
రాహుల్ గాంధీ గురువారం (జూన్ 6, 2024) తేదీన బాంబు పేల్చారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి (అవుట్ గోయింగ్) లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు స్టాక్ మార్కెట్ కు నిర్దిష్టమైన సూచన చేశారనీ, ఇది అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం అనీ ఆయన ఆరోపించారు.
“ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఆర్ధిక మంత్రి ముగ్గురూ స్టాక్ మార్కెట్ పైన వ్యాఖ్యానాలు చేశారు. స్టాక్ మార్కెట్ భారీ వేగంతో వృద్ధి చెందుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. హోమ్ మంత్రి గారేమో స్టాక్ మార్కెట్ పెరగనున్నదనీ, మీరందరూ స్టాక్ మార్కెట్ లో మదుపు చేయాలనీ జూన్ 4 తేదీన నేరుగా ప్రకటించారు. ఆర్ధిక మంత్రి కూడా ఇదే విధంగా ప్రకటించారు… జూన్ 4 తేదీ లోగా షేర్లు కొనుగోలు చేయాలని అమిత్ షా కోరారు. స్టాక్ మార్కెట్, జూన్ 4 తేదీన రికార్డులు బద్దలు కొడుతుందని మోడీ ప్రకటించారు” అని రాహుల్ గాంధీ ఎత్తి చూపారు.
“అదే వ్యాపార గ్రూపుకు చెందిన అదే మీడియా కంపెనీకి ఇద్దరూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారు? స్టాక్ మార్కెట్ ను తారుమారు (manipulate) చేసినందుకు సెబి (SEBI) విచారణలో ఉన్న బిజినెస్ గ్రూపు లోని మీడియాకే ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారు?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ప్రభుత్వ మంత్రులు గానీ, అధికారులు గానీ స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు ఇవ్వడం చట్ట విరుద్ధం. విదేశీ కంపెనీల కార్యకలాపాల వల్ల గానీ, పెట్టుబడులు భారీగా తరలిపోతూ రూపాయి విలువ భారీగా పడిపోతున్న పరిస్ధితి ఏర్పడినప్పుడు గానీ ఆర్.బి.ఐ లేదా, ఆర్ధిక మంత్రి లేదా సంబంధిత అధికారులు దేశ ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా, సంక్షోభ నివారణ నిమిత్తం మదుపరులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటించవచ్చు గానీ ఈ విధంగా తమ పార్టీకి కొమ్ము కాసే విధంగా, కొన్ని వ్యాపార గ్రూపులకు మేలు చేసే విధంగా (అనగా వాటి షేర్లలో మదుపు పెరిగి షేర్లు పెరిగే విధంగా) ప్రకటనలు చేయడం చేయరాదు. ఇది దాదాపు ఇన్సైడర్ ట్రేడింగ్ తో సమానం.
“జూన్ 4 తేదీ లోగా షేర్లు కొనండి” అని మే 13 తేదీన అమిత్ షా పిలుపు ఇచ్చారు. “జూన్ 4 తేదీన స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలు కొడుతుంది” అని మే 19 తేదీన ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం లోని అత్యున్నత పదవుల్లో ఉన్నవారి ప్రకటనలను, అందులోనూ స్టాక్ మార్కెట్ ని ఉద్దేశిస్తూ ఇచ్చే ప్రకటనలను మదుపుదారులు వెయ్యి కళ్ళు, మరో వెయ్యి చెవులతో గమనిస్తూ ఉంటారు. వారి నోటి మాటలు స్టాక్ మార్కెట్ కు నిజంగానే ముత్యాలు రాలి పడే విధంగానో లేదా అందుకు వ్యతిరేకంగా రాళ్ళ వాన కురిసే విధంగానో మదుపుదారులకు కనిపిస్తాయి లేదా వినిపిస్తాయి. కనుకనే మంత్రులు, అధికారులు స్టాక్ మార్కెట్ కదలికలను ప్రభావితం చేయకుండా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. ఆర్.బి.ఐ గవర్నర్/డిప్యుటీ గవర్నర్ లు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తారు.
“నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బూటకం అని బిజేపి నాయకత్వానికి ముందే తెలుసు. వారు జరిపిన అంతర్గత సర్వేలో తమకు 220 సీట్లు మాత్రమే వస్తాయని, ఇంటలిజెన్స్ ఏజన్సీల అంచనాలో 200 నుండి 220 వరకు సీట్లు వస్తాయని తేలింది” అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ప్రధాని మోడీ, హోం మినిష్టర్ అమిత్ షా ప్రకటనల తర్వాత మే 15 తెదీన 72,987 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ సూచీ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత జూన్ 3 తేదీన అది ఏకంగా 76,469 కు (3482 పాయింట్లు) పెరిగింది. జూన్ 4 తేదీన ఫలితాల ట్రెండ్ తెలిసే కొద్దీ సెన్సెక్స్ 4,390 పాయింట్లు కోల్పోయి 72,079 కు పడిపోయింది. నిఫ్టీ సూచీ అయితే ఈ తేదీల్లో 22,200 నుండి 23,264 పాయింట్లకు ఎగబాకింది.
అసలు ఫలితాల్లో బిజేపి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సీట్లు రాకపోవడం వల్ల షేర్లు భారీగా పడిపోయినట్లు కనిపించింది. అయితే కొందరు నిపుణుల ప్రకారం ఈ పతనానికి కారణం కంపెనీలు, విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్.ఐ.ఐ/ఎఫ్.పి.ఐ) లాభాలు నమోదు చేసుకోవడమే అని వెల్లడించారు.
పతనానికి బిజేపికి మెజారిటీ రాకపోవడమే కారణం అయితే మళ్ళీ జూన్ 6 తేదీ కల్లా సెన్సెక్స్ సూచీ 75,074 కు, నిఫ్టీ సూచీ 22,821 పాయింట్లకు పెరగడం జరిగేదా అన్నది వారి ప్రశ్న. బిజేపి పార్టీకి మెజారిటీ రాకపోవడం కొంత పని చేసి ఉండవచ్చు గానీ అదే మొత్తం కారణం కాదని వారు సూచిస్తున్నారు.
“ఇది భారీ కుంభ కోణం అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. “ఈ కుంభకోణం అదానీ గ్రూపుకు సంబంధించినదేనా అని ప్రశ్నించగా రాహుల్ “ఇది అదాని గ్రూపు కంటే విశాలమైన స్కాం. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వాస్తవ సమాచారం భారత దేశ ప్రధాన మంత్రి, హోం మంత్రిల వద్ద ఉన్నది. వారి వద్ద ఇంటలిజెన్స్ బ్యూరో ఇచ్చిన డేటా ఉన్నది. ఆ సంచారం దగ్గర పెట్టుకుని వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు కొనుగోలు చెయ్యమని సలహా ఇచ్చారు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎగ్జిట్ పోల్స్ వల్ల షేర్లు భారీగా పెరగ్గా, అసలు ఫలితాల తర్వాత భారీగా పడిపోయి మరో రెండు రోజుల్లోనే కోలుకుని పైపైకి వెళుతోంది. మే 15 తర్వాత మదుపు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు జూన్ 3 నాటి భారీ పెరుగుదలతో లాభాలను బుక్ చేసుకోవడం ద్వారా భారీ లబ్ది పొందారు. దీనివల్ల 5 కోట్ల చిన్న మదుపుదారుల సొమ్ము పెద్ద ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి లాభాలుగా చేరిపోయాయి.
స్టాక్ మార్కెట్ ఎలాంటి విలువనూ సృష్టించదు. అది చేసే పని సంపదను ఒకరి జేబులో నుండి మరొకరి జేబులోకి తరలించడమే. పెద్ద పెద్ద మదుపుదారుల వద్ద షేర్ మార్కెట్ కు సంబంధించి సకల గుట్టుమట్లను ఎప్పటికప్పుడు చేరవేసే నిపుణులు, ఎనలిస్టులు ఉంటారు. వారి వద్ద షేర్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేసే పరికరాలు (టూల్స్) సైతం ఉంటాయి. షేర్ మార్కెట్లన్నీ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ నియంత్రణలో ఉండడం వల్ల సాఫ్ట్ వేర్ల ను, ఎన్క్రిప్షన్ లను, నియంత్రించే వారు స్టాక్ మార్కెట్ ఉద్దాన పతనాలను కూడా తమ స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా నియంత్రించగల స్థానంలో ఉండటం కద్దు.
ఈ నేపధ్యం లోనే ఇన్సైడర్ ట్రేడింగ్ ను నేరంగా పరిగణించే చట్టాలు చేసుకున్నారు. కట్టుదిట్టమైన ఎన్క్రిప్షన్ సాధనాలు ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా ఇవన్నీ చివరికి వారి యజమానులైన బహుళజాతి సంస్థల నియంత్రణలో ఉండవలసిందే. ప్రభుత్వాలు రెగ్యులేటరీ వ్యవస్థలు సైతం బడా పెట్టుబడిదారులు, విదేశీ MNC కంపెనీల అదుపాజ్ఞల్లో నడుస్తాయి తప్ప పొదుపు కోసం మదుపు చేసే సాధారణ మదుపుదారుల ప్రయోజనాల కోసం నడవవు.
కనుక రాహుల్ గాంధీ ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేసేందుకు వీలు లేదు.