీన్ మాక్స్ వెల్ సెక్స్ ట్రాఫికింగ్ లో పేరు పొందింది. వీరి కుటుంబం తమ కంపెనీల ఉద్యోగుల పెన్షన్ తదితర ఫండ్ లను కాజేసి ఐపి పెట్టడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి వారినే మొస్సాద్ చేరదీసి తర్ఫీదు ఇస్తుంది.
ఇటువంటి మొస్సాద్ కు ఈజిప్టు అధ్యక్షుడు తన దేశంలో పాలస్తీనా వ్యతిరేక కార్యకలాపాలు జరిపేందుకు గేట్లు తెరిచి పెట్టాడు. ఈ క్రమంలో ఈజిప్టు కొన్ని నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఇజ్రాయెల్ పట్ల సంయమనం పాటిస్తున్నది. జూన్ 2024 ఆరంభంలో రఫా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో ఐడిఎఫ్ కాల్పుల్లో ఇద్దరు (ముగ్గురు అని కొన్ని వార్తలు చెబుతున్నాయి) ఈజిప్టు సైనికులు మరణించినప్పటికీ ఈజిప్టు నోరు మెదపలేదు. ఈ వార్తను ఇజ్రాయెలీ టి.వి ఛానెల్ ఒకటి ప్రకటించే వరకు ఈజిప్టు తొక్కి పెట్టింది. ఒక సైనికుడి సోదరుడు ఫేస్ బుక్ లో వెల్లడి చేసే వరకు లోకానికి తెలియదు. ఆ తర్వాత గాని ఈజిప్టు మిలటరీ ఈ వార్తను క్లుప్తంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆల్-సిసి ప్రభుత్వం 2017లో ఎర్ర సముద్రం లోని తన రెండు ద్వీపాలు, -తిరన్, సనాఫీర్- సౌదీ అరేబియా కు అప్పగించింది. 2013లో మోర్సి ప్రభుత్వ కూల్చివేతకు ఈజిప్టు మిలటరీకి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆల్-సిసి ప్రభుత్వం ఈ దానం చేసింది. మధ్యధరా సముద్ర తీరంలో వివిధ ప్రాంతాలను యుఏఇ, సౌదీలకు కట్టబెట్టిన సంగతి ముందు చూశాం.
ఈజిప్టు ఎదుర్కొంటున్న ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ (Balance of Payments Crisis) నుండి బైట పడేందుకు ఈజిప్టు పాలక వర్గాలు తమ సార్వభౌమత్వాన్ని కొద్ది కొద్దిగా గల్ఫ్ రాజులకు, పశ్చిమ దేశాలకు ధారాదత్తం చేస్తున్నాయి. తద్వారా మధ్య ప్రాచ్యంలో ఒకప్పటి ప్రతిష్టను శాశ్వతంగా వదులుకుంటోంది. ఈ పరిణామం పట్ల వాళ్లకు కనీస కలవరం కూడా లేదు. ఈజిప్టు అధ్యక్షుడు గానీ, అక్కడి మీడియా గానీ ఈజిప్టు ప్రజలను “సోమరి, చెడిపోయిన, అనైతిక, నిజాయితీ రహిత” గుంపుగా అభివర్ణించడం కద్దు. ఈజిప్టును పేద దేశంగా చెబుతూ తద్వారా పశ్చిమ దేశాల సహాయం అవసరం అన్న భావజాలాన్ని అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నాడు. తన చేతికి “సరైన దేశం” అందలేదని చెబుతూ దేశాన్ని సరి చేయడానికి కొన్ని చర్యలు తప్పవని ప్రచారం చేస్తూ వచ్చాడు. ప్రజలకు అందజేసే సబ్సిడీలు, రాయితీల్లో కోతలు విధించడానికి ఈ ప్రచారాన్ని వినియోగించాడు. ఆ విధంగా దేశ సార్వభౌమత్వాన్ని బలిగా పెట్టి ఈజిప్టు సూపర్ ధనిక వర్గాన్ని పోషిస్తున్నాడు. ఈ పోషణ కోసం ఇజ్రాయెల్ మరియు పశ్చిమ దేశాల అనుకూల విధానాలను అనుసరిస్తున్నాడు.
ముక్తాయింపు
గాజా యుద్ధం లేదా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండను మూడు పొరలుగా అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఇందులో మొదటిది పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ వలస ఆక్రమణకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం. పాలస్తీనా విమోచన కేంద్రంగా ఇరాన్ నేతృత్వంలో జరుగుతున్న ప్రాంతీయ ఘర్షణ మొదటి పొర పైన ఉన్న రెండవ పొర. రెండవ పొరలో ఇజ్రాయెల్ కేంద్రంగా ఒక శిబిరం, ఇరాన్ కేంద్రంగా ఒక శిబిరం మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం పరస్పరం ఘర్షణ పడుతున్నాయి. ఇరాన్ నేతృత్వంలో సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాక్ దేశాలు ప్రతిఘటనా అక్షం (Axis of Resistance) గా ఏర్పడి పోరాటం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా సౌదీ అరేబియా, యుఏఇ, బహ్రెయిన్, కతార్, ఈజిప్టు దేశాలు పని చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న అరబ్ దేశాల ప్రజలు మాత్రం పాలస్తీనా పోరాటానికి సంపూర్ణ సంఘీభావాన్ని కలిగి ఉన్నారు. ఈ కారణం చేత ఇజ్రాయెల్ తో స్నేహం నెరిపే అరబ్ దేశాల పాలకులు పైకి పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తూనే వాస్తవంలో ఇజ్రాయెల్ కు అంట కాగుతుంటారు. సౌదీ, కతార్ పాలకుల మధ్య ఆధిపత్య ఘర్షణ జరుగుతూ ఉన్నప్పటికీ ప్రాంతీయ స్థాయి ఘర్షణలో అంతర్గతంగా ఇజ్రాయెల్ కు సహకరిస్తాయి. ప్రపంచం లోని సున్నీ ముస్లింలను తమ ప్రభావం కింద ఆర్గనైజ్ చేసేందుకు కతార్, సౌదీ అరేబియా, టర్కీల మధ్య నడుస్తున్న పోటీ మరొక కోణం.
ఇక రెండవ పొరను కప్పుతూ అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఘర్షణ అసలైన, ప్రధానమైన మూడవ పొర. అమెరికా, ఇయు లు ఒక వైపు రష్యా, చైనాలు మరొక వైపు రెండు శిబిరాలు ప్రపంచాధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ఈ మూడు పొరలు ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉండడమే అసలు విషయం. గాజా విముక్తి జరిగితే మధ్య ప్రాచ్యంలో అంతటితో అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికినట్లే. అందుకే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ల నేతృత్వం లోని పశ్చిమ కూటమి ఎట్టి పరిస్ధితుల లోనూ మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి భంగం కలుగనివ్వదు, ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని, అరబ్ దేశాలపై దాని పట్టుని నిలిపి ఉంచేందుకు అమెరికా ఇరాన్ పై కత్తి కట్టి రెండు దశాబ్దాలుగా ఆంక్షలు అమలు చేస్తున్నది. ఐనప్పటికీ ఇరాన్ స్వశక్తితో, తన చమురు, గ్యాస్ వనరుల సాయంతో ఆధునిక ఆయుధ శక్తిని సంపాదించుకుంది. అమెరికా పశ్చిమ దేశాల ఆంక్షలను ప్రతిఘటించడమే కాకుండా గాజా లోని హమాస్ కు, సిరియా లోని సెక్యులర్ ప్రభుత్వానికి లెబనాన్ లోని హిజ్ బొల్లా మిలీషియా, యెమెన్ లోని హుతీ మిలీషియా లకు ఆయుధాలు సరఫరా చేస్తూ పశ్చిమ దేశాల ఆంక్షలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతిఘటనను నిర్మించింది.
అమెరికా ఆర్ధికంగా కుంగిపోతున్న కొద్దీ చైనా, రష్యాలు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్నాయి. అయితే అమెరికా ఆయుధ శక్తి ప్రాబల్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. కానీ తన ప్రభావ ప్రాంతాలను అమెరికా, పశ్చిమ దేశాలు ఒక్కొక్కటిగా కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో ఫ్రాన్స్ ప్రాబల్యం దాదాపు ఖాళీ అయింది. సహేలీ ప్రాంతం లోని బర్కినా ఫాసో, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్ లలో వరుసగా ఫ్రాన్స్, అమెరికా అనుకూల ప్రభుత్వాలను అక్కడి మిలట్రీలు కూల్చి వేశాయి. అమెరికా, ఫ్రాన్స్ సైనికులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించాయి. రష్యా లోపల టార్గెట్ లను ఛేదించటానికి తమ ఆయుధాలను వినియోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వగా రష్యా ప్రైవేట్ మిలటరీ కంపెనీ వాగ్నర్ సైన్యాలు తమకు భద్రత ఇవ్వాలని సహేలీ లోని ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. వాగ్నర్ సేనలు ఇప్పుడు ప్రభుత్వ మిలటరీకి అనుబంధంగా మార్చుతూ పుటిన్ చట్టం చేశాడు. అనగా రష్యా సైన్యం ఆఫ్రికాలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సైనిక స్థావరాలను ఆక్రమిస్తోంది. మరో పక్క ఆఫ్రికా దేశాలకు రుణాలు ఇస్తూ అక్కడి వనరులను చైనా తరలిస్తోంది.
ఇదే పరిస్థితిని మధ్య ప్రాచ్యంలో తెచ్చేందుకు చాప కింద నీరులా రష్యా, చైనాలు కృషి చేస్తున్నాయి. ఉత్తర కొరియాను తమతో కలుపుకున్నాయి. చైనా తన మధ్యవర్తిత్వంలో అసాధ్యం అనుకున్న ఇరాన్-సౌదీ అరేబియాల శాంతి ఒప్పందం సుసాధ్యం చేసింది. చైనాకు చేసే చమురు ఎగుమతులకు యువాన్ లలో చెల్లింపులు స్వీకరించేందుకు సౌదీ అంగీకరించింది. మరో పక్క టర్కీతో ఇరాన్, రష్యాలు స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి. టర్కీ, నాటో సభ్య దేశం ఐనప్పటికీ మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం తన కృషి తాను చేస్తున్నది. ప్రాంతీయ ఆధిపత్య రంధిలో టర్కీ ఓ సారి అమెరికాకు అనుకూలంగా, మరోసారి రష్యాకు అనుకూలంగా కనిపిస్తుంది. ఒకప్పటి ఒట్టోమన్ సామ్రాజ్య వైభవాన్ని పొందేందుకు కృషి చేస్తూ ఆటా-టర్క్ నాయకత్వంలో స్థాపించబడిన సెక్యులర్ నిర్మాణాలను కూల్చి దేశాన్ని తిరిగి మతరాజ్యం వైపు దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ విధంగా మధ్య ప్రాచ్యం ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు తలో దిక్కుకు తరలించేందుకు కృషి చేస్తున్నారు. అమెరికా బలహీనం కావడంతో అందుకు కావలసిన అవకాశాలు తమకు లభించాయని ప్రతి దేశ పాలకులూ భావిస్తున్నారు. కాని ప్రధాన ఘర్షణ అమెరికా-ఈయు మరియు రష్యా-చైనా శిబిరాల మధ్యనే జరుగుతోంది. విశాల దృష్టిలో చూచినప్పుడు ఈ ఘర్షణకు అనుబంధంగా ప్రాంతీయ మరియు స్థానిక ఘర్షణలు జరుగుతున్నాయి.
నిజానికి స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయి శిబిరాలను స్ట్రెయిట్ లైన్ లు గీసి విడదీసి ఎవరు ఎటు వైపు అన్నది తూకం వేయబూనడం వృధా ప్రయత్నం అవుతుంది. అందుకు కారణం ఇప్పటి సంధి దశలో బలాబలాలు వేగంగా మారిపోతున్నాయి. సౌదీ అరేబియా చైనాతో యువాన్ ఒప్పందం చేసుకుంది అనుకునే లోపు ఇజ్రాయెల్ తో సంబంధాల సాధారణీకరణకు తలూపింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో అరబ్ రాజ్యాలు చేరాయి. అంత లోపే అమెరికా మధ్యవర్తిత్వంలో అబ్రహాం ఎకార్డ్స్ పై సంతకాలు చేశాయి.
ఇలాంటి సంధి కాలంలో కూడా ఈజిప్టు, గాజా/పాలస్తీనా విమోచనకు నిర్ణయాత్మకంగా వ్యతిరేక దిశలో నిలబడింది. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ రాజులతో కలిసి చురుకుగా అడుగులు వేస్తున్నది. ఆ విధంగా పాన్-అరబ్ జాతీయోద్యమానికి ఒకప్పుడు నాయకత్వ స్థానంలో ఉన్న ఈజిప్టు దళారీ పాలకవర్గాల హయాంలో అదే జాతీయోద్యమానికి వెన్ను పోటు పొడుస్తున్నది.
గ్రీకు మైథాలజీ లో ఒక కథ ఉన్నది. గ్రీకులు ఎంతగా శ్రమించినప్పటికీ సముద్రంలో ద్వీప రాజ్యంగా ఉన్న ట్రాయ్ ను 10 ఏళ్ళ ముట్టడి తర్వాత కూడా ట్రాయ్ కోటను వశం చేసుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. చివరకు ట్రాయ్ సేనల వీరత్వానికి బహుమతిగా ఒక పెద్ద చెక్క గుర్రాన్ని ట్రాయ్ కోట లోపలికి పంపిస్తారు. ట్రాయ్ ఆ గుర్రాన్ని కోట లోపలికి అనుమతిస్తారు. అయితే ఆ చెక్క గుర్రం లోపల మెరికల్లాంటి గ్రీకు సైనికులు దాగి ఉంటారు. రాత్రి అంతా సద్దు మణిగాక చెక్క గుర్రం లోపలి సైనికులు బైటకి వచ్చి కోట తలుపులు తెరుస్తారు.
దానితో ట్రాయ్ రక్షణ దుర్గం బలహీనపడుతుంది. గ్రీకు సైనికులు కోట లోకి చొరబడి ట్రాయ్ ను ఓడించి వశం చేసుకుంటారు. ఈ చెక్క గుర్రం ట్రోజాన్ హార్స్ పేరుతో ఒక సామెతగా వాడుకలోకి వచ్చింది. ఈజిప్టు ఒకప్పుడు శక్తివంతమైన అరబ్ దేశం. అరబ్ జాతీయ ఉద్యమానికి, పాలస్తీనా విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించడంతో పాటు అలీన ఉద్యమానికి కూడా నాయకత్వం వహించింది. అలాంటి ఈజిప్టు పాలస్తీనా ఉద్యమానికి పైకి మద్దతు ఇస్తూనే వాస్తవంలో మాత్రం ఆ ఉద్యమానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్, అమెరికాలతో సహకరిస్తున్నది. ఆ విధంగా ఈజిప్టు పాలస్తీనా విమోచన ఉద్యమంలో చొరబడ్డ ట్రోజాన్ హార్స్ గా వ్యవరిస్తున్నది.
———-అయిపోయింది.
సర్, ఇంత సుదీర్ఘ వ్యాసంలో ముగింపు పలుకులలో ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇస్రాయిల్ పక్షాన
ఉన్న మన దేశీయ ప్రభుత్వ వైఖరిని పేర్కొని ఉంటే బాగుండేది !