
Middle East & North Africa (MENA)
ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతాలలో విస్తరించిన అరబ్బు దేశాలలో ఈజిప్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 5,000 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిన ఈజిప్టు నాగరికత, 6 బిసి సం. లో అఖేమినీడ్ (మొదటి పర్షియన్ వంశం) సామ్రాజ్యం వశం అయ్యే వరకూ స్థానికుల పాలనలోనే కొనసాగింది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజంటైన్లు, ఒట్టోమన్ లు ఈజిప్టును ఒకరి తర్వాత మరొకరు ఆక్రమించుకున్నారు.
ఒట్టోమన్ రాజుల కాలంలో అల్బేనియన్ సైన్యాధికారుల కింద 1805 నుండి ఈజిప్టు రాజ్యం ఆధునీకరణ చెందడం ప్రారంభం అయింది. పాలకులు మౌలిక నిర్మాణాలను ఆధునీకరించారు. ఐరోపా దేశాల బ్యాంకర్లు ఇచ్చిన అప్పుతో సూయజ్ కెనాల్ నిర్మించారు. కానీ ఆ బ్యాంకర్లు మోపిన అధిక వడ్డీ (usury) చెల్లించేందుకు అధిక పన్నులతో ప్రజలను చావమోదారు. చివరికి ఒట్టోమన్ రాజులు కెనాల్ లో తమ వాటాను బ్రిటిష్ కు అప్పగించాల్సి వచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టుకు చెందిన లక్షల మంది భూమి లేని రైతులను బ్రిటన్ తమ సైన్యంలోకి రిక్రూట్ చేసుకుని ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనం నుండి సిరియా, పాలస్తీనాల ఆక్రమణకు వినియోగించింది. ఈ సందర్భంగా ఈజిప్టులో అడుగు పెట్టిన బ్రిటిష్ సైన్యం పట్ల ఈజిప్టు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. రైతులు, చేతివృత్తుల పనివార్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న బ్రిటిష్ విధానాల పట్ల ఆందోళన తీవ్రం అయింది. దేశంలో ప్రత్తి పంటను ముడి సరుకు కింద బ్రిటన్ అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తన దేశం నుండి దిగుమతి అయిన బట్టలను ఈజిప్టు ప్రజలకు అంటగట్టడంతో ఈజిప్టు రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం హెచ్చింది. అసమ్మతిని తీవ్ర అణచివేతకు గురి చేశారు. ఈజిప్టును బ్రిటిష్ ప్రొటెక్టరేట్ గా గుర్తిస్తూ అమెరికా, బ్రిటన్ లు నిర్ణయించడంతో దేశంలో తిరుగుబాటు ధోరణి మరింత తీవ్రం అయింది.
అయితే ప్రజల తిరుగుబాట్లకు దళారీ నేతలే ప్రతినిధులుగా వ్యవహరించారు. తిరుగుబాట్లు, సమ్మెలు, బ్రిటిష్ ప్రతినిధుల హత్యలు తీవ్రం కావడంతో 1922 ఫిబ్రవరిలో పరిమిత స్వాతంత్రం ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. విదేశీ విధానం, సూయజ్ కెనాల్ లను బ్రిటన్ అదుపులో కొనసాగాయి. దరిమిలా ఈజిప్టులో అత్యంత ప్రజాదరణ పొందిన జఘ్లుక్ నేతృత్వంలో రాచరిక ప్రభుత్వం, ధనిక వర్గ ప్రయోజనాల కోసం ఓ పక్క బ్రిటన్ తో ఘర్షణ పడుతూనే మరోపక్క రాజీలు చేసుకుంటూ వచ్చింది. చివరికి 1952 లో సంస్కరణల అభిలాషులైన కొందరు మిలటరీ అధికారులు సైనిక కుట్రతో రాచరిక ప్రభుత్వాన్ని కూల్చేశారు. 1948లో ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధంలో ఈజిప్టు ఓటమికి రాజుని బాధ్యుడిగా వారు ఆరోపించారు.
సైనిక తిరుగుబాటుకు గమాల్ అబ్దుల్ నాజర్ హుస్సేన్ నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమం ‘స్వేచ్ఛా అధికారుల ఉద్యమం’ పేరుతో చరిత్ర పుటలకు ఎక్కింది. అయితే ముస్లిం బ్రదర్ హుడ్ కు చెందిన మొహమద్ నగూయిబ్ ను అధ్యక్షునిగా నియమించారు. 1954లో ముస్లిం బ్రదర్ హుడ్ నాజర్ హత్యకు ప్రయత్నం చేసింది. ఆయన అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసి, ముస్లిం బ్రదర్ హుడ్ పై నిర్బంధం అమలు చేశాడు. ఈ ముస్లిం బ్రదర్ హుడ్ ఎన్నడూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇండియాలో ఆర్ఎస్ఎస్ వలే మతాదిపత్యాన్ని కోరుకుంది. పశ్చిమ వలస, సామ్రాజ్యవాదులతో ఎప్పుడూ రాజీ పడుతూనే వచ్చింది. ఇప్పటికీ తన దళారీ స్వభావాన్ని అది కొనసాగిస్తూనే ఉన్నది.
ఈజిప్టు సామాజికార్ధిక వ్యవస్థ – నాజర్ శకం
నాజర్ హత్యా ప్రయత్నం వెనుక బలమైన కారణాలున్నాయి. 1952 నుండే నాజర్ భూసంస్కరణలు అమలు చేశాడు. అప్పటి వరకు కేవలం 6% గా ఉన్న భూస్వాములు 65% భూములను ఆస్తిగా కలిగి ఉండేవారు. దేశంలో ఉన్న సారవంతమైన భూమిలో 1/3 వంతు 0.5 శాతం భూస్వాముల చేతుల్లో ఉండేది. వీళ్ళు తమ భూముల్ని పేద భూమి లేని రైతులకు కౌలుకు ఇచ్చి పంటలో 75 శాతం ఆదాయాన్ని కౌలు కింద వసూలు చేసేవారు. బ్యాంకులు మోయలేని వడ్డీ వసూలు చేసేవి. దానితో సాగు చేసే రైతులు నడ్డి విరిగే అప్పుల్లో కూరుకుపోయారు. వ్యవసాయ కూలీలకు సైతం అత్యల్ప కూలి రేట్లు అందేవి. ఆకలి, వ్యాధులు, చావులు రైతాంగాన్ని చుట్టుముట్టాయి.

Gamal Abdel Nasser
ఈ నేపధ్యంలో నాజర్ ఒత్తిడితో ప్రభుత్వం భూపరిమితి చట్టం తెచ్చింది. 200 ఫెడన్ ల (1 ఫెడన్ = 1.038 ఎకరం లేదా 0.42 హెక్టార్) కంటే ఎక్కువ ఒక కుటుంబం కలిగి ఉండాలి (1961లో పరిమితిని 100 ఫెడన్ లకు తగ్గించారు); కౌలు రేటు భూమి శిస్తు కంటే 7 రెట్లు కంటే తక్కువ ఉండాలి; కౌలు కాలం కనీసం 3 ఏళ్ళకు తగ్గరాదు. చట్టం ద్వారా మిగిలిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే బదులు ప్రభుత్వ బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించింది. 30 ఏళ్ళ కాల పరిమితి గల బాండులపై 3% వడ్డీ (ఆ తర్వాత 1.5% కి తగ్గించింది) చెల్లించింది.
ఒక బాండు విలువ కౌలుకు 19 రెట్లుగా నిర్ణయించారు. ఇలా కొన్న భూముల్ని ఒక్కో రైతుకు 5 బెడన్ లకు మించకుండా అమ్మకం చేసింది. భూమి ఖరీదు పైన 15% సర్ ఛార్జి (తర్వాత 10% కి తగ్గించారు) వసూలు చేసింది. 5 ఫెడన్ ల లోపు భూములు కలిగిన రైతుల కోసం కో-ఆపరేటివ్ లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, మార్కెట్ సౌకర్యం అందజేసే ఏర్పాటు చేశారు.
భూసంస్కరణల చట్టాన్ని అప్పటి ప్రధాన మంత్రి ఆలి మహార్ పాషా గట్టిగా వ్యతిరేకించాడు. భూగరిష్ఠ పరిమితి 500 ఫెడన్ లకు పెంచాలని డిమాండ్ చేశాడు. రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఈజిప్టు, సూడాన్ లను ఇది పర్యవేక్షించింది), ప్రధానిగా పాషాను తప్పించి మహమ్మద్ నగూయిబ్ ను నియమించింది.

ఆరంభంలో ఈ భూసంస్కరణలు భూస్వాముల రాజకీయ ఆధిపత్యాన్ని రద్దు చేయగలిగింది. కానీ వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 15% మాత్రమే పునఃపంపిణీ జరిగింది. 1980ల ఆరంభానికి భూసంస్కరణల అమలును పట్టించుకోవడం మానేశారు. 1970 సెప్టెంబర్ 28 తేదీన నాజర్ హత్య తర్వాత అమెరికా అండతో అధికారం చేపట్టిన అన్వర్ సాదత్ భూసంస్కరణ లను రద్దు చేసేశాడు. ప్రజలు భూముల సాగు నుండి వేరే రంగాలకు తరలిపోయారని బొంకి రద్దుకు సాకుగా చూపించారు.
గమాల్ అబ్దుల్ నాజర్ అత్యంత పిన్న వయసులో (52 సం.లు) హత్యకు గురయ్యాడు. జబ్బు చేసి చనిపోయాడని అబద్ధాలు ప్రచారం జరిగింది గానీ అది అసత్యం. నాజర్ ఈజిప్టు నేతగా ఉన్న 18 ఏళ్ళ కాలంలో ఆయనపై 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఒక గల్ఫ్ రాజ్యం (సౌదీ అరేబియా) కుట్ర చేసి ఈజిప్టు ప్రభుత్వంలో కొందరు అధికారుల సాయంతో విష ప్రయోగంతో హత్య చేశారని ఇటీవల ఆల్ జజీరా ఛానల్ ప్రకటించింది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాన్ని అమెరికా, ఇజ్రాయెల్, దళారీ అరబ్ పాలకుల దుష్ట కూటమికి దాసోహం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమ రాజ్యాలు పధకాన్ని రచించి అమలు చేస్తున్న క్రమంలో ఈ పధకానికి వ్యతిరేకంగా తలెత్తిన అరబ్బు ప్రతిఘటనకు గమాల్ అబ్దుల్ నాజర్ ప్రధాన ప్రతినిధిగా ఉండడమే ఆయన హత్యకు కారణం.
అంతే కాకుండా యెమెన్, పాలస్తీనా, ఇరాక్ ల కోసం రూపొందించిన వినాశకర పధకం అమలుకు నాజర్ ఆటంకంగా నిలబడ్డాడు. 1967లో ఇజ్రాయెల్ – అరబ్బు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధానికి ముందే నాజర్ ని ఓడించేందుకు అమెరికా, బ్రిటిష్, ఇజ్రాయెల్ దేశాలు చేసిన కుట్రలు ఆ దేశాల ఇంటలిజెన్స్ వర్గాలు ఇటీవల విడుదల చేసిన పత్రాల ద్వారా వెల్లడి అయ్యాయి. (1967లో అదే జరగడం గమనార్హం.) నాజర్ ను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ తో జరిపిన రహస్య కమ్యూనికేషన్లు కూడా ఈ పత్రాలలో వెల్లడి అయింది. 11 సార్లు జరిగిన హత్యా ప్రయత్నాలను ఈ పత్రాలే వెల్లడి చేశాయి. చమురు ఉత్పత్తి చేసే గల్ఫ్ రాజ్యాలకు వెళ్ళిన ఈజిప్షియన్ కూలీలపై గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు అనేక రకాల వివక్ష అమలు చేసేవి. తద్వారా నాజర్ పట్ల తమకు ఉన్న కసిని సంతృప్తి పరచుకునేవి.
పాలస్తీనా ప్రతిఘటనకు వెన్నెముక
మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ వలస ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా సాగిస్తున్న ప్రతిఘటనకు అబ్దుల్ నాజర్ వెన్నెముకగా నిలబడ్డాడు. 1965లో పాలస్తీనా పోరాటం గురించి ఇలా అన్నాడు, “పాలస్తీనాకు మనం వెళ్ళే మార్గం రెడ్ కార్పెట్ తోనూ లేదా పచ్చని ఇసుక తోనూ కూడి ఉండదు. మన మార్గం రక్తంతో నిండి ఉంటుంది… పాలస్తీనాను విముక్తి చేయాలంటే అరబ్ జాతి ఐక్యం కావాలి, అరబ్ సేనలు ఐక్యంగా పోరాడాలి. ఐక్య పోరాట పంథాను రూపొందించుకోవాలి.”

1967 యుద్ధంలో ఓటమితో ఈజిప్టు నుండి సినాయ్ ప్రాంతంను, సిరియా నుండి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి గెలుచుకునేందుకు ఈజిప్షియన్ సైన్యాన్ని పునరుత్తేజం చేసేందుకు నాజర్ ప్రయత్నాలు తీవ్రం చేశాడు. సిరియాతో కలిసి ఉమ్మడి మిలటరీ వ్యూహాలను రచించేందుకు పూనుకున్నాడు. సరికొత్త యుద్ధ పరికరాలను సమీకరించడం, సైన్యానికి ఆధునిక యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టాడు.
ఈ నేపధ్యంలో నాజర్ బ్రతికి ఉన్నంత కాలం విశాల అరబ్ జాతీయోద్యమానికి, పాలస్తీనా విముక్తి పోరాటానికి అంతం ఉండదని అమెరికా, ఇజ్రాయెల్ లు గ్రహించాయి. నాజర్ సంపాదించిన అంతర్జాతీయ ప్రతిష్ట, ముఖ్యంగా దేశ సరిహద్దులకు అతీతంగా అరబ్ ప్రజల్లో ఆయన సంపాదించిన గౌరవం, ఆదరణ, ఆరాధనలు ఇతర అరబ్ రాజ్యాల దళారీ నేతలు, ప్రభుత్వాలు ఈర్ష్య, అసూయలతో ఉడికిపోయారు. నాజర్ ప్రతిష్ఠ ముందు తమకు తాము మరుగుజ్జులుగా కనిపించారు. బహుశా ఆత్మ న్యూనత వారిని పట్టి పీడించింది. ఆ విధంగా వాళ్ళు నాజర్ హత్యకు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ లు రచించిన పధకానికి నిండు మనసుతో సహకరించారు.
నాజర్ హత్యతో పశ్చిమ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన అరబ్ జాతీయోద్యమ చరిత్రలో, దీర్ఘకాలిక పాలస్తీనా విముక్తి పోరాట యజ్ఞంలో ఒక ఉత్తేజ పూరిత శకం ముగిసింది. ఆ తర్వాత పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ మినహా, పాలస్తీనాకు ఆవల ప్రజా పునాది గల మరో శకం ఆరంభానికి ఇంకా పునాది రాయి పడనే లేదు. సిరియా నేతలు హఫీజ్ ఆల్-అస్సాద్, ఆయన కుమారుడు బషర్ ఆల్-అస్సాద్ లకు తమ దేశాన్ని అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాద దాడుల నుండి, ఇజ్రాయెల్ నుండి నిరంతరం ఎదురవుతున్న కుట్రల నుండి, సౌదీ-కతార్-టర్కీ దేశాలు పంపే ఇస్లామిక్ టెర్రరిస్టు మూకల నుండి రక్షించుకోవడంతోనే సరిపోతోంది. ఇస్లామిక్ సంస్థ హమాస్ అవతరణ, యాసర్ అరాఫత్ నాయకత్వం లోని సెక్యులర్ సంస్థ ‘ఫతా’ ను బలహీన పరిచేందుకు ఇజ్రాయెల్-కతార్ లు ఆరంభంలో అందించిన ఆర్ధిక, ఆయుధ మద్దతుతో కూడుకుని ఉన్నది. పైగా మత ఛాందస పరిమితి ఎలాగూ ఉన్నది.
పాలస్తీనా విముక్తి పోరాటానికి ప్రధాన మిత్రుడుగా, గట్టి మద్దతు దారుగా ఈజిప్టు వహించిన చారిత్రక పాత్ర గమాల్ అబ్దుల్ నాజర్ హత్యతో సిలువ పైన ఏసుక్రీస్తు తన మరణానికి ముందు ప్రకటించిన ఆఖరి ఏడవ వాక్యం తరహాలో పరిసమాప్తమయింది. నాజర్ మరణం అనంతరం అధికారం చేపట్టిన అన్వర్ సాదత్, అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాదులతో కుమ్మక్కు అయ్యే విధానాలు అనుసరించాడు.
———-సశేషం