అమెరికా తీరంలో రష్యా యుద్ధ నౌకలు, అమెరికా ప్రతి చర్య!


Russian Navvy Admiral Gorshkov at Havana Port

ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో అమెరికా, ఐరోపాలు ఒక పక్క, రష్యా, చైనాలు మరో పక్క ఉన్న శిబిరాల మధ్య ఉద్రిక్తత నానాటికి శృతి మించుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను రష్యా భూభాగం లోపల ఉన్న మిలటరీ టార్గెట్ల పైకి ప్రయోగించేందుకు ఇటీవల అమెరికా అనుమతి ఇవ్వడంతో రెండు శిబిరాల మధ్య ఉద్రిక్తత ఒక్క సారిగా వేడెక్కినట్లయింది.

ఈ పరిస్ధితుల్లో రష్యాకు చెందిన పలు యుద్ధ నౌకలను మిలటరీ విన్యాసాల నిమిత్తం అమెరికా పొరుగునే ఉన్న క్యూబా తీరానికి వెళ్లనున్నట్లు రష్యా ప్రకటించడంతో అందరి దృష్టి అటు మళ్ళింది. ఫ్లోరిడా రాష్ట్రానికి క్యూబా అతి సమీపంలో ఉండడంతో, రష్యా ప్రకటన 1960 లలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ‘మిసైల్ సంక్షోభం’ ను గుర్తుకు తెస్తున్నది.

రష్యా యుద్ధ నౌకలు తమ తీరానికి అతి సమీపంలోకి రానున్న దృష్ట్యా తాము ప్రతి చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ప్రతినిధులు ప్రకటించారు.

ఒక ఫ్రిగేట్, ఒక అణు శక్తితో నడిచే సబ్ మెరైన్ తో సహా రష్యాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలు జూన్ 12 నుండి జూన్ 17 వరకు ‘పోర్ట్ ఆఫ్ కాల్’ జరపనున్నాయని గత వారం రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు ప్రకటించాయి.

యుద్ధ నౌకలు ఇంధనం నింపుకోవటానికి లేదా మరే ఇతర కారణాల కోసం; సరుకు రవాణా నౌకలు సరుకు దింపేందుకు లేదా ఎక్కించుకునేందుకు లేదా రిపేర్ల కోసం; క్రూయిజ్ (మానవ ప్రయాణ) నౌకలు ప్రయాణీకులను దించేందుకు లేక ఎక్కించుకునేందుకు తమ సొంత నౌకాశ్రయం కాకుండా ఇతర దేశ నౌకాశ్రయం వద్ద ఆగితే దానిని “పోర్ట్ ఆఫ్ కాల్” అంటారు.

తమ యుద్ధ నౌకలు “అట్లాంటిక్ సముద్రంలో హై-ప్రెసిషన్ మిసైల్ ఆయుధాలను వినియోగించే విషయంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ జూన్ 11 తేదీన ప్రకటించింది. అంటే క్యూబా రాజధాని హవానా లో ‘పోర్ట్ ఆఫ్ కాల్’ జరపక ముందే రష్యా యుద్ధ నౌకలు అమెరికా తన పెరటి దొడ్డిగా భావించే అట్లాంటిక్ సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేసిందన్నమాట!

ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అయితే రష్యా ఇలాంటి చర్యకు పాల్పడుతుందన్న సంగతిని ఊహించడం కూడా సాధ్యం అయ్యేది కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తన ఆధునిక ఆయుధాల శక్తి ఏపాటిదో రుజువు చేసుకుంటున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ వార్త అనూహ్యమే గానీ, అంత ఆశ్చర్యం కలిగించడం లేదు. అమెరికా, జర్మనీ, బ్రిటన్ లకు చెందిన అత్యాధునిక భారీ ట్యాంకులను సైతం రష్యా ఆయుధాలు ఉక్రెయిన్ లో నాశనం చేయడంతో రష్యా ఆత్మ స్థైర్యం పదింతలైనట్లు కనిపిస్తోంది.

ఎంతో పేరు గడించిన అమెరికా అబ్రాం ట్యాంకులు, జర్మనీకి చెందిన లెపర్డ్ 2 ట్యాంకులు, బ్రిటన్ కు చెందిన ఛాలెంజర్ ట్యాంకులు ఇవన్నీ రష్యన్ మిసైళ్ళ ముందు దిగదుడుపు అయ్యాయి. కేవలం కొన్ని వేల డాలర్ల ధర మాత్రమే కలిగిన రష్యన్ మానవ రహిత డ్రోన్ లు బాంబులను మోసుకెళ్ళి పశ్చిమ దేశాల ట్యాంకులను పనికిరాకుండా చేశాయి. అబ్రాం ట్యాంకుల ఖ్యాతి తగ్గిపోయి వాటి అమ్మకాలు పడిపోతాయన్న భయంతో చివరికి అమెరికా తన అబ్రాం ట్యాంకుల సరఫరాను ఆపివేసుకుంది.

“మిలటరీ డ్రిల్లులో భాగంగా ఫ్రిగేట్ (ఇతర నౌకలకు రక్షణగా ఉండే చిన్న నౌకలు. ఇవి వేగంగా ప్రయాణిస్తాయి) మరియు అణు శక్తి సబ్ మెరైన్ సిబ్బంది అట్లాంటిక్ సముద్రంలో హై-ప్రెసిషన్ మిసైల్ ఆయుధాల ప్రయోగాన్ని పరీక్షించారు. కంప్యూటర్ సిములేషన్ ద్వారా 600 కి.మీ దూరం ఉండే మాక్ శత్రు టార్గెట్లు ఐన నావల్ గ్రూపులపై ఆయుధాల ప్రయోగం చేశారు” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ ప్రకటన ద్వారా తెలిపింది.

అనగా వాస్తవంగా మిసైళ్ళను ప్రయోగించలేదని రష్యా డిఫెన్స్ శాఖ ప్రకటన ద్వారా అర్ధం అవుతోంది. అయితే రష్యన్ యుద్ధ నౌకలు ఫ్లోరిడా తీరానికి కేవలం 30 మైళ్ళ సమీపం లోకి వెళ్ళడం గమనార్హం.

రష్యా నౌకలు వస్తున్న వార్త వెలువడిన వెంటనే తాము కూడా ప్రతి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఏయే యుద్ధ నౌకలను పంపిస్తున్నదో అమెరికా చెప్పలేదు. ఆన్ లైన్ లో వివిధ నౌకల కదలికలను ట్రాక్ చేసే సంస్థలు అమెరికా ఏయే యుద్ధ నౌకలను ఫ్లోరిడా తీరంలో మొహరించిందో వెల్లడి చేశాయి. వారి ప్రకారం మూడు డిస్ట్రాయర్ నౌకలను (యుఎస్ఎస్ ట్రక్ స్టన్, యుఎస్ఎస్ డొనాల్డ్ కుక్, యుఎస్ఎస్ డెల్బర్ట్ డి. బ్లాక్ లను జూన్ 11 తేదీన మోహరించింది. వాటితో పాటు సముద్ర పెట్రోలింగ్ నౌక పి-8 పోసీడియన్, సబ్-మెరైన్ వ్యతిరేక యుద్ధ విమానాన్ని అమెరికా పంపినట్లు తెలుస్తోంది.

“అమెరికా నేవీ కి చెందిన యుఎస్ సెకండ్ ఫ్లీట్, యుఎద ఫోర్త్ ఫ్లీట్, యు.ఎస్ కోస్ట్ గార్డ్ అట్లాంటిక్ ఏరియా మరియు కెనడియన్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అట్లాంటిక్ లు అట్లాంటిక్ సముద్ర వ్యాపితంగా సాధారణ ఆపరేషన్లు నిర్వహించాయి” అని అమెరికా డిఫెన్స్ శాఖ ప్రతినిధి చెప్పాడు. అంటే రష్యా యుద్ధ నౌకల్ని తాము పెద్దగా పట్టించుకోలేదు అన్న సందేశాన్ని అమెరికా వినిపించింది.

రష్యన్ యుద్ధ నౌకలు అమెరికా తీరానికి 25 నుండి 30 మైళ్ళ లోపలకు వచ్చాయి అని అమెరికా లోని మియామి హెరాల్డ్ పత్రిక తెలిపింది. జూన్ 12 తేదీకల్లా రష్యన్ నౌకలు హవానా పోర్ట్ కు చేరాయి. “విదేశాలకు చెందిన ఎలాంటి నౌకలైనా సరే అమెరికా సముద్ర జలాల సమీపానికి వస్తే మేము తప్పనిసరిగా వాటిని పర్యవేక్షిస్తాము. ఇలాంటి మిలటరీ విన్యాసాలు అమెరికాను ఏ విధంగానూ బెరించలేవు” అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి సబ్రినా సింగ్ స్పష్టం చేసింది. ఇలాంటివి గతంలో మేము చాలా చూశాం అని ఆమె కొట్టిపారేసింది.

అయితే గతంలో రష్యా జరిపిన పోర్ట్ ఆఫ్ కాల్స్ లో అభివృద్ధి చెందని పాత రష్యా నౌకలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు విన్యాసాల్లో పాల్గొంటున్న రష్యన్ సబ్ మెరైన్ గానీ, ఫ్రిగేట్ గానీ అత్యంత ఆధునిక టెక్నాలజీతో తయారు చేసినవి. 2018 లో రష్యా అమ్ముల పొది లో చేరిన అడ్మిరల్ గోర్ష్ కొవ్ తాజా రష్యా నౌకల్లో ఉండడం విశేషం. 2021 లో కమిషన్ అయిన ‘కాజన్’ అణు జలాంతర్గామి ఆచూకీ ని మాత్రం అమెరికా ఇంకా పసిగట్టలేకపోయినట్లు తెలుస్తున్నది.

Kazan Nuclear Submarine

‘కాజన్’ అణు జలాంతర్గామి సముద్రం లోని శత్రు నౌకలతో పాటు భూ ఉపరితలం పైన ఉండే లక్ష్యాలను కూడా చేదించగల ఆధునిక మిసైళ్ళను మోసుకు వచ్చిందని బ్రిటన్ కు చెందిన ‘రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్” తెలిపింది. ఈ మిసైళ్ళలో రాడార్లకు దొరక కుండా అత్యంత వేగంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేదించగల, హైపర్ సోనిక్ మిసైల్ ‘జిర్కాన్’ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంతవరకు హైపర్ సోనిక్ మిసైళ్ళను (శబ్ద వేగానికి అనేక రెట్లు వేగంతో ప్రయాణించగల మిసైళ్ళు) అభివృద్ధి చేయలేదు. అది ఇటీవల జరిపిన హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విఫలం అయింది కూడా.

రష్యన్ ఆధునిక అణు సబ్ మెరైన్ అయిన కాజన్ ఎలాంటి సద్దు చేయకుండా పిల్లి లాగా శత్రు నౌకలను సమీపించగల శక్తి కలది. అమెరికా సబ్ మెరైన్ ప్రోగ్రాం కు చెందిన ఒక మిలటరీ అధికారి ‘కాజన్’ క్లాస్ కు చెందిన సబ్ మెరైన్ పట్ల ఎంతగా ఆకర్షితుడు అయ్యాడంటే దాని మోడల్ ను రోజూ కనపడేలా తన ఆఫీస్ లో ఉంచాడని మిలటరీ డాట్ కాం వెబ్ సైట్ తెలిపింది.

ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు వంద బిలియన్ దైలర్లకు పైగా ఖరేచు చేసే ఆయుధాలను ఇప్పటికీ సరఫరా చేస్తున్న నేపధ్యంలో సమీప భవిష్యత్తులో ఇలాంటి పోర్ట్ ఆఫ్ కాల్స్ ను రష్యా మరిన్ని జరపవచ్చని అమెరికా మిలటరీ అధికారులు అంచనా వేస్తున్నారు.

రష్యా లోపల కూడా టార్గెట్ చేసి అమెరికా ఆయుధాలు ప్రయోగించవచ్చని ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక మలుపు లాంటిది. రష్యా భూభాగం పైకి తన ఆయుధాలు ప్రయోగించరాదని అమెరికా ఇప్పటిదాకా ఉక్రెయిన్ కు షరతు విధిస్తూ వచ్చింది. షరతు విధించినట్లు పైకి చెప్పినప్పటికీ రష్యా లోని బెల్గోరోవ్ లోని వివిధ టార్గెట్ పైకి, జనావాసాల పైకి కూడా ఉక్రెయిన్ అమెరికా మిసైళ్ళు డ్రోన్ లు ప్రయోగించింది. ఈ దాడుల్లో రష్యా పౌరులు అనేక మంది చనిపోయారు కూడా.

ఉక్రెయిన్ గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఖార్కివ్ పట్టణం మళ్ళీ రష్యా చేతుల్లోకి వెళ్ళే విధంగా రష్యన్ సేనలు ముందుకు వెళుతున్న పరిస్ధితుల్లో అమెరికా బహిరంగంగానే రష్యా లోపలి టార్గెట్ ల ఛేదనకు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామమే రష్యా నౌకలు, సబ్ మెరైన్ హవానా లో పోర్ట్ ఆఫ్ కాల్ కు తరలి వెళ్లేందుకు పురికొల్పిందని విశ్లేషకులు అంచనా.

ఉక్రెయిన్ ఓటమికి అమెరికా సిద్ధంగా లేదు. యుద్ధం ప్రారంభమైన రెండు నెలలకే సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు సిద్ధం అయినప్పటికీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ను అమెరికా దూతగా పంపి సంధి చేసుకునేందుకు వీలు లేదని ఉక్రెయిన్ కు స్పష్టం చేసింది. దానితో యుద్ధం రెండేళ్లకు పైగా కొనసాగుతోంది. యుద్ధంలో 5 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ సైన్యం బలైంది. ‘చివరి ఉక్రెయినియన్ రక్తపు బొట్టు చిందే వరకూ ఉక్రెయిన్ పోరాడుతుందని’ అమెరికా ప్రకటించడమే ఈ యుద్ధం లోని విడ్డూరం.

ఉక్రెయిన్ లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువ గల ఖనిజ నిల్వలను సొంతం చేసుకోవడమే అమెరికా లక్ష్యం. ఈ యుద్ధంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా మరణించే పరిస్ధితి లేకపోవడం వల్ల ఇది మాకు ఎంతో లాభదాయకమైన యుద్ధం అని అమెరికా, ఐరోపా దేశాల నాయకులు సిగ్గు విడిచి ప్రకటించారు. ఉక్రెయిన్ లోని నాణ్యమైన నల్ల రేగడి నేలలు గోధుమ పంట సమృద్ధిగా పండుతుంది. ప్రపంచానికి రష్యా తర్వాత ఉక్రెయిన్ దేశమే ఎక్కువగా గోధుమలను సరఫరా చేస్తుంది. ఈ ఖనిజ, వ్యవసాయ వనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన నల్ల సముద్రం కూడా అమెరికాకు కావాలి. అందుకే ఉక్రెయిన్ యుద్ధం ముగియ కుండా సకల చర్యలను అమెరికా తీసుకుంటోంది.

వ్యాఖ్యానించండి