టిడిపి గెలుపుతో బాబు షేర్లు జంపు!


ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ 135 సీట్లు గెలవడంతో మిత్ర పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థానంలో నిలబడి ఉంది. దానితో టిడిపి పార్టీ పెద్దలతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఉన్న ఫళంగా పైపైకి ఎగబాకుతున్నాయి.

2024 సాధారణ ఎన్నికల్లో బిజేపి సొంతగా మ్యాజిక్ నెంబర్ 272 ను చేరుకోలేక చతికిల బడింది. మత విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎంతగా దిగజారి ఎత్తులు వేసినా 240 సీట్లతో సరి పెట్టుకోవలసి వచ్చింది.

ఇప్పుడు ఎన్.డి.ఏ లోని మిత్ర పక్షాలను కలుపుకుంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో బిజేపి ఉన్నది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ టిడిపి, బీహార్ కి చెందిన మరో ప్రాంతీయ పార్టీ జేడి(యు) లతో పాటు ఇతర చిన్నా చితకా పార్టీల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితికి నెట్టబడింది.

ఈ నేపధ్యంలో 16 సీట్లతో టిడిపి, 12 సీట్లతో జేడి(యు) కింగ్ మేకర్లుగా అవతరించారని పత్రికలు ఆకాశానికి ఎత్తుతున్నాయి. దానితో తెలుగుదేశం పార్టీ లోని నాయకుల కంపెనీల షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి.

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ జూన్ 5 తేదీన ఏకంగా 20 శాతం వృద్ధి నమోదు చేసింది. కంపెనీ షేరు ధర రు 91.06 పై లు ఎగబాకి రు 546.50 పై.ల కు చేరింది. అనగా 20 శాతం లాభాన్ని అది నమోదు చేసింది.

టిడిపి కి చెందిన గల్లా జయదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అమర రాజా కంపెనీ షేరు ధర రు 137.70 పై లు ఎగబాకి రు 1220 లకు చేరింది. అనగా 12.72 శాతం లాభం నమోదు చేసింది. టిడిపి మాజీ ఎంపి గల్లా జయదేవ్ ఎన్నికలకు ముందు రాజకీయ అస్త్ర సన్యాసం చేసినప్పటికీ మార్కెట్ మాత్రం ఆయన్ని టిడిపి నేత గానే గుర్తించింది అన్నట్లు!

బిజేపి ప్రభుత్వ ఏర్పాటుకు టిడిపి, జేడి(యు) పార్టీలపై ఆధార పడటం వల్ల ఆ పార్టీలు ఇప్పుడు బిజేపి తో గట్టి గొంతుతో బేరం ఆడగల బలాన్ని కలిగి ఉన్నాయి. తమ తమ రాష్ట్రాలకు ప్రత్యెక హోదా ఇవ్వాలని ఈ రెండు పార్టీలు గతంలో గట్టిగా డిమాండ్ చేశాయి. కానీ బిజేపి లొంగలేదు. ఇప్పుడు బిజేపి బలహీన పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు అవి గట్టిగా ప్రయత్నిస్తాయి అనడంలో సందేహం లేదు.

అమర రాజ ఎనర్జీ అండ్ మొబిలిటీ కంపెనీ అనేక రంగాల్లో ఉత్పత్తులు తయారు చేస్తోంది. ఎనర్జీ రంగంలో వివిధ సొల్యూషన్స్ ను అందజేస్తున్నది. ఎనర్జీ (శక్తి) నిల్వలు, లిధియం-యాన్ సెల్ బ్యాటరీ తయారీ, అనేక శ్రేణులకు చెందిన ఇవి చార్జర్లు, లి-అయాన్ బ్యాటరీ అసెంబ్లీ, ఆటోమోటివ్ మరియు పారిశ్రామిక లూబ్రికెంట్లు, నూతన రసాయనాల అభివృద్ధి.. మొ.న రంగాల్లో అమర రాజా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Amara Raja Batteries Limited

అత్యంత భారీ ఎనర్జీ స్టోరేజి ఉత్పత్తులను తయారు చేసే కంపెనీల్లో అమరరాజా ఎనర్జీ కంపెనీ ఒకటిగా తెలుస్తున్నది. ఈ ఉత్పత్తులను ఆటోమోటివ్ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో వినియోగిస్తున్నారు. అమరాన్ బ్రాండ్ బ్యాటరీ ఈ కంపెనీకి చెందినదే. ఇండియాలో, విదేశాలలోనూ ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కలిగి ఉన్నది.

అయితే అనేక ఇతర భారతీయ కంపెనీలకు మల్లేనే అమర రాజా ఎనర్జీ కంపెనీలో కూడా విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు (ఎఫ్.పి.ఐ) వాటా కలిగి ఉన్నాయి.

గల్లా కుటుంబం తమ హోల్డింగ్ కంపెనీ (ఆర్.ఎన్. గల్లా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్) ద్వారా 28.06 శాతం వాటా కలిగి ఉండగా ఎఫ్.పి.ఐ లు 24.64 శాతం వాటా కలిగి ఉన్నాయి. భారత జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి ఆఫ్ ఇండియా) 7.23 శాతం వాటా కలిగి ఉండడం విశేషం. మిగిలిన వాటాలను మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్.ఐ.ఐ లు తదితర సంస్థలు కలిగి ఉన్నాయి.

ఏప్రిల్ 2021లో ఆంద్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తిరుపతి, చిత్తూరులలో ఉన్న అమరరాజా ఎనర్జీ కంపెనీ ఉత్పత్తి చేసే యాసిడ్ బ్యాటరీల వల్ల కాలుష్యం పెరిగి వాతావరణ కాలుష్యం పెరిగిందన్న ఆరోపణతో కంపెనీల మూసివేతకు ఆదేశించింది. అయితే ఎపి ఐ కోర్టు కాల్యుష్య బోర్డు ఆదేశాలపై ఎప్పటికప్పుడు ప్రతి ఏడూ తాత్కాలిక సస్పెన్షన్ విధించడంతో మూసివేత జరగలేదు.

ఈ నేపధ్యంలో అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్^మెంట్ 2023 జులై నెలలో తన వాటా 14 శాతం మొత్తాన్ని ఇతర ఇన్వెస్టర్లకు అమ్మేసింది. బహుశా ఈ నేపధ్యం లోనే గల్లా జయదేవ్ తన కంపెనీ ని చూసుకునేందుకు తాత్కాలికంగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారేమో తెలియదు.

వ్యాఖ్యానించండి