
బిజేపి తరపు అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేసి ఎంపిగా గెలుపొందిన సినీ నటి కంగనా రణావత్ అనూహ్య రీతిలో ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బ తిన్నది.
తమ జీవనోపాధిని దెబ్బ తీసే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే సాధారణ శ్రామిక ప్రజలకు మద్దతు ఇవ్వడం అటుంచి వారి పట్ల ఎంత మాత్రం సానుభూతి చూపకపోవడమే కాకుండా వారిని అభ్యంతరకర పదజాలంతో దూషించడానికి వెనుకాడబోనని కంగనా రణావత్ అనేక సార్లు రుజువు చేసుకుంది.
కంగనా లోని ఈ శ్రామిక ప్రజా వ్యతిరేక లక్షణమే ఆమె ఈ రోజు ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బ తినేందుకు దారి తీసిందని తెలుస్తోంది.
ఎన్.డి.ఏ తరపున విజయం సాధించిన ఎం.పి లు అంతా ఢిల్లీ చేరుకోవాలని పిలుపు రావడంతో కంగనా పంజాబ్ లోని మొహాలీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానం ఎక్కే ముందు ప్రయాణీకులను సి.ఐ.ఎస్.ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది.
కుల్వీందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కంగనా రణావత్ ను తనిఖీ చేసింది. కంగనా బాడీ తనిఖీ చేసిన అనంతరం కుల్వీందర్ కౌర్ చివరలో కంగనాకు చెంపదెబ్బ తినిపించింది.
మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో పంజాబ్, హర్యానా, బీహార్, వెస్ట్ ఉత్తర ప్రదేశ్ లకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పంజాబ్ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెలల తరబడి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆ మూడు చట్టాలు రద్దు చేసే వరకూ ఉద్యమించారు.
ఈ ఆందోళనకారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కంగనా నోరు పారేసుకుంది. పంజాబ్ మహిళలు డబ్బు తీసుకుని ఆందోళనలో పాల్గొన్నారని ఆమె వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సి.ఏ.ఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై ఆమె పలు కువ్యాఖ్యలు చేసింది. ఆందోళనలో పాల్గొన్న 80 ఏళ్ళ పంజాబ్ మహిళ ఫోటోను ట్విట్టర్ లో ప్రచురిస్తూ ఆమెను బిల్కిస్ బానో గా గుర్తిస్తూ అభ్యంతర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.
బిల్కిస్ బానో
బిల్కిస్ బానో 2002 లో గుజరాత్ ముస్లింలపై జరిగిన మారణకాండలో భాదితురాలు. ఆమెపై 11 మంది విద్వేష మూకలు అత్యాచారం జరిపారు. ఆమె కుటుంబానికి చెందిన 7 గురిని ఆమె ఇంటి చుట్టుపక్కల నివసించే హిందువులే దారుణంగా చంపేశారు. వారు చంపినవారిలో బిల్కిస్ బానో కు చెందిన 3 ఏళ్ళ పసి పాప కూడా ఉన్నది. కాగా ఆమెపై అత్యాచారం జరిపినప్పుడు ఆమె 5 నెలల గర్భవతి. ఈ సంగతి చెబుతూ తనను వదిలెయ్యమని వేడుకున్నప్పటికీ పశు మూకలు కనికరించలేదు.
ఇది ఇలా ఉంటే 2022 గుజరాత్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ‘మంచి ప్రవర్తన’ పేరుతో యావజ్జీవ శిక్ష పడిన 11 మందినీ ఆగస్టు 15 తేదీన విడుదల చేసింది. “భారతీయ మహిళలు అర్ధరాత్రి వీధుల్లో తిరగ గలిగిన నాడే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్లు” అన్న గాంధీ పుట్టిన రాష్ట్రం లోనే బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ హై కోర్టు ఈ దారుణానికి తెగించాయి. ఈ చర్య 2022 గుజరాత్ ఎన్నికల్లో బిజేపి మళ్ళీ విజయం సాధించేందుకు ఉపకరించిందని పలువురు విశ్లేషించారు. 11 మంది రేపిస్టులు, హంతకులు విడుదల అయినప్పుడు వారిని పూల మాలలతో సత్కరించి ఊరేగింపుగా తీసుకెళ్ళిన జనం గుజరాత్ లో నివసిస్తున్నారు.
ఆ తర్వాత TMC ఎంపి మహువా మొయిత్ర తో పాటు ఇతర మహిళా కార్యకర్తలు వేసిన పిటిషన్ ను విచారించి సుప్రీమ్ కోర్టు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని కట్టబెట్టుకుని ఆ 11 మందిని చట్ట విరుద్ధంగా విడుదల చేసిందని తీర్పు ఇస్తూ నేరస్థులను తిరిగి జైలులో తోసింది.
ఈ నేపధ్యంలో షాహీన్ బాగ్ (ఢిల్లీ) లో నెలలపాటు జరిగిన సిఏఏ వ్యతిరేక ఆందోళనలోని ఒక 80 ఏళ్ళ మహిళ ఫోటో, రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న మరో మహిళ ఫోటో లను ట్విట్టర్ లో పక్క పక్కన ప్రచురించి “షహీన్ బాగ్ దాదీ ఇప్పుడు రైతు ఉద్యమంలో కూడా ప్రత్యక్షం అయింది” అంటూ వ్యాఖ్యానించింది.
మళ్ళీ అదే ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఈ సారి షాహిన్ బాగ్ మహిళ, రైతు ఉద్యమ మహిళతో పాటు బిల్కిస్ బానో ఫోటో కూడా జత చేసి “టైం మ్యాగజైన్ కవర్ పైన చోటు సంపాదించిన అదే దాదీ ఇప్పుడు 100 రూపాయల కోసం అందుబాటు లోకి వచ్చింది” అంటూ పరమ నాసిరకమైన వంకర రాతలు రాసింది.
కుల్వీందర్ కౌర్
మూడు రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన ఆందోళనలో కుల్వీందర్ కౌర్ అమ్మ గారు కూడా పాల్గొన్నారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్ మహిళలు అందరూ 100 రూపాయల కోసం ఆందోళనలో పాల్గోన్నారన్న అర్ధం స్ఫురించేలా చేసిన కంగనా రణావత్ వ్యాఖ్యల పట్ల కుల్వీందర్ సింగ్ సహజంగానే ఆగ్రహంగా ఉన్నారు.
“రైతుల ఆందోళన సందర్భంగా పంజాబ్ మహిళలపై కంగనా రణావత్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని కుల్వీందర్ కౌర్ ఆరోపించింది. పంజాబ్ మహిళలు డబ్బు కోసం ఆందోళనలో పాల్గోన్నారన్న అర్ధం వచ్చేలా మాట్లాడిందని ఆమె చెప్పింది. నూతనంగా ఎన్నికైన ఎం.పి కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఆమె ఎయిర్ పోర్ట్ లోని సిఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులకు తెలియజేసింది” అని సిఐఎస్ఎఫ్ ఉన్నత అధికారి చెప్పారని న్యూస్ 18 వెబ్ సైట్ తెలిపింది.
హైదరాబాద్ యూనివర్సిటీ రీసర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మరణం గురించి సాక్షాత్తు లోక్ సభ లోనే అవాకులు చవాకులు పేలిన బిజేపి ఎం.పి స్మృతి ఇరాని ఈ ఎన్నికల్లో అమేధీ లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమి చవి చూసింది. వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న కంగనా అనేక సార్లు అనేక విధాలుగా సాధారణ శ్రామిక ప్రజల పట్ల ఏవగింపు ప్రకటించిందే గానీ సహానుభూతి ఎన్నడూ తెలిపింది లేదు.
చెంప దెబ్బ తిన్న అనంతరం కూడా ఆమె ఒక వీడియో ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేస్తూ “నేను క్షేమంగానే ఉన్నాను. కానీ కలవరం అంతా ఏమిటంటే పంజాబ్ లో పెరిగిపోతున్న టెర్రరిజం, తీవ్రవాదం లతో ఎలా వ్యవహరించాలి అన్నదే నా ఆందోళన అంతా” అని వ్యాఖ్యానించి అతి తెలివి ప్రదర్శింది. “రైతుల ఆందోళనపై నువ్వు చేసిన అసభ్య వ్యాఖ్యల వల్లనే నేను నీ చెంప ఛెళ్ళుమనిపించాను” అని కుల్వీందర్ సింగ్ స్వయంగా కంగనా కు చెప్పినా కూడా అదంతా కప్పి పుచ్చేందుకు విషయాన్ని టెర్రరిజం, తీవ్రవాదం అంటూ అసలు విషయానికి మసి పూసే ప్రయత్నం చేసింది.
సాధారణ ప్రజలు తమ జీవనోపాధిని కబళించే చట్టాల గురించి కలవర పడుతూ చేసిన ఆందోళన పట్ల కనీస మర్యాద చూపించని కంగనా ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశించింది. తన తోటి బాలీవుడ్ నటీ నటుల పట్ల కూడా ఆమె ఎన్నడూ సభ్యత, సంస్కారాలతో వ్యవహరించింది లేదు. తన 3 ఏళ్ళ పాపతో సహా బిల్కిస్ బానో కుటుంబం మొత్తం ఊచకోతకు గురైనా ఆమె పట్ల సానుభూతి అటుంచి వ్యక్తిగా గౌరవించే సంస్కారాన్ని ప్రదర్శించలేదు.
అలాంటి మహిళ పంజాబ్ లో పెరిగిపోతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం పట్ల ఆమె కలవరపడుతోందిట! గుంట నక్క అకస్మాత్తుగా సాధువు అవతారం ఎత్తినట్లు, మానవీయ లక్షణాలు ఎన్నడూ కనబరచని ఈమె పంజాబ్ ప్రజలను వారి మానాన వారిని వదిలేస్తే అదే పదివేలు.